వన్ ప్లస్ (OnePlus) భారతదేశాన్ని వదిలి వెళ్తోందనే పుకార్లు మరోసారి హల్‌చల్ చేస్తున్నాయి. అయితే.. కంపెనీ ఈ ప్రచారాన్ని ఖండించింది. పేరెంట్ కంపెనీ ‘ఒప్పో’ (Oppo) తన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలో పెద్ద మార్పులు చేయాలని యోచిస్తోందని బ్లూమ్‌బెర్గ్ నివేదించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అమెరికా, యూరప్ మార్కెట్లలో వన్ ప్లస్ తన కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకోనుందని, భవిష్యత్తులో భారత్‌పైనా దీని ప్రభావం పడవచ్చని ఆ నివేదిక పేర్కొంది.
అయితే.. వన్ ప్లస్ ఇండియా బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ రాబిన్ ల్యూ ఈ ప్రచారాన్ని తీవ్రంగా తోసిపుచ్చారు. భారతీయ కస్టమర్ల కోసం ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘భారత్ ఎల్లప్పుడూ వన్ ప్లస్ అంతర్జాతీయ మార్కెట్లలో అత్యంత కీలకమైన దేశంగా కొనసాగుతుంది. మా వినియోగదారులు, భాగస్వాములకు మేం ఇచ్చే నిబద్ధతలో ఎలాంటి మార్పు లేదు. భారతదేశంలో సరికొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి మేం నిరంతరం పెట్టుబడులు పెడుతూనే ఉంటాం.’ తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు రాబోయే రోజుల్లో ‘వన్ ప్లస్ N6x’ లాంటి కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
UPDATE: OnePlus India has responded to the Bloomberg report about its exit from India in 2027.
“OnePlus India continues to operate its business as usual, with all local operations on track. We urge the media to exercise restraint before amplifying unverified speculation.” https://t.co/ah6lj04BBS
— TrakinTech (@TrakinTech) July 16, 2026
మరోవైపు.. ఒప్పోకు చెందిన ‘రియల్‌మీ’ చైనా మార్కెట్ నుంచి తప్పుకోవచ్చని, 2027 నాటికి వన్ ప్లస్ పునర్వ్యవస్థీకరణ భారతదేశానికి కూడా విస్తరించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఆర్థిక ఇబ్బందులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆపిల్, శామ్‌సంగ్ కంపెనీల ఆధిపత్యం కారణంగా ఒప్పో తన గ్లోబల్ వ్యూహాలను మార్చుకుంటున్నట్లు సమాచారం. ఏదేమైనా.. ఈ మార్పులపై ఒప్పో ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ వన్ ప్లస్ మాత్రం భారతదేశంలో తాము సుస్థిరంగా కొనసాగుతామని, మరిన్ని కొత్త ప్రొడక్ట్స్‌తో అలరిస్తామని భారతీయ వినియోగదారులకు స్పష్టమైన భరోసా ఇచ్చింది.

