వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాపం పండిందని ఆరోపించారు. టెక్నికల్ నాలెడ్జ్ తో గతంలో 18 కేసుల్లో స్టే లు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. మరోవైపు.. పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనాలంటే చంద్రబాబు సపోర్ట్ కావాలని తెలిపారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ ని ఇంటికి సాగనంపడం కాయమని మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. జగన్ బురదను అందరికి అంటించాలని చూస్తున్నారని తెలిపారు. ఆధారాలు లేకుండా చంద్రబాబుని నిర్బంధించారని మండిపడ్డారు. లేని రింగ్ రోడ్డులో అవినీతి ఏంటి అని ప్రశ్నించారు.?
టీడీపీపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు అరెస్ట్ దగ్గర్నుంచి టీడీపీ వాళ్లు.. నేరం చెయ్యలేదని ఎక్కడా చెప్పడం లేదని మంత్రి పేర్కొన్నారు. దొరికిన దొంగలకు మర్యాద చెయ్యలేదు అని వాదిస్తున్నారని.. అన్ని కోర్టుల్లో ఒకే రకమైన వాదనలు వినిపిస్తున్నారని ఆరోపించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మిణి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ములాఖత్ అయ్యారు. 40 నిమిషాల పాటు ములాఖత్ సాగింది. ఇదిలా ఉంటే చంద్రబాబు 32 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
టీడీపీపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా న్యాయస్థానాల ముందు నిలబడాల్సిందేనని అన్నారు. అన్నీ ఆధారాలతోనే దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టాయని.. ఎన్ని కేసులు పెట్టినా భయపడనని చెప్పిన లోకేష్ ఢిల్లీ వెళ్లి కూర్చున్నాడని మంత్రి తెలిపారు. 20 మంది అడ్వకేట్లను చుట్టూ కూర్చోబెట్టుకుని బెయిల్ కోసం ప్రార్దనలు చేస్తున్నారని ఆరోపించారు.
పార్టీ ప్రతినిధుల సభతో గేర్ మారింది.. స్పీడ్ పెరిగింది అని మంత్రి పేర్కొన్నారు. ఇక పాత సైకిల్, కొత్త గ్లాసు కొట్టుకుపోవాల్సిందేనంటూ టీడీపీ, జనసేన పార్టీలపై పరోక్షంగా ఈ వ్యాఖ్యలను ఆయన చేశారు. అంతేకాదు.. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలను మంత్రి అంబటి రాంబాబు తన పోస్టుకు ట్యాగ్ చేశారు.