కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలో కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.
ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జూరాల జలాశయం నుంచి లక్షా 75 వేల క్యూసెక్కులకు పైగా వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి 1,50,900 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.