దేశంలో ధరలు మండిపోతున్నాయి. చమరు సెగ ఓవైపు, గ్యాస్ రేటు మరోవైపు భయపెడుతున్నాయి. ఇవి చాలదన్నట్టు నిత్యావసరాలు కూడా రోజుకో రకంగా పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం కూడా వణికిస్తోంది. ప్రజల కొనుగోలు శక్తి కూడా పడిపోయిందని ఎఫ్ఎంసీజీ కంపెనీల నివేదిక చూస్తుంటే.. మాంద్యం ముంచుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవే పరిస్థితులున్నాయి. 2008 నాటి మాంద్యం కాదు.. 1930 నాటి మహామాంద్యం తరహా ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు అన్ని దేశాల్నీ అల్లాడిస్తున్నాయి. అమెరికా నుంచి ఆఫ్రికా దాకా ఏ దేశం ఇక్కడ మినహాయింపు కాదు. ప్రతిచోట చిన్నవో, పెద్దవో కష్టాలున్నాయి. అగ్రరాజ్యంలోనూ 50 వేల ఉద్యోగాలు ఊడిపోయాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టడానికి సరిగ్గా 9రోజుల ముందు ప్రపంచ బ్యాంకు మాంద్యం హెచ్చరికలు జారీ చేసింది. అభివృద్ధి చెందుతున్న 69 దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు తెలిపింది. 11 వందల కోట్ల డాలర్లు అప్పు బకాయిపడినట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ తరువాత 9 రోజులకే ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగింది. ప్రపంచ మార్కెట్లు స్తంభించిపోయాయి. భారీగా చమురు, ఆహార కొరత నెలకొంది. ఫలితంగా చిన్న చిన్న దేశాలపై భారీ ప్రభావం పడింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో 107 దేశాల్లో పరిస్థితులు విషమిస్తున్నట్టు మార్చిలోనే ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లో ఆహార కొరత, ఇంధన ధరల పెరుగుదల, ఆర్థిక కష్టాలు మొదలవుతాయని వెల్లడించింది. దీంతో 107 దేశాలకు చెందిన 170 కోట్ల జనాభా అంటే ప్రపంచ జనాభాలో ఐదో వంతు ప్రజలకు కష్టాలకు గురి కానున్నట్టు ఐక్యరాజ్యసమితి స్పష్టంగా చెప్పింది.
107 దేశాల్లో 69 దేశాలను మాత్రం ఆహారం, ఇంధన ధరలు, ఆర్థిక కష్టాలు వణికిస్తాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఈ జాబితాలో 25 ఆఫ్రికా దేశాలు, 25 ఆసియా పసిఫిక్ దేశాలతో పాటు 19 లాటిన్ అమెరికా దేశాలు ఉన్నట్టు నివేదించింది. ప్రస్తుతం ఆర్థికంగా కుప్పకూలనున్న దేశాల్లో ఈజిప్టు ముందువరుసలో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా గోధుమలను దిగుమతి చేసుకుంటున్న దేశం ఈజిప్టే.. ఈ దేశానికి గోధుమలను ఎగుమతి చేసేది ఉక్రెయిన్, రష్యా దేశాలే. ఈ రెండు దేశాల సంక్షోభంతో గోధుమల సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈజిప్టులో ఉన్న గోధుమల నిల్వలు మూడు నెలలకు మాత్రమే సరిపోతాయని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఈ నిల్వలు అయిపోతే ప్రజలు ఆకలితో అల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆహార కొరతతోపాటు నిరుద్యోగం, మందగించిన ఆర్థిక వ్యవస్థతో కుదేలవుతోంది. ఈజిప్టు తరువాత టునీషియాను కష్టాలు వెంటాడనున్నాయి. ఈ దేశంలోనూ ద్రవ్యోల్బణం 7శాతం పెరిగింది. 80 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్య లోటు నెలకొన్నది. ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో టునీషియా ప్రజలు… శ్రీలంకలో మాదిరిగా ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది.
టునీషియా మార్గంలో లెబనాన్ పయనిస్తోంది. బీరుట్ లో 2020లో జరిగి పేలుడుతో లెబాన్ ధాన్యపు నిల్వలు పూర్తిగా నాశనమయ్యాయి. దీంతో నిత్యావసర ధరలు 11 రెట్లు పెరిగాయి. లెబనాన్ పౌండ్ విలువ 90 శాతం పడిపోయింది. పూర్తిగా ఉక్రెయిన్ గోధుమలపై ఆధారపడిన ఈ దేశం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆహార భద్రత కోసం ఇప్పటివకే 15 కోట్ల డాలర్లను ప్రపంచ బ్యాంకు నుంచి లెబానాన్ రుణంగా తీసుకుంది. అర్జెంటీనా కూడా అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పటివకే తొమ్మిది సార్లు అప్పులను కట్టలేక చేతులెత్తేసింది. పదోసారి ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ-ఐఎంఎఫ్‌ను అర్జెంటీనా ఆశ్రయించింది. 4కోట్ల డాలర్ల రుణాన్ని మంజూరు చేయమని కోరింది. పూర్తి అప్పుల్లో కూరుకుపోయిన అర్జెంటీనాలాగే… ఎల్ సాల్వెడార్, పెరూ దేశాలు కూడా విలవిల్లాడుతున్నాయి. ఈ దేశాల్లోనూ పెరిగిన ద్రవ్యోల్బణం, ఆహార కొరత, నిరుద్యోగం, మండుతున్న ధరలతో శ్రీలంక పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆఫ్రికా దేశాలైన ఘనా, ఇథోఫియా, కెన్యా, దక్షిణాఫ్రికా దేశాల్లోనూ పరిస్థితులు విషమిస్తున్నాయి. టర్కీ కూడా ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోంది. ద్రవోల్బణం 70శాతం పెరిగింది. 50 వేల టన్నుల గోధుమలను ఇటీవల భారత్ నుంచి దిగుమతి చేసుకుంది. ఆయా దేశాల్లో పరిస్థితులు విషమంగా మారుతున్నాయి. వచ్చే 12 నెలల్లో డజనుకు పైగా దేశాల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తనున్నట్టు ప్రపంచ బ్యాంకు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది ఈ తరంలోనే అతి పెద్ద సంక్షోభంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సగానికి పైగా దేశాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. మన పొరుగున ఉన్న శ్రీలంక తరువాత పాకిస్థాన్, మయన్మార్, నేపాల్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో సంక్షోభం నెలకొనడానికి ప్రధానంగా స్థానిక పరిస్థితులు, కరోనా సంక్షోభం, తాజాగా తలెత్తిన ఉక్రెయిన్- రష్యా యుద్ధాలే కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆయా దేశాల ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ భారత్‌పైనా పడనున్నది. ఇప్పటికే దేశంలో బెంగాల్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బీహార్ రాష్ట్రాలు లోటు బడ్జెట్‌తో కష్టాల్లో కూరుకుపోయాయి. సరైన చర్యలు తీసుకోకపోతే.. ప్రజలకు తీవ్ర కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెరిగిన ద్రవ్యోల్బణం, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వృద్ధి రేటు అంచనాను ప్రపంచ బ్యాంక్ 8 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాలో ప్రపంచ బ్యాంక్ కోత పెట్టడం ఇది రెండోసారి. జనవరిలో ప్రకటించిన అంచనా కన్నా ఇది 1.2 శాతం తక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మరింత క్షీణించి 7.1 శాతంగా నమోదవుతుందని కూడా అంచనా వేసింది. ప్రపంచం ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నట్టు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్దం ఇప్పట్లో ఆగేలా లేదనే సంకేతాలు కలరవపెడుతున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం పలు దేశాలు ప్రమాదంలో పడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్ని రకాల వస్తువులతో పాటు తినుబండారాలు, కూరగాయలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి సగటు మనిషికి బతుకు భారమవుతోంది. స్టాక్‌మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. చైనా, జపాన్, సౌదీ అరేబియా..వంటి కొన్ని దేశాలే ఇందుకు మినహాయింపు. మిగతా దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కొవిడ్ సమయంలో వ్యవస్థలోకి విడుదల చేసిన అధిక నగదును ఉపసంహరిస్తూ, వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణ సమస్య అంటే ధరలు అదుపు లేకుండా పెరిగిపోవడమే. ఖర్చులు భరించలేక అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అభివృద్ధి చెందిన 44 దేశాలను పరిశీలిస్తే అందులోని 37 దేశాల్లో ద్రవ్యోల్బణం గత రెండేళ్లలోనే రెట్టింపయ్యింది.
అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠ స్థాయులకు చేరి, కొన్ని నెలలుగా 8 శాతానికి పైనే నమోదవుతోంది. అమెరికా ప్రజలు గ్యాసోలిన్, నిత్యావసరాలకు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. గ్యాసోలిన్, డీజిల్‌పై ఫెడరల్ పన్నులను 3 నెలలు వాయిదా వేయాలని అధ్యక్షుడు బైడెన్ ఇటీవల కాంగ్రెస్‌కు పిలుపునిచ్చారు. అమెరికా కేంద్ర బ్యాంకు కీలక వడ్డీ రేట్లను పెంచడం మొదలు పెట్టి, ఉద్దీపన పథకాల్లో కోత అమలు చేస్తోంది. ఇందువల్ల ఏడాది-రెండేళ్లలో మాంద్యం చోటుచేసుకుంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు ఊడిపోవడం అమెరికన్లను వణికిస్తోంది.
యూకేలోనూ ద్రవ్యోల్బణం గత నెలలో 9.1 శాతానికి చేరుకుంది. ఇది 40 ఏళ్ల గరిష్ఠం. తినుబండారాలు, పెట్రోలు ధరలు అనూహ్యంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ ఏడాది అక్టోబరు నాటికి 11 శాతానికి చేరుకుంటుందని అంచనా. దీంతో బ్రిటన్ ప్రజల కష్టాలు ఇంకా పెరిగిపోతాయి. ఇప్పటికే అక్కడ అధిక ధరలకు తోడు నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉంది. ఇలాంటి పరిస్థితులే ఇతర ఐరోపా దేశాల్లోనూ కనిపిస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ.. తదితర దేశాల్లోనూ ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. రష్యాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ దేశంలో ఇది గత నెలలో 17.1 శాతంగా నమోదైంది.
మన పొరుగు దేశమైన శ్రీలంకలో అయితే ఏరోజుకారోజు పెట్రోలు, నిత్యావసరాల కోసం ప్రజలు వెతుక్కుంటున్నారు. అప్పు కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి వైపు చూస్తోంది శ్రీలంక ప్రభుత్వం. ఆ దేశానికి 51 బిలియన్ డాలర్ల విదేశీ అప్పు పేరుకుపోయింది. కరోనా పరిణామాలతో పర్యాటకుల రాక తగ్గడం, అంతర్జాతీయ పరిణామాలకు తోడు ఆ దేశ పాలకుల స్వయంకృతం మరికొంత కారణం. భారతదేశం ఇస్తున్న రుణంతో ఆ దేశం ఎంతో కష్టంగా రోజులు నెట్టుకొస్తోంది. ఇలాంటి పరిస్థితులే పాకిస్థాన్, నేపాల్‌లలోనూ కనిపిస్తున్నాయి. లెబనాన్, సూడాన్, వెనెజువెలా దేశాల్లో ద్రవ్యోల్బణం 200 శాతానికి మించింది. ఆ దేశాల్లో ఇప్పుడు కరెన్సీ విలువ నామమాత్రమే. ఆసియా- ఐరోపా ఖండాల మధ్య వారధిగా ఉండే టర్కీ.. నాటో సభ్య దేశం. అక్కడ నిర్మాణ రంగం, వాహన పరిశ్రమలు, పర్యాటక రంగం నుంచి వచ్చే ఆదాయాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గానే ఉండేవి. మే నెలలో ద్రవ్యోల్బణం 73.5 శాతానికి చేరి ఆ దేశమూ తల్లడిల్లిపోతోంది.
భారత్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం గరిష్ఠంగా 7.8 శాతానికి చేరినా, మేలో 7.04 శాతానికి దిగివచ్చింది. ఇప్పటికిప్పుడు 6 శాతం కంటే దిగువకు వచ్చే పరిస్థితి లేదు. ఆర్బీఐ ద్రవ్య పరపతి చర్యల మీదే ఆధారపడకుండా, ప్రభుత్వం కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తేనే ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా ఉంటుందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. అన్ని ధరలూ పెరిగి ప్రజలు సతమతమవుతున్నారు. డాలర్‌తో రూపాయి మారకపు విలువ క్షీణించడం ఆందోళనకర పరిణామం. జింబాబ్వే, టునీసియా, కెన్యా వంటి ఆఫ్రికా దేశాల్లో ప్రజల ఆందోళనను కట్టడి చేయడం ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారింది. అఫ్గానిస్థాన్, యెమెన్, హైతీ వంటి పేద దేశాల్లో తీవ్ర ఆహార కొరత కనిపిస్తోంది.
మనదేశం, అమెరికా, ఐరోపా దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. వ్యవస్థలో నగదు లభ్యతను తగ్గించే చర్యలపై దృష్టి సారించాయి. చమురు ధరల మంట 2-3 నెలల్లో చల్లారుతుందని అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఈ సంవత్సరాంతానికి ధరలు తగ్గి ద్రవ్యోల్బణం దిగిరావచ్చు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగియకుండా చమురు ధరలు బాగా తగ్గడం సాధ్యం కాదు. ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తలనొప్పిగానే ఉంటుందని, ప్రజల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపనుందని స్పష్టమవుతోంది.
అధిక ద్రవ్యోల్బణ సమస్య ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. దాదాపు రెండేళ్ల పాటు కొవిడ్ కేసుల విస్తృతిని తగ్గించేందుకు పలు దేశాలు లాక్‌డౌన్‌తో పాటు రాకపోకలపై ఆంక్షలు విధించాయి. దీని వల్ల వాణిజ్య కార్యకలాపాలు క్షీణించి, వస్తూత్పత్తి తగ్గింది. ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఉద్దీపన పథకాలను పెద్దఎత్తున అమలు చేశాయి. దీంతో వ్యవస్థలోకి నగదు సరఫరా పెరిగింది. కరోనా కష్టాల నుంచి ప్రపంచ దేశాలు గట్టెక్కుతున్న తరుణంలోనే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైంది. దీనివల్ల ముడి చమురు ధరల మంట తీవ్రమైంది. లోహాలు, గ్యాస్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి.
అధిక ద్రవ్యోల్బణంతో పెరిగిపోతున్న ధరలను తట్టుకోలేక పలు దేశాల్లో ప్రజలు రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత వారం, పది రోజుల్లో పాకిస్థాన్, బెల్జియం, బ్రిటన్, ఈక్వెడార్, అమెరికా దేశాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. పెరూలో ప్రజాందోళనను కట్టడి చేయడానికి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. మనదేశంలో ద్రవ్యోల్బణం 2-6 శాతం మధ్య ఉండాలి. 6 శాతానికి మించితే అభివృద్ధి మందగిస్తుందన్నది ఆర్థికవేత్తల విశ్లేషణ. కానీ గత ఏడాది కాలంలో ఆరు నెలల పాటు ఇది 6 శాతం కంటే పైనే నమోదైంది. వెనెజులా చమురు అధికంగా ఎగుమతి చేస్తూ ఎంతో సంపన్న దేశంగా ఉండేది. ఆ దేశ పాలకులు సంపద సృష్టిని విస్మరించి, ఉచితాలతో ప్రజలను ముంచెత్తి, ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిపోయేలా చేశారు. దీంతో ఆర్థికంగా ఆ దేశం దివాలా తీసిన చందాన తయారైంది.
44 అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల నుండి డేటా విశ్లేషణ చూస్తే, దాదాపు అన్నింటిలో, కోవిడ్ మహమ్మారి ముందు నుండీ వినియోగవస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని అర్థమవుతుంది. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజా నివేదిక ప్రకారం, మేలో వార్షిక ద్రవ్యోల్బణం రేటు సూపర్ పవర్ అనుకుంటున్న అమెరికాలో 8.6 శాతంగా ఉంది. ఇక ఇతర దేశాల పరిస్థితి ఊహించవచ్చు.
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక లావాదేవీలపై ప్రభావం చూపే సాధారణ విషయం. ప్రస్తుతం ద్రవ్యోల్బణంతో ప్రపంచ దేశాలు అల్లాడి పోతున్నాయి. 2001-2019లో సగటు వార్షిక ప్రపంచ ద్రవ్యోల్బణం 3.8 శాతంతో పోలిస్తే, 2022లో అది 7.9 శాతంగా ఉంది. 2023 నాటికి 5.0 శాతానికి చేరుకుంటుందని అంచనా. మొత్తంమీద, ఎక్కువ శక్తివనరులపై ఆధారపడే దేశాలు 2022లో అధిక ద్రవ్యోల్బణ ప్రభావాలను అనుభవిస్తాయి. 2021-22 ద్రవ్యోల్బణం అనేది 2021 మొదట్లో ప్రారంభమై ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో పెరిగింది. దీనికి ప్రధానంగా కోవిడ్ వల్ల ఏర్పడిన సరఫరా కొరత కారణం. మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో మంచి ఉద్యోగం, వేతనాల పెరుగుదల కారణంగా బలమైన వినియోగదారుల డిమాండ్ కూడా కారణమని భావిస్తున్నారు.
2022 వరకు సరఫరా గొలుసు అంతరాయాలు కొనసాగుతున్నందున ద్రవ్యోల్బణం వాస్తవానికి ఊహించిన దాని కంటే ఎక్కువ కాలం కొనసాగవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి జనవరిలో హెచ్చరించింది. ట్రేడింగ్ ఎకనామిక్స్ ప్రకారం అత్యధికంగా వెనిజులాలో1198 శాతం, సూడాన్ లో 340 శాతం, లెబనాన్ లో201 శాతం, సూరినామ్ లో63 శాతం, జింబాబ్వే లో 60 శాతం ఉంది. . అదే విధంగా రువాండా లో2.0 శాతం, చాద్ లో 0.5 శాతం, మాల్దీవుల్లో0.2 శాతం, గాబన్ లో0.6 శాతం, జపాన్ లో 0.6 శాతం అత్యల్ప ద్రవ్యోల్బణం నమోదైంది.
ద్రవ్యోల్బణ సూచికలను మూడు విధాలుగా వర్గీకరిస్తారు. వినియోగదారు ధరల సూచిక , టోకు ధరల సూచిక ఉత్పత్తిదారు ధర సూచిక. ఈ మూడూ ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా వస్తువుల సరఫరా మధ్య సమతౌల్యానికి సంబంధిం చినవి. నిజానికి మరీ ఎక్కువ, అతి తక్కువ ద్రవ్యోల్బణాలు… రెండూ ప్రతికూల పరిస్థితులకు దారితీస్తాయి. యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజర్వ్ ప్రకారం సంవత్సరానికి రెండు శాతం ద్రవ్యోల్బణం ఉత్తమంగా నిర్ణయించిన రేటు. అమెరికాలో వినియోగదారుల సూచిక ధరలు 2022 చివరి నాటికి 5 శాతం పైగా స్థిరమైన రేటుతో పెరుగు తున్నాయి. దీని వలన డిమాండ్ పరిమితం చేయడానికి ఫెడ్‌వడ్డీరేట్లను పెంచింది. 2023లో ద్రవ్యో ల్బణం కొనసాగి వృద్ధి మాంద్యం, నిరుద్యోగిత రేటు పెరగడానికి కారణమవుతుంది. 44 అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల నుండి డేటా విశ్లేషణ చూస్తే, దాదాపు అన్నింటిలో, మహమ్మారి ముందు నుండీ వినియోగ వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని అర్థమవు తుంది. ఈ 44 దేశాలలో 37 దేశాల్లో, ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం రేటు 2020 మొదటి త్రైమాసికంలో ఉన్నదాని కంటే కనీసం రెండింతలు ఉంది. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్ట స్థాయి అయిన 5.5 శాతానికి చేరుకుంది. మొత్తం మీద అభి వృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో దశాబ్దపు సగటు ద్రవ్యోల్బణం 10 శాతంగా ఉంది.
బ్రెజిల్, రష్యా, మెక్సికో వంటి ఇతర పెద్ద అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం కారణంగా వినియోగ వస్తువుల ధరలు త్వరగా పెరగడాన్ని చూస్తున్నారు. ఈ దేశాల్లో గత ఏడాది వార్షిక ద్రవ్యోల్బణం వరుసగా 10, 8.4, 7.4 శాతాలుగా నమోదయ్యాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రధానంగా డిమాండ్, వ్యయ ప్రేరణల ద్రవ్యోల్బణాలు కనిపిస్తాయి. బ్రెజిల్, రష్యా వంటి అనేక వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ప్రయత్నించాయి. ఈ చర్య రుణ ఖర్చులను పెంచడం ద్వారా విని యోగదారులపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా ఆహార ఖర్చులు ఎక్కువవుతాయి.
మన దేశంలో వినియోగదారుల ధరల సూచీ సీపీఐ ద్రవ్యో ల్బణం మార్చి 2022లో 7.0 శాతం నుండి ఏప్రిల్‌లో 7.8 శాతానికి పెరగగా, మే నాటికి 7.0 శాతంగా ఉంది. సెప్టెంబరు నాటికి భారతదేశంలో ద్రవ్యోల్బణం 8 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల ద్రవ్యోల్బణం అంచ నాను 202223 ఆర్థిక సంవత్సరానికి 5.3 నుండి 5.7 శాతానికి సవరించింది. అధికారిక సమాచారం ప్రకారం, భారతదేశంలో వార్షిక ద్రవ్యోల్బణం రేటు మార్చి 2022లో 6.95 శాతానికి పెరిగింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాల్ ముడి చమురు ధరల పెరుగుదల. ఇది కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర వస్తువుల ధరల పెరుగుదల ఫలితంగా కొన్ని నిత్యావసర వస్తువుల దిగుమతి ధరలు పెరిగాయి. అంతేకాకుండా, రష్యా ఉక్రె యిన్ యుద్ధం తరువాత, ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడింది. తన చమురు అవసరాలలో 85 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకునే భారత్‌లో ఉక్రెయిన్‌రష్యా యుద్ధం వల్ల ముడి చమురుతో పాటూ పామాయిల్, వంట గ్యాస్ ధరలూ పెరిగాయి.
ఇటీవల, ద్రవ్యోల్బణ నిరోధక చర్యల్లో భాగంగా 2018 తర్వాత మొదటిసారిగా, భారత రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. రెపో రేటు పెరుగుదల కారణంగా, బ్యాంక్ రుణం నెలవారీ వాయిదాలు పెరుగుతాయి. భారత్ వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. 202122లో రబీ, ఖరీఫ్ సీజన్‌లలో ఆహార పంటల ఉత్పత్తి బాగా ఉండటంతో, ఆహార ధాన్యాల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఇంకా, దిగుమతులపై ఒత్తిడిని తగ్గించ డానికి దేశీయ వంట నూనెల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది.
రైతుల ఆదాయాన్ని పెంచడం, దేశం వ్యవసాయ ఎగుమతులను పెంచడం ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి మంచి ఉపాయాలు. గతిశక్తి వంటి ప్రభుత్వ ప్రాజెక్టులు పెట్టుబడులను పెంచుతాయి. ముడి సరఫరాల భద్రతను నిర్ధారించడానికీ, ఒకే ప్రాంతం నుండి చమురు దిగుమతులపై ఆధారపడే ప్రమాదాన్ని తగ్గించడానికీ, భారత్… పశ్చిమ ఆసియా, ఆఫ్రికా; ఉత్తర, దక్షిణ అమెరికాల నుండి పెట్రోలియం దిగుమతులను విస్తరించడంపై దృష్టి సారిం చింది. ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా ద్రవ్యోల్బణం సాధారణం కాబట్టి, ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమీక్షలపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలి.