ఈమధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం గణనీయంగా పెరిగిపోయింది. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటడం, ఎలక్ట్రిక్ స్కూటర్ల రేట్లు కూడా తగ్గుముఖం పట్టడంతో.. ప్రజల్లో విద్యుత్ వాహనాల మోజు పెరుగుతోంది. దీనికితోడు చార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులోకి వస్తుండడంతో.. ఈ వాహనాల కోనుగోళ్లు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే విద్యుత్ వాహనాలు కంపెనీలు విరివిగా పుట్టుకొచ్చేస్తున్నాయి. ఆ కంపెనీలు కూడా వినియోగదారుల్ని ఆకట్టుకునేలా అధునాతన ఫీచర్లతో, మంచి బ్యాటరీ బ్యాకప్‌తో ఒకదానికి మంచి మరొక స్కూటర్స్‌ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది.
ఈ క్రమంలోనే విద్యుత్ వాహనాలు తయారుచేసే కంపెనీల మధ్య ఏ స్థాయిలో పోటీ ఉందో తెలిపే గణాంకాలు బయటకొచ్చాయి. జూన్ నెలలో ఎన్ని వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయన్న వివరాల్ని ‘వాహన్’ వెలువరించింది. ఇందులో ఒకినావా సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. నిజానికి.. ఈ రేసులో ఏప్రిల్ వరకూ ఓలా ఎలక్ట్రిక్ అగ్రస్థానంలో ఉండేది. కానీ, మే నెలలో తొలిసారి అగ్రస్థానం కోల్పోయి రెండో స్థానానికి పరిమితమైంది. ఇప్పుడు జూన్‌లో కేవలం 5753 వాహన రిజిస్ట్రేషన్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఒకినావా 6782 రిజిస్ట్రేషన్లతో తొలి స్థానంలో దక్కించుకోగా.. ఏంపియర్ (6199), హీరో ఎలక్ట్రిక్ (6049) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఓలా తర్వాత ఏథర్, రివోల్డ్, ప్యూర్ ఈవీ, బెన్లింగ్ కంపెనీలున్నాయి.
కంపెనీల విషయాన్ని పక్కనపెట్టి ఓవరాల్ ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ లెక్కలు చూసుకుంటే.. జూన్ నెలలో మొత్తం 32807 రిజిస్ట్రేషన్స్ జరిగాయి. మే నెలలో 32680 వరకూ రిజిస్ట్రేషన్స్ నమోదయ్యాయి. నిజానికి.. ఇప్పుడు ట్రెండ్‌లో ఈ సంఖ్య బాగా పెరగాల్సింది. కానీ, బ్యాటరీల లోపం వల్ల వాహనాలు కాలిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటుండడంతో, ఎలక్ట్రిక్ వాహనాల కోనుగోళ్లు పెద్దగా పెరగడం లేదని నిపుణులు చెప్తున్నారు.