తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. స్వయంగా సీఎం కేసీఆర్ డేట్ చెప్పాలంటూ విపక్షాలకు సవాల్ విసరడం, దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలని విపక్షాలు ప్రతిసవాళ్లు విసరడం పొలిటికల్ టెంపరేచర్ ను అమాంతం పెంచేసింది.
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ నడుస్తోంది. అధికార టీఆర్ఎస్ జోరు కొనసాగుతుండగా.. కాంగ్రెస్, బీజేపీ కూడా అగ్రనేతల సభలతో హడావుడి మొదలుపెట్టాయి. వరంగల్ లో రాహుల్ తో రైతు డిక్లరేషన్ ఇప్పించింది కాంగ్రెస్. బీజేపీ ఏకంగా హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది. జాతీయ స్థాయి కీలక నేతలందరూ వచ్చారు. పోటీగా టీఆర్ఎస్ కూడా రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పేరుతో రాజకీయ వేదిక క్రియేట్ చేసుకుంది. ఎవరికి వారే పోటాపోటీ విమర్శలతో రాజకీయ మంటలు రగిలించారు.
ఇప్పటికే ఓ విడత ముందస్తుకు వెళ్లిన అనుభవం ఉన్న కేసీఆర్.. మరోసారి ముందస్తుకు సిద్ధం.. తేదీ చెప్పాలంటూ విపక్షాలను కవ్విస్తున్నారు. అటు ప్రతిపక్షాలు కూడా దీటుగా స్పందించి వెంటనే అసెంబ్లీ రద్దు చేయాలని కౌంటర్ ఇచ్చాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలూ ఇప్పటికే ఎన్నికలకు సిద్దమయ్యాయనేది బహిరంగ రహస్యమే. ఎవరికి వారు నియోజకవర్గాల వారీగా బలాబలాల సమీక్షలు పూర్తిచేసుకుని.. అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా చేసుకుంటున్నాయి. సామాజికవర్గాలు, పాత, కొత్త ముఖాలు, చేరికల్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణలో హ్యాట్రిక్ గెలుపుతో పాటు జాతీయ రాజకీయాలపై బలమైన ముద్ర వేయాలని తపిస్తోంది టీఆర్ఎస్. అవసరమైతే జాతీయ పార్టీ పెడతామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. పాలనలో తెలంగాణతో పోటీపడాలని ప్రధాని మోడీకి కూడా సవాల్ విసిరారు. ఎన్నికల వ్యూహకర్తలు, ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్ఠానం మూడు సర్వేలు చేయిస్తున్నాయి. ఈ మూడు సర్వేల వడపోత తర్వాతే టికెట్లు ఖరారు చేయనుంది టీఆర్ఎస్. ప్రజాదరణ లేకపోతే సీనియర్లు, మంత్రులైనా షాక్ తప్పదని కేటీఆర్ ఇప్పటికే జిల్లాల టూర్లో హింట్ ఇచ్చారు. ఓటు బ్యాంకును కాపాడుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాలు చెల్లాచెదురయ్యే వ్యూహరచన చేస్తోంది గులాబీ పార్టీ. త్వరలో మంత్రులకు జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి.
కొన్ని ఉపఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీకి జోష్ ఇచ్చాయి. ఇతర పార్టీల నేతల్ని ఆహ్వానించడానికి ఏకంగా చేరికల కమిటీ కూడా వేసింది. తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి రావాలని జాతీయ నేతలు స్పష్టం చేయడంతో.. రాష్ట్ర పార్టీ నేతలంతా చెమటోడ్చాల్సిన పరిస్థితి. కేసీఆర్ ను గద్దె దించడం ఖాయమంటున్న బీజేపీ నేతలు.. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తామంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావాలన్న అభిప్రాయాలు కార్యకర్తల్లో ఉన్నాయి. అందుకు అనుగుణంగా అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలతో ప్రాసెస్ మొదలుపెడుతోంది కమలం పార్టీ.
కాంగ్రెస్ నేతలు కూడా ఈసారి అధికార ఉట్టి కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వర్గాల్ని గుర్తించి.. ఆయా వర్గాల వారీగా సభలకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఇదే రీతిలో నిర్వహించిన రైతు, ఆదివాసీ సభల సక్సెస్ కావడం.. క్యాడర్ కు జోష్ ఇచ్చింది. కష్టపడ్డవారికే టికెట్లని, నియోజకవర్గాల్లోనే ఉండాలని నేతలకు రాహుల్ గట్టిగా చెప్పారు. నేతల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలున్నా.. విజయానికి అది అడ్డంకి కాదనే భావనతో ఉంది హస్తం పార్టీ.
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఫలితాల సంగతి ఎలా ఉన్నా.. పొలిటికల్ స్క్రీన్ షేక్ చేయాలనే కసి కనిపిస్తోంది. తెలంగాణలో త్రిముఖ పోటీ ఆసక్తకరంగా ఉంటుందని, ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయనే ఉత్కంఠ ప్రజల్లో పెరుగుతోంది. టీఆర్ఎస్ పట్టు నిలబెట్టుకుంటుందా.. కాంగ్రెస్ పుంజుకుంటుందా.. బీజేపీ సత్తా చాటుతుందా.. ఇవన్నీ మున్ముందు తేలాల్సిన ప్రశ్నలు. పాతబస్తీ బయట విస్తరించాలని మజ్లిస్ చూస్తుంటే.. ఎంఐఎంను పాతబస్తీలోనే కట్టడి చేస్తామని బీజేపీ సవాళ్లు విసురుతోంది. వీటితో పాటు షర్మిల పార్టీ, బీఎస్పీ చూపించే ప్రభావంపై కూడా చర్చ జరుగుతోంద. కోదండరామ్ టీజేఎస్ ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది కూడా ఆసక్తకరమే.
మొత్తం మీద ఈసారి తెలంగాణ రాజకీయ ముఖచిత్రం.. జాతీయ రాజకీయాలకు ఎలాంటి సందేశం పంపుతుందా అనే ఆసక్తి అందరిలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని బట్టి.. పార్లమెంట్ ఎన్నికల సమీకరణాలు మారే అవకాశాలున్నాయి.
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైముంది. అయితే మహానాడుతో టీడీపీ, ప్లీనరీతో వైసీపీ టాప్ గేర్ లోకి వెళ్లిపోయి.. నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. ఏపీలో పొత్తులపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఏపీలో రాజకీయం హాట్ హాట్ గా నడుస్తోంది. టీడీపీ మహానాడు, వైసీపీ ప్లీనరీతో పొలిటికల్ హడావుడి పెరిగింది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లుంది కదా అని రిలాక్సైన నేతలు కూడా వరుస కార్యక్రమాలతో యాక్టివేట్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం రాజుకుంది. ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయనే సంగతి పక్కనపెడితే.. రెండు పార్టీలూ సమఉజ్జీలుగా తలపడుతున్నాయి. జన సమీకరణ, ప్రజాదరణ, విమర్శలు.. ఏ విషయంలోనూ ఎక్కడా తగ్గడం లేదు.
టీడీపీ పనైపోయిందనే లెక్కలు తప్పని విశ్లేషకులు కూడా అంగీకరిస్తున్న పరిస్థితి. వైసీపీ విమర్శలకు టీడీపీ నేతలు దీటుగా కౌంటర్లిస్తున్నారు. ఎక్కడా తగ్గటం లేదు. ఢీ అంటే ఢీ అంటున్నారు. మొదట్లో కేసుల భయంతో వెనకడుగు వేసిన వాళ్లు కూడా ఇప్పుడు యాక్టివ్ అయ్యారనే వాదన వినిపిస్తోంది.
ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఉన్న సీఎం జగన్.. ఇప్పటికే అందుకు తగ్గట్టుగా ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. పథకాలే గట్టెక్కిస్తాయనే ధీమా వైసీపీలో కనిపిస్తోంది. సంక్షేమం అందితేనే ఓటేయండనే స్టేట్ మెంట్ కూడా ఆయన నమ్మకానికి సంకేతంగా కనిపిస్తోంది. మ్యానిఫెస్టో వంద శాతం పూర్తిచేసిన తరుణంలో.. పార్టీపై ఫోకస్ పెంచాలనే ఉద్దేశంతో ఉన్నారు. ప్లీనరీలో ఆ దిశగా సంకేతాలు పంపిన జగన్.. ఇక నేతల పనితీరును కూడా మరింత క్లోజ్ గా మానిటర్ చేసే అవకాశం ఉంది. ఆశావహులు ఎక్కువగా ఉన్న తరుణంలో.. ఇప్పట్నుంచే కసరత్తు చేయాలనే ఉద్దేశం కనిపిస్తోంది.
సంక్షేమంతో మానవాభివృద్ధి చేస్తున్నామని వైసీపీ.. స్కీముల పేరుతో ఏపీని చీకట్లోకి తీసుకెళ్తున్నారని టీడీపీ ప్రచారం చేస్తున్నాయి. ప్రజలు ఎవరి వాదనకు మద్దతిస్తారనేది చూడాల్సి ఉంది. జనసేన అధినేత పవన్ కూడా జనవాణి వేదికల మీద కీలక కామెంట్లు చేస్తున్నారు. పొత్తులపై తానేం చెప్పలేనంటూనే.. వైసీపీని గద్దె దించాలని పిలుపు ఇస్తున్నారు. ఏపీలో 2014 తరహా పొత్తులు సాకారమౌతాయా.. లేకపోతే జనసేన, టీడీపీ మాత్రమే కలిసి ఎన్నికలకు వెళ్తాయా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ పొత్తు కుదిరితే జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది. పవన్ వ్యూహం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరం.
ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేతల టూర్లు మరింత ఊపందుకుంటాయనే వాదన ఉంది. ప్రజలతో నిరంతర సంబంధాల కోసం రెండు పార్టీలు కొత్త కొత్త కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన చేయొచ్చు. గతంలో మాదిరిగా కాకుండా ప్రజాదరణ ఉన్న నేతలకే టికెట్లని రెండు పార్టీలూ క్లారిటీ ఇచ్చాయి. దీంతో ఇప్పటివరకు సైలంట్ గా ఉన్న నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. టికెట్ కోసం కష్టపడాలని భావిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో రెండు పార్టీల టికెట్ల కోసం అంతర్గత పోటీ ఉంది. ఈ పోటీ మంచిదేనని అధినేతలు భావిస్తున్నారు. క్యాడర్, ప్రజలు ఇద్దరి ఆమోదం ఉన్న నేతలకే టికెట్లు దక్కే అవకాశాలున్నాయి. ఎవర్ని నిర్లక్ష్యం చేసినా.. భారీ మూల్యం తప్పదనే సంకేతాలు ఇప్పటికే వెళ్లాయి. ఒట్టి మాటల కంటే గ్రౌండ్ వర్క్ కే ఎక్కువ ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ఎన్నికల వ్యూహకర్తల సర్వేలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. 2024 ఎన్నికలు చాలా కీలకమని అటు వైసీపీ, ఇటు టీడీపీ భావిస్తున్నాయి. కాబట్టి ఆషామాషీగా తీసుకుంటే కుదరదని డైరక్ట్ వార్నింగులు ఇస్తున్నాయి. ఆశించిన పనితీరు లేకపోతే సీనియర్లైనా నిర్మొహమాటంగా పక్కనపెడతామని చెబుతున్నాయి.
2019లో ప్రత్యేక హోదా ప్రధాన అజెండాగా ఏపీ ఎన్నికలు జరిగాయి. ఈసారి సంక్షేమ అజెండాతో ఎన్నికలు జరగాలని వైసీపీ కోరుకుంటోంది. టీడీపీ మాత్రం అభివృద్ధిపై ఎక్కువ చర్చ జరిగేలా ప్లాన్ చేస్తోంది. ఎవరి స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందో చూడాలి. ఏపీలో బీజేపీ ప్రస్తుతానికి పెద్ద శక్తిగా లేకపోయినా.. ఎన్నికల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందనే చర్చ జరుగుతోంది. ఏపీలో ప్రాంతాల వారీగా పార్టీల బలాబలాలు అలాగే ఉంటాయా.. మారతాయా అనేది కూడా తేలాల్సిన వ్యవహారం. మొదట్నుంచీ రాయలసీమ వైసీపీకి బలమైన ప్రాంతంగా ఉంది. ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోటగా ఉంది. కానీ 2019లో ఉత్తరాంధ్రలో వైసీపీకి మంచి ఫలితాలు వచ్చాయ. ఈసారి రాయలసీమలో వైసీపీని దెబ్బతీయాలని చంద్రబాబు ప్లాన్లు గీస్తున్నారు. మరి ప్రజలు ఎటు మొగ్గుతారు, ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనే అంశాలే పార్టీల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈసారి వ్యూహకర్తల సందడి కూడా గట్టిగానే కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు సర్వేలు చేయించుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చేశాయి.
తెలుగు రాష్ట్రాలకు వ్యూహకర్తల కల్చర్ వచ్చేసింది. రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఎవరికి వారు వ్యూహకర్తలతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. తెర మీద నేతలు కనిపిస్తున్నా.. తెర వెనుక వ్యూహకర్తల మంత్రాంగం నడుస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వేలు మొదలైపోయాయి. గతానికి భిన్నంగా ఎన్నికల ముందే పార్టీ యంత్రాంగం ప్రక్షాళన, దానికి కూడా గ్రౌండ్ లెవల్లో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. అన్ని పార్టీలూ అదే వ్యూహం పాటిస్తున్నాయి. దీంతో నేతలు కూడా నిరంతరం ప్రజల్లో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాడర్ తో టచ్ లోకి వస్తున్నారు.
వ్యూహకర్తల ఫీడ్ బ్యాక్ తో పాటు తాము కూడా సొంతంగా సర్వేలు చేసుకుంటున్నాయి పార్టీలు. కొన్ని పార్టీలు రెండు, మూడు సర్వేలు కూడా చేయిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా.. రాజకీయంగా పైచేయి సాధించే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడే అన్ని పరిస్థితుల్ని ముందుగానే ఊహించుకుని.. బలాబలాల బేరీజు వేసుకుంటున్నాయి. కొన్ని పార్టీలైతే వ్యూహకర్తలతో కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. డైరక్టుగా వ్యూహకర్తలకు, క్యాడర్ కు లింక్ పెట్టే ప్రయోగం కూడా జరుగుతోంది.
ఇప్పటివరకు జాతీయ స్థాయి, కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన వ్యూహకర్తల కల్చర్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు వచ్చింది. దీంతో ఈసార జరిగే ఎన్నికల ఫలతాలపై ఎక్కడలేని ఆసక్తి ఉంది. ఇప్పటిదాకా నడిచిన పాలిటిక్స్ కు, ఇకపై జరిగే రాజకీయాల లెక్క వేరనే అభిప్రాయాలున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో వ్యూహకర్తలు ఎలాంటి పాత్ర పోషిస్తారు, ఎవరి వ్యూహాలు విజయవంతమౌతాయనేది చూడాల్సి ఉంది. సరికొత్త రాజకీయాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కూడా కీలకమే.
వ్యూహకర్తలంటే.. సోషల్ మీడియా ప్రచారం కొత్తగా ఉంటుంది. ఏపీ, తెలంగాణలో ఎలాంటి ప్రచార పద్ధతులు అవలంబిస్తారనేది చూడాల్సి ఉంది. ప్రతి పార్టీ సోషల్ మీడియా వింగుల్ని బలోపేతం చేసుకునే పడింది. ఏకంగా గ్రామస్థాయి వరకు సోషల్ మీడియో సోల్జర్స్ ఉండాలనే భావన పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రాజుకున్న రాజకీయ వేడి.. ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తి కలిగిస్తోంది.