దేశంలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధమవ్వడం, మరణాలు కూడా సంభవించడంతో.. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ వాహనాల ప్రమాదాల వెనుక అసలు కారణాలేంటో వెలికి తీయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో, డీఆర్డీవో రంగంలోకి దిగింది. ఎక్కడైతే ప్రమాదాలు చోటు చేసుకున్నాయో, ఆ ప్రాంతాలకు వెళ్ళి కొన్ని సాక్ష్యాల్ని సేకరించింది. తొలుత ఎండాకాలం సీజన్ వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే, అందులో వాస్తవం లేదని ప్రాథమిక విచారణలో భాగంగా డీఆర్డీవో వెల్లడించింది. బ్యాటరీ లోపాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపింది. ఇప్పుడు పూర్తిస్థాయి నివేదికలో.. అదే ప్రధాన కారణమని తేలింది. ఎండాకాలం సీజన్‌తో ఈ ప్రమాదాలకు ఎటువంటి సంబంధం లేదని, బ్యాటరీ లోపాలు కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయని ఆ నివేదికలో పేర్కొంది. బ్యాటరీ ప్యాక్స్ డిజైన్లను సరైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే ఈ వాహనాల్ని మార్కెట్‌లోకి రిలీజ్ చేశారని తేల్చింది. అంతేకాదు.. ఖర్చు తగ్గించుకోవడం కోసం లో-గ్రేడ్ మెటీరియల్‌ను ఉద్దేశపూర్వకంగానే ఉపయోగించినట్టు డీఆర్‌డీవో కుండబద్దలు కొట్టింది.
ఇదిలా ఉండగా.. లావాదేవీల్ని కేంద్రం ఎలాగైతే డిజిటలైజ్ చేసిందో, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని 2030 నాటికి 80 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, వరుస ప్రమాదాలు సంభవిస్తుండడాన్ని చూస్తుంటే.. ఆ లక్ష్యానికి చేరుకుంటారో, లేదో అనేది ప్రశ్నార్థకంగా మారింది. డబ్బులకి ఆశపడి లో-గ్రేడ్ మెటీరియల్‌ని వాడకుండా, ఉన్నతమైన మెటీరియల్‌తో వాహనాల్ని అందుబాటులోకి తెస్తే.. బహుశా ఆ లక్ష్యాన్ని అందుకోవచ్చు. ఈ వ్యవహారంపై కేంద్రం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.