కరోనా తగ్గుముఖం పడుతోందని ఊపిరి పీల్చుకుంటున్న నగరవాసులకు మళ్లీ కరోనా కలవరపెడుతోంది. భారీ వానలకు మళ్లీ కరోనా కోరలుచాస్తోంది. రోజురోజుకు కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి దాకా వందలో ఉన్న కేసులు తాజాగా 700 దాటాయి. భాగ్యనగరంలోని నార్కట్‌పల్లి గురుకుల కళాశాలలో కరోనా కలకలం రేపింది. నల్గొండ జిల్లాలోని విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. కాగా.. నార్కట్‌పల్లిలోని గురుకుల కళాశాలలో 15 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. విద్యార్థి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి కొంత మంది విద్యార్థులు కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో అలర్ట్ కళాశాల యాజమాన్యం కోవిడ్ పరీక్షలు చేయించింది. ఈనేపథ్యంలో..15 మంది విధ్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. వారిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. కళాశాలలో కరోనా నిబంధనలు పాటిస్తున్నామని.. విద్యార్థులంతా మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈనేపథ్యంలో.. విద్యార్థులను హోం క్వారంటైన్ కి తరలించామని, విద్యార్థులందరికీ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కొండల్ రావు వెల్లడించారు. నార్కట్ పల్లి గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. కరోనాకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. తగిన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ కొండలరావు సూచించారు. అయితే.. నిన్న కొండమల్లేపల్లి గురుకుల పాఠశాలలో 29 మంది విద్యార్థులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. మరుసటి రోజే నార్కట్ పల్లి గురుకుల పాఠశాలలో కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై, విద్యార్థులందర్నీ క్వారంటైన్ లో ఉంచి, శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు.