Harish Rao : 22A భూములపై హరీశ్ రావు ఫైర్.. ‘కమీషన్ల కోసమే దోపిడీ!’

  • 22A వ్యవహారంలో భారీ కమీషన్ల ఆరోపణలు
  • దశాబ్దాల నాటి పట్టా భూములూ నిషేధిత జాబితాలో
  • 22A భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
  • సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీలో పోరాటం: హరీశ్ రావు
Harish Rao

Harish Rao

Harish Rao : రాష్ట్రంలో 22A నిషేధిత భూముల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. కమీషన్ల కక్కుర్తి కోసమే సామాన్య ప్రజల ఆస్తులను ప్రభుత్వం నిషేధిత జాబితాలోకి నెట్టిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ ఎం.జే. గార్డెన్స్‌లో 22A భూముల సమస్యలతో సతమతమవుతున్న బాధిత కుటుంబాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, గోరేటి వెంకన్న తదితరులతో కలిసి బాధితుల ఆవేదనను స్వయంగా అడిగి తెలుసుకున్న హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఏ-1 రేవంత్ రెడ్డి, ఏ-2 పొంగులేటి.. కమీషన్ల కోసమే ఈ దోపిడీ

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పదునైన విమర్శలు గుప్పించారు. 22A కుట్ర వెనుక భారీ కమీషన్ల బాగోతం దాగి ఉందన్న ఆయన, ఈ అక్రమాల్లో ఏ-1గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏ-2గా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. 50-50 కమీషన్ల కోసమే లక్షలాది మంది ప్రజలను నిద్రలేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. 98 శాతం భూములను 22A జాబితా నుంచి తొలగించామని మంత్రి పొంగులేటి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, అదే నిజమైతే వందలాది మంది బాధితులు తమ గోడు వెళ్లబోసుకోవడానికి ఇక్కడికి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. తప్పు చేసింది ప్రభుత్వం అయితే, దానిని సరిదిద్దుకోవడానికి దరఖాస్తుల పేరుతో సామాన్యులు ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలని నిలదీశారు.

దశాబ్దాల నాటి పట్టా భూములు కూడా బ్లాక్.. అక్రమ వసూళ్ల పర్వం

58 ఏళ్ల క్రితం ఏర్పడిన పద్మారావు నగర్ ఫేజ్-1, 1950ల నాటి స్ప్రింగ్ ఫీల్డ్, నిజాంపేట్ లాంటి కాలనీల్లోని దశాబ్దాల క్రితం నాటి పట్టా భూములను కూడా 22Aలో చేర్చడం తుగ్లక్ చర్య కాక మరేమిటని హరీశ్ రావు ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో విల్లాకు, ఫ్లాట్‌కు రూ.30 వేలు వసూలు చేస్తున్నారని, డబ్బులు ఇస్తేనే పని అవుతుందని బాధితులు బహిరంగంగా వాపోతున్నారని తెలిపారు. అమీన్‌పూర్ నుంచి వచ్చిన బాధితుడిని ఎంఆర్వో, ఆర్డీవో, కలెక్టర్ అని తిప్పించుకుని, చివరకు బయట బ్రోకర్లను కలిస్తేనే పని అవుతుందని బెదిరిస్తున్నారన్నారు. ఈ సమస్య కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి ఎకరాల వ్యవసాయ భూములను 22Aలో పెట్టారని, దీనివల్ల రైతులకు రైతుబంధు, ఎరువులు, విద్యుత్ కనెక్షన్లు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం తమ్ముడికి వందల కోట్లు.. ప్రజల ఆస్తులేమో నిషేధిత జాబితాలో

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తమ్ముడికి మాత్రం వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కట్టబెడతారని, సామాన్య ప్రజల ఆస్తులను మాత్రం 22Aలో పెట్టి ఇబ్బందుల పాలు చేస్తారని హరీశ్ రావు విమర్శించారు. చివరికి అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్, సీఎం ఇల్లు కూడా 22A నిషేధిత జాబితాలోనే ఉన్నాయంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూములున్నా హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, హౌసింగ్ బోర్డు భూములతో పాటు పిల్లలు ఆడుకునే వెయ్యి గజాల పార్కును కూడా రేవంత్ రెడ్డి అమ్మకానికి పెట్టారని, ఇలా అమ్ముకుంటూ పోతే రేపు బడికి, గుడికి, చివరకు స్మశాన వాటికకు కూడా భూమి మిగలదని ధ్వజమెత్తారు.

శ్వేతపత్రం విడుదల చేయాలి.. అసెంబ్లీని స్తంభింపజేస్తాం

ఈ మొత్తం 22A నిషేధిత భూముల అక్రమాలపై తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అసలు ఈ భూములను ఎవరు నిషేధిత జాబితాలో పెట్టమన్నారో నిజాలు బయటపడాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని, నిషేధిత జాబితాను వెబ్‌సైట్‌లో ఎందుకు బ్లాక్ చేశారో సమాధానం చెప్పాలని అన్నారు. ప్రజల భూములతో చెలగాటమాడుతున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి తక్షణమే బర్తరఫ్ చేయాలని కోరారు. బాధితుల పక్షాన నిలబడి సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తామని, సభను స్తంభింపజేసి అయినా బాధితులకు న్యాయం జరిగేలా పోరాడతామని స్పష్టం చేశారు.