ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకమయ్యారు. ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌కు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి లేఖ రాశారు. బొత్సను శాసనమండలి పక్ష నేతగా నిర్ణయిస్తూ పార్టీ నుంచి అధిష్ఠానం లేఖ ఇవ్వనుంది.
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతం.. విశాఖ ఒకేలా అభివృద్ధి చెందాలన్నారు. ప్రస్తుతానికి మా పార్టీది మూడు రాజధానుల విధానమేనని.. మూడు రాజధానులపై మా పార్టీ విధానం మార్చాలనుకుంటే మా నాయకుడితో చర్చించుకుంటామని స్పష్టం చేశారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ మోషేన్‌రాజు తన చాంబర్‌లో.. బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. కాగా, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే.