అత్యంత భద్రత కల్గిన భారత దేశ పార్లమెంటులో ఆగంతకులు కలకలం సృష్టించిన సమాచారం వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. రాజమండ్రిలో భరత్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జీరో అవర్ జరుగుతున్న సమయంలో లోక్‌సభలోకి దూసుకెళ్లి రంగు పొగను విసిరిన వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ దుండగులు వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకారు.