Story Board: నీరు పల్లమెరుగు… నిజం దేవుడెరుగు అంటారు. ఏకధాటిగా వానలు కురుస్తున్నప్పుడు వరదనీరు అంతా తన దారిలో తాను పోతూ దగ్గరిలోని చెరువులు, కుంటలు వంటివాటిలోకి చేరుతుంది. స్థానిక ప్రజల తాగు, సాగు అవసరాలు తీరుస్తుంది. భూగర్భ జలాల పెంపు, ఉష్ణతాపం తగ్గింపు, జీవవైవిధ్య పరిరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. ప్రకృతికి జీవనాడులైన ఆ జలవనరులు కబ్జాల కోరల్లో చిక్కి కనుమరుగైతే ప్రజాజీవనం అస్తవ్యస్తం కాదా? దురదృష్టవశాత్తు ప్రస్తుతం కాంక్రీట్ కీకారణ్యాలుగా పేరుగాంచిన పట్టణాలు, నగరాల్లో జరుగుతోంది అదే.
Read Also: Delhi: ఢిల్లీ పేరు మార్చాలని అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ.. కొత్త పేరు ఇదే!
కట్టుతప్పుతున్న భూతాపం, వాతావరణ మార్పుల మూలంగా ఇటీవల కుండపోత వానలు విరుచుకుపడుతున్నాయి. వాటివల్ల విపరీతమైన జనసాంద్రత కలిగిన భారతీయ నగరాలు వరదల గుప్పిట చిక్కి విలవిల్లాడుతున్నాయి. రోడ్లపైకి భారీగా వాననీరు చేరి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి స్థానికులు నరకం అనుభవిస్తున్నారు. ఈ బాధలు తప్పాలంటే ఏం చేయాలి! వరద నీరు సాఫీగా వెళ్లే ఏర్పాట్లు ఉండాలి. ముఖ్యంగా స్థానిక జల వనరులను కంటికి రెప్పలా కాచుకోవాలి. కానీ, వాటి గురించి పట్టించుకుంటున్న వారెవరు? వలసలు పెరుగుతున్న తరుణంలో పట్టణ భూముల్లో ప్రతి అంగుళమూ బంగారు తునకగా మారింది. దాంతో కబ్జారాయుళ్ల కళ్లు చెరువులూ కుంటలపై పడుతున్నాయి. ఏ వైపు నుంచి ఎలా డబ్బు దండుకోవాలన్న ధ్యాసే తప్ప నిజమైన ప్రజాసంక్షేమం పట్టని నాయకుల అండదండలూ వారికి దండిగా అందుతున్నాయి. లంచాల కోసం అనుక్షణం అర్రులుచాచే కొందరు అధికారుల సంగతి ఇక సరేసరి. ఇంకేముందీ! ఇలాంటి వాళ్ల గూడుపుఠాణీలతోనే హైదరాబాద్‌లో చెరువు భూముల్లోనే వందల కోట్ల రూపాయల విలువైన భారీ భవనాలు యథేచ్ఛగా మొలుచుకొస్తున్నాయి. నేతలూ అధికారుల సహకారంతో అక్రమ నిర్మాణదారులు ఎలాంటి వెరపూ లేకుండా దందాలు కొనసాగిస్తున్నారు. వారు కట్టిన ఇళ్లు కొనుగోలు చేసిన అమాయకులు తరవాతి కాలంలో జడివానలకు తమ నివాస ప్రాంతాలు మునిగి బావురుమంటున్నారు! కేంద్ర జల్‌శక్తి శాఖ గణన ప్రకారమే దేశవ్యాప్తంగా 38 వేల జలవనరులు ఆక్రమణల పాలయ్యాయి. వీటిలో అత్యధికం ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే ఉన్నాయి. చెరువులూ కుంటలను నామరూపాలు లేకుండా చేయడమంటే స్థానిక జలావరణ వ్యవస్థను చావుదెబ్బ తీయడమే! జేబులు కొట్టే చిల్లర దొంగలనే జైళ్లకు పంపుతున్నప్పుడు- పర్యావరణాన్నీ జనజీవితాలను సర్వనాశనం చేస్తున్న అవినీతి అసురగణాలకు ఇంకెంత కఠిన శిక్షలు పడాలి?. కానీ అసలు దీన్నొక పెద్ద నేరంగా పరిగణించే భావనే లేకపోవడం.. నగరాలకు వరద ముప్పును కొనితెస్తోంది. చివరకు వాన తగ్గినా ముంపు సమస్యతో.. నగర వాసులు సతమతమౌతున్నారు.
Read Also: Liver Issue: ఫ్యాటీ లివర్ తో బాధపడుతన్నారా.. ఈ చిట్కా పాలో అవ్వండి..
ఇదేదో ఒక్క హైదరాబాద్ బాధే కాదు. దేశంలో ఉన్న ప్రతి నగరం.. అంతెందుకు చివరకు పట్టణం కన్నీటి వ్యథ కూడా ఇదే. నదుల పక్కన నాగరికతలు విలసిల్లిన రీతిగానే.. ఇప్పుడు చెరువుల్ని ముంచేసి పట్టణాలు, నగరాలు విస్తరించడం కొత్త ట్రెండ్ గా మారింది. పైగా చెరువుల్లో ఇళ్లు కట్టుకుంటే భూగర్భజలాలకు లోటుండదనే దురాలోచనే.. అర్బన్ జీవితాన్ని జలప్రళయం పాలు చేస్తోంది. నిజంగా జలప్రళయం వస్తే.. అది ప్రకృతి ప్రకోపం. అది మనం నియంత్రించే స్థితి ఉండదు. కానీ కొన్నాళ్లుగా దేశంలో యావత్తు నగరాలు, పట్టణాల్లో వస్తున్న వరదలన్నీ.. ప్రకృతి విపత్తులు కానే కావు. ఇవన్నీ మానవ నిర్మిత విపత్తులేననేది నిపుణులు, అధ్యయనాలు తేల్చిచెప్పిన నిప్పులాంటి నిజం. అన్నీ తెలిసినా సరే ఎప్పటికప్పుడు సీరియస్ నెస్ నటించడమే తప్ప.. గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న దాఖలాలు దివిటీ వేసి వెతికినా కనిపించడం లేదు. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం.. ఎవరికి వారే తమ తప్పులేదని తప్పించుకోవటానికి, సాకులు వెతకటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకానీ గతంలో వరద వచ్చినప్పటి కంటే.. ఇప్పుడు సమస్య తీవ్రత తగ్గించగలిగామని గట్టిగా, ధైర్యంగా చెప్పుకోగల స్థితిలో మాత్రం ఎవరూ లేరనేది కాదనలేని వాస్తవం.
Read Also: PM Modi: దాతృత్వానికి భారత్ ముందుంటుంది.. ఛత్తీస్‌గఢ్ పర్యటనలో మోడీ వ్యాఖ్య
అలాగని నగరాలు, పట్టణాల్లో విపత్తు నిర్వహణ యంత్రాంగం, విపత్తులు ఎదుర్కోవటంలో అనుభవానికి లోటేం లేదు. చివరకు నిధులు కూడా దండిగానే ఉంటాయి. అయినా సరే నిర్లక్ష్యం కొంప ముంచుతోంది. ఒక నగరానికి ఎన్నిసార్లు వరద వచ్చినా 90 శాతం కొన్ని ప్రాంతాల్లోనే సమస్య వస్తుంది. అంటే వానొస్తే వరద ఎక్కడ్నుంచి వస్తుందో.. ఎలా తీవ్రమౌతుందో.. అలాగే ముంపు సమస్య ఏర్పడే ప్రాంతాలేమిటో యంత్రాంగానికి కచ్చితంగా తెలుసు.అయినా సరే ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమనే చర్యలే కానీ.. శాశ్వత పరిష్కార మార్గాలూ చూడాలనే చొరవ కరువౌతోంది. ఎప్పటికప్పుడు వరదలు వచ్చినప్పుడు, ముంపు సమస్య ఎదురైనప్పుడు.. నామ్ కే వాస్తే నిపుణుల కమిటీ వేయడం, ఆ నివేదికలు సర్కారుకు పంపామని ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకోవటమే అధికారుల పని. ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఏమీ తక్కువ తినలేదు. ఆ నివేదికల్ని సమగ్రంగా అధ్యయనం చేసి.. భవిష్యత్తులో సమస్య రాకుండా చూస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తారు. కానీ కొద్దిరోజులకే మరో ఇష్యూ తెరపైకి రాగానే.. దీని సంగతి గాలికి వదిలేస్తారు. దీంతో వరద, ముంపు సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంటోంది. దేశంలోనే సాంకేతిక విద్యకు అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు కొలువైన నగరాల్లోనూ వరద ముప్పు తప్పడం లేదంటే.. ముంపు సమస్య వస్తోందంటే.. ఈ నేరపూరిత నిర్లక్ష్యానికి మనకు మనమే జవాబు చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తమ నగరాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపలేని ఐఐటీలు.. ఇక దేశ సమస్యల్ని ఎలా పరిష్కరించగలవనే ప్రశ్నలు తెరపైకి రావడం సహజమే. కొన్నిచోట్ల ఐఐటీలు చొరవ తీసుకుని.. పరిష్కార మార్గాల్ని సూచించినా.. యథాప్రకారం ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కపెడుతున్నాయి. దీంతో ఎన్నో ఆశలతో నగరాలకు వలస వచ్చిన సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
బెంగళూరు నీటి అవసరాలు తీర్చేందుకు ఆ నగర నిర్మాత కెంపేగౌడ వేల సంఖ్యలో చెరువుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాలక్రమంలో కబ్జారాయుళ్ల ధాటికి ఆ నగరంలో 837 చెరువులు మాయమయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారమే రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌లో 920 చెరువులుంటే, అనంతర కాలంలో 171 కనుమరుగయ్యాయి. తెలంగాణలో సాగు, తాగు అవసరాలు తీర్చేందుకు కాకతీయులు గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. కాలగతిలో వాటిలో చాలావరకు ఆక్రమణలకు గురవడంతో వరంగల్ తరచూ ముంపు బారిన పడుతోంది. ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబాబాద్ వంటి చోట్ల చెరువులు అన్యాక్రాంతమయ్యాయి. తిరుపతి, నెల్లూరు, కడపల్లోనూ చాలా చెరువులు మాయమవడంతో ఆయా నగరాలను వరదలు చుట్టుముడుతున్నాయి. నిరుడు విజయవాడ జలసంద్రమవడానికి బుడమేరు దురాక్రమణలే కారణం. చెన్నైలోనూ జలవనరులు బాగా తరిగిపోవడంతో ఆ నగరం తరచూ భీకర వరదలను చవిచూస్తోంది. ఇలా కుంటలు చెరువులను మింగేస్తూ- మనకి పోయేదేముంది.. పూడ్చేద్దాం.. కట్టేద్దాం.. డబ్బు దండుకుందాం అన్నట్లు చెలరేగిపోతున్న వారంతా సామాజిక ద్రోహులే. వారితో ఊచలు లెక్కపెట్టించలేకపోతే- ప్రజాప్రయోజనాల పరిరక్షణలో పాలకులు విఫలమైనట్లే. పురపాలికల్లో అవినీతి అధికారులను ఏరిపారేస్తూ, జలవనరుల సంరక్షణకు హైడ్రా వంటి వ్యవస్థలను అన్ని నగరాల్లోనూ ఏర్పాటు చేయాలి. పురాతన కాలం నాటి వరద కాలువలను ఆధునికీకరించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా పట్టణాలకు బృహత్ ప్రణాళికలు రూపొందించి అవి సమర్థంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. నత్తకు నడకలు నేర్పడంలో ఎప్పుడూ ముందుండే ప్రభుత్వాలు వీటన్నింటి పట్ల వేగంగా స్పందిస్తేనే నగర జీవనం నరకమయం అన్న అపప్రథ తొలగిపోతుంది.
భారత్‌లో తుపానులు, వరదలు జాతీయ విపత్తు గణాంకాల ప్రకారం గత 22 ఏళ్లలో దేశం మొత్తం మీద సుమారు రూ.12 లక్షల కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది. అందులో వరదల వల్ల దాదాపు రూ.7.67 లక్షల కోట్లు; తుపాన్లతో రూ.3.16 లక్షల కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది. విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యూహాలను రూపొందించడానికి ముందుగా విపత్తు సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని సరైన రీతిలో సేకరించాలి. దీన్ని ఆధునిక సాంకేతిక వ్యవస్థలతో తీర్చిదిద్దాలి. వీటిపై ప్రజల్లో శాస్త్రీయ అవగాహన కల్పించాలి. వరదలు సంభవించే అవకాశమున్న ప్రాంతాల్లో ఎంతో కొంత నష్టాన్ని నివారించడానికి అవసరాన్ని బట్టి ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి. ముందుగా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి. వారిని అక్కడి నుంచి సత్వరమే ఖాళీ చేయించాలి. విపత్తు నిర్వహణ సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచాలి. కానీ దేశంలో ఈ సన్నద్ధతే కనిపించడం లేదు. వాతావరణ శాఖ అంచనాలు నిజమైతే అదో పెద్ద వార్త అనుకునేంత కామెడీగా హెచ్చరికలు ఉంటున్నాయి. సరే ముందస్తు అంచనాలు ఎలాగో వేయలేకపోతున్నారు. కనీసం విపత్తులు సంభవించాకైనా తక్షణం స్పందిస్తారా.. అంటే అదీ లేదు. వరదలొచ్చినా.. తుపానులు విరుచుకుపడ్డా బాధితులు గంటల తరబడి.. రోజుల తరబడి సాయం కోసం ఎదురుచూడాల్సిందే. అదృష్టం ఉంటే బతుకుతారు. లేదంటే లేదు. అంతేకానీ విపత్తు నిర్వహణ బృందాలపై నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండే పరిస్థితులు దేశంలో ఎక్కడా లేవు. అసలు విపత్తు నిర్వహణలో నిపుణులైన సిబ్బందే లేకపోవడం మరో చోద్యం. ఊ అంటే ఆర్మీ రావాల్సిందే. సైన్యం రాకపోతే అంతే సంగతులు.
భారత్‌కు ఉన్న 7516 కి.మీ.ల తీరరేఖలో దాదాపు 5700 కి.మీ. పొడేవునా తుపాన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు ఎక్కువగా తుపాను బారిన పడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల దేశ జీడీపీలో 2 శాతం నష్టం వాటిల్లుతున్నదని ప్రపంచ బ్యాంక్ అంచనా.ప్రపంచంలో అధికంగా వరదలు సంభవించే ప్రాంతాల్లో భారత్ ఒకటి. అయినా సరే ఇప్పటికీ వరదలపై ముందస్తు హెచ్చరికల జారీలో మన వాతావరణ శాఖ వెనుకబడే ఉంది. తుపానుల్ని ఎదుర్కోవటంలో ఏడున్నర దశాబ్దాల అనుభవం ఉండి కూడా.. ఇంకా తుపాను దయ.. మన ప్రాప్తం అనుకునే రోజులు దేశంలో.. అదీ అత్యాధునిక నాగరికతకు నిలయాలైన నగరాల్లో ఉండటం దురదృష్టకరం.
