Site icon NTV Telugu

Story Board: ఫోన్ ట్యాపింగ్ సంగతి తేలేదెప్పుడు..?

Sb

Sb

Story Board: ప్రభాకర్ రావు విదేశాల నుంచి వచ్చాక.. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వేగం పెరిగింది. ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు.. కీలక వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే ప్రభాకర్ రావు మాత్రం చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటేస్తున్నారు. పైగా అప్పటి ఉన్నతాధికారుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాకర్ రావు వాంగ్మూలంతో అప్పటి ఉన్నతాధికారుల దగ్గర కూపీ లాగింది సిట్.

Read Also: Jailer 2 : జైలర్ 2 లో షారుక్ ఖాన్.. రజినీ రుణం తీర్చుకుంటున్న షారుక్

తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ప్రస్తుతం ఓ పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్ రావులకు (Harish Rao) సిట్ (SIT) నోటీసులు ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతున్న వేళ.. ఇప్పుడు ఈ కేస్ ప్రూవ్ చేయడానికి ఈ పెన్ డ్రైవ్ సాలిడ్ ఎవిడెన్స్ అని సిట్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎస్ఐబీ చీఫ్ గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు ఆ పెన్ డ్రైవ్ లో కీలక సమాచారం నిక్షిప్తం చేశారని.. ఈ పెన్ డ్రైవ్ లో వందల నెంబర్లు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జీలు, వ్యాపారవేత్తల ప్రొఫైల్స్ ఉన్నాయని అంటున్నారు. ఈ సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించినట్లు చెబుతున్నారు.

Read Also: Silver Rates: బాబోయ్ సిల్వర్.. మరోసారి భారీగా పెరిగిన వెండి ధర

కీలక మలుపు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీశ్ రావుకు ఉచ్చు బిగుస్తోందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభాకర్ రావుతో పాటు ఇద్దరు మాజీ సీఎస్‍లు, మాజీ ఎస్‍ఐబీ చీఫ్‍ను సిట్ విచారించిన తరుణంలో ఎవరి ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారనే విషయంపై దర్యాప్తు అధికారులు కూపీ లాగారు. ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో తాజాగా పెన్ డ్రైవ్ అంశం మరో సంచలనంగా మారింది. ఈ పెన్ డ్రైవ్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది ఉత్కంఠ రేపుతోంది.

Read Also: Launches Rs.5 Meal: దేశ రాజధానిలో కేవలం 5 రూపాయలకే మీల్స్..

గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నోళ్లను కట్టడి చేసేందుకు ఎస్‌‌‌‌ఐబీ కేంద్రంగా ప్రణీత్‌‌‌‌రావు ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్‌‌‌‌ టార్గెట్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. బేగంపేటలోని ఎస్‌‌‌‌ఐబీ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఎస్‌‌‌‌వోటీ లాగర్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు సహా రాష్ట్రంలోని కీలక నాయకులు, మీడియా, సినీ ఇండస్ట్రీ ప్రముఖుల ఫోన్‌‌‌‌ నెంబర్లతో ప్రణీత్‌‌‌‌రావు టీమ్ ప్రత్యేక ప్రొఫైల్స్ రూపొందించింది. ఈ క్రమంలోనే ఓ మహిళా జడ్జి, ఓ కోర్టు జడ్జి దంపతులు సహా పబ్లిక్‌‌‌‌ డొమైన్‌‌‌‌లో ఉన్న హైకోర్టు జడ్జీల వివరాలను సేకరించినట్లు సిట్‌‌‌‌ దర్యాప్తులో వెల్లడైంది. 16 మంది జడ్జీలకు సంబంధించిన ప్రొఫైల్స్‌‌‌‌ పెన్‌‌‌‌డ్రైవ్‌‌‌‌లో ఉన్నట్టు సమాచారం. మొత్తం 6 వేల మందికి పైగా ప్రొఫైల్స్‌‌‌‌ను ఎస్‌‌‌‌వోటీ టీమ్ తయారు చేసినట్టు తెలిసింది. దాదాపు 4,200కు పైగా ఫోన్‌‌‌‌ నెంబర్లతో ప్రొఫైళ్లను క్రియేట్‌‌‌‌ చేసినట్టు సిట్‌‌‌‌ గుర్తించింది. ప్రణీత్‌‌‌‌రావు టీమ్‌‌‌‌ ధ్వంసం చేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌‌‌‌ హార్డ్‌‌‌‌ డిస్క్‌‌‌‌ల్లో మరో 2 వేలకు పైగా ఫోన్‌‌‌‌ నంబర్లు, వ్యక్తిగత సమాచారం ఉన్నట్టు ఆధారాలు సేకరించింది. అలాగే ప్రభాకర్ రావు సహా ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌తో సంబంధం ఉన్న అధికారులు, రాజకీయ పార్టీల నేతల కుట్రలకు సంబంధించిన కీలక ఆధారాలు పెన్‌‌‌‌డ్రైవ్‌‌‌‌లో ఉన్నాయని చెబుతున్నారు.

పెన్‌‌‌‌డ్రైవ్‌‌‌‌లో దొరికిన 6 వేల మంది వివరాలతో ప్రొఫైల్స్ మాత్రమే క్రియేట్‌‌‌‌ చేశారా? లేక వాళ్ల ఫోన్‌‌‌‌ నెంబర్స్ కూడా ట్యాప్‌‌‌‌ చేశారా? అనే కోణంలో సిట్‌‌‌‌ ఆధారాలు సేకరించే పనిలో ఉంది. మరోవైపు డేటా ప్రొఫైలింగ్‌‌‌‌ వవ్యహారంలో నాటి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పర్సనల్‌‌‌‌ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి నుంచి సిట్‌‌‌‌ కీలక వివరాలను రాబట్టింది. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను విచారించేందుకు అవసరమైన న్యాయసలహాలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కాకపోతే ట్యాపింగ్‌ కేసును భిన్న కోణాల్లో చూడాల్సిన పరిస్థితి నెలకొందని సిట్‌ అధికారులు చెబుతున్నారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో జరిగిన ట్యాపింగ్‌ ఒకటైతే.. ప్రభాకర్‌రావు బృందానికి అనధికారికంగా ఫోన్‌ నంబర్లు ఇచ్చి ట్యాపింగ్‌ చేయించిన మాజీ మంత్రులది మరో కోణమని, వాటికి అదనంగా వ్యక్తిగతంగా ఎస్‌ఐబీ అధికారులు ట్యాపింగ్‌ చేసినవి మరికొన్ని ఉన్నాయని అంటున్నారు. వీటిని ఒకదానికొకటి లింక్‌ చేసుకుంటూ వెళ్లడం ద్వారా ట్యాపింగ్‌ లక్ష్యాలను గుర్తించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా ఇద్దరు మాజీ మంత్రులు, నాటి సీఎంవో పాత్రకు సంబంధించిన ఆధారాలు లభించాయని అంటున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు కర్త, కర్మ, క్రియ ఒక్కరేకాదని, కొంత మంది ఉన్నారని ఒక నిర్ధారణకు వచ్చినట్టు భావిస్తున్నారు. ప్రభాకర్‌రావును ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు కీలక ఆధారాలను ముందుంచి ప్రశ్నించినా.. ఆయన నుంచి అరకొరగానే సమాధానాలు వచ్చాయని చెబుతున్నారు.

ప్రభాకర్ రావు వాంగ్మూలం ఆధారంగా.. సిట్ ఇప్పటికే రివ్యూ కమిటీలో ఉన్న వారిని విచారించింది. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను మరోసారి ప్రశ్నించి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి నవీన్ చంద్‌కు సైతం నోటీసులు ఇచ్చి సిట్‌ విచారించింది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌ నవీన్ చంద్‌ ఎదుట ప్రభాకర్‌రావును ఉంచి వివరాలడిగింది. రెండోసారి నవీన్ వద్దకు వెళ్లి ఆయన స్టేట్‌మెంట్‌ రికార్డు చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి, అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ స్టేట్‌మెంట్‌ కూడా మరోసారి రికార్డు చేసిన సిట్‌.. ఈ కేసులో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ప్రభాకర్ రావు రెండు వారాల కస్టడీ ముగియడంతో.. విచారణలో ఆయన వద్ద ఉన్న కీలక పెన్ డ్రైవ్ ను సిట్ స్వాధీనం చేసుకుంది. దాదాపు 6వేలకు పైగా ఫోన్ నెంబర్లు అందులో ఉండటం గుర్తించిన సిట్ అధికారులు వాటిపై ప్రభాకర్ రావు ను ప్రశ్నించగా సమాధానం లభించలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాను ట్యాపింగ్‌కు ఆదేశాలిచ్చానని ప్రభాకర్ రావు చెప్పిన విషయాన్ని సిట్ తోసిపుచ్చింది. తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఇప్పటికే వారంతా సిట్‌కు వాంగ్మూలాలు ఇచ్చారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌లో ట్యాప్‌ చేసిన ఫోన్‌ నంబర్లు సరైనవేనా కావా అని పరిశీలించిన రివ్యూ కమిటీ సభ్యులూ ఈ విషయంతో పూర్తి బాధ్యత ప్రభాకర్‌రావుదేనని చెప్పినట్లుగా సమాచారం. తాము రివ్యూ కమిటీ మీటింగ్ పెట్టిన ప్రతిసారి దాదాపు 4-5 వేల ఫోన్‌ నంబర్ల జాబితాను ప్రభాకర్‌రావు తీసుకొచ్చేవారని.. అవి మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచేందుకు సంబంధించిన వారివేనా అని తనిఖీ చేసే యంత్రాంగం తమకు అందుబాటులో లేదని వారంతా వాంగ్మూలమిచ్చారు. అదే సమయంలో ఉద్యోగ విరమణ చేశాక మళ్లీ ఎస్ ఐబీ చీఫ్ గా మాజీ సీఎం కేసీఆర్ ఎలా..ఎందుకు నియమించారన్నదానిపై ప్రభాకర్ రావు నుంచి మౌనమే సమాధానమైంది. అప్పట్లో ప్రభాకర్ రావు పునర్నియామకం కోసం ప్రత్యేక జీవోలు కూడా జారీ అయ్యాయి.

ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీ చీఫ్‌గా పనిచేసి.. 2020 జూన్‌ 30న పదవీ విరమణ పొందారు. అనంతరం జులై 1 నుంచి మూడేళ్ల కాలానికి ఆయన్ని చీఫ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌గా పునర్నియమించారు. జులై 10న హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో నం.18 జారీ చేశారు. అధికారికంగా ఫోన్‌ ట్యాపింగ్‌ చేసేందుకు ఉద్దేశించిన జీవోల్లో మార్పులు చేస్తూ.. ప్రభాకర్‌రావుకు బాధ్యతల్ని కట్టబెడుతూ ఉత్తర్వులిచ్చారు. టెలిఫోన్లను, ఇంటర్నెట్‌ సర్వీసెస్‌ను ఇంటర్‌సెప్ట్‌ చేసేందుకు అధీకృత సంతకందారుడిగా ప్రభాకర్‌రావును నియమించారు. గతంలో ఐజీలకు మాత్రమే ఈ అధికారం ఉండేది. ఐజీ స్థానంలో చీఫ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ హోదాలో ప్రభాకర్‌రావును నియమించడంపై జులై 20న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ అభ్యంతరం తెలిపారు. మరుసటి రోజే డీవోటీ డీజీకి తెలంగాణ ఇంటెలిజెన్స్‌ అప్పటి ఐజీ ప్రత్యుత్తరమిచ్చారు. ఐజీ హోదాలోనే విరమణ పొంది.. పునర్నియామకం పొందినందువల్లే ప్రభాకర్‌రావును అధీకృత సంతకందారుడిగా నియమించినట్లు వెల్లడించారు. అదే నెల 22న డీవోటీ సహా అందరు టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లు, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు అప్పటి హోంశాఖ కార్యదర్శి లేఖలు రాశారు. ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ రూల్స్‌ 419ఏ కింద ప్రభాకర్‌రావును అధీకృత సంతకందారుగా నియమించినట్లు లేఖల్లో పేర్కొన్నారు.

తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. శాంతిభద్రతల పరిరక్షణకు వాడాల్సిన ట్యాపింగ్‌ను.. ప్రైవేట్ వ్యక్తుల్ని టార్గెట్ చేయటానికి ఉపయోగించారు. అంతటితో ఆగకుండా బెదిరించి డబ్బు వసూలు చేశారు. ఇంకా దారుణంగా ప్రైవేట్ వ్యక్తులే ట్యాపింగ్ వ్యవస్థను ఆపరేట్ చేశారు. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో ప్రైవేట్ జీవితాలు రిస్క్‌లో పడ్డాయి. ఆఖరికి భార్యాభర్తల సంభాషణలు కూడా విన్నారన్న ఆరోపణలు వచ్చాయి.

తెలంగాణలో బీఆర్ఎస్‌ పాలనలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరికీ సీక్రెసీ లేదని తేలిపోయింది. రాష్ట్రంలో ఎవరు ఫోన్ మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి తెచ్చారు. ట్యాపింగ్ పేరుతో కొందరు అధికారులు, మరికొందరు ప్రైవేట్ వ్యక్తులు ఓ గ్రూప్ గా ఏర్పడి నడిపిన వ్యవహారం.. అందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ట్యాపింగ్ కేసులో మొదట ఎస్ఐబీ అధికారుల పేర్లు వెలుగుచూశాయి. తర్వాత పోలీసుల పేర్లు వచ్చాయి. సరే ఎంతోకొంత లింక్ ఉంటుంది కదా అని సరిపెట్టుకున్నారు. ఇక్కడదాకా ట్యాపింగ్ ను దుర్వినియోగం చేశారనే కోణమే ఉంది. అధికార దుర్వినియోగమూ జరిగిందని నిగ్గుతేలింది. కానీ ఇక్కడ్నుంచీ ట్యాపింగ్ కథ ప్రమాదకర మలుపు తిరిగింది. ఏకంగా ప్రైవేట్ వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వమే చేయాల్సిన పని కాకుండా.. చేయకూడని పని చేసిందని మొత్తుకుంటుంటే.. మధ్యలో సంబంధం లేని ప్రైవేట్ వ్యక్తుల ప్రస్తావన రావడం, వారిచ్చిన సమాచారం ఆధారంగా ట్యాపింగ్ జరిగిందన్న సమాచారం మరిన్ని భయాలకు తావిస్తోంది.

సినిమాలు, వ్యాపారాలు, భూ లావాదేవీలు, బంగారం కొనుగోళ్లు.. ఇలా ఒకటేంటి కాస్త డబ్బులు కనిపించే ఏ రంగాన్నీ ట్యాపింగ్ భూతం వదల్లేదు. ఇంకాచాలా మంది ట్యాపింగ్ బాధితులైనా..చెప్పుకోవడానికి ఇష్టపడటం లేదనే కోణం ఉంది. గత కొన్నాళ్లుగా అనూహ్యంగా జరిగిన పరిణామాల్నే కాదు.. సహజంగా జరిగినట్టుగా కనిపించిన ప్రతి లావాదేవీని అనుమానించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎలక్టోరల్ బాండ్లకు ట్యాపింగ్ లింక్ బయటపడటంతో.. బాండ్ వారీగా దర్యాప్తు జరుగుతోంది. బాండ్లు అంటే ఫిజికల్ గా కనిపిస్తున్నాయి కాబట్టి విచారణ చేయొచ్చు. కానీ విన్న ఫోన్ కాల్స్.. బెదిరింపులకు వాడిన ఆడియోలు.. ఇవన్నీ ఎలా చూడాలి.. ఎక్కడ వినాలి.. వీటిని ఏఏ ఘటనలతో లింక్ చేయాలనేది పెద్ద చిక్కు ప్రశ్న.

ట్యాపింగ్ వ్యవహారం గురించి మూడేళ్ల క్రితమే అప్పటి ప్రతిపక్ష నేత.. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. తనతో పాటు తన సోదరుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని, ప్రభాకర్ రావే అంతా నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్ ఆరోపణలకు బలం చేకూరేటట్టుగా ఆయన నివాసానికి 200 మీటర్ల దూరంలోనే ట్యాపింగ్ కోసం ఆఫీస్ పెట్టారనే విషయం ఇప్పుడు బయటపడింది. ఓ కారులో ట్యాపింగ్ ఎక్విప్ మెంట్ పెట్టి రేవంత్ పై డేగకళ్లతో నిఘా వేశారు. ఆయన ఇంటికి ఎవరు వస్తున్నారు..? ఎవరు వెళ్తున్నారు..? అనే వివరాలన్నీ కూపీ లాగారు. ఓ ప్రతిపక్ష నేతకే ఇలాంటి దుస్థితి ఎదురైతే.. ఇక సామాన్యుడకి దిక్కెవరనేది అసలు ప్రశ్న. ట్యాపింగ్ వ్యవహారాన్ని లోతుగా చూస్తే.. అది పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది. ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఎంతో చరిత్ర ఉన్న ఎస్ఐబీని తనకు తోచినట్టుగా నడిపించారు. ఏకంగా ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలిపి.. ఊహించని ప్రమాదానికి తావిచ్చారు.

ఇక్కడ ట్యాపింగ్ జరిగిన తీరు చూస్తే.. ఏదో పరిమితమైన లక్ష్యం కనిపించడం లేదు. ఛాన్స్ దొరికిందే తడవుగా ఎవరెవరి కాల్స్ అయినా వినేయడం.. దొరికిన సమాచారం ఆధారంగా కొత్త టార్గెట్లు, కొత్తగా బ్లాక్ మెయిళ్లు చేసి.. ట్యాపింగ్ పరిధిని ఎప్పటికప్పుడు విస్తృతం చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ మరో దారుణం ఏమిటంటే.. కేవలం ప్రభాకర్ రావు చెప్పిన వ్యక్తుల్నే ట్యాప్ చేయలేదనే సందేహాలు కూడా వస్తున్నాయి. ట్యాపింగ్ రాకెట్ లో ఇన్వాల్వ్ అయిన అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు.. తమ తమ సొంత టార్గెట్లను ఎంచుకుని కూడా ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. ట్యాపింగ్ జరిగిన తీరు చూస్తే దేన్నీ కాదనడానికి లేదు. ఏ అవకాశాన్నీ కొట్టిపారేసే పరిస్థితి రాలేదు. ఇదేదో పరిమితమైన వ్యవహారమే అయితే.. కేవలం కొందరు చెప్పినట్టుగా పనిచేసి ఉంటే.. నిందితులు దేశం దాటాల్సిన పనేముందనేది కీలక ప్రశ్న.

అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా ప్రభాకర్ రావే వ్యవహరించారు. ప్రభాకర్ రావే అన్నీ తానే చూసుకున్నారు. ప్రభాకర్ రావు చెప్పు చేతల్లోనే ఎస్ఐబి నడిచిపోయింది. ప్రభాకర్ రావు చెప్పిన ఫోన్ నెంబర్లను ట్రాక్ చేయడం లైవ్ లొకేషన్ తీసుకోవడం సంభాషణలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం లాంటి పనులు ప్రణీతరావు అండ్ గ్యాంగ్ చేసి పెట్టింది. 50 మంది అధికారులతో ప్రభాకర్ రావు ఇష్టాను రీతిగా ట్యాపింగ్ కు పాల్పడి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముగ్గురు బిఆర్ఎస్ నేతల అదేశాలతో టాపింగ్ ని విచ్చలవిడిగా చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.

ట్యాపింగ్ ఏదో పొరపాటునో గ్రహపాటునో జరగలేదు. ఉద్దేశపూర్వకంగా.. కుట్రపూరితంగా కొందర్ని టార్గెట్ చేసి వేధించారు. ఎవరికీ ప్రైవేట్ లైఫ్ లేకుండా చేశారు. వ్యక్తిగత జీవితాల్ని నడి బజార్లో పడేశారు. ట్యాపింగ్ పేరుతో వ్యవస్థీకృత నెట్ వర్క్ నడిచింది. ఎస్ఐబీకి ఉన్న యంత్రాంగం చాలదన్నట్టు ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ ఆఫీసుల్ని వాడుకోవడం చూస్తుంటే.. జరిగిన నేరం తీవ్రమైనేద కాదు హేయమైనదని చెప్పకతప్పదు. మామూలుగానే సర్వర్ రూమ్ లో ఆథరైజ్డ్ వ్యక్తులకే ప్రవేశం ఉంటుంది. ప్రభుత్వ సర్వర్లు అయితే కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండాలి. ఎందుకంటే వాటిలో రాష్ట్ర పౌరులందరి సమాచారం ఉంటుంది. అలాంటిది కీలకమైన ట్యాపింగ్ సర్వర్ ను తీసుకెళ్లి ప్రైవేట్ ఆఫీస్ లో పెట్టారు. సాధారణంగా ట్యాపింగ్ సర్వర్ ను ఎస్ఐబీలో కూడా ప్రత్యేక విభాగం ఆధీనంలో ఉంచుతారు. అలాంటిది ఎస్ఐబీ పరిధి దాటి.. ఏకంగా పోలీస్ శాఖకు కూడా సంబంధం లేని చోట.. ఎలాంటి రక్షణ లేని ఓ ప్రైవేట్ ఆఫీస్ పెట్టారంటే.. ఇంతకంటే లెక్కలేనితనం, బాధ్యతారాహిత్యం ఇంకేం ఉంటుందనే చర్చ జరుగుతోంది.

ఎందుకంటే ట్యాపింగ్ కోసం ప్రభాకర్ రావు ఒక ప్రైవేట్ సైన్యమే ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్లో పనిచేస్తున్న అధికారులతో పాటు ఎస్ఐబిలో పనిచేస్తున్న అధికారులు అందరికీ కలిపి ఫోన్ టాపింగ్ తో పాటుగా లైవ్ ట్రాకింగ్, సి డి ఆర్ లు తర్వాత ఎవరైనా ముఖ్యమైన నేతలు ఉంటే వాళ్ళని సమీపంలో మానిటరింగ్ మొత్తం కూడా ఎస్ఐబిని నడిపించింది. ప్రభాకర్ రావు చెప్పుచేతుల్లో ఎస్ఐబి పూర్తిగా కీలుబొమ్మగా మారిపోయింది. ఎస్ఐబిలో రెండు లాగర్ రూమ్ లు ఏర్పాటు చేసుకొని.. అందులో 17 అత్యంత అధునాతనమైన కంప్యూటర్లను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ప్రణీత్ రావు ఇన్చార్జిగా ఉన్నారు. ఈ రూమ్ లోనే ఫోన్ ట్యాపింగ్ డివైజ్ కూడా పెట్టుకున్నారు. ప్రభాకర్ రావు నేతృత్వంలో మొత్తం 50 మంది ప్రైవేట్ సైన్యం 24 గంటల పాటు పనిచేసింది. ట్యాపింగ్ ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉన్నప్పుడు పరిమిత సోర్సులు ఉంటాయి. కానీ ఒక్కసారి ట్యాపింగ్ వ్యవహారం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లాక.. వారేం చేస్తారనేది ఊహించడం అంత తేలిక కాదు. ఎవరికి వారే బ్యాకప్ సోర్స్ పెట్టుకోవచ్చు.

ట్యాపింగ్ వ్వవహారాన్ని హ్యాండిల్ చేసిన ప్రైవేట్ వ్యక్తి ఓ టీవీ ఛానెల్ ఎండీగా ఉన్న శ్రవణ్ రావు. ఇతడు బీఆర్ఎస్‌ హయాంలో… పెగాసెస్‌ సాఫ్ట్‌వేర్‌ ఇజ్రాయెల్‌ నుంచి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించాడు. రెండు ఫోన్‌ ట్యాపింగ్‌ మిషన్లను తీసుకొచ్చి…అందులో ఒక దాన్ని ప్రభుత్వ అధికారులకు అప్పగించాడు. రెండో ఎక్విప్‌మెంట్‌ను తన ఛానల్‌ కార్యాలయంలోనే ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నుంచే ప్రత్యర్థులు, రాజకీయ నేతలు, సెలబ్రెటీలు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్‌ చేయించాడు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులకు ఆర్థిక వనరులు అందకుండా చేసే ఉద్దేశంతో ప్రణాళికలు రచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి…తన మనుషులనే పెట్టుకున్నాడు. వాళ్లు వీళ్లు అని చూడకుండా…ఇష్టారాజ్యంగా అందరికి ఫోన్లు ట్యాప్‌ చేయించాడు.

వ్యాపారుల ఫోన్ వాయిస్‌ను దొంగ చాటుగా వినడం…ఆ తర్వాత వారిని బెదిరించడం…ఆ తర్వాత వారి నుంచి డబ్బు వసూలు చేయడమే టార్గెట్‌గా శ్రవణ్‌రావు పని చేశాడు. ఎన్నికల సమయంలో అయితే మనోడు…అడ్డు అదుపులేకుండా వ్యవహారించాడు. ఎన్నికల సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బు వెళ్తుందో…కాల్స్‌ రికార్డ్ చేయడం…తర్వాత డబ్బు గుంజుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. సెలబ్రెటీలు, కాంగ్రెస్‌, బీజేపీ నేతలను టార్గెట్‌ చేసుకొని…వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. మొత్తం మీద ట్యాపింగ్ వ్యవహారంలో అటు ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జిరిగినదానికీ, ఇటు ప్రైవేట్ వ్యక్తి శ్రవణ్‌ రావు ఆధ్వర్యంలో జరిగినదానికీ ఉమ్మడిగా పోలీసుల సహకారం ఉందనేది సుస్పష్టం.

ఇప్పుడు ట్యాపింగ్ విచారణ ఎలా ముగుస్తుందనేది ఉత్కంఠకు దారితీస్తోంది. ఇప్పటివరకు ఒక్కో లింకూ కలుపుకుంటూ వచ్చిన సిట్.. ఇక ఆఖరి అడుగు ఎటువైపు వేస్తుందనేది కీలకం కానుంది. ఇప్పటికే ట్యాపింగ్ కేసు విచారణపై దేశవ్యాప్తంగా ఆ సమాజ హితం కోసం కొన్ని వ్యవస్థలుంటాయి. ప్రజల రక్షణ కోసం మరికొన్ని వ్యవస్థల్ని ప్రత్యేకంగా సృష్టిస్తారు. ప్రత్యేక అవసరాల కోసం కొన్ని వ్యవస్థలకు విశేష అధికారాలిస్తారు. వీటన్నింటి వెనుక ప్రధాన ఉద్దేశం శాంతిభద్రతలు కాపాడటమే. సమస్యలు వచ్చాక పరిష్కరించడం ఓ ఎత్తైతే.. అసలు సమస్య రాకుండా చూసుకోవడం మరో ఎత్తు. ప్రభుత్వాలు ఇటీవలి కాలంలో సమస్య రాకుండా చూడటానికే ఎక్కువగా తాపత్రయపడుతున్నాయి. అందులో భాగంగానే పోలీస్ శాఖకు అనుబంధంగా కొన్ని ప్రత్యేక వ్యవస్థలకు రూపకల్పన చేశాయి. శాంతిభద్రతల విధులతో తలమునకలుగా ఉండే సాధారణ పోలీసులతో పని కాదనే.. ఎస్ఐబీ పేరుతో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోను ఏర్పాటు చేసి.. సంఘ విద్రోహ శక్తుల కదలికలపై నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగానే ట్యాపింగ్ కూడా చేస్తారు.

కానీ తెలంగాణలో ఎస్ఐబీ ఏర్పాటుచేసిన అసలు లక్ష్యాన్ని బీఆర్ఎస్‌ హయాంలో నీరుగార్చేశారు. సంబంధం లేని పనులకు ఎస్ఐబీని వాడుతూ దాని స్థాయిని దిగజార్చారు. మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టి.. గ్రేహౌండ్స్ తో మంచి సమన్వయం చేసుకుని.. మావోయిస్టుల ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గించడంలో ఎస్ఐబీది కీలకపాత్ర. అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఎంత సమర్థత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ అలాంటి ఎస్ఐబీని తక్కువ స్థాయి పనులకు వాడటం.. దాని స్థాయి తగ్గించడమే కాదు.. ప్రభుత్వ వనరుల్ని వృథా చేయడమే. ఈ ట్యాపింగ్ తంతు జరిగే సమయంలో.. ఎలాంటి విద్రోహ చర్యలు జరగలేదు కాబట్టి సరిపోయింది. అదే ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రైవేట్ సైన్యం టార్గెటెడ్ ట్యాపింగ్ లో బిజీగా ఉన్నప్పుడు సంఘ విద్రోహుల కీలక సమచారం మిస్సై.. జరగరానిది జరిగి ఉంటే.. ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నే అందర్నీ భయపెడుతోంది.

ఎస్ఐబీ దుర్వినియోగంతో నిబద్ధత, క్రమశిక్షణ, సమర్థత, విధేయత, అన్నీ ప్రమాదంలో పడ్డాయి. అలా పడేశారు ప్రభాకర్ రావు అండ్ టీమ్. ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ ఆఫీసుల్లో ఎస్ఐబీ ట్యాపింగ్ సర్వర్, ట్యాపింగ్ సమాచారం వెళ్లాయంటే.. అవి ఎంత ప్రమాదకరమో ఐపీఎస్ స్థాయి వ్యక్తులకు తెలియదా అంటే తెలుసు. అంతా తెలుసు. అన్నీ తెలిసే.. రాష్ట్ర భద్రతను ప్రమాదంలో పెట్టి మరీ వ్యక్తిగత పనులు చేసుకున్నారు. నలుగురి కోసం నాలుగో కోట్ల మంది జీవితాల్ని పణంగా పెట్టేశారు. నమ్మి అధికారం ఇస్తే.. అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. జనం సొమ్ముతో జీతాలు తీసుకుని.. అదే జనానికి దారుణంగా వెన్నుపోటు పొడిచారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోనే ఇంత తతంగం జరిగిందంటే.. ఇప్పటికీ నమ్మడం కష్టంగా ఉందని రిటైర్డ్ అధికారులు చెబుతున్నారు. అంటే ఆ విభాగానికి ఉన్న విశ్వసనీయత, దానిపై ఉండే నమ్మకం ఏంటో తెలుస్తోంది. కానీ కొందరు అధికారులు, మరికొందరు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి చేసిన నిర్వాకం.. ఎస్ఐబీ అస్తిత్వాన్నే ప్రమాదంలో పడేసింది. ఇలా ఎవరికి నచ్చినట్టుగా వారు కీలకమైన విభాగాన్ని ఏళ్ల తరబడి వాడుకుంటే.. జరగబోయే దుష్పరిణామాలకు బాధ్యత ఎవరిదనేది తేలాల్సిన ప్రశ్న.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సంఘ విద్రోహశక్తుల్ని నియంత్రించడం కోసం కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు ఉన్నాయి. కానీ వాటిని సార్వజనీనం చేసి.. అధికార దుర్వినియోగం చేస్తే.. అది ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది. అసలు ఇంత నిస్సిగ్గుగా.. ఇంత బహిరంగంగా.. ఇంత బరితెగించి ట్యాపింగ్ చేసిన ఘటన గతంలో జరగలేదంటే అతిశయోక్తి కాదు. జీవితంలో ఎప్పుడూ ట్యాపింగ్ పేరుకూడా వినని వ్యక్తులు అనూహ్యంగా ట్యాపింగ్ ను సొంతానికి వాడుకున్నారు. అదేదో మనుషుల్ని కిడ్నాప్ చేసి కుటుంబసభ్యుల్ని బ్లాక్ మెయిల్ చేసినట్టుగా.. ఎవరి వాయిస్ కాల్స్ వారికే వినిపించి పెద్దమొత్తంలో డబ్బు గుంజటం.. నయా దారిదోపిడీ అని చెప్పకతప్పదు. ఓ రకంగా బ్లాక్ మెయిలింగ్ కు ట్యాపింగ్ నిందితులు కొత్త కోణాన్ని జత చేశారనే చెప్పాలి. అసలు ట్యాపింగ్ ఇంత తెలికగా చేయొచ్చా అని ఆశ్చర్యపోయేలా కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఏతావాతా ట్యాపింగ్ నిందితులు రాష్ట్రం పరువు తీశారు.

ఇప్పటిదాకా అభివృద్ధి పనుల్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం గురించి విన్న ప్రజలకు.. ట్యాపింగ్ లో మాత్రం కొత్త కోణాలు పరిచయం అయ్యయి. పీపీపీ పద్ధతిలో జరిగిన తంతు ఒకటైతే.. మళ్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో, ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లో వేర్వేరుగా ట్యాపింగ్ జరిగింది. ఇప్పటికీ కీలక నిందితులు సిట్‌ను కూడా అయోమయంలో పడేసే ప్రయత్నం చేయడం చిన్న విషయం కానే కాదు. ఇప్పటికే చాలా వరకు విచారణలో ఆధారాలు సేకరించిన సిట్.. ఆఖరి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలని చూస్తోంది. ఆ ఒక్క అడుగు కరెక్టుగా పడితే.. ఇక విచారణ ముగిసినట్టేనని చెబుతున్నారు. దీంతో సంచలనం సృష్టించిన ట్యాపింగ్ కేసు ఎలా ముగుస్తుంది..? ఎవరు అసలైన దోషులుగా తేలతారనే ప్రశ్నలు ఉత్కంఠకు దారితీస్తున్నాయి.

Exit mobile version