దేశంలో దొంగనోట్లు వరదలా వచ్చిపడుతున్నాయి..ఎటు చూసినా దొంగనోట్ల ముఠాలే పట్టుబడుతున్నాయి..
చేతిలోకొచ్చే ప్రతి కరెన్సీ నోటు అసలుదా, నకిలీదా అని చెక్ చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని… రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోదామని అనుకునేవాళ్లు పెరుగుతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు.. దేశమంతా అనేక చోట్ల నకిలీ నోట్లకు అడ్డాలు తయారవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సంగతి చెప్పనక్కర్లేదు. అటు కావలి నుండి ఇటు శ్రీకాకుళం వరకు… ఇటు సత్తుపల్లి నుండి హైదరాబాద్ వరకు నిత్యం అనేక చోట్ల నకిలీ నోట్ల ఆనవాళ్లు దొరుకుతున్నాయి. పట్టుబడేవే ఈ స్థాయిలో ఉన్నాయంటే, గుట్టుచప్పుడు కాకుండా చలామణీ అవుతున్న కరెన్సీ ఎంతో ఊహించలేని పరిస్థితి ఏర్పడింది
ఒక్క మాటలో చెప్పాలంటే నకిలీ నోట్ల చలామణి దడ పుట్టించే స్థాయిలో ఉంది. ఎందుకంటే రూ.500 నోట్లలో నకిలీవి గతేడాదితో పోలిస్తే 100 శాతం పెరిగాయంటోంది ఆర్బీఐ.. అన్ని నోట్లలో గతంతో పోలిస్తే ఫేక్ కరెన్సీ భారీగా పెరిగినా, నకిలీ రూ .500 నోటు ముద్రణ మాత్రం రెట్టింపైంది.
భారతీయ రిజర్వు బ్యాంకువిడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్ని డినామినేషన్లలో నకిలీ నోట్ల చలామణి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే రూ.500 నోట్లలో 101.9 శాతం, రూ.2,000 నకిలీ నోట్లలో 54.16 శాతం పెరుగుదలను ఆర్బీఐ గుర్తించింది.
2021-22లో దాదాపు 80వేల నకిలీ ఐదొందల నోట్లు బ్యాంకులు గుర్తించాయి. అదే సమయంలో 13 వేల 604 2 వేల నోట్లు కూడా గుర్తించారు. ఐదొందలు, రెండువేల రోట్లే కాదు… పది, ఇరవై, రెండొందల రూపాయల నోట్లలో కూడా నకిలీవి వచ్చేశాయి. వీటిలో కూడా నకిలీ నోట్లు భారీగా పెరుగుతున్నాయి గతేడాదితో పోలిస్తే వీటి చలామణీ 16శాతంపైగా పెరిగింది. నకిలీ నోట్లలో 6.9శాతం ఆర్బీఐ గుర్తిస్తే, 93.1 శాతం బ్యాంకులు గుర్తించాయి. మొత్తంగా మనదేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల నకిలీవి 10.7శాతం పెరిగిందని ఆర్బీఐ చెప్తోంది.
అయితే, యాభై, వంద రూపాయల నకిలీ నోట్లలో పెరుగుదల కాస్త తగ్గి, ఐదొందలు, రెండు వేల నకిలీ నోట్లు మాత్రం అమాంతం పెరుగుతున్నాయి. మరోపక్క నకిలీ నోట్లు వచ్చి చేరటంతో దేశంలో చేతులు మారే ఐదొందల నోట్ల సంఖ్య పెరిగింది. ఆర్బీఐ లెక్కల ప్రకారం సర్క్యులేషన్ లో ఉన్న అన్ని కరెన్సీ నోట్ల విలువ గత 2021 మార్చ్ లో 28.27లక్షల కోట్లు ఉంటే, 2022 మార్చ్ నాటికి ఇది 31.05లక్షల కోట్లకు చేరింది
అంటే నకిలీ… నకిలీ… నకిలీ… ఎక్కడ చూసినా నకిలీ నోట్ల ప్రవాహమే. ఏటీఎమ్ లోంచి ఐదు వందల రూపాయల నోటు వస్తే అది ఒరిజినల్లా, ఫేకా అని డౌటు పడాల్సిన పరిస్థితి. పర్సులో రెండు వేల రూపాయల నోటు పెట్టుకు తిరగాలంటే భయం. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే… అందులో ఎన్ని నోట్లు నకిలీవో అని గుండెదడ. అంతలా మామూలు నోట్లలో కలిసిపోతున్నాయి.
బ్యాంకులు, ఆర్బీఐ గుర్తిస్తున్న నోట్లే ఈ స్థాయిలో ఉంటే, జనాల చేతుల్లో తిరిగేవి.. కొత్తగా ముఠాలు కరెన్సీలోకి నెట్టేసేవి ఎన్ని ఉంటాయో.. వాటి ఫలితం ఎలా ఉంటుందో ఊహించటానికే ఆందోళన కలిగించే అంశం
ఓవర్‌నైట్‌లో కోటీశ్వరులు అయిపోవాలని కలలు కనేవాళ్లకు… తరతరాలకు తరగనంత ఆస్తులు కూడబెట్టాలనుకునేవాళ్లకు,. కాలు కదపకుండానే… కనకమహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవాలనుకునే వాళ్లకు…. ఇదే దగ్గరిదారి. వారానికో ముఠా దొరుకుతోంది. నెలకో గుట్టు రట్టవుతోంది. అయినా అందరి దొంగదారి ఈ నకిలీనోట్ల తయారీయే. పైగా రూపాయికి సగానికి సగంపైగా లాభం.అందుకే చాలామంది ఈజీగా దీనివైపు అట్రాక్ట్ అవుతున్నారు….
ఈ స్థాయిలో నకిలీ చలామణిలో ఉంటే, మనం తీసుకున్నప్పుడో, ఇచ్చినప్పుడో ప్రతీసారీ అవి ఒరిజినలా, ఫేకా అని చెక్‌చేయడం కష్టం. అందులోనూ బిజీగా ఉండే బిజినెస్ టైంలో షాపుల్లో వీటి జోరెక్కువ. నకిలీ నోట్ల ముఠాలు కూడా ఇలాంటి టైంలోనే వీటిని అంటగడతారు. వచ్చిన బాధల్లా ఏంటంటే ఏది నకిలీ, ఏది అసలు అనేది అంత ఈజీగా తెలుసుకోలేకపోవడం. టాలెంటంతా అసలు నోట్లకంటే నమ్మకంగా కనిపించేలా నకిలీ నోట్లను తయారు చేయటంలోనే పెడుతున్నారు.
రాష్ట్రంలో అక్కడా, ఇక్కడా అని లేదు.. ఏ ఏరియాకు వెళ్లినా దొంగనోట్ల బెడదే కనిపిస్తోంది. ఏటీఎమ్‌లోంచి డ్రా చేసిన నోట్లలోనూ దొంగనోట్లు వస్తున్నాయని.. వాటిని తిరిగి బ్యాంకులో డిపాజిట్ చేయాలనుకుంటే తీసుకోవట్లేదని బాధపడిన వాళ్లు చాలామంది ఉన్నారు. మీరో, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నవారో, ఎప్పుడో ఒకప్పుడు దీని బారిన పడినవారే అయ్యుంటారు. అయినా వీటిని పూర్తిగా అడ్డుకట్ట వేయలేని పరిస్థితి కనిపిస్తోంది.
చేతిలో ఉన్న రూపాయే జీవితాల్ని నడిపిస్తున్నపుడు అదికాస్తా నకిలీది అయితే ఎలా? ఈ లెక్కన చూస్తే క్యాష్ ఎక్కడ తీసుకోవాలన్నా ఓ క్షణం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చినట్టే. అన్ని చోట్లా డిజిటల్ ట్రాన్సాక్షన్లు వీలుకాకపోవచ్చు. ఎన్నో చోట్ల డిజిటల్ లావాలేదేవీలకు అవకాశం లేకపోవచ్చు. అలాంటపుడు క్యాష్ పై ఆధారపడక తప్పదు. ఇవన్నీ కాదు. చేతిలోకి వచ్చిన ప్రతినోటు విలువను ఆర్బీఐ ప్రామిస్ చేస్తుంది. అది నెరవేరకపోవటం అంటే ఆర్థిక వ్యవస్థను సమస్యల్లోకి నెడుతున్నట్టే..
ఆర్బీఐ నివేదిక సంచలనంగా మారింది.దేశంలో భారీ సంఖ్యలో దొంగనోట్లు చలామణిలో ఉన్నాయని, వాటిలో మెజారిటీ ఐదొందలు, ఆ తర్వాత రెండువేల నోట్లే అని తేలటం ఆందోళన కలిగించే విషయం. దానికి తగ్గట్టుగానే చలామణిలో ఉన్న నోట్ల విలువ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రూ.4,554.68 కోట్ల విలువైన రూ.500 నోట్లు చలామణిలో ఉన్నాయి. కానీ, గతేడాది దీని విలువ రూ.3,867.90మాత్రమే. మనం వాడే నోట్లలో ఎక్కువగా 500 రూపాయల నోట్లే ఉంటాయి. ఉపయోగించే కరెన్సీలో దాదాపు 34.9శాతం ఐదొందల నోట్లే ఉంటాయి. ఆ తర్వాతే పది, వంద, రెండొందలు ఉంటాయి. మరోవైపు 2000 నోట్ల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. 2020లో 274 కోట్ల 2వేల నోట్లుంటే, గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య 214 కోట్లకు పడిపోవటం ఆసక్తికరంగా మారింది.
ఈ లెక్కన చూస్తే రానున్న కాలంలో 2000 నోట్లు దొరకని పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. దేశంలో చలామణిలో అత్యధిక విలువ కలిగిన ఈ నోట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్ల విలువ, మొత్తం కరెన్సీ నోట్ల విలువలో ప్రస్తుతం 13.8 శాతంగా ఉంది. దీని విలువ గత సంవత్సరం 17.3 శాతంగా ఉండేది. నిజానికి కొత్త 2000 నోట్ల ముద్రణ కొంత కాలంగా నిలిచిపోయింది. అదే సమయంలో ఇతర నోట్ల ముద్రణ నిరంతరం కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి చలామణిలో ఉన్న అన్ని రకాల కరెన్సీ నోట్ల సంఖ్య 13,053 కోట్లు. అయితే 2 వేల నోట్లు తగ్గటం, అయిదు వందల నోట్లపై ఎక్కువగా ఆధారపడుతున్న సమయంలో, ఆ నోట్లు ఎక్కువగా నకిలీ దొరకటం ఆందోళన కలిగించే అంశం
నకిలీ నోట్లకు మూలాలు ఒక్కచోట అని చెప్పే పరిస్థితి లేదు. సరిహద్దుల నుండి ఉగ్రమూకలు డంప్ చేసే సందర్భాలు కొన్నైతే, దేశంలోపలే ప్రింటింగ్ సెటప్ పెట్టుకుని నోట్లు ముద్రిస్తున్న ముఠాలు అనేకం ఉన్నాయి. చాలా ఏళ్లుగా భారత ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్రలకు పాకిస్తాన్ పాల్పడుతోందనే ఆరోపణలున్నాయి. విచ్చలవిడిగా, మన కరెన్సీని ముద్రించి భారత్ లో ఉన్న ఉగ్రవాదులకు ఆ నకిలీ నోట్లను చేరవేస్తోందనే వాదనలున్నాయి. పాకిస్తాన్ లో ముద్రించిన నకిలీ నోట్లను నేపాల్, బంగ్లాదేశ్ మీదుగా మన దేశంలోకి పంపిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి.
లష్కరేతొయిబా, జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులకు నకిలీ నోట్ల కట్టలు చేరేలా నెట్ వర్క్ తయారైందనే వాదనలున్నాయి. డీమానిటైజేషన్ తర్వాత ఢాకాలో 2000, 500, 200 రూపాయల నోట్ల కట్లలు వెలుగు చూశాయి. అవన్నీ నకిలీవే. వాటిని పాకిస్తాన్ లో ముద్రించి, బంగ్లాదేశ్ ద్వారా భారత్ తీసుకురావాలనే స్కెచ్ ఉన్నట్టు తేలింది. అదేసమయంలో, నేపాల్ పోలీసులు ఖాట్మండూ ఎయిర్ పోర్టులో ఓ పాకిస్తానీని అరెస్టు చేశారు. అతని దగ్గర 70 లక్షల రూపాయలకు పైగా మన దేశ కరెన్సీ నోట్లు దొరికాయి. ఢాకాలోని ఎయిర్ పోర్ట్ లో కూడా భారత నకిలీ కరెన్సీ పట్టుబడింది
ఇక 2017లో ఢిల్లీలో భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ బయటపడింది. ఢిల్లీ వీధుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల దగ్గర పోలీసులు 6లక్షలకుపైగా విలువైన నకిలీ కరెన్సీని గుర్తించారు.
ఇటు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం నకిలీ నోట్ల ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. గతంలో కడప జిల్లా మైదుకూరులో దొంగనోట్లను చెలామణి చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేస్తే సంచలన విషయాలు వెల్లడయ్యాయి.ఈ నకిలీ నోట్ల ముఠాలో గుంటూరు, బాపట్ల, ఖమ్మం, కడప, పల్నాడు ప్రాంతాలకు చెందిన వ్యక్తులున్నారని గుర్తించారు. అటు నెల్లూరు జిల్లా కావలిలో కూడా ఆ మధ్య దొంగ నోట్ల ముఠా పట్టుబడింది. నిందితుల నుంచి రూ. 1.47 లక్షల విలువైన రూ. 500 దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒరిజినల్ నోట్లు రూ. 30 వేలు ఇస్తే దొంగ నోట్లు లక్ష రూపాయలు ఇస్తున్నారని సమాచారం.
గతంలోనే పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో దొంగనోట్లు చలామణి చేస్తున్న భార్యభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు గుంటూరు జిల్లాలో పొలానికి వెళ్తున్న రైతుకు నకిలీ నోట్ల కట్టలు దొరికాయి. గుంటూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని నకిలీ కరెన్సీ చలామణి అవుతోందనే వాదనలున్నాయి. పల్నాడు ప్రాంతంలో కూడా ఇదే తరహాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఘటనలు అప్పుడప్పుడు బయటపడుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు చలామణి చేస్తే ఇబ్బందులు కలుగుతాయని భావించి, చిన్న మొత్తాల్లోనే చలామణి జరుగుతోంది. పైగా ఎక్కడైనా ఇలాంటి ఘటనలు బయటకొచ్చినా అవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకపోవడంతో నకిలీల దందా నిరాఘాటంగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ కేసులో రికవరీకి వెళ్లిన పోలీసులకు దొంగనోట్ల ముఠా పట్టుబడింది. లక్షల్లో ఫేక్ కరెన్సీని పోలీసులు గుర్తించారు. ఈ లెక్కన చూస్తే తెలుగు రాష్ట్రంలోని ప్రతి నగరం, పట్టణంలో ఈ దొంగనోట్ల ముఠాలు విచ్చలవిడిగా తిరుగుతున్నట్టు తెలుస్తోంది. అటు ఉత్తర భారతంలో నకిలీ నోట్ల కేసులకు లెక్కే లేదు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో మొబైల్, జిరాక్స్ షాపు నడిపే వ్యక్తి.. కరెన్సీ నోట్లను కలర్ జిరాక్స్ తీసి చలామణిలోకి తీసుకొచ్చేశాడు..
నల్లధనాన్ని వెలికితీసేందుకు, ఉగ్ర నిధులను అరికట్టేందుకు రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధాని నరేంద్రమోదీ సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు నకిలీ నోట్ల కేసుల్ని చూస్తుంటే, ఆ లక్ష్యాన్ని మనం చేరుకున్నామా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు పట్టుబడిన నకిలీ నోట్లలో రూ. 500, రూ.2000 విలువైన నోట్లు ఎక్కువగా ఉండటమే దీనికి నిదర్శనం.
కరెన్సీ నోట్లకు అదనపు ఫీచర్లన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉంటుందన్నారు. కానీ, దొంగనోట్ల ముఠాలు జిరాక్స్ తీసినంత సులువుగా ఫేక్ కరెన్సీ తయారు చేస్తున్నాయి. అయితే అసలు నకిలీ నోట్లను గుర్తించటానికి ఆర్బీఐ సూచనలు కూడా ఉన్నాయి. ఐదొందల నోటు విషయంలో, నోటును లైటు వెలుగులో చూస్తే ప్రత్యేకమైన ప్రాంతాల్లో 500 అని రాసి ఉంటుంది. అది లేకుంటే దొంగ నోటే. ఒరిజినల్ నోటు మీద దేవనాగరి లిపిలోనూ 500 అని రాసి ఉంటుంది. ఒరిజినల్ నోటు మీద మహాత్మా గాంధీ ఒరియెంటేషన్, రిలేటివ్ పొజిషన్ కూడా కుడివైపుకు ఉంటుంది. ఒరిజినల్ నోటైతే దాని మీద ఇండియా అని రాసి ఉంటుంది. నోటును వంచితే సెక్యూరిటీ హెడ్ కలర్ మారుతుంది. ఇలా అనేక సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నప్పటికీ దొంగనోట్ల ముఠాలు మాత్రం అలవోకగా చెలరేగిపోతున్నాయి.
ప్రకృతి వైపరీత్యాలను మించిన పెనువిపత్తును సృష్టించగలదు. దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా దెబ్బతీయగలదు. ఈజీ మనీకి దొడ్డిదారిగా, ఉగ్రవాదానికి మరోరూపంగా, దేశద్రోహానికి రాజమార్గంగా అది సరికొత్త రూపు సంతరించుకుంది. దశదిశలా విస్తరించి, దేశ ఆర్థిక భద్రతకే పెను సవాల్ విసురుతోంది. అదే ఫేక్ కరెన్సీ.
నకిలీ నోట్ల సమస్య పాతదే అయినా, అసలు కరెన్సీ నోట్ల గురించి జనమంతా మాట్లాడటం మొదలైన సందర్భం డీమోనిటైజేషన్. నకిలీ నోట్ల రాకెట్, నల్లధనం, నగదు ఆధారిత అవినీతిపై అతిపెద్ద దాడిగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రవేశపెట్టారు. కానీ, ఈ నిర్ణయం తీసుకున్న ఆరేళ్ల తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థపై నకిలీ నోట్ల తయారీదారుల పట్టు కొనసాగుతోంది. డీమోనిటైజేషన్ తరువాత పరిస్థితుల్లో మార్పు పెద్దగా లేదని తెలుస్తోంది. నకిలీ నోట్ల మాఫియాలు తిరిగి మార్కెట్‌లోకి రావడానికి అవసరమైన మార్గాలు వెతుక్కుంటున్నాయి.
దేశంలో ఎంత కరెన్సీ ముద్రించాలో ఆర్బీఐకి ఒక లెక్క ఉంటుంది. లెక్కాపత్రం లేకుండా కరెన్సీ ముద్రించే అవకాశం లేదు. కరెన్సీ అదుపు తప్పి మార్కెట్ లోకి వస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తే కానీ, వస్తు సేవలు అందవు. అందుకే ఆర్బీఐ కొన్ని నిబంధనలు అనుసరించే నోట్లను ముద్రిస్తుంది. కానీ, ఇప్పుడు నకిలీ నోట్లు విచ్చలవిడిగా చెలామణిలోకి రావటంతో, ఆర్థిక వ్యవస్థలో నగదు సర్కులేషన్ ను పెరుగుతుంది. దీని వలన వస్తుసేవలనకు డిమాండ్ పెరుగుతుంది. ఇలా డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరిగి.. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. నకిలీ నోట్లు చెలామణిలో ఉన్న కరెన్సీపై బ్యాంకింగ్ రెగ్యులేటర్, ప్రభుత్వ ఏజెన్సీల అంచనాలను కూడా తలకిందులు చేస్తాయి. ఇవి ఆర్థిక వ్యవస్థలో అక్రమ లావాదేవీలు జరిగేందుకు కూడా కేంద్ర బిందువుగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలటానికి దారితీసే ప్రమాదం ఉంది.
నకిలీ నోట్ల బెడదను తొలగిస్తామని, నల్ల ధనాన్ని బయటకు తెస్తామని మోదీ ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేసింది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో మోదీ సర్కారు విఫలమైందని ఆర్బీఐ నివేదిక చెప్తోంది. ఆర్బీఐ రిపోర్ట్ నేపథ్యంలో.. ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్ విరుచుకుపడ్డారు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే పెద్ద నోట్ల రద్దు ఏకైక దురదృష్టకరమైన విజయమంటూ ట్వీట్ చేశారు.
దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీలో ఎన్నో వంతు నకిలీదో ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. గణాంకాలు కేవలం బ్యాంకులు, ఆర్బీఐ గుర్తించిన నోట్లవి మాత్రమే. ఇవి కాకుండా, ఇంకా ఎంత నకిలీ కరెన్సీ ఉందో తెలియదు. అసలిప్పుడు మన దగ్గరున్న నోట్లలో ఏది ఒరిజినల్లో, ఏది డూప్లికేటో తెలుసుకోలేనంతగా ఇవి అసలు నోట్లతో మిక్స్ అయిపోయాయి.
నకిలీ నోట్లకు ఉగ్రవాదానికి ప్రత్యక్ష సంబంధాలున్నాయి. బాంబు దాడులకన్నా భయంకరమైన విద్రోహ చర్య ఇది. దొంగనోట్లతో దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలనేదే శత్రుదేశాల వ్యూహం. అన్ని మార్గాలకన్నా సముద్రమార్గంలో దీన్ని ఇండియాలో ప్రవేశపెట్టడం ఈజీ అన్న సంగతి తెలియడంతో… ఈ మార్గంలో నకిలీ నోట్లను తీసుకురావడం మొదలైంది.
ఇప్పుడు పట్టుబడుతున్న నకిలీ నోట్లను చూస్తే ఆర్బీఐ చెప్పిన సాంకేతికత, ముందుజాగ్రత్తలు ఏమయ్యాయనే సందేహాలు వస్తాయి. కొందరైతే ఏకంగా రెండు వేల నోటులో చిప్ ఉందని వాదించారు. కానీ, ఏ నోటునీ వదలటం లేదు. అన్నిటికీ ఫేక్ నోట్లు మార్కెట్ లో ఉన్నాయి. నెలంతా కష్టపడి సంపాదించిన సొమ్మును అవసరాల కోసం వెచ్చించడమే తెలిసినవారికి నకిలీ నోట్లను గుర్తించడం చాలా కష్టం. అటు వ్యాపారులదీ ఇదే పరిస్థితి. కౌంటర్ కి వచ్చిన ఐదొందల నోటు నకిలీదని తేలితే వారి పరిస్థితి మాటల్లో చెప్పలేం.
దేశంలో అనేక నగరాలు దొంగనోట్లకు కేంద్రంగా మారిపోయాయి. విదేశీ శక్తులు నేరుగా అక్కడికే వీటిని పంపుతున్నాయని సమాచారం. అటు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో నకిలీ నోట్ల ముద్రణ కుటీర పరిశ్రమగా మారిపోయిందనే వాదనలు ఇప్పటివి కావు. పాకిస్తాన్ నుంచి భారత్‌లో చొరబడే ప్రతీ ఒక్కరూ నకిలీ కరెన్సీని వెంట తెచ్చుకుంటున్నారనే వాదనలున్నాయి. ఒక్కో వ్యక్తి లక్షల్లో తెచ్చుకుంటాడని సమాచారం. ఇది చాలదా మన ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చడానికి. అంటే బాంబులతో చేసే విధ్వంసం ఒకటైతే, ఆర్థిక వ్యవస్థపై చేసే దాడి కలిగించే విధ్వంసం మరీ పెద్దది. దాడులు ఆ ప్రదేశానికే పరిమితమౌతాయి. కానీ, ఆర్థిక వ్యవస్థపై దాడి చేస్తే అది దేశమంతా ప్రభావం చూపుతుంది.
అందుకే ఏ దేశమైనా నకిలీ నోట్లపై తీవ్రంగానే స్పందిస్తాయి. కానీ సువిశాల భారత దేశంలో ఎన్ని నకిలీ నోట్ల ముఠాలు పట్టుబడుతున్నా వాటికి ముగింపు లేకుండా పోతోంది. పైగా ఎన్ని నోట్లు సర్క్యులేషన్ లో ఉన్నాయో, ఈ దందాకు అసలు మూలాలు ఎక్కడున్నాయో ఎప్పటికీ తేలకపోవటం మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఎప్పటికప్పుడు వాటిని చెలామణీ చేసే చిన్నా చితకా వ్యక్తులు దొరకటమే తప్ప, నకిలీ నోట్ల అసలు కేంద్రాలను మాత్రం కదిలించలేకపోతున్నారు. అన్నిటికీ మించి ఉగ్రవాదం, నల్లధనం, నకిలీ నోట్ల పేరు చెప్పి, దేశం మొత్తాన్ని క్యూలో నిలబెట్టిన డీ మానిటైజేషన్ తర్వాత కూడా ఈ సమస్య అలాగే ఉండటం మరింత ఆందోళన కలిగించే విషయం. ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, బ్యాంకులు నిత్యం ఎలర్ట్ గా ఉంటే తప్ప నకిలీ నోట్లకు చెక్ పెట్టడం సాధ్యం కాదు. దానికి తోడు సామాన్య ప్రజలకు కూడా నకిలీ నోట్లను గుర్తించే ఎవేర్ నెస్ కల్పించాల్సిన అవసరం కూడా ఉంది.