రోగాలు తగ్గాలంటే మందులు వేసుకోవాల్సిందే. అందుకని అతిగా వాడితే ఆ మందే విషమౌతుంది. ఇప్పుడు యాంటీబయాటిక్స్ విషయంలో ఇదే నిజమౌతోంది. చీటికీ మాటికీ విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడకంతో.. దుష్ప్రభావాలు వస్తున్నాయి. రోగం త్వరగా తగ్గుతుందనే ఉద్దేశంతో యాంటీబయాటిక్స్ వాడుతున్నారు కానీ.. అవి స్లో పాయిజన్ లా పనిచేస్తున్నాయని ఎవరూ గుర్తించడం లేదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యాంటీబయాటిక్స్ వాడుతున్న ఇండియా.. లేని సమస్యలు కొనితెచ్చుకుంటోంది.
కోవిడ్ సమయంలో దేశంలో డోలో- 650 ట్యాబెట్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు యాంటీబయాటిక్స్ వాడకంపై కూడా ఆందోళన కలిగించే నివేదిక వెలుగులోకి వచ్చింది.
దేశంలో యాంటీబయాటిక్స్ వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులకు వాడాల్సిన మందులను.. పనిచేయవని తెలిసినా.. వైరస్ జబ్బులకు వాడుతున్నారు. యాంటీబయాటిక్స్ వాడితే ఏ రోగమైనా త్వరగా తగ్గిపోతుందనే ఫీలింగ్ బాగా ఉంది. అందుకే డాక్టర్లు కూడా కచ్చితంగా ప్రిస్క్రిప్షన్లో యాంటీబయాటిక్స్ ఉండేలా చూసుకుంటున్నారు. ఒకవేళ డాక్టర్ రాయకపోయినా.. రోగులే అడిగి మరీ రాయించుకుంటున్నారు. అప్పటికీ వినకపోతే.. మందుల షాపుకి వెళ్లి డైరక్టుగా కొనుక్కుంటున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి.. ఇలా సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లకు కూడా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. ఓవైపు అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో డాక్టర్లు అత్యవసరం అయితేనే యాంటీబయాటిక్స్ వాడుతుంటే.. మన దగ్గర మాత్రం మినిమం మెడిసిన్ కింద యాంటీబయాటిక్స్ వాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
వ్యాక్సిన్లతో సమానమైన అద్భుత ఆవిష్కరణగా యాంటీబయాటిక్స్ కు గుర్తింపు ఉంది. యాంటీ బయాటిక్స్ కోట్ల మంది ప్రాణాలు కాపాడాయనే మాట కూడా నిజమే. అయితే అదే అదనుగా ప్రతి చిన్న దానికీ యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగింది. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. అమెరికాలో అయితే యాంటీబయాటిక్స్ నియంత్రణ కోసం నేషనల్ యాక్షన్ ప్లాన్ ను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలో అమల్లోక తెచ్చారు. బ్రిటన్లో కూడా డాక్టర్లు అత్యవసరం అయితేనే యాంటీబయాటిక్స్ రాయాలని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇండియాతో పోలిస్తే.. అమెరికా, బ్రిటన్లో డ్రగ్ కంట్రోల్ వ్యవస్థలు సమర్థంగా ఉండటం, జాతీయ వైద్య మిషన్ కింద ఎక్కువ ఆస్పత్రులు ఉండటంతో.. అక్కడ మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఆయా దేశాల్లో రోగులు ఒత్తిడి చేసినా.. డాక్టర్లు మాత్రం యాంటీబయాటిక్స్ అంటే నో అంటున్నారు. అయితే మన దగ్గర ఎక్కువగా ప్రైవేట్ ఆస్పత్రులు ఉండటం.. డ్రగ్ కంట్రోల్ బలహీనంగా ఉండటం.. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మే ట్రెండ్.. అన్నీ కలిసి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. యాంటీ బయాటిక్స్ విషయంలో అమెరికా తరహాలో సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే.. ప్రమాదాన్ని కొనితెచ్చుకున్న్టట్టు అవుతుందంటున్నారు నిపుణులు.
ఏ రోగం వచ్చినా.. మందులు ఏ మోతాదులో వాడాలో అంతే వాడాలి, అలాగే రోగానికి సంబంధించిన మందులే వాడాలి. కానీ స్పీడీ రికవరీ కోసం ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ మింగితే.. లాభం లేకపోగా.. దీర్ఘకాలంలో నష్టాలు తప్పవంటున్నారు నిపుణులు. దేశంలో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ ను వినియోగిస్తున్నట్టు లాన్సెట్ రీజినల్ హెల్త్ ఆగ్నేయాసియా జర్నల్ వెల్లడించింది. 2019లో భారతీయులు 500 కోట్లకు పైగా యాంటీబయాటిక్స్ మాత్రలు వినియోగించినట్టు తేలింది. ఇందులో ప్రధానంగా అజిత్రోమైసిన్ ను ఎక్కువగా వినియోగించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. యాంటీబయాటిక్స్ అమ్మకం, వినియోగం, నియంత్రించకపోతే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. యాంటీబయాటిక్స్ వాడకంపై నియంత్రణలతో పాటు ప్రస్తుత నిబంధనలను కఠినతరం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
దేశంలో వాడుతున్న యాంటీబయాటిక్స్ లో చాలా వరకు సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటరే ఆమోదించలేదు. విస్తృత స్థాయిలో యాంటీబయాటిక్స్ వాడకం ప్రజారోగ్యానికి ముప్పని నిపుణులు చెబుతున్నారు. భారతీయుల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పై అధ్యయనం అవసరమని అంటున్నారు. డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో మందులు ఇవ్వడం కూడా.. యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వాడకానికి ప్రధాన కారణం. దేశంలో పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్స్ వినియోగం జరుగుతోంది. అమెరికా, యూరప్ తరహాలో ఔషదాల వాడకంపై నిఘా, నియంత్రణకు కొరవడింది.
జాతీయ, రాష్ట్ర-స్థాయి ఏజెన్సీల మధ్య సమన్వయం లేకపోవడం కూడా దేశంలో యాంటీబయాటిక్ లభ్యత, అమ్మకం, వినియోగాన్ని పెంచుతోందని తేలింది. అనేక దేశాలతో పోలిస్తే.. భారత్ లో యాంటీబయాటిక్స్ తలసరి వినియోగం రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, భారతదేశం పెద్ద మొత్తంలో బ్రాడ్-స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్‌ను వినియోగిస్తుందని అధ్యయనం తెలిపింది. అత్యధికంగా అజిత్రోమైసిన్‌ను వాడగా, ఆ తర్వాత సెఫిక్సిమ్ 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను అధికంగా వాడారు. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 500 కోట్ల యాంటీబయాటిక్స్ మాత్రలు మింగారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దెబ్బకు భారతీయుల్లో యాంటీబయాటిక్ మందులు కూడా పనిచేయని స్థితి ఏర్పడిందని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేశారు.
అమెరికాకు చెందిన బోస్టన్ యూనివర్సిటీ, ఢిల్లీకి చెందిన పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కలిసి మనదేశంలో యాంటీబయాటిక్ మందుల వాడకంపై ఓ సర్వే నిర్వహించాయి. వినియోగించిన మొత్తం యాంటీబయాటిక్స్‌లో 90 శాతం ప్రైవేటు ఆస్పత్రులు, డాక్టర్లు సిఫారసు చేయగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇచ్చినవి 10 శాతమే. 2019లో పెద్దలు వాడిన ఔషధాల్లో మొత్తం డిఫైన్డ్ డైలీ డోసేజ్ 5,071 మిలియన్లు. అంటే ప్రతి వెయ్యిమంది పెద్దల్లో రోజూ 10.4 డోసేజీ వాడారన్నమాట. జాతీయ జాబితాలో చేర్చిన మొత్తం ఫార్ములేషన్స్‌లో అత్యవసర ఔషధాలు 49 శాతం ఉండగా, ఫిక్స్‌డ్ డోసేజ్ కాంబినేషన్స్ వాటా 34 శాతం ఉంది. జాబితాలోని మొత్తం ఔషధాల్లో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గుర్తింపు పొందినవి కేవలం 47.1 శాతమే. ఔషధాలను అతిగా వాడుతుండటంతో రానురాను అవి పనిచేయకుండా పోతున్నాయని అధ్యయనంలో తేలింది.
మనదేశంలో ఔషధాల విక్రయం, వినియోగంపై అమెరికా, యూరప్‌లో ఉన్నట్టు ఇప్పటికీ ఒక సరైన నిఘా విధానం లేదు. దేశంలో యాంటీబయాటిక్స్ విచక్షణారహితంగా వాడుతున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకున్నా ఈ ఔషధాలు తేలికగానే దొరుకుతాయి. గుర్తింపు పొందిన డాక్టర్లు కూడా రోగులకు వీటినే ఎక్కువగా రాస్తున్నారు. భారతీయులు వాడుతున్న యాంటీబయాటిక్స్‌లో 72 శాతం ప్రపంచ ఆరోగ్య సంస్థ వాడొద్దని చెప్పినవే. కరోనా మొదలైన తర్వాతే కాదు అంతకు ముందు కూడా దేశంలో యాంటీబయాటిక్స్ వాడకం అధికంగానే ఉంది. కోవిడ్ తర్వాత ప్రతి ఇంట్లో పారాసెట్మాల్, అజిత్రోమైసిన్ వంటి టాబ్లెట్స్ వాడకం పెరిగింది.
ఏ రోగమైనా తగ్గించుకోవడానికి ఓ పద్ధతి ఉంది. తగ్గడానికి నిర్ణీత సమయం పడుతుంది. కానీ రోగం త్వరగా తగ్గాలని షార్ట్ కట్స్ కోసం వెతుకుతున్నారు రోగులు. అందుకే రోగాన్ని శాశ్వతంగా నివారించే మార్గాల వైపు చూడకుండా.. టెంపరరీ రిలీఫ్ కు మొగ్గు చూపుతున్నారు. యాంటీబయాటిక్ వేస్తే చాలు.. ఏ రోగమైనా ఇట్టే తగ్గిపోతుంది. కొన్నిరోజులకు మళ్లీ వచ్చినా.. ఇంకో ట్యాబ్లెట్ వేసుకోవచ్చులే అనుకుంటున్నారు. కానీ పదేపదే మందులు వాడి.. రోగనిరోధక శక్తి తగ్గించుకుంటున్నామని గుర్తించడం లేదు. ఇలా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడితే.. చివరకు ఏ మందులూ పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. అప్పుడు వచ్చిన రోగం తగ్గడం కూడా గగనమౌతుంది. ఇప్పటికైనా యాంటీబయాటిక్స్ వాడకంపై పరిమితి పాటించాలంటున్నారు నిపుణులు.
యాంటీ బయాటిక్స్ వాడకంలో ప్రపంచంలో ఇండియానే టాప్ ప్లేస్ లో ఉంది. కరోనా ముందు.. ఆ తర్వాత భారత్ లో యాంటీ బయాటిక్స్ వినియోగం బాగా ఎక్కువైంది. కాస్తంత జలుబో, జ్వరమో రాగానే వెంటనే ట్యాబ్లెట్స్ వేసేసుకుంటాం. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని కూడా ఆలోచించడం లేదు.
కరోనా మహమ్మారి తర్వాత మందుల వినియోగం బాగా పెరిగింది. ఎటు నుంచి కరోనా ఎటాక్ చేస్తుందోనని భయపడి కాస్త జలుబు, జ్వరం రాగానే యాంటీ బయాటిక్స్ ని వాడేస్తున్నారు. అప్రూవల్ లేని, నాసిరకమైన యాంటీ బయాటిక్స్ ను విపరీతంగా వాడటం చాలా ప్రమాదకరం. వీటి వల్ల భారతీయులు క్రమంగా యాంటీ బయాటిక్ రెసిస్టెన్స్ కోల్పోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత జీవనశైలి కారణంగా అందరూ ఏదో ఒక ఆరోగ్య సమస్య ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే మందులు కూడా వేసుకుంటున్నారు. కొందరైతే డైరెక్ట్ గా మెడికల్ షాపుకు వెళ్లి మందులు తీసుకుని వేసుకుంటున్నారు. యాంటీ బయాటిక్స్ వాడి త్వరగా ఉపశమనం పొందుతున్నారు. అయితే యాంటీ బయాటిక్స్ అతిగా వాడితే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. పెద్దలే కాకుండా చిన్నారులకు కూడా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. ఇది చాలా ప్రమాదమని, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా మాత్రమే యాంటీబయాటిక్స్ ప్రభావవంతంగా పని చేస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. ప్రతి చిన్న సమస్యకు యాంటీబయాటిక్స్ వాడొద్దని సూచిస్తున్నారు. డెంగ్యూ, ఫ్లూ, కోవిడ్, వైరల్ డయేరియా, వాంతులకు వైరస్ కారణం కాగా .. బ్యాక్టీరియా వల్ల 10 శాతం వ్యాధులు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
చిన్నగా జలుబు చేయగానే యాంటీ బయాటిక్స్ వాడుతున్నారని, అయితే భవిష్యత్ లో తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులను సంప్రదించకుండానే పిల్లలకు కూడా యాంటీబయాటిక్స్ వాడటం ఇంకా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. కొందరు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే మెడికల్ షాప్‌కు పరిగెత్తుతారు. సొంత వైద్యాన్ని అప్లై చేసి ఇష్టారాజ్యంగా ట్యాబ్లెట్లు వేసుకుంటుంటారు. పెయిన్ కిల్లర్స్ మొదలు, యాంటీబయాటిక్స్‌ను ఎడాపెడా వాడేస్తుంటారు. నిజానికి ఏ చిన్న ట్యాబ్లెట్ అయినా డాక్టర్ సూచనమేరకే తీసుకోవాలి. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వాడితే రోగనిరోధ వ్యవస్థలో లోపాలు ఏర్పడుతాయని, బ్యాక్టీరియాకు మందులను తట్టుకునే శక్తి వస్తుంది. దీంతో మున్ముందు మందులు పనిచేయవు. మరింత శక్తిమంతమైన మందులు అవసరమవుతాయని చెబుతారు. అయితే తాజాగా శాస్త్రవేత్తల పరిశోధనల్లో మరో షాకింగ్ విషయం వెల్లడైంది.
యాంటీబయాటిక్స్‌ను అతిగా వాడితే ప్రమాదకరమైన ఫంగల్ వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుందని వెల్లడైంది. కాండిడా అనే ఫంగస్ కారణంగా ప్రమాదకరమైన ఇన్వాసివ్ కాండిడియాసిస్ సోకే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ బిర్మింగ్‌హామ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. యాంటీబయాటిక్స్‌ను అతిగా వాడడం వల్ల జీర్ణవాహికలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా నశిస్తాయి. దీంతో ఈ మంచి బ్యాక్టీరియా స్థానంలో కాండిడా వంటి ఫంగస్ చేరుతాయని పరిశోధనల్లో తేలింది.
ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏది ఉన్నా, ఎన్ని ఉన్నా..ఆరోగ్యంగా లేకపోతే ఎందుకు పనికిరాడు.. ఆరోగ్యవంతుడైన మనిషి..అడివిలోనైనా బ్రతికేయగలడు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే ఆరాటంతో ఇప్పుడు చాలా మంది ప్రమాదంలో పడిపోతున్నారు. కరోనా కాలంలో చాలా మంది రకరకాల యాంటీ బయోటిక్స్ విచ్చలవిడిగా వాడేశారు. ఇప్పుడు అదే మనిషి ఆరోగ్యానికి పెను ముప్పుగా మారింది. ఇప్పుడు చాలా రకాల యాంటిబయోటిక్స్ చాలా మందికి పని చేయడంలేదు. కొద్ది కాలం క్రితం వరకూ ఇది ఒక సమస్య మాత్రమే. కానీ కరోనా తర్వాత ఇది అతి పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ టాబ్లెట్స్ పరిధి దాటి.. అనేక మంది డేంజర్ లెవెల్ లో పడ్డారు. వాయిస్..
మానవ శరీరంలో అనారోగ్యాన్ని కలిగించే బ్యాక్టీరియా కంటే.. ఆరోగ్య వంతమైన బ్యాక్టీరియా చాలానే ఉంది. ఇలా మంచి చేసే బ్యాక్టీరియా విచ్చలవిడి యాంటీ బయోటిక్స్ వాడకం వల్ల .. నాశనం అయిపోతున్నాయి. ఇది మరింత ప్రమాదకర పరిస్థితి అంటున్నారు డాక్టర్లు. హాని కలిగించే బ్యాక్టీరియా రెసిస్టెన్స్ తో మరింత పటిష్టం కూడా అవుతోందంటున్నారు. యాంటీ వైరల్ మందులు తక్కువ కాబట్టి.. యాంటీ బ్యాక్టీరియా డ్రగ్స్ వాడకం.. పెరుగుతోంది. ప్రతి మెడిసిన్ అమ్మకానికికు డాక్టర్ల ప్రిస్కిప్షన్ తప్పని సరి. అందులో కొన్ని మందులకుఇంకా అవసరం. అయితే చాలా మంది పాత మందుల చీటీలు తీసుకువచ్చి మందులు కొనేస్తున్నారు. మరోవైపు ఆన్‌లైన్ లో కొనుగోళ్లు, వాట్సాప్ ప్రిస్క్రిప్షన్లు తోనూ .. యాంటీబయోటిక్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇలా నిబంధనలు పాటించకుండా నేరుగా అమ్మకాలు చేస్తున్న మెడికల్ షాపులు కొన్ని ఉంటే.. కొందరు అమ్మలేమని చెబితే దాడులకు దిగే పరిస్థితి ఉంటోంది. ఇప్పటికే యాంటీబయాటిక్స్ రెండు జనరేషన్స్ మందులు దాటి మూడో జనరేషన్ కు చేరుకుంటున్నాయి. అంటే.. రెండు జనరేషన్స్ లో తయారైన మందులు పనిచేయకుండా పోయాయనే ఆందోళన వ్యక్తమౌతోంది.
నిజంగానే ఇది ఒక డేంజర్ ఇండికేషన్. ఎన్నో వ్యయప్రాయాసల కోర్చి తయారుచేసిన మందులు ఎందుకూ కాకుండా పోతున్నాయి. ఇలా కొనసాగితే.. భవిష్యత్ లో ఇప్పుడున్న యాంటీబయోటిక్స్ ఏవీ పనిచేయవు. ఇప్పటికైనా విచ్చలవిడి మందుల వాడకం..అందులో యాంటిబయాటిక్స్ వాడకాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే అత్యవసర స్థితిలో కూడా మందులు పనిచేయక ప్రాణాలు పోయే దుస్థితి తప్పదంటున్నారు నిపుణులు.
ఏదైనా చిన్న వ్యాధికి గురైతే అందుకు తగ్గ యాంటీ బయాటిక్స్ వాడటం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ యాంటిబయాటిక్స్ తీసుకోవడం వల్ల జరిగే ప్రయోజనం కంటే దుష్ఫలితాలే ఎక్కువని డాక్టర్లు చెబుతున్నారు.
యాంటీబయాటిక్స్ అనేవి శరీరంలో బ్యాక్టీరియా పెరుగుదలను నెమ్మదిగా నాశనం చేసే మందులు. జలుబు, ఫ్లూ, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు ఈ యాంటీబయాటిక్స్ పని చేయవు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ద్వారా వచ్చే జ్వరం, న్యుమోనియా వంటి జబ్బులకు ఇవి కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి. వీటిని పరిమితికి మించి వాడటం వల్ల మన శరీరం రోగ నిరోధక శక్తిని కోల్పోతుందని, దాని వల్ల వాతావరణం, వయస్సు రీత్యా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను తట్టుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది.
యాంటీబయాటిక్స్ అధికంగా రోగనిరోధకతను దెబ్బతీస్తుంది. శరీరంలో బాక్టీరియా ఎక్కువగా పెరిగినపుడు.. ఆ మందుల డోస్ బాక్టీరియా మీద పనిచేయదు. దీని వల్ల ఆ బ్యాక్టీరియా వృద్ధి చెంది మరింత హాని కలిగిస్తుంది. యాంటీబయాటిక్స్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్లతో రోగులు ఎక్కువ కాలం ఆసుపత్రికే పరిమితమవ్వాల్సి వస్తుంది. అనారోగ్యానికి గురైన ప్రతిసారీ యాంటీబయాటిక్స్ వాడటం తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది కానీ ముందు ముందు ఊహించని దానికంటే ఎక్కువ హాని కలుగుతోంది.
ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా యాంటీబయాటిక్స్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. యాంటీబయాటిక్స్ వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందుతామన్న ఆలోచనలో అధికశాతం మంది ఇష్టారీతిలో యాంటీబయాటిక్స్ వినియోగిస్తున్నారు. పలువురు వైద్యులుకూడా అవసరానికి మించి యాంటీబయాటిక్స్ ను రిఫర్ చేస్తున్నాయి. అయితే యాంటీబయాటిక్స్ తరచూ వినియోగిస్తూపోతే చివరకు పెను ప్రమాదం కొనితెచ్చుకోవటం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ బిర్మింగ్ హోమ్ నిర్వహించిన పరిశోధనల్లో యాంటీబయాటిక్స్ వినియోగం అధికంగా ఉన్నవారిలో రోగ నిరోధక వ్యవస్థలో లోపాలు ఏర్పడుతాయని గుర్తించారు.
యాంటీబయాటిక్స్ అధిక వినియోగం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవటంతో ప్రమాదకరమైన ఫంగల్ వ్యాధులు సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో తేల్చారు. ఐసీయూలో పేషెంట్లకు అతిగా యాంటీబయాటిక్స్ అందిస్తే కేథటర్ నుంచి కూడా ఈ ఫంగస్ రక్తంలోకి సోకే ప్రమాదముందని తేలింది. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే ఆరోగానికి సంబంధించిన మందుతో పాటు యాంటీబయోటిక్స్ వాడేస్తాం. డాక్టర్ల చిటీ లేకపోయినా మందుల షాపుకు వెళ్లినా యాంటీబయోటిక్స్ ఇచ్చేస్తారు. అయితే యాంటీబయోటిక్స్ విచ్చలవిడిగా వాడటం ప్రమాదమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నా.. వాటి వాడకం మాత్రం తగ్గడంలేదు. తాత్కాలిక ఉపశమనం కోసం ఎక్కువుగా ఈ మందులను వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముందని డాక్టర్లు సూచిస్తున్నారు.
కొందరు అనవసరంగా, డాక్టర్ల సలహా లేకుండా ఎడాపెడా యాంటీబయాటిక్ మందులు వేసుకుంటుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడితే బ్యాక్టీరియాకు మందులను తట్టుకునే శక్తి వస్తుంది. దీంతో మున్ముందు ఆ మందులు పనిచేయవు. మరింత శక్తిమంతమైన మందులు అవసరమవుతాయి. ఇప్పటికే ఇలాంటి పరిస్థితిని వచ్చేసింది. చిన్నాచితకా ఇన్‌ఫెక్షన్లు సైతం ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ యాంటీబయాటిక్ మందుల ప్రభావం అక్కడితోనే ఆగిపోయేది కాదు. ముందు తరాల్లోనూ కొనసాగుతుంది. క్లోరోటెట్రాసైక్లిన్ ప్రభావానికి గురైన చేపలకు పుట్టిన పిల్లల్లో బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యం, రోగనిరోధక కణాల సంఖ్య తగ్గినట్టు యూనివర్సిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్ పరిశోధకుల అధ్యయనంలో తేలటమే దీనికి నిదర్శనం. ఈ దుష్ప్రభావాలు మూడో తరంలోనూ కొనసాగుతున్నాయి. యాంటీబయాటిక్ మందులను మనుషులకే కాదు, పశువులకూ ఇస్తుంటారు. అతిగా వాడకం వల్లనో, నిర్లక్ష్యంతోనో ఇవి నీటిలోనూ కలుస్తుంటాయి. వ్యర్థజలాలు, భూగర్భజలాలు, కాలువలు, నదుల్లోనే కాదు.. చివరికి సీసాల్లో అమ్మే నీటిలోనూ యాంటీబయాటిక్ అవశేషాలు కనిపిస్తుంటాయి. టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ మందు ప్రభావానికి గురైన తేళ్లకు పుట్టిన పిల్లల్లో వీర్యం నాణ్యత తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. వీటిల్లో వీర్యకణాల సంఖ్య 25 శాతం వరకు పడిపోయినట్టు కనుగొన్నారు. అందుకే యాంటీబయాటిక్ మందుల వాడకంలో అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం. నిర్లక్ష్యం వహిస్తే మన ఆరోగ్యాన్ని మనమే ప్రమాదంలో పడేసుకున్నట్టు అవుతుందని అధ్యయనాల ఫలితాలు హెచ్చరిస్తున్నాయి.