National Integration Day : తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనిని ఒక్కక్కరు ఒక్కో పేరుతో.. ఒక్కో అంశాన్ని పేర్కొంటూ గుర్తుచేసుకుంటారు. ఇప్పుడే ఇదే అంశాన్ని రాజకీయ పార్టీలు హాట్ టాపిక్ గా మార్చాయి. ఈ విషయంలో ఎవరికి వారు పై చేయి సాధించే విధంగా ముందుకు కదులుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ ల మధ్య కొనసాగుతున్న రాజకీయ పోటీకి సెప్టెంబర్ 17 కీలక అంశంగా మారింది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు వేరువేరు పేర్లతో భారీ కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి.
తెలంగాణలో హై ఓల్డేజ్ రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మునుగోడు ఉపఎన్నికల తరుణంలో.. విమోచన రాజకీయం మొదలైంది. తెలంగాణ ఏర్పాటైన దగ్గర్నుంచీ సెప్టెంబర్ 17ను ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో జరుపుతూ వచ్చాయి. అయతే ప్రభుత్వం మాత్రం అధికారికంగా నిర్వహించడం లేదు. ఏటా సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా.. విలీనమా, విమోచనా.. విద్రోహమా అనే చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఎప్పుడూ లేనంత హడావుడి ఈసారి కనిపిస్తోంది. కేంద్రం హైదరాబాద్ సంస్థానం విమోచన ఉత్సవాలు నిర్ణయించడం, ఏడాది పాటు జరపాలని ప్రకటించడం కలకలం రేపింది. కేంద్రం ప్రకటన రాగానే.. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇచ్చింది.సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినంగా జరిపి.. ఏడాది పాటు వజ్రోత్సవాల పేరుతో కార్యక్రమం జరపాలని భావిస్తోంది. స్వాతంత్ర్య అమృతోత్సవాల్ని ఎలా అయితే కేంద్రానికి పోటీగా ఎలా జరిపామో.. సెప్టెంబర్ 17న కూడా అదే వ్యూహం అమలుచేయాలనేది టీఆర్ఎస్ ఆలోచన. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెప్టెంబర్ 17ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నంగా కనిపిస్తున్నది. అందుకే పోటీపడి మరీ సెప్టెంబర్ 17న వివిధ కార్యక్రమాలు జరపడానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలోని కాషాయ పార్టీల నేతలు దీనిని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా పేర్కొంటుండగా, టీఆర్‌ఎస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవంగా పేర్కొంటోంది. అలాగే, కాంగ్రెస్ సైతం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమైంది. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గం 2022 సెప్టెంబర్ 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ప్రారంభ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 16న ప్రభుత్వం భారీ ర్యాలీలను నిర్వహించింది. ఇందులో విద్యార్థులు, యువకులు, పురుషులు, మహిళలు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ప్రధాన కార్యాలయాల్లో పాల్గొన్నారు. సెప్టెంబర్ 17న పబ్లిక్ గార్డెన్‌లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
సెప్టెంబర్ 17న రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సిపాలిటీ, పంచాయతీల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేస్తారని తెలిపారు. గుస్సాడి గోండు లంబాడీలు, ఇతర కళారూపాలతో కూడిన సాంస్కృతిక ప్రదర్శనలతో పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇందిరాపార్కు సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18న అన్ని జిల్లా కేంద్రాల్లో కవులు, కళాకారులతో పాటు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
కేంద్రంలోని బీజేపీ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలు పాలుపంచుకుంటున్నారు. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల నాయకులు కూడా ఇందులో పాల్గొంటారు. గురువారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం ఉత్సవాలను చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి దేవాలయం నుండి మహిళా బైక్ ర్యాలీతో ప్రారంభించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ పక్కా ప్లాన్ తో ముందుకు కదులుతున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రానికి.. ప్రజలతో ముడిపడి ఉన్న ప్రతిఅంశాన్ని బీజేపీ ఉపయోగించుకోవాలని ప్రణాళికలు చేసినట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
75వ హైదరాబాద్ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17న త్రివర్ణ పతాకంతోపాటు ప్రత్యేక రాష్ట్ర పతాకాన్ని ఎగురవేస్తామని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో త్రివర్ణ పతాకంతో పాటు తెలంగాణ జెండాను రెపరెపలాడిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. తెలంగాణా ప్రజలందరినీ ప్రతిబింబించేలా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ఆవిష్కరించనుంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు దీటుగా సెప్టెంబర్ 17 వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్దమైంది కాంగ్రెస్. మొత్తంగా రాష్ట్రంలో పొలిటికల్ మైలేజ్ కోసం ప్రధాన రాజకీయ పార్టీలన్ని ప్రయత్నిస్తున్నాయని స్పష్టమౌతోంది.
మునుగోడు ఉపఎన్నికల తరుణంలో.. రాజకీయం ఇప్పటికే వేడెక్కగా.. సెప్టెంబర్ 17నాటి కార్యక్రమాలతో సెంటిమెంట్ రగిలించాలని పార్టీలు పోటీ పడుతున్నాయి. స్వయంగా కేంద్రం రంగంలోకి దిగి విమోచన దినోత్సవం జరుపుతామని ప్రకటించడం, కౌంటర్ గా టీఆర్ఎస్ కూడా జాతీయ సమైక్యత దినం అనడం ఆసక్తి కలిగిస్తోంది.
భారత దేశంలోనే కాక ప్రపంచ విప్లవోద్యమాల్లోనే ప్రముఖమైనది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. దేశంలో మిగతా చోట్ల బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా అహింసా యుత స్వాతంత్య్ర పోరాటం జరిగితే… తెలంగాణలో బ్రిటిష్‌వారి మిత్రుడైన నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగింది.
ఇంగ్లిష్ పాలకులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రోద్యమం జరిగిన సమయంలో… ఇక్కడ తెలంగాణలో నిజాం పాలనకు చరమగీతం పాడుతూ విప్లవకారులు అనేక గ్రామాలను విముక్త ప్రాంతాలుగా ప్రకటిస్తూ ముందుకు పోతున్నారు. అటువంటి సమయంలో భారత ప్రభుత్వం హైదరాబాద్‌పై సైనిక చర్య చేపట్టింది. భారత హోంమంత్రికి నిజాం అధికారికంగా లొంగిపోయి, తన రాజ్యాన్ని భారత్‌లో కలిపివేశాడు. అయితే ఈ చారిత్రక ఘట్టాన్ని రాజకీయ పార్టీలు తమ తమ స్వప్రయోజనాలకోసం వాడుకోవాలని చూస్తున్నాయి.
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17న జరిగింది ఏమిటో నేటికీ మెజారిటీ తెలంగాణ ప్రజలకు తెలియదు. ఆనాటి రజాకార్ల, దేశ్‌ముఖ్‌ల, దొరల ఆగడాలు మాత్రమే సామాన్య ప్రజలకు తెలుసు. మరి ఆ రోజు జరిగిందేమిటి? విలీనమా? విమోచనా? విద్రోహమా? దురాక్రమణా? చెరపలేని చరిత్రను, గత చారిత్రక సత్యాన్ని వివాదాస్పదం చేసి ప్రజల మన్నలను పొందాలని పాలక, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆనాటి పాలక పార్టీ కాంగ్రెస్ విలీనమనీ, మత కోణంలో లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ విమోచననీ, ప్రజల ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధమున్న కమ్యూనిస్టులు ముమ్మాటికీ విద్రోహమనీ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు.
నిజాం నిరంకుశ పాలనలో… దేశ్‌ముఖ్‌లు, దొరలు, భూస్వాముల పెత్తనం, వెట్టి చాకిరీ లాంటి ఆగడాలపై ఎదురు తిరిగిన హైదారాబాద్ రాష్ట్ర ప్రజలు పోరాటాన్ని ఉధృతం చేసి నైజాం పాలనను అంతమొందించే స్థాయికి వచ్చారు. దొరలు గడీలు విడిచి హైదరాబాద్ పారిపోయేలా చేశారు. వేలాదిమంది మాన ప్రాణాలను దోచుకున్న ఊర్లలోని దొరలే కాదు నిజాంకూడా గద్దె దిగే పరిస్థితిని రైతాంగ పోరాటం కలిగించింది. నలువైపుల నుండి వస్తున్న పోరాట వార్తలు నిజాంను ఉక్కిరి బిక్కిరి చేశాయి. సైనిక చర్యను కాంగ్రెస్ విలీనం అంటోంది. ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగి శాంతియుతంగా జరిగే ప్రక్రియను విలీనం అనాలి. దీన్నెలా అంటారు? ముస్లిం పాలన పోయి హిందూ పాలన వచ్చినందున ఇది విమోచన అంటుంది బీజేపీ. ఎవరినుండి ఎవరికి విమోచన వచ్చినట్లు? ప్రజల నుండి నిజాం పాలకులకు విమోచన కలిగింది. ప్రజల నుండి దొరలు, భూస్వాములకు విమోచన కలిగింది. దీన్ని ఎలా విమోచన అంటారో ఉత్సవాలు చేసుకునే బీజేపీ చెప్పాలి. కమ్యూనిస్టులు ఇది విద్రోహం అంటున్నారు. సెప్టెంబర్ 17 విషయంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పటివరకూ కిమ్మనకుండా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఈసారి కొత్త రాగం అందుకుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని.. అందుకోసం మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. దీని వెనుక కేసీఆర్ వ్యూహాలు ఆయనకున్నాయి.
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే నాటికి తెలంగాణ ప్రజలంతా కలిసి కూకటి వేళ్ళతో నిజాం రాచరికా నికి వ్యతిరేకంగా మహత్తర సాయుధ పోరాటం జరుపుతున్నారు. అప్పటివరకూ తెలంగాణ ప్రజలు చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా దుర్భర బానిసత్వాన్ని అనుభవించారు. నిజాం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాల్లోనే కాకుండా భాషాసంస్కృతుల్లో కూడా పరాయీకరణకూ, అవమానాలకూ గురయ్యారు. దీనికి వ్యతి రేకంగా తెలంగాణ తొలితరం విద్యావంతులైన మాడపాటి హన్మంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు వంటి వారు 1921లో ఆంధ్ర జన సంఘం అనే సంస్థను ఏర్పాటు చేశారు. అది 1923లో ఆంధ్ర జన కేంద్ర సంఘంగా, 1930లో నిజాం రాష్ట్రాంధ్ర మహాసభగా మారుతూ తన కార్యకలా పాలను విస్తృతంగా నిర్వహించింది. 1942 నుండి కమ్యూనిస్టుల చేరికతో ఆంధ్రమహాసభ భాషా సంస్కృతుల పరిధి దాటి వెట్టిచాకిరీ వ్యతిరేక ఉద్యమం, దున్నేవానికి భూమి వంటి పోరాటా లను నిర్వహించింది.
యూనియ న్‌లో చేరమని బ్రిటిష్ వారు నిజాంకు సలహా ఇచ్చారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది గ్రామాలను విముక్త ప్రాంతంగా ప్రకటించిన తరుణంలో హైదరాబాద్ నగరం కూడా పోరాటకారుల స్వాధీన మయ్యే అవకాశం ఉందని గ్రహించిన లార్డ్ మౌంట్‌బాటెన్ నిజాంను యూనియన్‌లో చేరమని ఒత్తిడి చేశాడు. స్వతంత్ర దేశంగా ఉంటానన్న నిజాంకు దేశీయంగా, అంతర్జాతీయంగా మద్దతు కరవయింది. నిజాంకు సమాంతరంగా ఎదుగు తున్న మతోన్మాద నాయకుడు ఖాసిం రజ్వీ యూని యన్‌లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజ లపై తీవ్ర హింసాకాండకు దిగాడు. ఐక్యరాజ్య సమితిలో నిజాంకు మద్దతు తెలుపుతూ వస్తున్న పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మహ్మద్ అలీజిన్నా ఆకస్మికంగా మరణించారు. ఈ పరిస్థితులలో నిజాంసైన్యాలు, రజాకారులు స్థైర్యాన్ని కోల్పోయి గందరగోళంలో పడి బలహీన స్థితికి చేరుకున్నాయి. 1947 సెప్టెంబర్ 29న నిజాం, నెహ్రూ సర్కార్‌లు యథాతథ ఒడం బడికను చేసుకున్నాయి. అయినా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ ప్రజా గెరిల్లాలు నిజాం సైన్యాన్ని దెబ్బ మీద దెబ్బ తీసి పూర్తిగా ఆత్మరక్షణలో పడవేశారు. కేంద్ర హోంమంత్రి ఇదే సమయంలో హైదరాబాద్‌పై సైనిక చర్యకు ఆదేశించాడు. యూనియన్ సైన్యాలను ప్రతిఘటించకుండానే నిజాం సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత్‌లో విలీనమైంది.
రాజకీయాల్లో పార్టీలు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయి. సెప్టెంబర్ 17 వేడుకల విషయంలోనూ తెలంగాణలోని రాజకీయ పార్టీలు అదే విధంగా నిర్ణయాలు తీసుకున్నాయి. ఎవరి రాజకీయ లబ్ధి వారుచూసుకుంటున్నారు.
ఈసారి సెప్టెంబర్ 17 వేడుకలను కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఈ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారని ప్రకటించింది. అయితే బీజేపీకి కౌంటర్‌గా ఈసారి సెప్టెంబర్ 17న సందర్భంగా జాతీయ సమైక్యతా వేడుకలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. దీంతో సెప్టెంబర్ 17 క్రెడిట్ మొత్తం బీజేపీ ఖాతాలో పడకుండా.. ఆ విషయంలో తాము టార్గెట్ కాకుండా ఉండేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యూహత్మకంగా వ్యవహరించిందనే టాక్ వినిపించింది. అయితే ఈ రెండు పార్టీల సెప్టెంబర్ 17 వేడుకలు జరపడం వల్ల తాము వెనుకబడిపోతామని భావించిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో స్పందించింది. ఆ రోజు తాము కూడా వేడుకులు నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు ఆ రోజు సరికొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని, తాము అధికారంలోకి వస్తే తెలంగాణవాదానికి ప్రతీకలైన పలు నిర్ణయాలను అమలు చేస్తామని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17 విషయంలో తీసుకున్న నిర్ణయం పరోక్షంగా టీఆర్ఎస్‌కు కొంతమేర కలిసి వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
ఒకవేళ కేవలం బీజేపీ మాత్రమే తెలంగాణలో సెప్టెంబర్ 17 వేడుకలు నిర్వహించి ఉంటే.. ఇందుకు సంబంధించిన మొత్తం పొలిటికల్ మైలేజీ ఆ పార్టీ ఖాతాలో పడేది. కానీ బీజేపీకి చెక్ చెప్పేందుకు సీఎం కేసీఆర్ కూడా ఈ వేడుకలను నిర్వహించేందుకు సిద్ధం కావడం.. ఈ రెండు పార్టీలకు చెక్ చెప్పే విధంగా తాము కూడా ఈ వేడుకులను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవడంతో ఇప్పుడు ఈ వేడుకలను ప్రజలు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగడంతో.. సెప్టెంబర్ 17 వేడుకల విషయంలో గతానికి భిన్నంగా ఎక్కువగా రాజకీయమే తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఈసారి ఈ వేడుకల ద్వారా తమ ప్రత్యర్థులను టార్గెట్ చేయడంపైనే ఎక్కువగా ఫోకస్ చేయడానికి అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈసారి ఈ వేడుకలను తాము కూడా ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం పరోక్షంగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌కు కలిసొచ్చే అంశమనే వాదన కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సైతం ఈ వేడుకలను ఘనంగా చేయాలని అనుకోవడంతో బీజేపీ చేయబోయే వేడుకలపై తెలంగాణ ప్రజల దృష్టి తగ్గుతుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈసారి సెప్టెంబర్ 17 వేడుకలనుపై ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల ఎవరికీ ఎక్కువ పొలిటికల్ మైలేజీ వస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
విమోచన దినోత్సవం తామే జరిపి, తెలంగాణ ప్రభుత్వాన్ని, కెసిఆర్‌ను బోనులో నిలబెట్టాలనుకున్న బిజెపి, మజ్లిస్ సమేతంగా టిఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్ణయం తీసుకునేసరికి అవాక్కయింది. టిఆర్ఎస్ దిగివచ్చిందా, ఇన్నాళ్ల నుంచి నిలబడ్డ వైఖరి నుంచి దిగజారిందా అన్న ప్రశ్నలకు పెద్దగా చెలామణీ లేదు. ఎత్తుకు పై ఎత్తు పడిందా లేదా? మునుగోడుకు ముందు ముందస్తు పైచేయి దొరికిందా లేదా? అన్నవిప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నలు.
మొత్తానికి, చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఒక అంశం ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది, ఏ పేర్లతో అయితేనేమి అందరూ అధికారికంగానో, అనధికారికంగానో తెలంగాణపై పోలీసు చర్య వార్షికోత్సవాలను జరుపుకుంటారు. విద్రోహదినమనో, దురాక్రమణ దినమనో అక్కడక్కడ చిన్న చిన్న అసమ్మతి వ్యక్తీకరణలు వినిపించవచ్చును తప్ప, తక్కినదంతా ఒకే పాట. సర్దార్ పటేల్‌కు నిజాం అభివాదం చేస్తున్న ఫోటోను విస్తృతంగా ప్రచారంలో పెట్టవచ్చు. రాజకీయ లాభం తెచ్చే అంశంగా మాత్రం సెప్టెంబర్ 17 నిర్వీర్యం అయిపోయింది.
ఒకపక్క వేల మంది రైతులు సాయుధ పోరులో ప్రాణాల పోగొట్టుకున్న సమయంలో., అత్యధిక భూస్వాములు ఆఖరు నిముషం వరకు నిజాం పాలనలోనే తమ ప్రయోజనాలను చూసుకున్నారు. నిజాంను గద్దె దించడానికి కాంగ్రెస్ పార్టీ చివరి ఏడాది, రెండేళ్లు కొంత ప్రయత్నించింది కానీ, అంతకు మునుపు లేదు. దేశీయ సంస్థానాలలో ఉద్యమాలు వద్దనేది కాంగ్రెస్ విధానంగా ఉండేది.
రాజకీయ ప్రజా ఉద్యమాలు తీవ్రంగా జరిగి, ప్రభుత్వాన్ని కూలదోసి ఉంటే, అది పెద్ద వేడుకకు ఆస్కారం ఇచ్చి ఉండేది. . సెప్టెంబర్ 17ను వేడుక జరుపుకోవడం ఆ గాయాలను గుర్తుచేసినట్టు అవుతుందన్న సున్నితత్వంతోనే ప్రభుత్వాలు దాటవేస్తూ వచ్చాయి. ఆ సున్నితత్వం రాజకీయ వ్యవస్థలో ఉండడం ఆరోగ్యకరం, అభిలషణీయం. తెలుగుదేశం, టిఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా అదే ఆనవాయితీని అనుసరించాయి. విమోచనం అనే మాట బదులు జాతీయ సమైక్యత అన్న మాటను ఎంచుకోవడంలో కూడా ఆ పట్టింపు ఉన్నది. మజ్లిస్ ఒత్తిడి వల్ల ఇంతకాలం సెప్టెంబర్ 17 వేడుకను జరపలేదు అన్న వాదన సరైనది కాదు, 1957 దాకా మజ్లిస్ పార్టీ మీద నిషేధమే ఉన్నది. 1960లో మాత్రమే మజ్లిస్ తరఫున మొదటి కార్పొరేటర్ ఎన్నికయ్యారు. 1970 దశకానికి ఆ పార్టీకి హైదరాబాద్ నగరంలో కొంత బలం సమకూరింది. మరి తొలినాటి ప్రభుత్వాలు ఎందుకు విమోచన దినం జరుపుకోలేదు?. ఇప్పుడు సహజంగా కలిగే సందేహం, కేంద్రప్రభుత్వం ద్వారా విమోచన దినం జరపడానికి బిజెపికి మాత్రం ఎనిమిదేండ్లు ఎందుకు పట్టింది? 2014 నుంచే చేయవచ్చును కదా? తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఈ సంవత్సరం జూన్ 2న ఢిల్లీలో ఆ పార్టీ మొదటిసారిగా జరిపింది. ఎందుకు ఇన్నేళ్లు జరపలేదు? అంటే, రాజకీయంగా తెలంగాణ మీద పూర్తిస్థాయి గురిపెట్టిన తరువాత మాత్రమే, రాష్ట్రావతరణ, విమోచన దినోత్సవాలను చేపట్టారు. తెలంగాణలో అధికారపార్టీ కూడా సెప్టెంబర్ 17 సమస్యను ముందే పరిష్కరించి ఉండవచ్చు, ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే ముందు తీసుకుని ఉండవచ్చు. కానీ, దానిని మరొక పక్షం తీవ్రస్థాయికి తీసుకువెళ్లి, ప్రమాదం ముంచుకు వచ్చేదాకా స్పందించలేదు. అన్ని సందర్భాలలోనూ ఇంత సమయం దొరకకపోవచ్చు. పరిష్కరించకుండా మురగబెట్టిన సమస్యలతో మొదటికే మోసం రావచ్చు.