NTV Telugu Site icon

Priyanka Gandhi: ప్రభుత్వ విభాగాలు పూర్తిగా అవినీతిమయం.. బీఆర్‌ఎస్ సర్కార్‌పై ప్రియాంక ఫైర్‌

Priyanka

Priyanka

Priyanka Gandhi: ఈ హుస్నాబాద్ గడ్డ సర్దార్ సర్వాయి పాపన్న, పీవీ నరసింహారావుల గడ్డ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ విజయభేరీ సభలో ప్రియాంక ప్రసంగించారు. పీవీ నరసింహారావు మా తండ్రి రాజీవ్ చనిపోయినప్పుడు మా కుటుంబానికి అండగా ఉన్నారని ఆమె తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో గండిపల్లి, గౌరవెల్లి, తోటపల్లి ప్రాజెక్టులు పూర్తికాలేదని.. నిర్వాసితులకు పరిహారం రాలేదని ఆమె పేర్కొన్నారు. ప్రజల భూములు గుంజుకున్నప్పుడు ఇక్కడి ఎమ్మెల్యే ప్రజలకు అండగా లేరని ఆమె విమర్శించారు. రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్నపుడు ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు.

Also Read: Himantha Biswa Sharma: వికారాబాద్ జిల్లా పరిగిలో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ రోడ్ షో..

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగినప్పుడు అడ్డుకోని ఎమ్మెల్యే హుస్నాబాద్‌కి అవసరమా అంటూ ప్రశ్నలు గుప్పించారు. సీఎం కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి… తెలంగాణ బిడ్డలకు రాలేదని ఆమె విమర్శించారు. తెలంగాణలో నిరుద్యోగం దేశంలో కంటే ఎక్కువగా వుందన్నారు. డిగ్రీలు చదివిన పిల్లలకు ఉపాధి లేదన్న ఆమె.. పిల్లల భవిష్యత్ కోసం కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులకు ఎదిగిన బిడ్డలకు ఉపాధి లేక నిరాశే మిగులుతుందన్నారు. పేపర్ లీకులు, నోటిఫికేషన్ల రద్దుతో అవినీతితో యువతకు ఉద్యోగాలకు నోచుకోవడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలల్లో ఒకటైన నియామకాలు, ఉపాధి ఈ పదేళ్ళలో తీరలేదన్నారు. రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరిగాయని.. రక్షణ లేదన్నారు. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ విభాగాలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాయన్నారు.

రైతులకు రుణమాఫీ చేయలేదు.. మా పాలిత రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ చేశామన్నారు. కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కేసీఆర్, మోడీకి రైతుల పట్ల రుణమాఫీ పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. దేశంలో ఉన్న సంపద మొత్తం అదానీకి దోచిపెడుతున్నారని ఆమె ఆరోపించారు. అదానీ ఆదాయం ఒక రోజుకు 1600 కోట్లు అంటే దోపిడీ ఎంత జరుగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఎన్నికల పోరు సాగుతోందన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలన చూశారు… కాంగ్రెస్ హామీలను చూడాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ బీజేపీ , ఎంఐఎం మూడు ఒక్కటేనని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది.. హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కి ఎంఐఎం మద్దతు ఇస్తుందన్నారు.

Also Read: Rajnath Singh: ఈ సారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం..

ప్రియాంక గాంధీ మాట్లాడుతూ..” దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అన్ని స్థానాల్లో పోటీ చేసే ఎంఐఎం సొంత రాష్ట్రంలో 7 సీటల్లోనే ఎందుకు పోటీ చేస్తుంది. ఈ మూడు పార్టీలు బయట ఫైట్ చేస్తున్నట్టు నటించి లోపల నాటు నాటు డ్యాన్స్ చేస్తాయి. మహాత్మా గాంధీ నుంచి నేటి వరకు పేదల కోసం వారి హక్కుల కోసమే పని చేస్తుంది. దేశంలో సంపద సృష్టిస్తున్న వారికి సంపద పై హక్కులు కావాలని కోరుతుంది కాంగ్రెస్. ఇక్కడ ఆరు గ్యారంటీలు హామీ ఇస్తున్నాం… వాటిని అమలు చేసి తీరుతాం..ఆ గ్యారంటీలకు నాది బాధ్యత. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం..ఈసారి బై బై కేసీఆర్ అని కాంగ్రెస్ ని గెలిపించండి. మీ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన వస్తుంది..ఈ రాష్ట్రం మీది మీ పోరాటం వల్ల వచ్చిన రాష్ట్రాన్ని రక్షించుకునే బాధ్యత మీది..” అని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.