స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఏళ్లుగా కలలు కంటున్న సమయం రాబోతోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కలను చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘రియల్‌మీ’ నెరవేర్చబోతోంది. ఏకంగా 10,001mAh బ్యాటరీతో రియల్‌మీ పీ4 పవర్ (Realme P4 Power 5G Launch) స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. 2026 జనవరి 29న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’లో రియల్‌మీ పీ4 పవర్ ఫోన్‌ను విక్రయాలు జరగనున్నాయి. ధర రూ.35 వేల పైనే ఉండొచ్చని టెక్ వర్గాల అంచనా.
వన్‌ప్లస్ 15ఆర్ దేశంలోనే అత్యధిక బ్యాటరీ సామర్థ్యం (7400 ఎంఏహెచ్) కలిగిన స్మార్ట్‌ఫోన్. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు 6500 నుంచి 7300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. రియల్‌మీ మాత్రం అంతకు మించి అంటూ.. ఏకంగా 10వేల ఎంఎహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేస్తోంది. రియల్‌మీ పీ4 పవర్ ఫోన్ 932 గంటలకు పైగా స్టాండ్‌బై, 32.5 గంటల YouTube స్ట్రీమింగ్, అలాగే 185 గంటలకు పైగా మ్యూజిక్ ప్లేబ్యాక్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. సాధారణ వినియోగంలో వారం రోజుల పాటు, హెవీ యూజ్‌లో కూడా కనీసం 1.5 రోజులు చార్జింగ్ అవసరం లేకుండా పనిచేస్తుందట. ఈ ఫోన్ మరో ముఖ్యమైన ఫీచర్ 27W రివర్స్ ఛార్జింగ్. ఇది అవసరమైతే పవర్ బ్యాంక్‌లా కూడా పనిచేస్తుంది. ఇయర్‌బడ్‌లు, స్మార్ట్‌వాచ్‌లను ఛార్జ్ చేయొచ్చు.
గతంలో భారీ బ్యాటరీ ఫోన్లు అంటే బరువు, మందం ఎక్కువగా ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే ‘పవర్ బ్యాంక్ ఫోన్లు’లా కనిపించేవి. కానీ రియల్‌మీ మాత్రం ఆధునిక టెక్నాలజీని వినియోగించింది. ఎనర్జీ ఎఫిషియెంట్ చిప్‌సెట్, అడాప్టివ్ డిస్‌ప్లే కంట్రోల్, హై డెన్సిటీ బ్యాటరీ సెల్స్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టింది. పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా.. ఈ ఫోన్ చేతిలో సన్నగా అనిపిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ మందం, బరువు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే విడుదలైన ఫోటోలు చూస్తే గత మోడల్ (7.58mm మందంతో 7,000mAh బ్యాటరీ) కంటే పెద్దగా తేడా కనిపించడం లేదు.
Also Read: Virat Kohli Mystery Drink: ఇండోర్ వన్డే మ్యాచ్.. విరాట్ కోహ్లీ తాగిన ఆ మిస్టరీ డ్రింక్ ఏంటి?
రియల్‌మీ పీ4 పవర్ ఫోన్ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇది స్క్రోలింగ్, గేమింగ్ అనుభవాన్ని స్మూత్‌గా మార్చుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంటుంది. ఈ డివైస్ 12GB RAM వేరియంట్‌లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెన్సర్ల వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ.. రియల్‌మీ మిడ్‌రేంజ్ ఫోన్ల ట్రాక్ రికార్డ్ చూస్తే అద్భుత మెయిన్ కెమెరా, అల్ట్రావైడ్, అలాగే మ్యాక్రో లేదా డెప్త్ సెన్సర్ ఉండే అవకాశముంది. మొత్తంగా బ్యాటరీ లైఫ్ విషయంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసేలా కనిపిస్తోంది.