పెట్రోలు ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో జనాలందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపుకు మళ్లారు. ఈ క్రమంలోనే కంపెనీలు ఒకదానికి మించి మరొకటి మోడల్స్‌ను రంగంలోకి దింపుతున్నాయి. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలుగా స్కూటర్స్‌ని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా బ్యాట్రీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ (battRE storie electric scooter) రంగంలోకి దిగింది. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్కసారి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే, 132 కి.మీల దూరం ప్రయాణించవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీ పేర్కొంది.
ఈ స్కూటర్ భారతదేశంలో రూ. 89,600 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి రానుంది. రాష్ట్రాలలో లభించే సబ్సిడీ దృష్ట్యా, ఆ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. మెటల్ ప్యానెల్‌తో తయారు చేయబడ్డ ఈ స్కూటర్.. లూకాస్ TVS ఎలక్ట్రిక్ మోటార్ & 3.1kWh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 5 రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. అవి.. ఎకో, కంఫర్ట్, స్పోర్ట్, రివర్స్ & పార్కింగ్. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ స్పీడోమీటర్ విత్ టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇందులో.. రైడింగ్ సమయంలో కాల్ అలర్ట్ సదుపాయం కూడా ఉంది. కనెక్ట్ చేయబడిన డ్రైవ్ ఫీచర్.. సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌లను వెతకడంలో సహాయపడుతుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 65 kmph వేగంతో వెళ్లగలదు.
ఈమధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో.. భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపామని, స్కూటర్‌లో అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నామని కంపెనీ వారు వెల్లడించారు. టెస్టింగ్ సమయంలో ఇది లక్ష కిలోమీటర్లు నడిచిందని తెలిపారు. ఇందులో ఉన్న అధునాతన ఫీచర్స్, ఇతర జాగ్రత్తల దృష్ట్యా.. ఇది ఓలా ఎలక్ట్రిక్, హీరో ఎలక్ట్రిక్, ఒకినావా, ప్యూర్ ఈవీ వంటి కంపెనీలతో పోటీపడనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.