NTV Telugu Site icon

ఆర్టీసీ కార్మికులకు శుభవార్త..

నష్టాల్లో కూరుకుపోతున్న టీఎస్‌ఆర్టీసీని గాడిలోపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. ఇప్పటికే ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌.. ఆర్టీసీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇక, ఆ తర్వాత మూడు, నాలుగు నెలల్లో ఆర్టీసీ కోలుకోకపోతే.. ప్రైవేట్‌పరం చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారంటూ ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.. సంస్థ బాగుకోసం అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇక, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కూడా రంగంలోకి దిగారు.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆర్టీసీలో ఉన్న ఇబ్బందులపై అధ్యయనం చేసిన ఆయన.. దసరా సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు శుభాకాక్షంలు చెబుతూనే.. కీలక సూచనలు చేశారు. ఇదే సమయంలో గుడ్‌న్యూస్‌ కూడా చెప్పారు.

ఆర్టీసీ కుటుంబ సభ్యులందరికీ దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సజ్జనార్.. ముందుగా నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, మీరు కరోనా సమయంలో కానీ మరియు ఇతర సమయంలో చాలా నిబద్ధతతో పనిచేసి ఎంతో మంది ప్రయాణికుల్ని వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చారు, చాలా మంది ప్రాణాలు కూడా మీరు రక్షించ గలిగారని ప్రశంసించారు.. ఇకమీదట మీయొక్క జీతాలు ఒకటో తారీఖునే రాబోతున్నాయి.. నేను మీ అందరి దగ్గర నుంచి కోరుకునేది ఒకటే.. ఇప్పుడు కూడా మీరు అంతే నిబద్ధత, శ్రద్ధ, బాధ్యత మరియు క్రమశిక్షణతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం అని పిలుపునిచ్చారు.. ప్రయాణికులే దేవుళ్లు… వారి ఆధారాభిమానాలే సంస్థకు నిధి వారిని సురక్షితంగా సకాలంలో గమ్యస్థానాలకు చేర్చటం మన విధి అన్న ఆయన.. ప్రయాణికుల మన్ననలు పొందుతూ వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా సకాలంలో చేర్చివారి అభిమానాన్ని చూరగొందాం. సంస్థను ప్రగతి బాటలో నడిపిద్దాం అంటూ ఓ ప్రకటన విడుదల చేవారు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌. కాగా, కరోనా కష్టకాలంలో ఎదురైన ఇబ్బందుల కారణంగా నష్టాలపాలైన ఆర్టీసీ.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టం కావడంతో.. ప్రతీ నెల 20 తేదీ తర్వాత జీతాలు ఇస్తూ వచ్చారు.. కానీ, ఆ ఇబ్బందులు చెక్‌ పెట్టి.. ఇప్పుడు ఒకటో తేదీనే జీతాలు ఇవ్వనున్నారు.