WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..

Whatsapp

Whatsapp

WhatsApp: పాత స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న వారికి వాట్సాప్ షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 8, 2026 నుంచి కొన్ని పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లలో వాట్సాప్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని Wabetainfo తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 5.0, 5.1 (లాపాప్) వెర్షన్లతో నడిచే ఫోన్లలో ఇకపై ఈ ప్రముఖ మెసేజింగ్ యాప్ అందుబాటులో ఉండదు. ఈ పాత ఫోన్ల వినియోగదారులు యాప్ ఓపెన్ చేయగానే, వారి సేవలు నిలిచిపోయినట్లు ఒక అలర్ట్ నోటిఫికేషన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి వినియోగదారులకు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. మొదటిది, మీ ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆప్షన్ ఉంటే వెంటనే దానిని కొత్త వర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. ఒకవేళ మీ హ్యాండ్‌సెట్‌కు కంపెనీ తదుపరి అప్‌డేట్స్ ఇవ్వకపోతే, వాట్సాప్ వాడటానికి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనడం మినహా వేరే మార్గం లేదు. ఎందుకంటే ఇకపై వాట్సాప్ సేవలను పొందాలంటే ఫోన్‌లో కనీసం ‘ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మెల్లో’ లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండటం తప్పనిసరి.

నిజానికి వాట్సాప్ ఈ నిర్ణయాన్ని అకస్మాత్తుగా ఏమీ తీసుకోలేదు. పాత ఫోన్లలో సపోర్ట్ నిలిపివేస్తున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే కంపెనీ అధికారికంగా ప్రకటించింది. భారత్, పాకిస్తాన్, బ్రెజిల్ వంటి అనేక దేశాల్లో నేటికీ ఆండ్రాయిడ్ 5 లేదా అంతకంటే పాత వర్షన్లపై పనిచేసే స్మార్ట్‌ఫోన్లను భారీ సంఖ్యలోనే ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ నిర్ణయం ఆయా దేశాల్లోని అనేకమంది యూజర్లపై నేరుగా ప్రభావం చూపనుంది. భద్రతతో పాటు వినియోగదారులకు ఎప్పటికప్పుడు అధునాతన ఫీచర్లను అందించడానికే వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది. యాప్‌లో తీసుకొచ్చే కొత్త సెక్యూరిటీ అప్‌డేట్స్, సరికొత్త ఫీచర్లు చాలా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లలో సాంకేతికంగా సపోర్ట్ చేయవు. అందుకే యూజర్లకు మెరుగైన, సురక్షితమైన అనుభవాన్ని అందించే క్రమంలో వాట్సాప్ కాలానుగుణంగా ఇలాంటి పాత ఆండ్రాయిడ్ వెర్షన్లకు సపోర్ట్‌ను నిలిపివేస్తూ ఉంటుంది.