Telangana Congress :తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు ఆగటం లేదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత… పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఓ దశలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది. అద్దంకి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. ఈ క్రమంలో స్వయంగా రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు. మరో సీనియర్ మర్రి శశిధర్ రెడ్డి నేత రేవంత్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగానే… మరో నేత… ఠాగూర్ కు లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ముసలం కొనసాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ ఎటుపోతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎదురుగా మునుగోడు టార్గెట్ కనిపిస్తున్నా.. నేతలు మారడం లేదు. ఎప్పటిలాగే ఇగో క్లాషెస్ పెట్టుకుంటున్నారు. మొన్నటివరకు రేవంత్ ను టార్గెట్ చేసిన సీనియర్లు.. ఇప్పుడు ఠాగూర్ రేవంత్ ఏజెంట్ అంటున్నారు. గతంలో సైలంట్ గా ఉన్నవాళ్లు కూడా ఇప్పుడు గళమెత్తడం కలకలం రేపుతోంది. బీజేపీలోకి వెళ్లేవాళ్లే తనను విమర్శిస్తున్నారని ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. వీటికి తోడు వెలమల్ని కొట్టాలంటే రెడ్లతోనే అవుతుందని రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని రెడ్డి సామాజికవర్గమే తప్పు పడుతోంది. కేవలం రెడ్లు ఓటేస్తే కాంగ్రెస్ గెలవదని, అన్ని వర్గాల అండ కావాలని గుర్తుంచుకోవాలని హితవు పలుకుతోంది. ఓవైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ సీరియస్ గా మునుగోడుపై దృష్టి పెడుతుంటే.. కాంగ్రెస్ మాత్రం ఇంకా ఇల్లు చక్కదిద్దుకునే పనిలోనే ఉంది. అందరూ ఐక్యంగా పనిచేసి మునుగోడులో గెలవాలని మీటింగులు పెట్టుకోవడమే కానీ.. వాస్తవానికి హస్తం నేతలు టీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. సీనియర్లు, క్యాడర్ అనే తేడా లేదు. ఎవరికి ఛాన్స్ వస్తే వాళ్లు చల్లగా జారుకుంటున్నారు.
కాంగ్రెస్ విషయంలో ఇలాంటి చాలానే కనిపిస్తుంటాయి.అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ లో ఇప్పుడు నేతల పరిస్థితి కూడా అలాగే ఉంది.పార్టీ అధినాయకత్వం ఢిల్లీ నుంచే ఆదేశాలు ఇస్తుండటంతో స్టేట్ లో నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎవరికి వారే పదవులు కావాలి.ఎవరికి వారే అధికారం. పెత్తనం కావాలి.అది జరగకపోతే సొంత పార్టీ నాయకులే రోడ్డెక్కుతారు.తమకు దక్కాల్సిన పదవులు ఎవరో కొట్టుకు పోయారని గగ్గోలు పెడతారు.
రాష్ట్ర విభజన తర్వాత నేతల్లో సమన్వయం లేకపోవడంతో నిత్యం అంతర్గత కుమ్ములాటలు బయటపడుతుండటంతో ప్రజల్లో కూడా చులకనవుతున్నారు కాంగ్రెస్ నేతలు.
రేవంత్ పీసీసీ చీఫ్ అయిన దగ్గర్నుంచీ సీనియర్లు అసంతృప్తిగానే ఉన్నారు. తమకు దక్కాల్సిన చీఫ్ పదవిని ఆయన ఎత్తుకుపోయారని రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు చాన్స్ దొరికితే రేవంత్ కి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ఇటీవల ప్రియాంక గాంధీ పేరు స్క్రీన్ మీదకు రావడంతో.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ నడుస్తోంది. ప్రియాంక తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు నిర్వహిస్తే.. లాభ నష్టాలు ఎలా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రియాంక కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారా.. రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధం అవుతారా అనే చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న కీలక ఆయుధాల్లో ప్రియాంక గాంధీ ఒకరు. అందుకే ఆమెను ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రంగంలోకి దింపారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రియాంక ఫలితాలను రాబట్టలేదు. 400లకు పైగా అసెంబ్లీ స్థానాలున్న యూపీలో.. కేవలం రెండుచోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థులు గెలిచారు. ప్రియాంక అన్నీ తానై వ్యవహరించినా.. ఫలితం మాత్రం ఎవరూ ఊహించని విధంగా వచ్చింది. ఒకానొక దశలో ప్రియాంకనే సీఎం క్యాండెట్ అనే చర్చ కూడా జరిగింది. అయినా.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంక ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత కొన్నిసార్లు ప్రియాంక గాంధీ కనిపించినా.. ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ తరుణంలో ప్రియాంకకు తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపని ప్రియాంక ఈ రెండు రాష్ట్రాల్లో రాణిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. అందుకే ప్రియాంక గాంధీ ఈ రాష్ట్రాల్లోకి రంగంలోకి దిగితే.. ప్రభావం ఎంత అనే చర్చ నడుస్తోంది. కర్ణాటక విషయం ఎలా ఉన్నా.. తెలంగాణలో ప్రియాంక పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ప్రియాంక గాంధీ నేరుగా రంగంలోకి దిగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పటికీ అనేక గ్రామాల్లో ఇందిరమ్మ పాలన అనే పదం చాలా ఫేమస్. ప్రియాంక కూడా దాదాపు ఇందిరాగాంధీ లాగానే ఉంటారు. దీంతో సాంప్రదాయ కాంగ్రెస్ ఓటు వేరేవైపు వెళ్లకుండా ఉపయోగపడతారు అనే చర్చ నడుస్తోంది. అంతే కాకుండా.. ఇప్పుడు, గతంలో పార్టీ ఇంఛార్జులుగా ఉన్నవారితో సమస్యలు తగ్గకపోగా.. ఎక్కువయ్యాయి. దీంతో నేరుగా ప్రియాంకనే రంగంలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రియాంక ఎంట్రీపై పాజిటివ్ కామెంట్స్ ఇలా ఉంటే.. నెగెటివ్ కామెంట్స్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో చాలాసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రియాంక ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈ ఇష్యూ తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధంగా మారే అవకాశం ఉంది. యూపీలో పోటీ ఇవ్వలేని ప్రియాంక.. తెలంగాణ తమకు పోటీ ఇస్తుందా.. అని ఇప్పటికే ఇతర పార్టీల నేతలు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రియాంక వస్తే.. లాభం జరుగుతుందా.. నష్టం జరుగుతుందా అని నేతలు లెక్కలేసుకుంటున్నారు. అసలు ప్రియాంక వస్తారనేది ఒట్టి పుకారేననే మాట కూడా వినిపిస్తోంది.
తెలంగాణలో నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలున్న బీజేపీ హడావుడి చేస్తోంది. గ్రౌండ్ లో పట్టు కోసం ప్రతి రోజూ ప్రయత్నిస్తోంది. అధికార టీఆర్ఎస్ దూకుడు మీద ఉంది. తెలంగాణలో త్రిముఖ పోటీ నెలకొన్న తరుణంలో.. కాంగ్రెస్ కూడా రేసులో నిలవాలంటే.. ప్రజాక్షేత్రంలో కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ నేతలు మీటింగులు, సిట్టింగులతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికీ అంతర్గత పోరు నడుస్తూనే ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం.. కాంగ్రెస్ వ్యవహారశైలికి అద్దం పడుతోంది. ఏ విషయాన్నైనా తెగేదేకా లాగటం, సమస్య పెద్దదయ్యే వరకు వేచి చూసే ధోరణి పార్టీ పుట్టి ముంచుతున్నాయి. ఇలాగే ఉంటే మరో పాతికేళ్లైనా అధికారం గురించి ఆలోచించాల్సిన పనిలేదని క్యాడర్ నిట్టూరుస్తోంది.
తెలంగాణ రాజకీయాలు మునుగోడుపై కేంద్రీకృతమైన వేళ.. కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మునుగోడు చరిత్రను కొందరు తవ్వి పోస్తుంటే.. ఇంకొందరు అక్కడ పార్టీల బలాబలాలు.. పూర్వం జరిగిన సంఘటలను కొత్తగా చర్చల్లోకి తీసుకొస్తున్నారు. అలా కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు వచ్చిన అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
మునుగోడు కాంగ్రెస్‌కి ఎప్పుడూ వివాదాలే తెచ్చిపెడుతుందనేది కొందరి వాదన. ఇప్పటి వరకు జరిగిన పరిణామలను అందుకు ఉదహరణగా చెబుతున్నారు కూడా. ఉమ్మడి రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా కాంగ్రెస్‌కి కంచుకోట. 1967 నుండి ఇక్కడ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం వహించేవారు. ఆయన కాలం చేసే వరకు పాల్వాయి అడ్డా ఇదే. పైగా జిల్లాలో ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, పాల్వాయి లాంటి ఉద్దండుల గ్రూపు రాజకీయాలు వాడీవేడీగా ఉండేవి. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. పాల్వాయి కూడా అప్పటి గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే వారు. పార్టీలో ఏం జరిగినా.. బయటకొచ్చి బహిరంగంగా మాట్లాడేసే వారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు కూడా ఇక్కడి నుండే వచ్చేవి. దీనికితోడు తెలంగాణ సెంటుమెంట్ పై పాల్వాయి ఒకింత దూకుడుతోనే ఉండేవారు.
మునుగోడులో అప్పట్లో పాల్వాయి గోవర్దన్ రెడ్డి.. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి. ఇద్దరి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయనేది పార్టీ నేతలు చెప్పేమాట. 2018 ఎన్నికల్లో మునుగోడు నుండి గెలిచిన రాజగోపాల్ రెడ్డి.. అసెంబ్లీలో అడుగుపెట్టిన కొద్దిరోజులకే కాంగ్రెస్‌కు తలనొప్పిలా మారారు. కాంగ్రెస్ అధిష్ఠానం.. రాహుల్ గాంధీల మీద విమర్శలు చేశారు. కేంద్రంలో పార్టీ బలహీన పడిందని.. తెలంగాణలో trsతో కొట్లాడే బలం బీజేపీకే ఉందని.. రాష్ట్రంలో బీజేపీ బలపడిందని చాలా వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్‌రెడ్డి. అప్పటి నుండి కాంగ్రెస్‌లో వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారడం ఒక ఎత్తు అయితే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ద్వారా కాంగ్రెస్‌ను మరింత ఇరకాటంలో పెట్టేశారు.
మునుగోడులో కాంగ్రెస్‌కు ప్రస్తుతం చాలా సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఎమ్మెల్యే కాగానే రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో పాల్వాయి టీమ్ లేకుండా చేశారు. అంతేకాదు. పాల్వాయి కుమార్తె స్రవంతిని సైతం రాజకీయంగా ఇబ్బంది పెట్టారనే వాదన ఉంది. అందుకే అప్పట్లో పాల్వాయి.. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి అని కాంగ్రెస్ రాజకీయాలు తెలిసిన వాళ్లు పొలికలు బయటకు తీస్తున్నారట. అధిష్ఠానంపై మాట్లాడే విషయంలో కానీ.. పార్టీని తప్పుపట్టే అంశంలో కానీ.. ఒకే విధంగా వీళ్ల వైఖరి ఉందని గుర్తు చేసుకుంటున్నారట. మునుగోడులో కాంగ్రెస్‌కు రాజకీయం సానుకూలంగా ఉన్నప్పటికీ.. హస్తం గుర్తుపై గెలిచిన నాయకుల తీరు వల్లే రచ్చ రచ్చ అవుతోందని అభిప్రాయపడేవాళ్లూ ఉన్నారు.
మరికొద్ది నెలల్లో మునుగోడు ఉప ఎన్నికల, ఆ తరువాత రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఏ రకంగా ఎదుర్కోవాలనే దానిపై కాంగ్రెస్ నాయకత్వం తర్జనభర్జన పడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. అయితే నేతల మధ్య ఐక్యత తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం సరికొత్త ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్ నేతలతో బస్సు యాత్ర నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పలువురు నేతలతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. కాంగ్రెస్ నేతలు ఐక్యంగా ముందుకు సాగితే.. విపక్షాలను ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. కానీ అంతా కలిసి బస్సుయాత్ర చేస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
సీనియర్లను ఏకతాటిపైకి తీసుకురావడం పార్టీ నాయకత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. పార్టీలోని ఎక్కువమంది సీనియర్లు రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి కొందరు నేతలు ఆయనతో పని చేసేది లేదని తెగేసి చెబుతుంటే.. మరికొందరు నాయకులు మాత్రం ఆయన తమను పట్టించుకోకుండా సొంత అజెండాతో ముందుకు సాగిపోతున్నారని కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కలిసి ముందుకు సాగేలా చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నేతలతో ఓ బస్సు యాత్ర చేయించాలని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఆందోళనతో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్.. ఇక్కడ పరిస్థితిని చక్కబెట్టడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ముందుగా నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించడం, వారంతా కలిసి పని చేసేలా చేయడం వంటి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. సీనియర్ నేతల్లో ఎక్కువమంది బస్సు యాత్రకు అంగీకరిస్తే.. మిగతా నేతలు కూడా ఇందుకు అంగీకరిస్తారని.. అప్పుడు నేతల మధ్య ఉన్న విభేదాలు తొలిగిపోయేందుకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఈ రకమైన ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయని.. కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా మనోధైర్యం పెరుగుతుందని ఆ పార్టీ భావిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పేరుకే ప్రధాన ప్రతిపక్షం. కానీ ఆ హోదాకి తగ్గట్టుగా ప్రజాపోరాటాలు చేయడం లేదనే విమర్శ ఉంది. ముగ్గురు ఎమ్మెల్యేలున్న బీజేపీ దూకుడు చూపిస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎప్పటికప్పుడు తేలిపోతోంది. తెలంగాణ వచ్చి ఎనిమిదేళ్లైంది. ఈ ఎనిమిదేళ్లలో కాంగ్రెస్ రాజకీయంగా చాలా అవకాశాలొచ్చాయి. కానీ అన్నింటినీ చేజేతులా జారవిడుచుకుంది. కొన్ని అధిష్ఠానం కారణంగా మిస్సైతే.. మరికొన్ని రాష్ట్ర నేతల స్వయంకృతాపరాధాల వల్లే అందకుండా పోయాయి.
టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమౌతోంది. పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన నేతలు కూడా ఇప్పుడు గాంధీ భవన్ ముఖం చూడకపోవడం మైనస్ గా మారుతోంది. కొందరు మాజీ మంత్రులు కూడా తమ నియోజకవర్గాలకే పరిమితమౌతున్నారు. ఒకప్పుడు జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపిన నేతలు.. ఇప్పుడు అంత చురుగ్గా లేకపోవడం పార్టీ వర్గాలకు అంతుబట్టని రహస్యం
తెలంగాణ కాంగ్రెస్ కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుడ్ బై చెప్పారు. భువనగిరి ఎంపీగా ఉన్న ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌ని వీడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతకు ముందు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి దాదాపు రాజీనామా చేసేదాకా వెళ్లారు. ఐతే, సీనియర్ల బుజ్జగింపుతో ప్రస్తుతం ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇలా ఒకరి తరువాత ఒకరు పార్టీ వీడే పరిస్థితి ఎందుకు వచ్చింది?
నిజానికి తెలంగాణాలో కాంగ్రెస్ సంస్థాగతంగా బలమైన పార్టీ. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఇప్పటికీ ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఇప్పటికీ అధికారంలో రాగల సత్తా ఉన్న కాంగ్రెస్‌ను ఎందుకు వీడుతున్నారనేది ప్రశ్న. పోనీ, కాంగ్రెస్‌ను వీడి అధికార టీఆర్‌ఎస్ లోకి వెళితే స్వప్రయోజనాల కోసం అనుకోవచ్చు. కానీ క్షేత్ర స్థాయిలో నామ మాత్రంగా ఉన్న బీజేపీలోకి ఎందుకు ఎంచుకుంటున్నారు? అంటూ పార్టీ బలంతో కాకుండా తమ స్వంత బలంతో గెలుస్తామనే ధీమా కావచ్చు. అలా ఎంతమంది సొంత బలంతో ఎమ్మెల్యేలుగా గెలుస్తారో తెలియదు. వాస్తవానికి తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్‌ఎస్ జనంలోకి ఎలా దూసుకు వెళ్లిందో.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను అంతే బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. దీనికి తోడు గత ఎన్నికల్లో చేసిన వ్యూహాత్మక తప్పిదాలు ఆ పార్టీ విజయావకాశాలను ఘోరంగా దెబ్బతీశాయి. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో ఫిరాయింపులు పోగా మిగిలింది ఆరుగురు.
కాంగ్రెస్ విషయానికొస్తే.. మొదటి నుంచి ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటలు..అసమ్మతి..అంతర్యుద్ధానికి పెట్టింది పేరు. సీనియర్లను కాదని టీడీపీ నుంచి వచ్చిన జూనియర్ రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి కట్టబెట్టినప్పటి నుంచి ఇంటిపోరు ఓ రేంజ్‌లో సాగుతోంది. సీనియర్లు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం కూడా మునపటిలా బలంగా లేకపోవటంతో ఒకరు చెబితే వినే పరిస్థితిలో ప్రస్తుతం ఆ పార్టీ నేతలు లేరు. దాంతో నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునే పరిస్థితిలో ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీ ఈ దుస్థితిలో ఉండటానికి ఇంటిపోరే ప్రధాన కారణం. ఇప్పుడిప్పుడే తెలంగాణలో పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా వలసలు వెళ్తుంటే.. ఏం చేయాలో కాంగ్రెస్ సీనియర్ నేతలకు సైతం పాలుపోవడం లేదు. ఇదిలానే కొనసాగితే.. తెలంగాణలో త్రిముఖపోరు కాస్త.. ద్విముఖ పోరుగా మారే అవకాశం ఉంది. గతంలో.. కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లోకి చేరిన నేతలు సైతం.. ఇప్పడు టీఆర్‌ఎస్ ని వీడుతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ.. చివరికి అందరూ బీజేపీలోకి చేరితే 2024 ఎన్నికల్లో ప్రధాన పోరు టీఆర్‌ఎస్-బీజేపీ మధ్యేననేది స్పష్టమవుతుంది.
తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ సమస్యలున్నాయి. ఎక్కడికక్కడ ప్రజల్ని కూడదీసుకుని పోరాటాలు చేస్తే.. కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో ఆదరణ పెరిగే అవకాశం ఉంది. కానీ నేతలు మాత్రం ఆ పని చేయడం లేదు. ఉన్న కాస్త ఆదరణ కూడా పోగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. ఈసారి అధికారం మాదే. కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ ఉంది లాంటి పడికట్టు ప్రకటనలే కానీ.. అసలు పార్టీ వ్యూహమేంటి అంటే ఎవరూ ఏమీ చెప్పలేని స్థితి. గాంధీభవన్లోనే ఇంత అయోమయం ఉంటే.. ఇక క్షేత్రస్థాయిలో కార్యకర్తల గురించి చెప్పాల్సిన పనిలేదు. వాళ్లను నేతలు ఎప్పుడో వదిలేశారు. ఎప్పటికప్పుడు క్యాడర్ ను యాక్టివ్ గా ఉంచేలా వరుస కార్యక్రమాలు ఉండాలని తెలిసినా.. ఆ ఊసే లేదు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు రెండు, మూడు సభలు పెట్టి హడావుడి చేయడం.. మళ్లీ నెలల తరబడి సైలంట్ కావడం రివాజుగా మారింది. ఈ పద్ధతి మారనంతవరకూ కాంగ్రెస్ ను ప్రజలు సీరియస్ గా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు.
యుద్ధం గెలవాలంటే పోరాటం కంటే ముందు వ్యూహమే ప్రధనం. కానీ గత రెండు ఎన్నికల్లోనూ ఈ వ్యూహమే వికటించి కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఇప్పుడైతే అసలు వ్యూహమేంటో కూడా అర్థం కావడం లేదంటున్నారు కార్యకర్తలు. ఉపఎన్నికల సమయంలో కూడా ప్రతిచోటా ఒకే ఎనర్జీతో పోరాటం చేయలేదు. కొన్నిచోట్ల సీరియస్ గా తీసుకుంటే.. మరికొన్నిచోట్ల ముందే కాడి కింద పడేశారు. ఎన్నికల్లో గెలుపోటముల సంగతి పక్కనపెడితే.. పోరాటంలో సీరియస్ నెస్ లేకపోతే మాత్రం దెబ్బతింటామని క్యాడర్ నుంచి హెచ్చరికలు వస్తున్నా.. నేతలు పట్టించుకోవడం లేదు. పార్టీ బాగుంటేనే తమకు గౌరవం ఉంటుందనే సంగతి వదిలేసి.. ఇగోల కోసం పార్టీని బలిపెట్టడానికి సిద్ధమౌతున్నారు.
తెలంగాణలో చాలా నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇంఛార్జులు లేరు. కొన్నిచోట్ల అనధికారిక ఇంఛార్జులున్నా.. వాళ్లు యాక్టివ్ గా ఉండటం లేదు. కొంతమంది నేతలైతే పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. గాంధీభవన్ నుంచి పిలుపొచ్చినా అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. వీళ్లలో ఎంతమంది పార్టీలో కొనసాగుతారో.. ఎంతమంది పక్కచూపులు చూస్తారో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అక్కడి నేతలు వెళ్లిపోవడం ఖాయమని కార్యకర్తలే చెబుతున్న పరిస్థితి ఉంది. అయినా సరే అలాంటి నేతల్నే పట్టుకుని వేలాడుతున్నారనే విమర్శలున్నాయి. ఎవరి మీదా ఎవరికీ నమ్మకం లేదు. ఎవరూ ఎవరి మాటా వినేవాళ్లు లేరు. ఎవరికి వారే యమునా తీరే.. ఇదీ తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి.