ఆరు నెలల వ్యవధిలో మూడు సార్లు పెరిగిన వడ్డీ రేట్లు.. మధ్యతరగతిపై మోయలేని భారం మోపాయి. ఏడాది తిరగకుండానే వడ్డీ రేట్లు ఒకటిన్నర శాతం పెరగడంతో.. ఈఎంఐలు భారం కానున్నాయి. రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ పై కూడా వడ్డీ రేట్లు ప్రభావం చూపుతున్నాయి.
హోమ్ లోన్లు తీసుకున్నవారిపై వడ్డీల మోత మోగుతోంది. విపరీతంగా పెరుగుతున్న వడ్డీ రేట్లు.. మధ్యతరగతికి గుదిబండగా మారుతున్నాయి. భవిష్యత్తులోనూ వడ్డీ రేట్లు పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.
కొన్ని నెలల వ్యవధిలోనే వడ్డీ రేట్లు మూడుసార్లు పెరిగాయి. జనవరిలో 6.5 శాతం ఉన్న వడ్డీ రేటు ఇప్పుడు ఏకంగా 8.5 శాతానికి పెరిగింది. దీంతో ఈఎంఐలకు రెక్కలొచ్చాయి. ఇప్పటివరకు నెలకు రూ.25 వేలు ఈఎంఐ కడుతున్నవాళ్లు.. ఇకపై రూ.28 వేలు కట్టాల్సిన పరిస్థితి. రూ.50 వేలు కడుతున్నవాళ్లు.. రూ.56 వేలు కట్టాల్సిన పరిస్థితి. నెలకు రూ. 3 వేల నుంచి రూ.6 వేల వరకు బడ్జెట్ పెరగడంతో.. మధ్యతరగతి కుటుంబాలు కుదేలౌతున్నాయి. ఓవైపు జీతాలు పెరగడం లేదు. మరోవైపు వడ్డీరేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. పైసా పైసా లెక్కచూసుకుని జాగ్రత్తగా ఖర్చుపెట్టేవాళ్లకు ఈఎంఐలు మోయలేని భారంగా మారుతున్నాయి. భవిష్యత్తులో కూడా వడ్డీరేట్లు పెరుగుతాయన్న సంకేతాలు.. సామాన్యుల్ని భయపెడుతున్నాయి.
మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ రెపో రేట్లు పెంచింది. రేట్ల పెంపు కొనసాగుతుందనే సంకేతాలను ఇచ్చింది. దీనిని బట్టి ఆర్‌బీఐ ఇంకా న్యూట్రల్ జోన్‌కి వచ్చినట్టు లేదు. పెరిగిన ఇన్‌ఫ్లేషన్‌ను తగ్గించేందుకు అన్ని స్ట్రాటజీలు ఫాలో అవుతామనే సంకే తాలను ఆర్‌బీఐ ఇస్తోంది. రెపో రేటు పెరగడంతో ఈ రేటుతో లింక్ అయి ఉన్న లోన్లను బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు పెంచడం స్టార్ట్ చేశాయి. హోమ్ లోన్లను కొత్తగా తీసుకున్న వారిపైన, ఇప్పటికే తీసుకున్నవారిపైన ఈఎంఐల భారం మరింత పడనుంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఇస్తున్న లాంగ్ టెర్మ్ లోన్లలో మెజార్టీ లోన్లను రెపో రేటుకు లింక్ అయి ఉన్నాయి. రెపో రేటు పెరగడంతో కనీస వడ్డీ రేటును కూడా బ్యాంకులు పెంచుతున్నాయి. దీంతో అన్నిరకాల లోన్ల వడ్డీ రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు తమ హోమ్ లోన్లపై వడ్డీని పెంచడం మొదలు పెట్టాయని, సమీప భవిష్యత్‌లో కూడా ఇది కొనసాగుతుందని నిపుణుల అంచనా.
కస్టమర్లకు ఇచ్చే అప్పులపై వడ్డీ రేట్లను రాబోయే రెండు క్వార్టర్లలో మరో 0.5 శాతం వడ్డీరేట్లు పెంచుతామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇందుకోసం ఇవి తమ కనీస వడ్డీ రేటును పెంచుతున్నాయి. దీనివల్ల కార్పొరేట్, రిటైల్ బారోవర్లు ఇక నుంచి అప్పులపై ఎక్కువ వడ్డీ రేటును చెల్లించాల్సి రావచ్చు. అన్ని రేట్లూ పెరుగుతున్నాయని, చవక వడ్డీ రేట్ల కాలం ముగిసినట్టేనని ఎనలిస్టులు అంటున్నారు. బ్యాంకులు కనీస వడ్డీ రేటు పెంచినప్పుడు, కొత్త బారోవర్లు తమ ఆటో, హోం, వెహికల్ లోన్ల కోసం మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాబోయే నెలల్లో వారి ఈఎంఐలు పెరుగుతాయి. ఆర్బీఐ రేట్ల పెంపు ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ రెండవ క్వార్టర్ నుండి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. లోన్ల రేట్లు ప్రస్తుత స్థాయుల నుంచి మరో 1.5 శాతం పెరగవచ్చని అంచనా.
ఈఎంఐలకు కట్టే అమౌంట్ పెరిగితే బారోవర్లు మిగతా ఖర్చులు తగ్గించుకుంటారు. దీనివల్ల వినియోగం, డిమాండ్ చాలా తగ్గుతుంది. బ్యాంకుల కిస్తీలు ఆలస్యమైతే బకాయిలు పెరిగే ప్రమాదమూ ఉంటుంది. దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ , మూడేళ్లలో మొదటిసారిగా ఈ నెలలో అన్ని టెన్యూర్ల లోన్లపై కనీస వడ్డీ రేటును 15 నుండి 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా ఇటీవల తమ కనీస వడ్డీ రేటును పెంచాయి. స్టేట్‌బ్యాంక్‌లో ఒక సంవత్సరం కనీస వడ్డీ రేటు 7.1 శాతం కాగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లలో ఇది 7.25 శాతం ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక సంవత్సరం కనీస వడ్డీ రేటు 7.35 శాతంగా ఉండగా, యాక్సిస్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కనీస వడ్డీ రేటు7.40 శాతం ఉంది.
6.5-7 శాతం మధ్య ఉన్న గృహ రుణ రేట్లు 8-8.5 శాతానికి చేరాయి. దేశంలోని కమర్షియల్ బ్యాంకులన్నీ నిధుల కోసం ఆర్‌బీఐ పైనే ఆధారపడుతాయి. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే వార్షిక వడ్డీ రేటునే రెపో రేటు అంటారు. రెపో రేటు పెరిగిందంటే ఆర్‌బీఐ నుంచి తీసుకునే రుణాలకు బ్యాంకులు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కస్టమర్స్‌కి ఇచ్చే రుణాలపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత ఇతరత్రా రుణాలపై వడ్డీ భారం పెరుగుతుంది. హోమ్ లోన్లు ఆర్‌బీఐ రెపో రేట్‌కు లింక్ అయి ఉంటాయి కాబట్టి హోమ్ లోన్ భారం కానుంది. ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ సెక్టార్ పైన ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేవారిలో రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేట్ ఎంచుకుంటూ ఉంటారు. రెపో రేట్ తగ్గితే ఈ వడ్డీ తగ్గుతుంది. రెపో రేట్ పెరిగితే ఈ వడ్డీ పెరుగుతుంది.
రుణ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు పలు రకాల ప్రోత్సాహకాలతో రుణాలు ఇచ్చేందుకు పోటీ పడ్డ బ్యాంకులు, ఇప్పుడు ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. గృహ, వ్యక్తిగత రుణ దరఖాస్తులను మరింత నిశితంగా పరిశీలిస్తున్నాయి. గతంలో తీసుకున్న రుణాలను చెల్లించిన తీరును తెలియజేసే క్రెడిట్ స్కోరును ప్రాతిపదికగా చూస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులకు గృహ రుణాల మంజూరులోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
వడ్డీ రేట్ల పెంపు ప్రభావం హోమ్ లోన్లపై పడుతుందనే ఆందోళన వ్యక్తమౌతోంది. ఇళ్లు కొనాలనుకునేవాళ్లు ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. సొంతింటి కలను ఇంకొంతాకలం వాయిదా వేసుకుంటారని భావిస్తున్నారు.
.
ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడానికి వడ్డీ రేట్లు పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం.. గృహ రుణాలపై ఎక్కువగా పడుతోంది. వాహన, వ్యక్తిగత రుణాలతో పోలిస్తే.. గృహ రుణాలే ఎక్కువ కాలవ్యవధికి ఉంటాయి. ఇప్పుడు ఆ రుణాలు తీసుకున్నవాళ్లందరికీ భారం పెరిగింది. హోమ్ లోన్ EMI ఇప్పుడు మరోసారి పెరగనుంది. పెరిగిన ఈఎంఐలకు అనుగుణంగా మనీ అడ్జస్ట్ మెంట్ కు ఆర్నెళ్ల నుంచి ఏడాది సమయం పడుతుందని మధ్యతరగతి జీవులు వాపోతున్నారు.
ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న తర్వాత హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి బ్యాంకులకు ఇచ్చే రుణాలు ఖరీదైనవి మారిపోయాయి. ఇటీవలి కాలంలో బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి గృహ రుణం తీసుకోవడం ద్వారా తమ ఇంటిని కొనుగోలు చేసిన వారు ఖరీదైన రుణాల అతిపెద్ద భారాన్ని భరించవలసి ఉంటుంది.
మీరు ఇప్పటికే రూ.20 లక్షల హౌసింగ్ లోన్ తీసుకున్నట్లైతే.. మీరు రూ. 15,326 EMI చెల్లించాల్సి ఉంటుంది. కానీ వడ్డీ రేట్ల పెంపుతో.. మీరు రూ. 17,041 EMI చెల్లించాల్సి ఉంటుంది. అంటే మూడు నెలల్లో రూ. 1715 అధికంగా వస్తుంది. ఏడాది మొత్తంలో మీ జేబుపై రూ.20,580 అదనపు భారం పడుతుంది.
రూ. 40 లక్షల గృహ రుణం మీరు 6.95 శాతం వడ్డీ రేటుతో 15 ఏళ్లపాటు రూ. 40 లక్షల గృహ రుణం తీసుకున్నట్లయితే.. మీరు ప్రస్తుతం రూ. 35,841 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. కానీ వడ్డీ రేటు పెరిగిన తర్వాత మీరు రూ. 38,806 EMI చెల్లించాలి. అంటే ప్రతి నెలా రూ.2965 అదనంగా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరం మొత్తం కలిపితే.. మరో 35,580 EMI చెల్లించాల్సి వస్తుంది.
మీరు 7.25 శాతం వడ్డీతో 20 సంవత్సరాలకు రూ. 50 లక్షల హోం లోన్ తీసుకున్నట్లయితే.. మీరు ప్రస్తుతం రూ. 39,519 EMI చెల్లిస్తున్నారు. కానీ పెరిగిన వడ్డీ రేటు తర్వాత మీరు రూ. 43,867 EMI చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రతి నెలా రూ.4348 అదనంగా EMI చెల్లించాల్సి ఉంటుంది. ఒక సంవత్సరంలో మీ జేబుపై రూ.52,176 అదనపు భారం పడుతుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తర్వాత చాలా బ్యాంకులు తమ రుణాలు, డిపాజిట్ రేట్లను పెంచాయి. గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. రుణగ్రహీతలు తమ లోన్‌లపై అధిక వడ్డీరేట్లను చెల్లించాల్సి ఉంటుంది. అంటే అధిక ఈఎంఐ, గడువు తేదీ వచ్చిన తర్వాత లోన్ గడువును మరింతగా పెంచుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది ఇంటిని సొంతం చేసుకోవడం అనేది జీవిత కాలపు అతిపెద్ద ఆర్ధిక లక్ష్యాలలో ఒకటిగా భావిస్తారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కన్నా కూడా ఇంటికే ఎక్కువ ఖర్చవుతుంది. ఇల్లు కొనడం చౌక కాదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని సమయాల్లో ఇంటిని సొంతం చేసుకునే ఖర్చు మీ ప్రస్తుత వార్షిక ఆదాయానికి 10-15 రెట్లు కంటే కూడా ఎక్కువగా ఉండవచ్చు. ప్రత్యేకించి స్తిరాస్థి ధరలు ఎక్కువగా ఉన్న నగరంలో ఆస్తిని కొనాలని ఆలోచన చేస్తే చాలామంది 30 సంవత్సరాల వరకు వడ్డీతో తిరిగి చెల్లించే విధంగా ఇంటి కొనుగోలుకు గృహ రుణం తీసుకుంటారు.
ఇప్పటికే రుణం తీసుకున్న వారికీ వడ్డీ రేటు పెరిగినా, నెలవారీ చెల్లించాల్సిన వాయిదాలో మార్పు ఉండదు. రుణం చెల్లించాల్సిన వ్యవధి పెరుగుతుంది. గృహరుణం దీర్ఘకాలం అమలవుతుంది కనుక పలు దశల్లో వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం లాంటివి వ్యవధిపై ప్రభావం చూపుతుంటాయి. కొత్తగా ఇంటి రుణం తీసుకోవాలనుకునే వారికి, వడ్డీ రేట్లు పెరగడంతో రుణ అర్హత మొత్తం తగ్గిపోతోంది. కొత్త ఇల్లు కొనుగోలుకు రూ.30లక్షల రుణాన్ని 25 ఏళ్ల వ్యవధికి 6.5 శాతం వడ్డీతో తీసుకున్నప్పుడు ఈఎమ్‌ఐ రూ.20,256 అవుతుంది. రుణరేటు ఇప్పటి వరకు 1.40 శాతం పెరిగితే, ఈఎమ్‌ఐ రూ.22,956 అవుతుంది. అంటే ప్రతి రూ.లక్ష లోన్‌కు అదనంగా నెలకు రూ.90 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు వ్యక్తుల ఆదాయం, వయసు ఆధారంగా రుణ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. వడ్డీ రేటు పెరిగినప్పుడు ఆ మేరకు రుణ అర్హత తగ్గుతుంది. రూ.20,256 వాయిదా చెల్లించే వారికి రుణం రూ.30 లక్షలకు బదులు, రూ.26,50,000 మాత్రమే మంజూరవుతుంది.
ఒకవేళ ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే.. వడ్డీరేట్ల పెంపు విషయంలో భవిష్యత్తులో ఆర్‌బీఐ మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పడు బ్యాంకుల రుణరేట్లు ఇంకా అధికమవుతాయి. ఇదే జరిగితే రుణ అర్హత మరింత తగ్గుతుంది.