లంకకు నిప్పంటుకుంది. దేశం రణరంగంగా మారింది. ఆర్థిక సంక్షోభాన్ని తాళలేక జనంలో నెలకు పైగా నెలకొన్న ఆగ్రహావేశాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారుల దాడితో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఆగ్రహించిన జనం దేశవ్యాప్తంగా రోడ్లపైకొచ్చారు. ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ మద్దతుదారులపై దాడులకు దిగారు.
ఇప్పటిదాకా తమకు తిరుగులేదనుకున్న రాజకపక్సేలకు.. జనం పవరేంటో తెలిసొచ్చింది. శ్రీలంకలో కర్ఫ్యూ పెట్టినా.. ఎమర్జెన్సీ విధించినా నిరసనకారులు తగ్గడం లేదు. అధికార పార్టీ నేతల్ని వెంటపడి మరీ తరుముతున్నారు. ఏకంగా జనం నిరసనలకు తట్టుకోలేక.. విధిలేని పరిస్థితుల్లో అధికార పార్టీ ఎంపీ అమరకీర్తి సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. వందల మంది పోలీసులు ఉన్నా.. వేల మంది నిరసనకారులు తాను తలదాచుకున్న భవనాన్ని చుట్టుముట్టడంతో ఎంపీకి దిక్కుతోచలేదు. ఎలాగో చావు తప్పదు కాబట్టి.. ఉన్నంతలో మెరుగైన ఆప్షన్ ను ఉపయోగించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతకుముందు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై మహీంద రాజపక్సే అనుచరులు దాడికి దిగడంతో.. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. దేశవ్యాప్తంగా నిరసనకారుల్లో ఆగ్రహజ్వాలలు ఎగసిపడటంతో.. సైన్యం కూడా చేతులెత్తేసింది.
అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ప్రధాని మహీంద రాజపక్స నివాసాల దగ్గర శాంతియుతంగా నిరసన చేస్తున్న ఆందోళన కారులపై అధికార పార్టీ మద్దతుదారులు దాడికి దిగడం.. హింసకు దారితీసింది. అప్పట్నుంచీ దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతలు, మద్దతుదారులు ఎవర్నీ జనం వదలడం లేదు. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక ప్రధాని పదవికి రాజీనామా చేసిన మహీంద రాజపక్సే కూడా కొలంబోకు దూరంగా ఉన్న నౌకాశ్రయంలో తలదాచుకుంటున్నారు. తన ఆచూకీ తెలిస్తే జనం వచ్చి ఏం చేస్తారోననే భయం ఆయనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి అధ్యక్షుడు గోటబయ రాజపక్సే పైనే కేంద్రీకృతమైంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన ఆహ్వానించినా.. ప్రతిపక్షాలు నో చెప్పాయి. దీంతో పరిస్థితులు మరింతగా విషమించే అవకాశం కనిపిస్తంది. జనం రెచ్చిపోయి అధ్యక్ష భవనం మీద కూడా దాడికి దిగుతారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలు సైన్యాన్ని కలవరపెడుతున్నాయి.
ఇప్పటికే మహీంద రాజపక్స నివాసం, రాజపక్సల పూర్వీకుల నివాసాలు అగ్నికి ఆహుతయ్యాయి. సంక్షోభం ముదిరేదాకా పదవిని పట్టుకుని వేలాడిన రాజపక్సలపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా.. ఇప్పటిదాకా రాజపక్స సోదరులు స్పందించకపోవడంపై విశ్లేషకులు కూడా పెదవి విరుస్తున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమౌతుందనే దానికి శ్రీలంక ప్రస్తుత స్థితి అద్దం పట్టేలా ఉంది.
ప్రభుత్వానికి ఎంత మెజార్టీ ఉన్నా.. నేతలకు ఎంత ప్రజాదరణ ఉన్నా.. దైనందిన జీవితానికి అడ్డంకులు లేనంత వరకే జనం సహిస్తారు. అడ్డూ అదుపూ లేని ధరల పెరుగుదల, విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, అడుగంటిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు.. చమురు సంక్షోభం.. ఇలా ఒకటేంటి.. లంకలో దుస్థితికి కావాల్సినన్ని కారణాలున్నాయి. కనీస అవసరాలైన పాలు, నిత్యవాసరాలు కూడా దొరక్కపోవడంతో.. జనం గుండెలు మండాయి. గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ, పెట్రోల్ బంకుల దగ్గర ఆర్మీ పహారా.. ఇదంతా వారికి చిర్రెత్తించింది. ఓవైపు శ్రీలంక సంక్షోభం గురించి అంతర్జాతీయ మీడియా కోడై కూస్తుంటే.. రాజపక్స సర్కారు మాత్రం ప్రజలను చివరిదాకా నమ్మించాలని చూసింది. సంక్షోభం తాత్కాలికమేనని, త్వరలోనే పూర్వ స్థితి వస్తుందని కథలు చెప్పింది. రోజులు గడుస్తున్నా.. పరిస్థితిలో మార్పు రాకపోగా.. మరింత విషమించడంతో.. లంకేయులంతా మూకుమ్మడిగా రోడ్డెక్కారు.
లంకలో కొన్నేళ్లుగా రాజపక్స కుటుంబ పాలన నడుస్తోంది. అధ్యక్షుడు, ప్రధాని, క్యాబినెట్ మంత్రులు.. ఇలా అన్ని కీలక పదవుల్లోనూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు రాజ్యం చేశారు. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుని.. సంక్షోభాన్ని కొని తెచ్చారనేది నిపుణుల అభిప్రాయం. సంక్షోభాన్ని ముందుగానే నివారించే మార్గాలున్నా.. రాజపక్స పట్టించుకోలేదు. అసలు దేశానికి ఏమీ కాలేదన్నట్టే వ్యవహరించారు. ఇప్పుడు అదే కొంప ముంచింది. చైనా అప్పుల ఊబిలో కూరుకుపోవడం, తలాతోక లేని నిర్ణయాలు శ్రీలంక కొంప ముంచాయి. ప్రధాని మహీంద రాజీనామాకు నెల రోజులు పట్టింది.. అధ్యక్షుడు ఎప్పుడు గద్దె దిగుతారని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. గో గోటబయా గో అనే నినాదాలు హోరెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా పదవుల కోసం పాకులాడుతున్న గోటబయ.. దేశం ఏమైపోయినా పర్లేదన్నట్టుగా వ్యవహరించడం మరింత వ్యతిరేకతకు కారణమౌతోంది.
నిరంతర ఘర్షణలు, దేశవ్యాప్తంగా హింసాత్మక వాతావరణం మధ్య సమస్యకు పరిష్కారం కనుక్కోవడం ఎలా సాధ్యమనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులు మాత్రం లంకకు ఎలా వస్తాయనేది రాజపక్స ఆలోచించుకోవాలి. కనీసం అప్పులు ఇవ్వడానికి కూడా అంతర్జాతీయ సంస్థలు సిద్ధంగా లేవు. రుణాలిస్తాం సరే.. అవెలా తీరుస్తారని అడిగితే.. గోటబయ దగ్గర సమాధానం లేదు. కనీసం సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించే ప్రణాళిక లేదు. అసలు ఏదో ఒకటి ప్లాన్ చేద్దామనే ఆలోచనే లేదు. ఎంతసేపూ పదవి కోసం పాకులాట.. పౌరులపై అణచివేత తప్ప.. సామరస్యపూర్వక వాతావరణం ఏర్పాటుకు ప్రయత్నించడమే లేదు. గోటబయ పదవిలో ఉండగా.. శ్రీలంక చల్లారే పరిస్థితి లేదనే విశ్లేషణలు మరింత కలవరపెడుతున్నాయి.
శ్రీలంక చిన్న దేశమైనా.. ఆ దేశానికి కొన్ని అనుకూలతలున్నాయి. ఆ అనుకూలతోనే దశాబ్దాల పాటు అంతర్యుద్ధం జరిగినా.. ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుని.. జిగేల్ మని వెలుగులీనింది. కానీ కరోనా తర్వాతే పరిస్థితి అదుపు తప్పింది. కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఉంది. అయితే స్వీయ తప్పిదాల కారణంగా.. లంక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికీ దేశాన్ని చక్కదిద్దటానికి మార్గాలున్నాయని చెబుతున్నారు ఆర్థికవేత్తలు. కానీ అలా చేయాలంటే.. మొదట పరిస్థితి అదుపులోకి రావాలి. పౌరులందరూ శాంతించాలి. హింసాత్మక వాతావరణం పోవాలి. గోటబయ బేషరతుగా పదవికి రాజీనామా చేస్తే.. అన్ని పార్టీలు కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు పార్లమెంట్ ను సమావేశపరచడానికే ఇష్టపడని గోటబయ.. పదవికి రాజీనామా చేస్తారనుకోవడం అత్యాశే అవుతోంది. ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి విఫలయత్నం చేయడం, నిరసకారులపై దాడికి దిగి మరింతగా హింసను రెచ్చగొడుతున్న చర్యలు చూస్తుంటే.. లంకను రావణకాష్టం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.
కేవలం రెండు కోట్ల జనాభా ఉన్న శ్రీలంకలో.. ఈ స్థాయిలో పరిస్థితులు విషమించడం మొదట్లో అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కానీ అసలు విషయం తెలిశాక.. ఈ దుస్థితి ప్రభుత్వమే కొనితెచ్చిందని స్పష్టమైంది. ధరల పెరుగుదలతో మొదలైన సంక్షోభం.. ఏకంగా దేశమే దివాలా తీసే దాకా వచ్చింది.
శ్రీలంకను ఆహార, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. పెట్రోల్ నుంచి కూరగాయల దాకా.. నిత్యావసరాల కోసం కిలోమీటర్ల కొద్దీ బారులు.. ఆసుపత్రుల్లో ఔషధాలు లేక అవస్థలు పడుతోన్న రోగులు.. విద్యుద్దీపాలు వెలగక చీకట్లో మగ్గుతున్న ప్రజలు.. ద్వీప దేశం శ్రీలంకలో ఎటు చూసినా కన్పిస్తోన్న దృశ్యాలివే. ఆహార, ఆర్థిక సంక్షోభంతో సింహళ దేశం అల్లాడిపోతోంది. విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోవడంతో కీలక దిగుమతులు నిలిచిపోయాయి.
పర్యాటక దేశంగా పేరొందిన శ్రీలంకలో 2019లో ఈస్టర్ రోజు ఓ చర్చిలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటన ఆ దేశ పర్యాటక రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. దీంతో విదేశీ మారక నిల్వలు పతనమయ్యాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఆ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో దిగుమతులపై నిషేధం విధించారు. ఫలితంగా చమురు, నిత్యావసరాల కొరత ఏర్పడి వాటి ధరలు ఆకాశాన్నంటాయి. తేయాకు, రబ్బరు, వస్త్రాలు వంటివి ఎగుమతి చేసే శ్రీలంకకు.. 2013లో ప్రపంచవ్యాప్తంగా కమొడిటీ ధరలు భారీగా పతనం కావడం కూడా పెద్ద కుదుపే. వాస్తవానికి అప్పట్నుంచే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూడటం మొదలైందన్నది విశ్లేషకుల మాట.
సింహళ జాతీయవాదం ముసుగులో రాజపక్స సోదరులు భారీ అవినీతికి పాల్పడ్డారన్నది ప్రజాస్వామ్యవాదుల ఆరోపణ. మహీంద అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా నుంచి అధికంగా పెట్టుబడులు వచ్చాయి. ఈ నిధుల్లో ఎక్కువ భాగాన్ని రాజపక్స సోదరులు, బంధువర్గాలు విదేశాలకు తరలించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హంబన్‌టొటకు చెందిన రాజపక్స కుటుంబం 1947 నుంచి అక్కడి రాజకీయాల్లో చురుగ్గా ఉంటోంది. 2019 అధ్యక్ష ఎన్నికల్లో శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన గొటబాయ రాజపక్స గెలుపొందిన అనంతరం ఆయన కుటుంబంలోని వారికే కీలక మంత్రి పదవులు దక్కాయి. ఆయన సోదరులు చమల్ రాజపక్స, బసిల్ మంత్రులుగా, మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స ప్రధానిగా ఉన్నారు. గతంలోనూ మహీంద రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్నారు. మహీంద ఇద్దరు కుమారులైన నమల్, యోషితాలకు కీలక పదవులు దక్కాయి. రాజపక్స కుటుంబీకులు నిర్వహించే మంత్రిత్వ శాఖలకే బడ్జెట్‌లో 75శాతం వరకు నిధులు కేటాయించడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
2019లో గొటబాయ అధికారంలోకి వచ్చిన తర్వాత లంక సర్కారు విలువ ఆధారిత పన్నును 15శాతం నుంచి 8శాతానికి తగ్గించడంతో పాటు, ఏడు ఇతర రకాల పన్నులను రద్దు చేసింది. ధార్మిక సంస్థలను పన్ను పరిధి నుంచి తప్పించింది. ఫలితంగా కేవలం 30 నెలల్లోనే శ్రీలంక ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. పన్నుల వసూలు దాదాపు సగం తగ్గడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చమురుకు, ఇతర వస్తువులకు పెద్దయెత్తున చెల్లింపులు చేయాల్సి రావడంతో సమస్య తలెత్తింది. శ్రీలంక ఆర్థిక స్థితిగతులపై ఆసియా అభివృద్ధి బ్యాంకు 2019లో ఒక అధ్యయనం వెలువరించింది. దీని ప్రకారం ఆ దేశంలో ఆదాయంకంటే వ్యయం ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తమయింది. ఇతర దేశాలతో పోలిస్తే శ్రీలంకలో పన్నుల శాతం తక్కువే అయినా ఆర్థిక నిపుణుల సూచనలు పట్టించుకోకుండా పన్నుల శాతాన్ని తగ్గించేశారు. ఫలితంగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కోసుకుపోయింది.
ఎల్‌టీటీఈతో పోరాటం సమయంలో లంక బడ్జెట్‌లో భారీ లోటు ఉండేది. 2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యంతో ఆ దేశ పరిస్థితి మరింత కుదేలైంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో 2009లో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి లంక ప్రభుత్వం 2.6 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. బడ్జెట్ లోటును 5 శాతానికి తగ్గిస్తామన్న షరతు మీద రుణం పొందింది. తర్వాత కూడా ఎగుమతులు పుంజుకోలేదు. విదేశీ నిల్వలు దిగజారిపోతూనే ఉన్నాయి. దీంతో అప్పటి యూఎన్‌పీ సంకీర్ణ ప్రభుత్వం 2016లో మరోసారి ఐఎంఎఫ్‌ను ఆశ్రయించింది. 1.5 బిలియన్ డాలర్ల రుణం పొందింది. 2020 నాటికి ఆర్థిక లోటును 3.5 శాతానికి తగ్గించడం, వ్యయ నియంత్రణ, పన్ను సంస్కరణలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాణిజ్యవిధానాల అమలు, విదేశీ పెట్టుబడులకు స్వేచ్ఛాయుత వాతావరణం వంటి షరతుల మీద ఈసారి ఐఎంఎఫ్ రుణాన్ని మంజూరు చేసింది. ఇది లంక ఆర్థిక స్థితిని మరింత ఒత్తిడికి గురి చేసింది.
విదేశీ మారక నిల్వలు కాపాడుకోవటానికి.. ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. దిగుమతులను పూర్తిగా తగ్గించాలని నిర్ణయించింది. రసాయన ఎరువుల దిగుమతిని మే 2021 నుంచి పూర్తిగా నిషేధించింది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. అసలు ఉద్దేశం మాత్రం వేరే ఉంది. ఈ నిర్ణయమే లంక పరిస్థితిని పూర్తిగా దిగజార్చి సంక్షోభానికి దారితీసింది. వరి, తేయాకు, కొబ్బరి సహా ఇతర వ్యవసాయోత్పత్తుల దిగుబడి 30 శాతం మేర పడిపోయింది. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తల ఆందోళనల్ని సైతం ప్రభుత్వం పెడ చెవిన పెట్టి తమ నిర్ణయాల్ని మొండిగా అమలు చేసింది. మసాలా దినుసులు, వంట నూనెలు, పసుపు, వాహనాలు, టూత్ బ్రష్‌లు ఇతరత్రావాటి దిగుమతులను నిషేధించినా ఫలితం లేకపోయింది. డిమాండ్, సరఫరాకు మధ్య నెలకొన్న తీవ్ర అంతరంతో పెను సంక్షోభం ఏర్పడింది.
సంక్షోభం కారణంగా అత్యవసర ఔషధాల నుంచి సిమెంట్ వరకూ అన్ని వస్తువుల కొరత ఏర్పడింది. ఆసుపత్రుల్లో మందులు లేక సాధారణ శస్త్రచికిత్సలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అటు ఇంధన కొరత కారణంగా రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. పేపర్ కొరతతో విద్యా సంస్థలు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేశాయి. పెట్రోల్‌తో పాటు కూరగాయల కోసం కూడా ప్రజలు బారులు తీరాల్సిన స్థితి ఎదురైంది. గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చుని కొందరు స్పృహ కోల్పోగా.. కొందరు మరణించారు. ఏడు దశాబ్దాల్లో ఇటువంటి సంక్షోభ పరిస్థితులను చూడలేదని లంక ప్రజలు వాపోతున్నారు.
ఆహార, ఇంధన, ఔషధాల కొరతపాటు విదేశీ మారకద్రవ్య నిల్వలు కరిగిపోతుండడంతో శ్రీలంక అల్లాడుతోంది. మొత్తం 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించలేమని ప్రకటించింది. సాయం కోసం పొరుగు దేశాలవైపు చూస్తోంది. అయితే దివాలా తీసినట్టు ప్రకటించిన దేశం.. ఎలా ఒడ్డున పడుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆర్థిక సంక్షోభం కాస్తా అరాచకానికి దారితీయడంతో.. లంకలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
శ్రీలంక సంక్షోభంలో రాజపక్స కుటుంబం పూర్తిగా ఏకాకైంది. ప్రభుత్వానికి సహకరించడానికి ప్రతిపక్షాలు నిరాకరిస్తున్నాయి. ఏకంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినా.. తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. ఏ ప్రజలైతే రాజపక్సను నెత్తినపెట్టుకున్నారో.. అదే ప్రజలు ఇప్పుడు రాజపక్సను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేయడం.. ప్రజాస్వామ్య వైచిత్రికి అద్దం పడుతోంది.
శ్రీలంకలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని.. అధ్యక్షుడు గోటబయ పంపిన ఆహ్వానాన్ని ప్రధాన ప్రతిపక్షం తిరస్కరించింది. దేశంలో ఎమర్జెన్సీ, అల్లర్లు, రాజకీయ అనిశ్చితిని కారణాలుగా చూపింది. సంక్షోభం ముదిరేదాకా పదవులు పట్టుకుని వేళ్లాడి.. ఇప్పుడు ప్రతిపక్షాల్ని బలిచేస్తారా అని ప్రశ్నించింది. 19వ రాజ్యాంగ సవరణను పునరుద్ధరించాలని లంక బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. దేశాధ్యక్షునికి అత్యధిక అధికారాలను కట్టబెడుతూ 2020లో జరిగిన 20వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని కోరింది. 18 నెలలపాటు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దేశంలో అధ్యక్ష తరహా పరిపాలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. దీనిపై గోటబయ స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
ప్రస్తుతం సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు సాయమందించేందుకు భారత్ సహా మరికొన్ని దేశాలు ముందుకొస్తుంటే..శ్రీలంకను నట్టేట ముంచిన చైనా మాత్రం ఆ దేశానితో మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా చూస్తూ ఉండిపోయింది. మరిన్ని రుణాలు అందించి ద్వీప దేశాన్ని ఇంకా ఇరుకున పెట్టాలని చూస్తోంది. శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి చైనానే కారణమని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. శ్రీలంక 1980 నుంచి ఆర్థిక సరళీకరణ పేరుతో విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించింది. ఈ విధానాలతో చైనా చాలా లాభపడింది. కరోనాకు ముందు చైనా.. శ్రీలంకలో భారీగా పెట్టుబడులు పెట్టింది. పెద్ద ఎత్తున రుణాలిచ్చింది. కరోనా తర్వాత డ్రాగన్ అప్పులు భారంగా మారింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఉద్దేశంతో శ్రీలంక… చైనా విదేశీ పెట్టుబడులకు లొంగిపోయింది. 2022 నాటికి శ్రీలంకపై దాదాపు 7 బిలియన్ అమెరికన్ డాలర్ల రుణం ఉంది. 2021-22లోనే శ్రీలంక చైనాకు చెల్లించాల్సిన రుణాల విలువే 2 బిలియన్ యూఎస్ డాలర్ల వరకు ఉంది. ఇంత జరిగినా శ్రీలంక నేతలు మళ్లీ చైనా ట్రాప్ లో పడుతున్నారు. అత్యవసర మద్దతు కోసం 100 మిలియన్ డాలర్ల సాయం కోరింది.
ఎల్టీటీఈని నిర్మూలించిన మహీంద రాజపక్స శ్రీలంకలో నేషనల్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఆ పాపులారిటీతోనే సొంత పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చారు. కానీ పాలనలో మాత్రం ప్రజల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. మొదట అధ్యక్షుడిగా తర్వాత ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న మహీంద రాజపక్స.. కుటుంబ పాలనతో తీవ్రంగా అప్రతిష్ఠ పాలయ్యారు. ఏ ప్రజలైతే రాజపక్సను నెత్తిన పెట్టుకున్నారో.. అదే ప్రజలు ఇప్పుడు విసిరి కొట్టడానికి సిద్ధపడ్డారు. చివరకు ప్రతిపక్షాల్ని కూడా రాజపక్స లెక్కపెట్టలేదు. అందుకే సంక్షోభ పరిస్థితుల్లో కూడా అధికార పక్షంతో చేతులు కలపటానికి విపక్షం నో చెప్పింది. రాజపక్స పాపం పండిందనే అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ ఉంది. అత్యంత ప్రజాదరణ ఉన్న నేత.. ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడానికి ప్రధాన కారణం అధికారం శాశ్వతం అనే అహంకారమే అని వేరే చెప్పక్కర్లేదు.
ప్రజాస్వామ్యం లో పాలన ఎప్పుడూ ప్రజల కోణంలోనే చేయాలి. అతి భారీ గెలుపు వచ్చిందని.. యాభై శాతం మంది ఓట్లేశారని.. విచ్చలవిడితనంగా పరిపాలన చేస్తే సీన్ మారిపోతుంది. వారే తిరుగుబాటు చేస్తారు. తాము ఏం చేసినా ప్రజల మద్దతు ఉందని.. ప్రజలు గొప్ప మెజార్టీ ఇచ్చారని చెప్పుకుంటే చివరికి ఆ ప్రజలే చితిమంటలు వేస్తారని శ్రీలంక ప్రజలు నిరూపిస్తున్నారు. ఎంతటి వ్యక్తులయినా ప్రజాగ్రహానికి తల వంచక తప్పదని తేలిపోయింది. ఆర్థిక సంక్షోభం తరుముకొచ్చేదాకా.. లంకలో ప్రతిపక్షాలు నామమాత్రంగానే ఉన్నాయి. రాజపక్స అధికారం సుస్థిరం అనే స్థాయిలో వాళ్ల హవా నడిచింది. అధికార పార్టీపై కనీస విమర్శలకు కూడా ప్రతిపక్షాలు సాహసించలేదు. ఎవరైనా అంశాల వారీగా తప్పులు ఎత్తిచూపినా.. రాజపక్స తీవ్రమైన ఎదురుదాడి చేసేవారు. ఆయన మద్దతుదారులు కూడా ఈలం యుద్ధ విజయమే అన్నింటికీ తారకమంత్రం అన్నట్టుగా ప్రచారం చేశారు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ గాడి తప్పితే.. ఏం జరుగుతుందో రాజపక్సకు అనుభవంలోకి వచ్చింది. పాలనలో తప్పులు జరగడం సహజం. పొరపాట్లు జరిగాయని ఒప్పుకుని.. వాటిని దిద్దుకుంటే ఎవరికైనా మనుగడ ఉంటుంది. అంతేకానీ అధికారం ఉందనే తలపొగరుతో ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు.. ఇలా తప్పు మీద తప్పు చేసుకుంటూ పోవడం, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం.. ఆ ప్రజల్నే పీడించే వ్యవస్థగా మారడమే.. ప్రస్తుత లంక దుస్థితికి ప్రధాన కారణం.
లంక్ష సంక్షోభం అన్ని దేశాలకూ హెచ్చరికే అంటున్నారు నిపుణులు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు నియంతృత్వ పోకడలు పోతే.. ప్రజలు రెచ్చిపోతారు. ఒక్కసారి ప్రజలు సహనం కోల్పోతే.. చివరకు మిగిలేది హింసే. ఇక్కడ చిన్నా, పెద్ద దేశాలనే తేడా ఏమీ లేదు. తమ దైనందిన జీవితానికి భంగం కలగనంత వరకు ప్రజలు.. ప్రభుత్వాలు చేసే జిమ్మిక్కుల్ని సహిస్తారు. కానీ ఇళ్లలో ఉండాల్సిన వాళ్లను నడిరోడ్డుపై నిలబెడితే మాత్రం దేనికైనా వెనుకాడరు. ప్రజలు తలుచుకుంటే పోలీసులు, సైన్యం.. ఇలా ఏ వ్యవస్థా పాలకుల్ని కాపాడలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులనే సంగతి మర్చిపోయి.. మెజార్టీ ఉందనో.. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయని విర్రవీగితే.. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటే.. సంక్షోభాన్ని ఆహ్వానించినట్టే.