Indian Army Day 2026: ప్రతి సంవత్సరం జనవరి 15న భారత సైన్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. 1949లో ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప భారత సైన్యానికి తొలి భారతీయ సర్వాధికారిగా బాధ్యతలు స్వీకరించిన చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఈ రోజున ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం తన రక్షణ వ్యవస్థపై సంపూర్ణ నియంత్రణ సాధించిన సంకేతంగా ఈ రోజు నిలిచింది. ఈ ఏడాది ఆ ఘట్టానికి 78 ఏళ్లు పూర్తవుతున్నాయి. భారత సైన్యం చేసిన త్యాగాలు, చూపిన ధైర్యం, దేశ భద్రతపై ఉన్న అంకితభావాన్ని గుర్తుచేసే రోజిది. దేశవ్యాప్తంగా పరేడ్‌లు, అమరవీరులకు నివాళులు, సైనిక శక్తిని చాటిచెప్పే కార్యక్రమాలతో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఐక్యత, క్రమశిక్షణ, జాతీయ భద్రతే సైన్యం లక్ష్యమని ఈ వేడుకలు మరోసారి స్పష్టం చేస్తాయి. ప్రధాన ఆర్మీ డే పరేడ్ ముంబైలోని మహల్ రోడ్డులో వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి, దేశ రక్షణలో సైన్యం పోషిస్తున్న కీలక పాత్రను ప్రజలకు గుర్తుచేశారు. సైన్య దినోత్సవం గత నాయకత్వాన్ని, అమరవీరుల త్యాగాలను స్మరించుకునే సందర్భమే కాదు. యుద్ధ విధానాలు కాలంతో పాటు ఎలా మారుతున్నాయో గుర్తు చేసే రోజు కూడా. సంప్రదాయ యుద్ధాల నుంచి ఆధునిక సాంకేతిక ఆధారిత పోరాటాల వరకు భారత సైన్యం తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
READ MORE: Telangana: పార్టీ మారిన వ్యవహారంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్
ఇక భవిష్యత్ యుద్ధాల్లో సాంకేతికత కీలక పాత్ర పోషించనుంది. వేగం, ఆటోమేషన్, సైనికుల ప్రాణాలకు తక్కువ ముప్పు ఉండేలా యుద్ధ విధానాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ దిశగా భారత సైన్యం ఎక్సోస్కెలిటన్‌ల అభివృద్ధిపై పనిచేస్తోంది. వీటి ద్వారా సైనికుల బలం, సహనం పెరుగుతుంది. భారీ బరువులు మోసుకుంటూ ఎక్కువ దూరం, ఎక్కువ సమయం అలసట లేకుండా పనిచేయడం సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టులో డీఆర్‌డీవో, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ కీలకంగా పాల్గొంటున్నాయి. అలాగే భూభాగం, గగనతలంలో పనిచేసే స్వయం నియంత్రిత యుద్ధ వాహనాల అభివృద్ధిపైనా భారత్ దృష్టి పెట్టింది. ఇవి కూడా డీఆర్‌డీవో ఆధ్వర్యంలో స్వదేశీంగా తయారవుతున్నాయి. దీంతో ఆధునిక రక్షణ వ్యవస్థల్లో భారత్ మరింత స్వయం సమృద్ధి సాధించనుంది. ఈ కొత్త ఆటోమేషన్లు మనుషులకంటే వేగంగా స్పందించగలవు. ప్రమాదకర పరిస్థితుల్లో సైనికులను ముందుకు పంపకుండా పనిచేస్తాయి. ఉపగ్రహాలు, డ్రోన్లు, భూసేన నుంచి వచ్చే సమాచారాన్ని కృత్రిమ మేధస్సు సమన్వయం చేసి, తక్షణ నిర్ణయాలు తీసుకునేలా సైన్యానికి సహకరిస్తుంది. ఈ విధంగా భారత సైన్యం భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా మరింత బలంగా మారుతోంది.