Site icon NTV Telugu

Story Board : స్మార్ట్ ఫోన్ ఉంటే.. వ్యక్తిగత గోప్యత డొల్లేనా? WhatsAppకు సుప్రీం వార్నింగ్

Storyboard

Storyboard

వాట్సాప్ లో మనం పంపే మెసేజ్ ఇంకెవరో చూస్తున్నారు. చివరకు మనం మాట్లాడే కాల్స్‌ కూడా వేరెవరో వింటున్నారు. చివరకు మెసేజ్ డిలీట్ చేసినా సరే.. అదెక్కడోచోట ఏళ్ల తరబడి అలాగే ఉంటోంది. ఈ లెక్కన స్మార్ట్ ఫోన్ యూజర్లెవరికీ వ్యక్తిగత రహస్యాలు లేనట్టే. మొత్తంగా రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కు ఇప్పుడు పెను ప్రమాదంలో పడింది. సమాచార విప్లవానికి తెరతీసిన సోషల్ మీడియానే అందుకు కారణంగా మారుతోంది. ఇప్పుడు వాట్సాప్, మెటా మధ్య డేటా షేరింగ్ గురించిన కేసులో వ్యక్తిగత గోప్యత విషయంలో హద్దు దాటొద్దని చెప్పిన సుప్రీం.. భారత్ చట్టాలు పాటించకపోతే.. దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించేంతగా పరిస్థితి విషమించింది.

వ్యక్తిగత గోప్యతకు వాట్సాప్ తిలోదకాలిస్తోందన్న చర్చ ఎప్పట్నుంచో ఉంది. మరీ ముఖ్యంగా వాట్సాప్ మెటా చేతుల్లోకి వెళ్లాక.. డేటా షేరింగ్ పేరుతో యూజర్ల వ్యక్తిగత వివరాలు ఎక్కడెక్కడికో వెళ్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరకు వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో వాట్సాప్‌కు సుప్రీం గట్టిగా తలంటింది.

దేశంలో వాట్సాప్ గోప్యతా విధానం అంశం మరోసారి తీవ్ర చర్చకు కేంద్రంగా మారింది. సుప్రీంకోర్టు ఈ విషయంపై లోతైన విచారణ చేపట్టడంతో మెటా సంస్థతో పాటు వాట్సాప్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. లక్షలాది మంది వినియోగదారుల వ్యక్తిగత డేటాను లక్ష్య ప్రకటనల కోసం ఎలా వినియోగిస్తున్నారన్న ప్రశ్నలు న్యాయస్థానం ముందుకు వచ్చాయి. డిజిటల్ యుగంలో గోప్యత ఎంత ముఖ్యమో ఈ కేసు మరోసారి గుర్తు చేస్తోంది. ఈ వివాదం 2021లో ప్రారంభమైంది. అప్పట్లో వాట్సాప్ తన కొత్త గోప్యతా విధానానికి వినియోగదారుల అంగీకారం తప్పనిసరిగా తీసుకోవాలని నిర్ణయించింది. అంగీకరించని వినియోగదారులు కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నిర్ణయం వినియోగదారుల్లో భయం కలిగించడమే కాకుండా, గోప్యతా హక్కులపై పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తింది.

2026 నాటికి కూడా ఈ కేసు కీలక అంశంగా కొనసాగుతోంది. విచారణ సందర్భంగా దేశ ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి. రాజ్యాంగాన్ని పాటించలేని సంస్థలు దేశంలో కొనసాగాల్సిన అవసరం లేదన్న స్పష్టమైన హెచ్చరికతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఐదేళ్లకు పైగా సాగుతున్న ఈ న్యాయపోరాటం వాట్సాప్ గోప్యతా విధానం స్వరూపం ఏమిటి, అసలు సమస్య ఎక్కడ ఉందన్న అంశాలపై దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించింది.

ఈ వ్యవహారం ఎలా మొదలైంది అన్నదానిపై చూస్తే, వాట్సాప్ వినియోగదారులకు ఒక పాప్-అప్ సందేశం ద్వారా కొత్త గోప్యతా విధానానికి అంగీకరించమని సూచించింది. ఈ నవీకరణలో వినియోగదారుల డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా వినియోగిస్తారు అన్న వివరాలు ఉన్నాయి. కాకపోతే ఈ మార్పులు సాధారణ వినియోగదారులకు పూర్తిగా అర్థం కాని రీతిలో ఉండటం ఆందోళనకు కారణమైంది. కొత్త గోప్యతా విధానంలో వాట్సాప్ తన సేవలు ఎలా పనిచేస్తాయో, వినియోగదారుల సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారో వివరించింది. మెటా పరిధిలో ఉన్న ఇతర యాప్‌లతో డేటా అనుసంధానం ఎలా జరుగుతుందన్న అంశాలను కూడా ఇందులో చేర్చింది. ఈ నిబంధనలను మూడు ప్రధాన విభాగాలుగా విభజించారు. వ్యాపారాలు ఫేస్‌బుక్ సాధనాల ద్వారా చాట్‌లను ఎలా నిర్వహించగలవో, వినియోగదారుల సమాచారం పెద్ద డిజిటల్ వ్యవస్థలో ఎలా భాగమవుతుందో స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఈ వివరాలు బయటకు రావడంతో గోప్యతృపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ మార్పులు వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలపడింది. వినియోగదారులను బలవంతంగా అంగీకారం తెలపాల్సిందిగా చేయడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమన్న అభిప్రాయం వ్యక్తమైంది.

దాంతో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. వాట్సాప్ కొత్త విధానం అధిక డేటా సేకరణకు దారి తీస్తోందని, లక్ష్య ప్రకటనల కోసం వినియోగదారుల ప్రవర్తనను గమనిస్తోందని ఆరోపించింది. ఈ చర్యలు ఆధిపత్య స్థితిని దుర్వినియోగం చేస్తున్నట్టు కమిషన్ పేర్కొంది. వాట్సాప్ మాత్రం ఈ ఆరోపణలను నిరంతరం ఖండిస్తోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా గట్టిగా స్పందించింది. మెటా సంస్థతో పాటు వాట్సాప్ డేటా షేరింగ్ విధానాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల జరిగిన విచారణలో ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వినియోగదారుల గోప్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుతుందని కోర్టు స్పష్టమైన సంకేతం ఇచ్చింది.

ఈ వివాదంలో వినియోగదారులు తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కోట్లాది మంది ఆధారపడటం వల్ల ఆ సంస్థకు నిబంధనలను నిర్ణయించే శక్తి పెరుగుతుంది. గోప్యతా విధానాల్లో జరిగే మార్పులు అందరికీ సులభంగా అర్థం కావు. డేటా భద్రతపై అవగాహన లేని వారు తెలియకుండానే తమ వ్యక్తిగత సమాచారాన్ని పెద్ద సంస్థలకు అప్పగించే ప్రమాదం ఉంది. తన వాదనలో వాట్సాప్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకే సమాచారం సేకరిస్తున్నామని చెబుతోంది. ఖాతా నిర్వహణ కోసం మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలు అవసరమని సంస్థ వివరిస్తోంది. వినియోగదారుల అనుభవాన్ని వ్యక్తిగతీకరించేందుకే ఈ డేటా వినియోగమని పేర్కొంటోంది.

సందేశాల గోప్యతపై కూడా వాట్సాప్ వివరణ ఇచ్చింది. వినియోగదారులు పంపే సందేశాలు సాధారణంగా సర్వర్లలో నిల్వ ఉండవని సంస్థ స్పష్టం చేసింది. సందేశం డెలివరీ అయిన వెంటనే.. అది తొలగిపోతుందని తెలిపింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఎన్‌క్రిప్టెడ్ రూపంలో గరిష్టంగా 30 రోజుల వరకు సందేశాలు తాత్కాలికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఆ గడువు పూర్తయిన తర్వాత అవి స్వయంచాలకంగా తొలగిపోతాయని వివరించింది.

వాట్సాప్ మాతృ సంస్థ అయిన టెక్ దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్ గోప్యతా విధానాలపై సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ .. అమెరికా సంస్థకు ఈ మేరకు హెచ్చరికలు చేశారు. మీరు మా దేశ గోప్యతతో ఆడుకోలేరు, మా డేటాలో ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి మేము మిమ్మల్ని అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. ఆ కంపెనీ దేశ చట్టాలను పాటించడంలో విఫలమైతే దేశం వదిలి వెళ్లాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. దేశంలో డేటా షేరింగ్, మార్కెట్ ఆధిపత్యానికి సంబంధించి గత నెలలో ఎన్టీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వాట్సాప్, మెటా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సహా పలువురు దాఖలు చేసిన అప్పీళ్లపై సుప్రీం విచారణ జరిపింది. ఇందులో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాట్సాప్ వినియోగదారుల డేటా షేరింగ్ పై అభ్యంతరం తెలిపింది. దీంతో సీజేఐ సూర్యకాంత్.. టెక్ దిగ్గజాల వాదనలను తప్పుబట్టారు. వీధి వ్యాపారులు, గ్రామీణ పౌరులు సహా లక్షలాది మంది వినియోగదారులు సంక్లిష్టమైన గోప్యతా విధానాలను అర్థం చేసుకోలేరని గుర్తుచేశారు. డేటా షేరింగ్ ఉండదని హామీ ఇవ్వాలని, లేదంటే మేమే మీ కేసును కొట్టేస్తామని హెచ్చరించారు. వాట్సాప్ తరపు న్యాయవాది తమ గోప్యతా విధానం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉందని వాదించగా, డేటా షేరింగ్ మాతృ సంస్థకే పరిమితం అని మెటా తెలిపింది. అయితే చాట్ ట్రెండ్‌ల ఆధారంగా ప్రకటనలతో సహా వినియోగదారు డేటా ప్రవర్తన, వాణిజ్య దోపిడీ వినియోగదారుల హక్కులను ఉల్లంఘిస్తుందని కోర్టు తెలిపింది. వైద్యులతో ప్రైవేట్ చాట్‌ల తర్వాత వినియోగదారులు ఔషధాల కోసం ప్రకటనలను అందుకున్న సందర్భాలను కూడా గుర్తుచేసింది. ఇది డేటా మానిటైజేషన్ పరిధిలోకి వస్తుందని తెలిపింది.

ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తనకు ఎదురైన పరిస్థితిని వివరించారు. తనకు ఒకసారి వాట్సాప్‌‌‌‌లో డాక్టర్ మెడిసిన్స్ లిస్ట్ పంపారు. తర్వాత వాటికి సంబంధించిన యాడ్స్ నా ఫోన్‌‌‌‌లో కనిపించడం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఇదొక మార్గం. కానీ దీన్ని మేం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించమని తేల్చేశారు. పనిలోపనిగా ఈ కేసులో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీని కూడా భాగం చేయాలని సుప్రీం ఆదేశాలిచ్చింది.

వాట్సాప్‌‌‌‌ 2021లో కొత్త ప్రైవసీ పాలసీ తెచ్చింది. వాట్సాప్ యూజర్లు తమ డేటాను మెటాతో పంచుకోవడాన్ని తప్పనిసరి చేసింది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ చేపట్టింది. మెటాకు రూ.213 కోట్ల జరిమానా విధించింది. వాట్సాప్ తమ యూజర్ల డేటాను అడ్వర్టయిజ్‌‌‌‌మెంట్ల కోసం ఇతర మెటా సంస్థలకు ఐదేళ్ల వరకు షేర్ చేయకూడదని ఆదేశించింది. దీనిపై నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ ను మెటా ఆశ్రయించింది. లా ట్రిబ్యునల్ విచారణ చేపట్టి.. ఐదేళ్ల నిబంధనను పక్కనపెట్టి, జరిమానా కట్టాల్సిందేనని తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మెటా, వాట్సాప్ పిటిషన్లు దాఖలు చేశాయి.

వాట్సాప్ 2021 గోప్యతా విధాన నవీకరణను పరిశీలిస్తూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నవంబర్ 2024లో జారీ చేసిన ఉత్తర్వుల నుండి ఈ వివాదం తలెత్తింది. మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని ఉపయోగించి వినియోగదారులను కొత్త గోప్యతా విధానాన్ని తప్పనిసరిగా అంగీకరించేలా వాట్సాప్ ఒత్తిడి తీసుకువచ్చిందని సీసీఐ పేర్కొంది. వాట్సాప్ మెసేజింగ్ సేవలను కొనసాగించాలంటే మెటా ఇతర ప్లాట్‌ఫార్మ్‌లతో డేటా పంచుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందేనని వినియోగదారులకు తెలిపిందని సీసీఐ ఆక్షేపించింది. ఈ చర్య పోటీ చట్టానికి విరుద్ధమని భావించి రూ.213 కోట్ల జరిమానా విధిస్తూ ఆదేశించింది. ఈ ఉత్తర్వును మెటా, వాట్సాప్ 2025 జనవరిలో సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. 2025 నవంబర్‌లో న్యాయ ట్రైబ్యునల్ వాట్సాప్ డేటా షేరింగ్‌పై ఐదేళ్ల నిషేధాన్ని రద్దు చేసింది. అయితే రూ.213 కోట్ల జరిమానాను మాత్రం యథాతథంగా ఉంచింది. ఇప్పుడు విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం మెటా తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

స్మార్ట్ ఫోన్ తో ప్రపంచం అరచేతిలోకి వచ్చిందని మురిసిపోతున్నాం. కానీ ముప్పు కూడా అంతే దగ్గరైందని గుర్తించలేకపోతున్నాం. ట్విటర్, ఫేస్ బుక్, వాట్సాప్, ఇలా.. ఏ అకౌంట్ అయినా నిమిషాల్లో హ్యాకైపోతోంది. వ్యక్తిగత గోప్యత అనేది ఎండమావిగా మారింది. కొన్నాళ్ల క్రితం సాక్షాత్తు దేశ ప్రధాని మోడీ ట్విటర్ అకౌంట్ కూడా హ్యాకవ్వటం కలకలం రేపింది.

ప్రస్తుతం సమాచార విప్లవం నడుస్తోంది. దానికి సోషల్ మీడియానే ప్రధాన ఊతంగా ఉంది. అలాంటి సోషల్ మీడియాలో దేనికీ సేఫ్టీ లేకపోతే.. ఇక వ్యక్తిగత జీవితాలు మార్చిపోవాల్సిందే అనే ఆవేదన వ్యక్తమౌతోంది. ఇప్పటికే తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలు, హేట్ స్పీచ్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన సోషల్ మీడియా.. ఇప్పుడు హ్యాకర్ల పాలిట స్వర్గంగా మారింది. వంద మంది ఉన్న గ్రూప్ లో ఓ హ్యాకర్ ఎంటరైతే.. ఆ వంద మంది జీవితాలు ప్రమాదంలో పడినట్టే. వ్యక్తిగత వివరాలు చాలా సెన్సిటివ్. ఏమాత్రం వివరాలు లీకైనా.. జీవితాలే తలకిందులౌతాయి. కానీ హ్యాకర్లు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. అటు సోషల్ మీడియా సంస్థలు కూడా వ్యక్తిగత గోప్యత పరిరక్షణలో తీవ్రంగా విఫలమౌతున్నాయి. ఎప్పటికప్పుడు సైబర్ సేఫ్టీని పటిష్ఠం చేస్తున్నామని చెప్పడమే కానీ.. ఇంతవరకూ ఏ సంస్థా ఆ దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు.

సోషల్ మీడియా సంస్థలకు వందల దేశాల్లో కోట్లాది మంది వినియోగదారులున్నారు. సమాచార విప్లవాన్ని ఆసరాగా చేసుకుని.. బిలియన్ డాలర్లు సంపాదిస్తున్న సోషల్ మీడియా సంస్థలు.. సేఫ్టీ విషయంలో మాత్రం చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికే ఫేస్ బుక్, వాట్సాప్ పై కూడా వ్యక్తిగత గోప్యత అంశంపై తీవ్ర ఆరోపణలొచ్చాయి. వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ వివాదాస్పద మైంది. ఇక యూజర్ల డేటాను థర్డ్ పార్టీ సంస్థలకు అమ్ముతున్నారన్న ఆరోపణలతో.. ఫేస్ బుక్ ప్రతిష్ఠ మంటగలిసింది. ఫేస్ బుక్ వచ్చిన డేటా చౌర్యం ఆరోపణలతో అమెరికా నుంచి ఇండియా దాకా ఏకంగా పార్లమెంట్ కమిటీలు విచారణ జరపాల్సిన పరిస్థితి దాపురించింది. నీతి నియమాలు, విలువలు, నిబద్ధత అనే విషయాల్ని సోషల్ మీడియా సంస్థలు పూర్తిగా గాలికొదిలేశాయి. ఎప్పటికప్పుడు విచ్చలవిడిగా యూజర్ బేస్ ను పెంచుకోవడంపై దృష్టిపెడుతూ.. అందుకు తగ్గట్టుగా ఉద్యోగుల్ని నియమించుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఫేస్ బుక్ కు ఇంగ్లీష్ మినహా ఇతర భాషల్లో హేట్ స్పీచ్ ను నియంత్రించే ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందని ఓ ప్రజావేగు బయటపెట్టిన ఫేస్ బుక్ పేపర్లు కలకలం రేపాయి. హేట్ స్పీచ్ ను నియంత్రిస్తామని ప్రపంచానికి ఫేస్ బుక్ ఇచ్చిన హామీ డొల్లేనని తేలిపోయింది.

ఫేస్ బుక్ కు హేట్ స్పీచ్, తప్పుడు ప్రచారాన్ని నియంత్రించే అవకాశం ఉన్నా.. ఆ పని చేయడం లేదని ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఫ్రాన్సిస్ హైగెన్ లీక్ చేసిన పేపర్లు చెబుతున్నాయి. ఓ పోస్ట్ ను రీషేర్ చేసేటప్పుడు సేఫ్టీ లింక్ క్లిక్ చేసేలా ఆప్షన్ పెట్టొచ్చని, రీషేరింగ్ ప్రక్రియను ఆలస్యం చేసే అవకాశం ఉందని, కానీ ఫేస్ బుక్ మాత్రం లాభాలు తగ్గుతాయనే ఉద్దేశంతో.. అలాంటి పనులకు దూరంగా ఉందని హైగెన్ చెప్పుకొచ్చింది. హైగెన్ కామెంట్ల తర్వాత ఫేస్ బుక్ పై ఆరోపణలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే అమెరికా, ఇండియా ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసిందనే ఆరోపణలతో ఫేస్ బుక్ ఉక్కిరిబిక్కిరైంది. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీకి కూడా తూట్లు పొడిచేలా సంస్థ వ్యవహారం ఉందని బట్టబయలు కావడం.. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని సూచిస్తోంది.

ప్రస్తుత ప్రపంచంలో డేటాను మించిన ఆయుధం మరొకటి లేదు. ఇప్పటివరకు ఆయుధాలతోనే యుద్ధాలు జరిగాయి. కానీ భవిష్యత్తులో డేటా వార్స్ మాత్రమే ఉంటాయని నిపుణులు ఇప్పటికే తేల్చేశారు. దీనికి తగ్గట్టుగానే గత దశాబ్ద కాలంగా భౌతిక యుద్ధాలకు కాలం చెల్లి… శత్రువుల కీలక సర్వర్లను హ్యాక్ చేయడం బాగా పెరిగిపోయింది. దీంతో పాటు వ్యక్తిగత జీవితాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. వాట్సప్ కు కొంతకాలం క్రితం వరకూ సేఫెస్ట్ యాప్ అనే విశ్వసనీయత ఉండేది. వాట్సప్ ఇంతగా ఆదరణ పొందడానికి అదే ప్రధాన కారణం. వాట్సప్ చాట్లు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లీకవ్వవు అనే నమ్మకం ఉండేది. కానీ ఎప్పుడైతే వాట్సప్ ను ఫేస్ బుక్ కొనుగోలు చేసిందో… అప్పట్నుంచీ అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు వాట్సప్ తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ చూస్తుంటే ఆ భయాలు నిజమయ్యేలా ఉన్నాయి. వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీని చదవకుండా యాక్సెప్ట్ చేస్తే… ప్రైవసీకి భంగం కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ అభిరుచులు, ఆసక్తులు ఫేస్‌బుక్‌కి తెలియడం వల్ల మీరు ఏవి ఇష్టపడతారో అందుకు సంబంధించిన యాడ్స్ మీ స్క్రీన్‌పైన ఎక్కువగా కనిపిస్తాయి. దీని ద్వారా మీకు ఆ అడ్వర్‌టైజ్‌మెంట్ల ట్రాప్‌లో పడే అవకాశం ఉంది. ఇటీవల వాట్సప్ పేమెంట్స్ కూడా మొదలయ్యాయి. అందులో మీరు చేసే లావాదేవీల వివరాలను కూడా ఫేస్‌బుక్‌తో పంచుకోనుంది వాట్సప్. మీ ఫోన్ నెంబర్లు కూడా ఫేస్‌బుక్‌తో పంచుకుంటుంది.

ఏ వ్యవస్థనైనా గుప్పిట్లోకి తెచ్చుకోవాలంటే అందులో సమాచారం పాత్ర కీలకం. దేశంలో పౌరుల వివరాలు, ఆసక్తులు, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత కార్యకలాపాలు తెలిస్తే, ఆ దేశంలో పట్టు సాధించే అనేక ఎత్తుగడలు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ సేకరించే సమాచారం కూడా చివరికిలాగే మారుతుంది. గతంలో కూడా విదేశీ ఆక్రమణదారులు ఇలాగే చిన్న కారణాలతో ఎంటరై.. ఆ తర్వాత పట్టు సాధించారు. ఇప్పుడు ఒక దేశాన్ని మరో దేశం ఆక్రమించటమంటే గతంలో చేసినట్టు, యుద్ధాలు, బలప్రయోగాలు అవసరం లేదు. ఆర్థిక వ్యవస్థపై పట్టుసాధించటం, సాంస్కృతికంగా ప్రభావితం చేయటం చేస్తే చాలు. ఇప్పుడు వాట్సాప్ సేకరించే సమాచారం అంతా క్రోడీకరిస్తే ఇదే జరుగుతుంది. ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని, నగరాన్ని అంతిమంగా దేశాన్ని గుప్పిట్లో పెట్టుకునేంత సమాచారం వాట్సాప్ సేకరిస్తోంది. అంతేకాదు హ్యాకర్ల నుంచి తన యూజర్లను కాపాడాల్సిన యాప్ సంస్థే స్వయంగా డేటా చోరీ చేస్తూ.. ఇతరులతో దాన్ని పంచుకోవడం క్షమించరాని నేరం అని చెప్పడంలో సందేహం లేదు. వాట్సాప్ అనైతిక చర్యలతో కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత వివరాలు ప్రమాదంలో పడ్డాయి. అత్యంత సున్నితమైన సమాచారానికీ, అతి సన్నిహితులతో పంచుకునే విషయాలకూ కూడా భద్రత లేదని తేలిపోవడంతో.. ఇక గోప్యత ఎక్కడుందనే ప్రశ్నలు వస్తున్నాయి.

అసలు వాట్సాప్ అంటేనే… ప్రైవసీకి మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్న పేరుండేది. అందుకే ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను ఉపయోగించేవారి సంఖ్య పెరిగింది. అసలు వాట్సాప్‌ లేని స్మార్ట్‌ ఫోనుండదు. ఒకరకంగా చెప్పాలంటే… వాట్సాప్‌ కోసమే స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్న వాళ్లున్నారు. వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటంతో… అంతటి పాపులారిటీ లభించింది. ప్లే స్టోర్‌లో వాట్సాప్‌ లాంటి యాప్స్‌ బోలెడన్ని ఉన్నా… వాట్సాప్‌ కే క్రేజ్‌. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంటే మీరు పంపిన మెసేజ్ అవతలివారికి మాత్రమే కనిపిస్తుంది. ఎవరూ హ్యాక్ చేసి ఆ మెసేజ్‌ని చదవడం సాధ్యం కాదు. కానీ ఇప్పుడు డేటా షేరింగ్ పేరుతో వాట్సాప్ చేస్తున్న పనులు చూశాక.. దేన్నీ నమ్మలేమని తేలిపోయింది. మరోవైపు అసలు మెసెజింగ్ యాపులు చెప్పేది ఎంతవరకు నమ్మొచ్చనే విషయంపై సైబర్ నిపుణుల్లో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. ఎవరైనా ఉచితంగా ఎందుకు సర్వీస్ చేస్తారనే లాజిక్ కూడా తెరపైకి వచ్చింది. మన దగ్గర ఎలాంటి రుసుము వసూలు చేయకుండా.. యాప్ లు సర్వర్లు ఎలా మెయింటైన్ చేస్తాయి.. వాటికి డబ్బులు ఎక్కడ్నుంచి వస్తాయనేది కూడా చర్చనీయాంశమే.

టెక్నాలజీ, సౌలభ్యం, యూజర్ ఫ్రెండ్లీ.. ఇలా ఏ పేరు పెట్టినా.. అంతిమంగా యూజర్ల డేటా మొత్తం గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నాయి సంస్థలు. ఇలా ఎంతమంది డేటా తమ దగ్గరుంటే.. మార్కెట్లో అంత డిమాండ్ ఉంటుందనే విషయాన్ని గుర్తించే.. ఇలాంటి పనులు చేస్తున్నాయి. భవిష్యత్తు మొత్తం క్లౌడ్ టెక్నాలజీదే అనే వాదనలున్న తరుణంలో.. డేటా బ్యాంకులే.. భవిష్యత్తులో బ్యాంక్ బ్యాలెన్స తెచ్చిపెడతాయనేది యాప్ సంస్థల స్ట్రాటజీ. ఈ వ్యూహాలతోనే ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసి.. వ్యూహాత్మకంగా డేటాను స్టోర్ చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి.

అందుకే యాప్ ఏదైనా.. దాన్ని ఎంతవరకు వినియోగించాలో అంత వరకే వాడాలంటున్నారు నిపుణులు. సమాచార మార్పిడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలే కానీ.. దాని చేతిలో బానిసలు కాకూడదని హితవు చెబుతున్నారు. ఇష్టారాజ్యంగా యాప్ లు వాడితే.. అతి రహస్యాలు బట్టబయలౌతాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా యూజర్లు వాట్సాప్ ప్రైవసీ పాలసీ నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఈ యాప్ ల్ని ఓ కంట కనిపెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయి. కోట్లాది మంది డేటా చేతిలో పెట్టుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే.. ఎవరు బాధ్యత వహిస్తారని యూజర్లు నిలదీస్తున్నారు. సౌకర్యాలు, సౌలభ్యాల పేరుతో యూజర్లను ఊరించి, బుట్టలో వేసి.. చివరకు డేటాతో డేంజరస్ గేమ్ ఆడుతున్నారని మండిపడుతున్నారు. వాట్సాప్ యూజర్లు వచ్చేదాకా.. ఇతర యాప్ లు సైలంట్ గా ఉంటాయి. రేపొద్దున అవి కూడా వాట్సాప్ దారిలోనే కొత్త ప్రైవసీ పాలసీలు తెస్తే పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. చివరకు ఏ యాప్ కూడా సేఫ్ కాదనే వాతావరణం క్రియేటౌతుందని, ఆ సమయం కూడా ఎంతో దూరంలో లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

సోషల్ మీడియాలో యూజర్లు పెరగడం చూసి ప్రజాచైతన్యం పెరుగుతోందని ఆనందపడాలో.. వ్యక్తిగత గోప్యతకు కాలం చెల్లిందని బాధపడాలో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే హ్యాకర్లు విజృంభిస్తుంటే.. వారిని కట్టడి చేయలేక వ్యవస్థలు చేతులెత్తేస్తున్నాయి. ఇక యాప్ సంస్థలే స్వయంగా డేటా చౌర్యానికి పాల్పడటం చూస్తుంటే.. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెతను గుర్తుచేస్తోంది.

ఫోన్లో మనం పంపే మెసేజ్ ఇంకెవరో చూస్తున్నారు. మనం మాట్లాడే కాల్ వేరెవరో వింటున్నారు. ఏతావాతా మన ఆసక్తులు, అభిరుచులు, అభిప్రాయాలు.. ఏవీ వ్యక్తిగతం కాదు. అన్నీ బట్టబయలౌతున్నాయి. మీరు అనారోగ్యంగా ఉంటే.. డాక్టర్లు, మెడికల్ షాపుల నుంచి కాల్స్ వచ్చేస్తాయి. మీరు ఇల్లు కట్టుకుంటున్నారని తెలిస్తే.. వెంటనే ఇంటీరియర్ డిజైనర్లు లైన్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఏఐ రావడంతో.. ఇది మరింత తేలికగా జరిగిపోతోంది. సాంకేతికతలు వేగంగా మారుతున్న తరుణంలో.. వ్యక్తిగత జీవితానికి అడ్రస్ లేకుండా పోతోంది.

ప్రతి మనిషి జీవితంలో వ్యక్తిగతం.. సామాజికం అని వేర్వేరు అంశాలు ఉంటాయి. సామాజిక అంశాలపై సమాచార విశ్లేషణ, సమాచార మార్పిడి కోసం ఉద్దేశించిన సోషల్ మీడియాలో.. వ్యక్తిగత సమాచారం లీకవ్వడం, హ్యాకవ్వడం.. అందరికీ ముప్పే. స్మార్ట్ ఫోన్ వాడకంలో సమాచారం లీక్ కావడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. మొదటిగా సోషల్ మీడియా సంస్థలు వ్యక్తిగత గోప్యతను కాపాడటానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సోషల్ మీడియా ఖాతాలకు ఇవ్వాల్సినంత రక్షణ ఇవ్వకపోవడంతో హ్యాకర్ల పని తేలికౌతోంది. రెండోది ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. హ్యాకర్లు లేటెస్ట్ టెక్నాలజీతో వరుస దాడులు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను, ప్రజలను బెంబేలెత్తిస్తూనే ఉన్నారు. ఇక మూడోది స్వయంగా ప్రభుత్వాలే స్పైయింగ్ పేరుతో స్పైవేర్లను పౌరుల ఫోన్లలో ప్రవేశపెడుతున్నాయనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ మూడు మార్గాల్లో ఎలాగైనా హ్యాకింగ్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా సంస్థలే యూజర్ల డేటాను గాల్లో దీపంలా మార్చేసి.. ఎవరికిపడితే వారికి అప్పగించేస్తున్నాయి. పచ్చిగా చెప్పాలంటే కోట్ల మంది వ్యక్తిగత జీవితాలతో ఆా సంస్థలు పక్కా బిజినెస్ చేస్తున్నాయి. సాంకేతికత అభివృద్ధి చెందేకొద్దీ.. వ్యక్తిగత సమాచారానికి రక్షణ పెరగాల్సింది పోయి.. గోప్యత హక్కుకు ముప్పు పెరగడం సోషల్ మీడియా యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది.

సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తిలా మారింది. సోషల్ మీడియా వాడితే.. వ్యక్తిగత గోప్యతకు ముప్పు తప్పదు. అలాగని పూర్తిగా సోషల్ మీడియాని దూరం పెట్టే పరిస్థితి కూడా లేదు. కేవలం వ్యక్తులే కాదు.. సంస్థలు కూడా సోషల్ మీడియా ఖాతాల ద్వారానే చాలావరకు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. సోషల్ మీడియా ఖాతాలతో సమాచార విప్లవం కొత్త పుంతలు తొక్కిందనే భావన కూడా ఉంది. కానీ యూజర్ల వ్యక్తిగత సమాచారంతో పాటు సంస్థల అధికారిక సమాచారం కూడా హ్యాకైతే.. ఆ నష్టం కూడా భారీగానే ఉంటుంది. ఇప్పటికైనా సోషల్ మీడియా వాడకం విషయంలో వ్యక్తులు, సంస్థలు ఎవరికివారే పరిమితులు నిర్ణయించుకోవాలంటున్నారు నిపుణులు. ఏది ఎంత అవసరమో అంతే వాడాలి. అతి సర్వత్ర వర్జ్యయేత్ అన్న పెద్దల మాటను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.

Exit mobile version