అగ్నిపథ్ ఎందుకు మంటలు రేపుతోంది?కేంద్రం ఏమంటోంది? అభ్యర్థుల సమస్యేంటి?అగ్నిపథ్ పథకంతో ఆర్మీకి ప్రయోజనం ఎంత?జీతాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించటానికే ఈ స్కీమ్ తెచ్చారా?
కేంద్ర ప్రభుత్వం మంగళవారం త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నాలుగేళ్లు సర్వీస్ అంటూ కేంద్రం తమకు అన్యాయం చేస్తోందంటూ సైనిక నియామక రిక్రూట్‌మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్న యువకులు దేశంలోని పలుచోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించారు. నిరుద్యోగుల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
రైళ్లు తగలబడ్డాయి. వందలాది రైళ్లు రద్దయ్యాయి. కొన్ని మధ్యలోనే నిలిచిపోయాయి.బస్సులు ధ్వంసం చేశారు. జాతీయ రహదారులు దిగ్భందించారు..
పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి….కొన్నిచోట్ల బీజేపీ కార్యాలయాలపై కూడా దాడి చేశారు.బీహార్, ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి.
దేశ భద్రతపైనా కక్కుర్తి పడుతున్నారా అని విపక్షాలు ప్రశ్నించాయి..ఈ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్లు చేశాయి.నిరుద్యోగుల సహనానికి కేంద్రం అగ్నిపరీక్ష పెడుతోందని మండిపడ్డాయి..
ఏమీటీ అగ్నిపథ్ స్కీమ్..?కేంద్రం ఎందుకు తెచ్చింది?ఇప్పుడింత ఆందోళనకు ఎందుకు కారణమైంది?
అగ్నిపథ్..
ఇదే ఇప్పుడు దేశమంతా నిరుద్యోగుల్లో మంటలు రేపుతున్న స్కీమ్..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అగ్నిపథ్ పథకంతో 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్న వారు త్రివిధ దళాలలో చేరవచ్చు.
నాలుగేళ్ల పాటు సేవలు అందించాక వీరిలో 25 శాతం మంది మాత్రమే సైన్యంలో కొనసాగుతారు. మిగిలిన వారు ప్రభుత్వం ఇచ్చిన సెటిల్ మెంట్ సొమ్ముతో ఇంటి బాట పట్టాల్సిందే. ఈ పథకం కింద చేరిన వారిని అగ్నివీరులుగా పిలుస్తారు. ఈ ఏడాది మొత్తం 46,000 మంది సైనికుల నియామకం చేపట్టనుంది.
కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించగానే బిహార్‌లో మొదలైన ఆందోళనలు ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, జమ్ము, దిల్లీ, తమిళనాడు సహా అనేక రాష్ట్రాలకు వ్యాపించాయి.
ఇటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగంగా మారిపోయింది. అగ్నిపథ్ స్కీమ్‌ను నిరసిస్తూ.. రైల్వేస్టేషన్‌కి దూసుకెళ్లిన ఆందోళనకారులు.. తీవ్ర విధ్వంసం సృష్టించారు. రైళ్లకు నిప్పుపెట్టారు. రాళ్ల దాడితో పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
ఎందుకీస్థాయిలో విధ్వంసం జరిగింది?నిరుద్యోగుల్లో ఇంతటి ఆగ్రహానికి కారణమైన అంశాలేంటి?ఇవన్నీ అర్థం కావాలంటే ముందు మన ఆర్మీ గురించి బ్రీఫ్ గా మాట్లాడుకోవాలి..ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలగాలు కలిగి ఉన్న దేశాల్లో భారత్ ది రెండో స్థానం.ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత సైన్యంలో దాదాపు 15 లక్షల మంది వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్నారు.
ప్రతి ఏడాదీ ఆర్మీలో రిక్రూట్ మెంట్ ర్యాలీ ఉంటుంది. మరోవైపు పదవీ విరమణ ద్వారా అంతేమంది ఆర్మీ నుంచి బయటకు వెళ్తుంటారు, మాజీ సైనికులుగా మారుతుంటారు. ఆర్మీ నుంచి రిటైర్ అయితే వారికి పెన్షన్ అందుతుంది. అయితే భారత సైన్యం తన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంతోపాటు,
రిటైర్ అయిన వారికి పెన్షన్ల కోసం కూడా భారీగా నిధులు కేటాయించాల్సి వస్తోంది.ఇలా ప్రతి ఏడాదికి భారత సైన్యం రూ. 1.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది.
అయితే కొంత కాలంగా ఆర్మీ ర్యాలీలు సక్రమంగా జరగటం లేదు. ఏటా వేలమంది సర్వీసునుండి రిటైర్డ్ అవుతున్నా, దానికి తగ్గట్టు కొత్త నియామకాలు మాత్రం జరగటం లేదు. కోవిడ్ కారణంగా ఆర్మీ ర్యాలీలు అనుకున్న స్థాయిలో జరగలేదని ప్రభుత్వం చెప్తున్నా, నిరుద్యోగుల వాదనలు మాత్రం మరోలా ఉన్నాయి. ఈ తరుణంలో అగ్నిపథ్ పథకం ప్రకటించటంతో నిరుద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
భారత ప్రభుత్వం త్రివిధ దళాల కోసం ఈ ఏడాది బడ్జెట్ లో 5.25 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో నాలుగో వంతు పెన్షన్ల కోసం పక్కనపెట్టాల్సిన పరిస్థితి. ఇక్కడే అగ్నిపథ్ స్కీమ్ కు పునాదులు పడ్డాయని నిరుద్యోగులు, విపక్షాల వాదన. టూర్ ఆఫ్ డ్యూటీ పేరుతో ఈ పథకాన్ని పట్టాలెక్కించాలని చూస్తున్న ప్రభుత్వం, ఈ పథకం ద్వారా కాంట్రాక్టు పద్దతిలో సైనికులను నియమించుకోవాలని భావిస్తోంది. పెన్షన్లను తగ్గించుకునే ప్రాసెల్ లో భాగంగా ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన ప్రభుత్వం చేసిందనే వాదన ఉంది. అందులో భాగంగానే పెన్షన్లు, ప్రమోషన్లు లేని ఓ కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చిందనేది నిరుద్యోగులు మండిపడుతున్నారు. కొత్త రిక్రూట్‌మెంట్ ప్రణాళిక ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీ జీతభత్యాలు, పింఛను బిల్లులను తగ్గటంతోపాటు ఆయుధాల సేకరణ కోసం అధిక నిధులు వెచ్చించే అవకాశమూ ఏర్పడుతుందని భావిస్తున్నారు.
ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ స్కీమ్ లో అంశాలు కూడా ఉన్నాయనే వాదనలూ ఉన్నాయి.
17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. వీళ్లు పదో తరగతి లేదా ఇంటర్ పాసవ్వాలి.
అర్హతలను బట్టి ఆర్మీ, వైమానిక దళం, నేవీలో పని చేయవచ్చు. వీరికి మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయల జీతం. రెండో ఏడాది నెలకు 33 వేల రూపాయల జీతం, మూడో ఏడాదిలో ప్రతి నెలా 36500 రూపాయల జీతం ఉంటుంది. నాలుగో ఏడాది నెలకు 40 వేలు జీతం ఇస్తారు.
ప్రతినెలా జీతంలో నుంచి కొంత మొత్తాన్ని తీసుకుని కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. అలా నాలుగేళ్లలో మొత్తం 5లక్షల రెండు వేల రూపాయలు కార్పస్ ఫండ్‌లో జమ అవుతాయి. దీనికి మరో 5 లక్షల 2 వేల రూపాయలు అదనంగా కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీ కలుపుకుని నాలుగేళ్ల తర్వాత 11లక్షల,71 వేల రూపాయలు చెల్లిస్తారు. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. అదే సమయంలో సైన్యంలో ఉండగా చనిపోతే 48 లక్షల జీవిత బీమా ఉంటుంది. విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అదనంగా చెల్లిస్తారు. సైన్యంలో ఉండగా శారీరక వైకల్యం సంభవిస్తే పరిహారం అందిస్తారు. అయితే, నాలుగేళ్ల తర్వాత ఈ 46 వేలమంది పనితీరుని సమీక్షించి, వారిలో 25 శాతం మందిని మాత్రమే రిటెయిన్ చేస్తారు. వీళ్లు సైన్యంలో 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు. అంటే కేవలం పదకొండున్నర వేలమంది మాత్రమే సర్వీసులో కొనసాగుతారు. ఈ సెలక్షన్ లో ఎలాంటి పెన్షన్ ప్రయోజనాలు ఉండవు.
అయితే రెగ్యులర్ ఆర్మీ ఉద్యోగాల కోసం లక్షలమంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వం ఇలాంటి స్కీమ్ ప్రకటించటంతో నిరుద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల విధ్వంసం సృష్టించారు
సాధారణంగా ప్రతి ఆరు లేదా మూడు నెలలకు ఒక ఆర్మీర్యాలీ ఆ జోనల్ లేదా ఆర్మీ రిక్రూట్ మెంట్ ఆఫీస్ పరిధిలో జరగుతూనే ఉంటుంది. కానీ కోవిడ్ పరిస్థితులతో అది సాధ్యపడలేదనేది ఆర్మీ అధికారుల వెర్షన్. కొన్ని జిల్లాలను కలిపి, అక్కడ ఆర్మీ రిక్రూట్ మెంట్ ఆఫీసులను రక్షణ శాఖ నిర్వహిస్తుంది. అలాంటివి ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, గుంటూరులలో, తెలంగాణలో సికింద్రాబాద్ లో ఉన్నాయి. వీటిలో ఏటా రెండు ర్యాలీలు నిర్వహిస్తే మూడు చోట్ల కలిపి ఆరు ర్యాలీలు జరుగుతాయి. ఈ కార్యాలయాలు ఆర్మీ ర్యాలీలు నిర్వహించి, రిక్రూట్ మెంట్ ప్రక్రియను పూర్తి చేస్తాయి. రక్షణ శాఖ రాజ్యసభకు అందించిన వివరాల ప్రకారం… 2020-21లో దేశ వ్యాప్తంగా 97 ర్యాలీలు నిర్వహించాలని అనుకున్నా అందులో 47 మాత్రమే నిర్వహించారు. అందులో నాలుగింటికే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి, రిక్రూట్ చేసుకున్నారు. తర్వాత 2021-22లో 87 ర్యాలీలు అనుకుంటే కేవలం 4 మాత్రమే నిర్వహించారు. వీటికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించలేకపోవడంతో, రిక్రూట్ మెంట్ జరగలేదు. 2018-19లో 53,431 మంది, 2019-20లో 80,572 మంది సైన్యంలో రిక్రూట్ అయ్యారు. ఇప్పుడు ర్యాలీల్లో పాల్గొని ఎంట్రన్స్ జరగక వేలాదిమంది ఎదురుచూపుల్లో ఉన్నారు. అనేక సార్లు వాయిదా పడ్డ పరీక్షలతో ఆవేదన చెందుతున్నారు.
సైన్యంలో ఏటా 60 నుంచి 70 వేల మంది రిటైర్ అవుతుంటారు. ఏటా ఆర్మీ ర్యాలీలు నిర్వహించి ఈ సంఖ్యను భర్తీ చేస్తుంది. కానీ, కొంత కాలంగా ర్యాలీలు లేవు. ఎంట్రన్స్ టెస్టులు లేవు. భర్తీ జగరలేదు. దీంతో దేశ వ్యాప్తంగా ఆర్మీ ఉద్యోగాల కోసం చూస్తున్న లక్షలాదిమందిలో తీవ్ర అసంతృప్తి ఉంది. రక్షణ శాఖ కోవిడ్ కారణమని చెప్తున్నా, నిరుద్యోగులు కొట్టిపారేస్తున్నారు. ఈ అలస్యం కారణంగా తమ ఏజ్ లిమిట్ దాటిపోయిందని ఆవేదన చెందుతున్నారు. రెండున్నరేళ్లుగా ర్యాలీలు జరగకపోవటంతో వయసు పెరిగి కొందరు, ఆర్థిక ఇబ్బందులతో మరికొందరు ఆర్మీ ఉద్యోగాలపై ఆశలు వదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఒక్కో ర్యాలీలో కనీసం 50 వేల మంది, గరిష్ఠంగా లక్ష మంది పాల్గొంటారు. ఒక్కో ర్యాలీ నుంచి దాదాపు ఐదు వేల మంది సెలక్ట్ అవుతుంటారు. వారిలో కనీసం రెండు వేల మందైనా ఆర్మీలో చేరతారు. 2021 మేలో గుంటూరులో ఒక ర్యాలీ నిర్వహించారు. దానికి ఫిజికల్, మెడికల్ అయ్యాయి, కానీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరగలేదు. ఇప్పుడు ఆ ర్యాలీ ఫలితాలు పరిశీలనలోకి తీసుకుంటారో లేదో తెలియని అయోమయం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అగ్నిపథ్ వచ్చి తమ జీవితాలను నాశనం చేస్తుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
కొన్నేళ్లుగా రిక్రూట్ మెంట్ లేక ఏజ్ దాటిపోయిన తమకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. అగ్నిపథ్ వద్దు.. సాధారణ రిక్రూట్ మెంట్ మాత్రమే కావాలని..తేల్చి చెప్తున్నారు.
నిరుద్యోగుల వాదనలు ఇలా ఉంటే ప్రభుత్వం..మాత్రం అగ్నిపథ్ పథకాన్ని సైన్యంలో ఆధునిక, రూపాంతర దశగా అభివర్ణిస్తోంది. యువకులకు సైన్యంలో సేవలందించే అవకాశం కల్పిస్తామని, దేశ భద్రతను పటిష్టం చేసేందుకు, యువతకు సైనిక సేవలో అవకాశం కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంటున్నారు. ఈ పథకం వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, సర్వీసులో ఉన్న నైపుణ్యాలు, అనుభవంతో వారికి వివిధ రంగాల్లో ఉద్యోగాలు కూడా లభిస్తాయని ఆయన అన్నారు.
యువతలో జాతీయ భావాన్ని బలోపేతం చేయడం, భారత సైన్యాన్ని యువసైన్యంగా మార్చడం, సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే యువత ఆకాంక్షను నెరవేర్చడం ఈ పథకం లక్ష్యమంటోంది ప్రభుత్వం. అంతేకాదు.. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవటంతో, 2022 నియామకాల్లో ఏజ్ లిమిట్ 23ఏళ్ల వరకు అనుమతించాలని నిర్ణయించామని చెబుతున్నారు.
అయితే, ఇక్కడ మరో లెక్క కూడా ఉంది. భారత సైన్యంలో 68 శాతం ఆయుధాలు చాలా పాతవి, 24 శాతం మాత్రమే నేటి కాలానికి చెందినవి. 8 శాతం మాత్రమే అత్యాధునిక విభాగంలో ఉన్నాయి. 2021-22 లో రక్షణ బడ్జెట్‌లో 54 శాతం జీతాలు, పెన్షన్‌ల కోసమే ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒక డేటా ప్రకారం, గత 10 సంవత్సరాలలో రక్షణ పెన్షన్ పై వ్యయం 12 శాతం పెరిగింది. రక్షణ బడ్జెట్‌లో సగటు పెరుగుదల 8.4 శాతమే ఉంది. దీంతో బడ్జెట్ అంతా సైనికులపేనే ఖర్చవుతోందని … దాన్ని నియంత్రిస్తేనే ఆయుధాలను కొనగలుతామని ప్రభుత్వం భావిస్తుందనే వాదనలున్నాయి.
మరోపక్క ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పై అనేక విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. భారత సైన్యంపై జీతం, పెన్షన్ భారాన్ని తగ్గించడమే ఈ పథకాన్ని తీసుకురావడంలో ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని చాలామంది భావిస్తున్నారు. కానీ, ఇది భారత సైన్యపు సంప్రదాయ స్వభావాన్ని దెబ్బతీయడంతోపాటు, సైనికుల మనోధైర్యాన్ని ప్రభావితం చేసే పొరపాటు నిర్ణయమంటున్నారు. డబ్బును ఆదా చేయడం మంచిదే కానీ రక్షణ దళాలను పణంగా పెట్టి చేయకూడదంటున్నారు
అదే సమయంలో భారత సైన్యంలో నాలుగేళ్ల పాటు పనిచేయడం అంటే చాలా తక్కువ సమయం. ఆరునెల్లలో శిక్షణ పూర్తి చేసుకుని ఆర్మీకి సేవలందిచటం సాధ్యమేనా అనే ప్రశ్నలున్నాయి. అగ్నిపథ్ పథకంలో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్ కాలేడు. గ్రౌండ్స్‌మెన్ అవుతాడు.. లేదా మెకానిక్ అవుతాడు.. ఆయుధాలను సమర్థంగా వాడే యుద్ధవీరుడిగా అయ్యే అవకాశాలు తక్కువే ఉంటాయి. అసలు సైన్యంతో కనెక్ట్ అయ్యే లోపే నాలుగేళ్లు ముగుస్తాయనే వాదన ఉంది. అంతేకాదు.. టెన్త్ లేదా ఇంటర్ వరకు మాత్రమే చదవిన 21 ఏళ్ల యువత నాలుగేళ్లు సైన్యంలో పనిచేసి ఆ తర్వాత ఏం చేయగలరనే వాదనలున్నాయి. చదువులేక, సరైన ఉపాధి లేక అయోమయంలో పడేపరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు.
ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఈ పథకం కింద, రాబోయే నాలుగేళ్లలో దాదాపు రెండు లక్షల మంది సైనికులను రిక్రూట్ చేస్తారు. ఇది మన సైనిక బలంలో 10 శాతం అవుతుంది. అంటే రెగ్యులర్ ర్యాలీలు లేకుండా పూర్తిగా దీనిపైనే ఆధారపడితే కొంత కాలం తర్వాత పూర్తి స్థాయి సైనికులు ఉండరు. వాళ్లకు పెన్షన్లు, జీతాల ఖర్చు కూడా భారీగానే తగ్గుతుంది. ఖర్చు తగ్గటం మాట ఎలా ఉన్నా, ఇది భారత సైన్యానికి బలాన్నిస్తుందా లేక, బలహీన పరుస్తుదా అనేది చర్చించాల్సిన అంశం..
ఆల్రెడీ సైన్యంలో సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని గాలికొదిలేశారు. కొత్త విధానాలు తీసుకురావాలంటే దానికో పద్ధతి ఉంటుంది. ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్న రిక్రూట్ మెంట్ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఫలితాలను బేరీజు వేసుకుని, అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వ ఏకపక్ష ధోరణే ఈ పరిస్థితికి కారణమా?
రక్షణ రంగానికి ప్రపంచ దేశాలన్నీ బడ్జెట్ లో కేటాయింపులు పెంచుతున్నాయి. మనదేశమూ అదే బాటలో ఉంది. అయితే భారీ సంఖ్యలో ఉన్న మన సైన్యానికి జీతాలు, పెన్షన్ కూడా భారీగానే ఉంటుంది. ఇప్పుడు ఖర్చెక్కువైందని సైన్యం సంఖ్య తగ్గించుకోవాలంటే దానికి ఓ విధానం ఉంటుంది. ఆల్రెడీ ర్యాలీలు పూర్తయి, టెస్టులు జరిగిన వారికి రిక్రూట్ మెంట్ పూర్తి చేయాలి. ఇక ముందు ర్యాలీలపై ఎలాంటి విధానం ఉంటుందో స్పష్టం చేయాలి. ఆ తర్వాతే అగ్నిపథ్ లాంటి స్కీములు అమలు చేయాలి. కానీ, అనుకున్నదే తడవుగా కొత్త పథకాలను తెరమీదికి తెస్తే ఇలాంటి ఫలితాలే ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి
ఇప్పటికే సైనికులకు సరైన ఆహారం అందటం లేదని, సౌకర్యాలు తగ్గిపోయాయనే వాదనలున్నాయి. అంతెందుకు సైన్యంలో అవినీతిని బయటపెట్టిన తేజ్ బహదూర్ యాదవ్ అనే జవాన్ ఆ తర్వాత రోడ్డున పడ్డాడు. అన్నిటికీ మించి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అనే వివాదం చాలా కాలంగా ఉంది. మొత్తంగా సైన్యం బాగోగులను ప్రభుత్వం లైట్ తీసుకుంటుందనే వివాదం ఆల్రెడీ ఉన్నదే.
ఇప్పుడు కేవలం సైన్యంపై జీతాలు, పెన్షన్ ఖర్చును తగ్గించుకోవాలనే దృష్టితోనే, అగ్నిపథ్ వచ్చిందని నిరుద్యోగులు నమ్ముతున్నారు. టూర్ ఆఫ్ డ్యూటీ స్కీమ్ కు సంబంధించి ఎలాంటి పరిశీలనా లేదు. ఓ పైలట్ ప్రాజెక్టు లేదు, నేరుగా అమలు చేస్తున్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కూడా తెలియదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇది సరైన ధోరణి కాదనే విమర్శలున్నాయి.
ప్రభుత్వ నిర్ణయం సైన్యం సామర్ధ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందంటున్నారు. సైనిక దళాలను ఆర్థిక కోణంలో చూడవద్దని సూచిస్తున్నారు. పైగా ఉద్యోగం పోయిన సైనికులు నేరస్తులుగా మారిన ఘటనలు అనేకం గతంలో ఉన్నాయి టిఒడి విధానంతో అమెరికాలో మాజీ సైనికులు ఇల్లు, వాకిళ్లు లేక నేరస్తులుగా స్థిరపడిపోతున్నారని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఇలాంటిది మన సమాజానికి ప్రయోజనకరం కాదంటున్నారు పరిశీలకులు. అందుకే నాలుగేళ్ల తరువాత ఏం చేయాలని ఆందోళనల్లో పాల్గొన్న యువత ప్రశ్నిస్తోంది.అగ్నిపథ్ పేరుతో ఇది సైన్యాన్ని కాంట్రాక్టు పద్ధతికి మార్చటమే అని మండిపడుతున్నారు.
తాము ఎన్నో సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీలో చేరేందుకు సన్నద్ధం అవుతున్నామని, ఇందుకోసం ఉన్నత విద్యను కూడా వదులుకున్నామని నిరుద్యోగులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా ఆర్మీ నియామకం కోసం తాము ప్రిపేర్ అవుతున్నామని, ఇప్పుడు నిబంధనలన్నీ మార్చేసి, అగ్నిపథ్ పథకం తీసుకువస్తే తమకు నష్టం జరుగుతుందంటున్నారు. పరీక్ష కూడా నిర్వహించారని, మెడికల్ టెస్టు మాత్రమే మిగిలిందంటున్నారు. మిగిలిపోయిన నియామక ప్రక్రియను కొనసాగించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
రాజకీయాలతో తమకు సంబంధం లేదని, తామంతా స్వచ్ఛందంగా ఈ ఆందోళన చేస్తున్నామని చెప్తున్నారు. బుల్లెట్ గాయంతో కూడా ఆర్మీ ఉద్యోగం గురించే మాట్లాడుతున్న నిరుద్యోగుల ఆవేదక అందర్నీ కలచివేసేలా ఉంది.
దేశయువతని కొంత కాలం సైన్యంలో పనిచేయించాలని ప్రభుత్వం భావించినా, యువతలో స్వయంగా అలాంటి ఆకాంక్షలు ఉన్నా తప్పులేదు. కానీ, ఇది నిరుద్యోగులను నిరాశపరిచేదిగానో, లేక సైన్యాన్ని బలహీనపరిచేదిగానో ఉంటే ప్రయోజనం ఏంటి? భారత సైన్యంలో సాధారణ సైనికుడికి నాలుగేళ్ల పాటు శిక్షణ ఉంటుందని, ఆ తర్వాత ఆయా యూనిట్లలో చేరిన తర్వాత మరలా ట్రైనింగ్ ఇస్తుంటారు. ఇప్పుడు నాలుగేళ్ల కాంట్రాక్ట్ తో ఎవరికి ఉపయోగమనే ప్రశ్నలు పెరుగుతున్నాయి
అటు విపక్షాలు ప్రభుత్వ నిర్ణయంపై విరుచుకుపడుతున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని తప్పుపడుతున్నాయి.కేవలం పెన్షన్ డబ్బులు ఆదా చేసుకోవటానికే ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందంటున్నాయి విపక్షాలు
ప్రభుత్వం అగ్నిపథ్ తీసుకురావాలనుకుంటే కచ్చితంగా ఇది మార్గం కాదు. ఓ పక్క ఏళ్లతరబడి నిరుద్యోగులు రిక్రూట్ మెంట్ కోసం చూస్తున్నారని తెలిసి కూడా ఆ విషయాన్ని పట్టించుకోకుండా, భారీగా ప్రకటనలిచ్చి, ఇది ఆర్మీకి, నిరుద్యోగులకు భ్రహ్మాండంగా పనికొచ్చే నిర్ణయమని చెప్పుకోవటం హాస్యాస్పదమనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగులు ఆగ్రహంతో, ఆవేశంతో ఉన్నారు. ఈ ఉద్వేగంలో ధ్వంసానికి పాల్పడటం సరైన చర్య కచ్చితంగా కాదు. కానీ, నిర్ణయాధికారం ఉన్న ప్రభుత్వం అన్యాయం చేసిందని భావించినపుడు సామాన్యులు ఏ మేరకు ఓ పరిధిలో ఉంటారని ప్రశ్నిస్తున్నారు. తమ జీవితాలు నాశనం అవుతున్నాయనే ఆవేదనను గుర్తించమని నిరుద్యోగులు ఆక్రోశిస్తున్నారు. జరిగిన ధ్వంసాన్ని కాదు.. కుప్పకూలుతున్న తమ ఆశలను అర్థం చేసుకోమని వేడుకుంటున్నారు.