Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్.. బ్రాడ్‌బ్యాండ్‌ స్పీడ్, నెట్‌వర్క్ క్వాలిటీలో నెం.1గా..!

Airtel Beats Jio

Airtel Beats Jio

Airtel Beats Jio: భారత టెలికాం రంగంలో జియో, ఎయిర్‌టెల్ మధ్య పోటీ కొనసాగుతోంది. మొబైల్ నెట్‌వర్క్ సేవలతో పాటు బ్రాడ్‌బ్యాండ్ విభాగంలోనూ ఈ రెండు సంస్థలు పోటీపడుతున్నాయి. అయితే తాజాగా విడుదలైన ఓ నివేదికలో బ్రాడ్‌బ్యాండ్ అనుభవం విషయంలో జియో కంటే ఎయిర్‌టెల్ మెరుగైన ఫలితాలు సాధించింది. “ఓపెన్ సిగ్నల్” విడుదల చేసిన నవంబర్ 2026 ఇండియా ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

ఈ నివేదిక ప్రకారం.. రిలయబిలిటీ, కన్సిస్టెంట్ క్వాలిటీ, డౌన్‌లోడ్ స్పీడ్, అప్‌లోడ్ స్పీడ్, వీడియో ఎక్స్‌పీరియన్స్ వంటి ఐదు విభాగాల్లోనూ ఎయిర్‌టెల్ అవార్డులు సొంతం చేసుకుంది. ముఖ్యంగా నెట్‌వర్క్ విశ్వసనీయత విషయంలో జియో కంటే 15% మెరుగైన స్కోర్ సాధించింది. ఓపెన్ సిగ్నల్ 100 నుంచి 1,000 పాయింట్ల స్కేల్‌పై నిర్వహించిన అంచనాలో ఎయిర్‌టెల్‌కు 486 పాయింట్లు రాగా, జియో 423 పాయింట్లతో నిలిచింది. డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్స్ విషయంలోనూ ఎయిర్‌టెల్ ముందంజలో ఉంది. జియో సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 30.5 Mbps, అప్‌లోడ్ స్పీడ్ 21 Mbpsగా నమోదయ్యాయి. వీటితో పోలిస్తే ఎయిర్‌టెల్ వేగాలు సుమారు 26 నుంచి 27% ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. కన్సిస్టెంట్ క్వాలిటీ, వీడియో ఎక్స్‌పీరియన్స్ విభాగాల్లోనూ ఎయిర్‌టెల్ ఆధిక్యం సాధించింది.

ఫిక్స్‌డ్ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్‌లోనూ

ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) విభాగంలోనూ ఎయిర్‌టెల్ ఐదు విభాగాల్లోనూ అవార్డులు గెలుచుకుంది. డౌన్‌లోడ్ స్పీడ్ విషయంలో ఎయిర్‌టెల్ 32.4 Mbps సాధించగా, జియో 25.7 Mbpsకే పరిమితమైంది. అప్‌లోడ్ స్పీడ్‌లో ఎయిర్‌టెల్ 20.7 Mbps, జియో 17.1 Mbps నమోదు చేశాయి. నెట్‌వర్క్ నాణ్యత విషయంలోనూ ఎయిర్‌టెల్ మెరుగైన ఫలితాలు సాధించింది. కన్సిస్టెంట్ క్వాలిటీ విషయంలో ఎయిర్‌టెల్ 66.2% స్కోర్ సాధించగా, జియో 55%తో నిలిచింది. రిలయబిలిటీ విభాగంలో ఎయిర్‌టెల్‌కు 450 పాయింట్లు, జియోకు 382 పాయింట్లు వచ్చాయి. అంటే ఈ విభాగంలో జియో కంటే ఎయిర్‌టెల్ 18% మెరుగ్గా ఉంది.

సబ్‌స్క్రైబర్ల విషయంలో

నెట్‌వర్క్ అనుభవంలో ఎయిర్‌టెల్ ముందున్నప్పటికీ, బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్యలో మాత్రం జియో ఆధిపత్యం కొనసాగుతోంది. TRAI గణాంకాల ప్రకారం.. 2026 ఆగస్టు చివరి నాటికి భారత్‌లో 4.86 కోట్ల వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో జియో 1.48 కోట్ల మంది వినియోగదారులతో మొదటి స్థానంలో ఉండగా, ఎయిర్‌టెల్ 1.14 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో రెండో స్థానంలో ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్ 45.6 లక్షల కనెక్షన్లతో తర్వాతి స్థానంలో నిలిచింది.