Oppo A6 5G: ఓపో నుంచి మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి వచ్చింది. పవర్ ఫుల్ బ్యాటరీ, కెమెరా ఫీచర్లతో Oppo A6 5Gను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. రోజువారీ వినియోగంతో పాటు గేమింగ్, వీడియోలు ఎక్కువగా చూసేవారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో ముఖ్యంగా ఆకట్టుకునే విషయం 7,000mAh భారీ బ్యాటరీ. ఒకసారి చార్జ్ చేస్తే చాలా సేపు ఫోన్ వాడుకోవచ్చు. అంతేకాదు.. 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ సైతం ఉంది. అంటే పెద్ద బ్యాటరీ ఉన్నా.. త్వరగా చార్జ్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు. దీంతో పాటు మరో చిన్న కెమెరా కూడా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు.
READ MORE: Ryan Dahl: ప్రశ్నార్థకంగా “సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల” భవిష్యత్తు..
Oppo A6 5G ఫోన్‌లో 6.75 అంగుళాల పెద్ద స్క్రీన్ ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. సినిమాలు, యూట్యూబ్ వీడియోలు చూడటానికి ఈ డిస్‌ప్లే బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేసే ColorOS 15తో వస్తోంది. పనితీరు కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. సాధారణ వినియోగంతో పాటు గేమ్స్‌కు కూడా ఈ ఫోన్ బాగా పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్న మోడల్ ధర రూ.17,999. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. ఇక 6GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్న టాప్ మోడల్ ధర రూ.21,999గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ఓపో అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అమ్మకానికి ఉంది. అంతేకాదు.. కొన్ని బ్యాంక్ కార్డులపై రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్, మూడు నెలల నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం సైతం కంపెనీ అందిస్తోంది. రంగుల విషయానికి వస్తే ఈ ఫోన్ సఫైర్ బ్లూ, ఐస్ వైట్, సకురా పింక్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. భద్రత కోసం సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉన్నాయి. అలాగే నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం ప్రత్యేక రేటింగ్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి పెద్ద బ్యాటరీ సామర్థ్యం, మంచి కెమెరా, పెద్ద స్క్రీన్‌తో మధ్య తరగతి వినియోగదారులను ఆకట్టుకునేలా Oppo A6 5G రూపొందించారు.