ఏపీలో పేకాటరాయుళ్లు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం సాగుతోంది. వీరికి పోలీసుల మద్దతు తోడవుతోంది. ఇంకేముంది.. మూడు ముక్కలు.. ఆరు ఆటలు అన్నట్టుగా సాగుతోంది యవ్వారం. ఓవైపు తెలంగాణలో పేకాట క్లబ్బుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తే.. ఏపీలో మాత్రం పేకాటను పెంచి పోషించి.. త్వరలో రిక్రియేషన్ క్లబ్బుల స్థాయికి తీసుకెళ్లే యజ్ఞం శ్రద్ధగా సాగుతోంది. పైగా కొందరు నేతలు మా ప్రాంతంలో పేకాట కామన్ అంటూ కామెంట్లు చేయడం.. చతుర్ముఖ పారాయణానికి మరింత కిక్ ఇస్తోంది.
ఏపీలో పేకాట ఫుల్ స్వింగ్ లో సాగుతోంది. ఒకప్పుడు చాటుమాటుగా పేకాట ఆడిన వారు కూడా ఇప్పుడు యథేచ్ఛగా బహిరంగంగానే పేకాట ఆడుతున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో పేకాట జోరు మీదుంది. చివరకు భీమవరంలో పేకాట విషయంలో డీఎస్పీ తీరుపై స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా డిప్యూటీ స్పీకర్ స్థాయి వ్యక్తి.. గోదావరి జిల్లాల్లో పేకాట కామన్ అని సమర్థించుకోవడం విడ్డూరంగా ఉంది.
పేరుకి పేకాట మీద నిషేధం ఉంటుంది. కానీ చాటుమాటుగా వ్యవహారం సాగుతూనే ఉంటుంది. ఇదో సంప్రదాయమని, ఆటవిడుపని.. రకరకాల సమర్థనలు ఉన్నాయి. అదే సమయంలో ఇదో దుర్వ్యసమనే విమర్శలకూ లోటు లేదు. అందుకే ఎప్పటికప్పుడు పేకాట విషయంలో ఎలా వ్యవహరించాలనేది పెద్ద ప్రశ్నగా ఉంటూ వస్తోంది. ప్రభుత్వాలు, నేతల అభిప్రాయాల్ని బట్టి.. పోలీసులు స్పందిస్తుంటారు. ఒక్కసారి పేకాట ఆడే ప్రాంతంలో ఉన్న పోలీస్ అధికారి వ్యవహారశైలిని బట్టి కూడా పేకాటరాయుళ్లపై చర్యలుంటాయి. లేదంటే లేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే పేకాటను మరీ లైట్ తీస్కుంటే.. వేయితలలతో విస్తరించే ప్రమాదం ఉంది. అలాగని మరీ సీరియస్ గా తీసుకుంటే.. ఇదేం మర్డరా, రేపా అని కొందరు నేతలు నీలుగుతారు. దీంతో పోలీసులకు పేకాట విషయంలో ఏం చేయాలా అనే మీమాంస ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంది. ఈ అయోమయాన్ని ఉపయోగించుకునే పేకాటరాయుళ్లు ఎప్పటికప్పుడు రెచ్చిపోతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఏపీలో పేకాట విషయంలో కన్ఫ్యూజన్ ఏమీ లేదంటున్నారు. ఏ జిల్లాలో చూసినా పేకాట రాయుళ్ల సందడి కనిపిస్తోంది. సంక్రాంతి సమయంలో కోడిపందాల శిబిరాలు నిర్వహించినట్టుగా.. ఇప్పుడు ఏపీలో రోజువారీ పేకాట శిబిరాలు నడుస్తున్నాయంటే అతిశయోక్తి కానే కాదు. చివరకు డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి జోక్యం చేసుకునే స్థాయిలో వ్యవహారం శృతి మించుతోంది.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పేకాట వ్యవహారం.. దానికి డీఎస్పీ జయసూర్య అండగా ఉంటున్న సంగతి డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఎస్పీ దగ్గర డీఎస్పీ గురించి ఆరా తీశారు. వెంటనే నివేదిక పంపాలని డీజీపీని కూడా ఆదేశించారు. చివరకు పేకాట, డీఎస్పీ గురించి క్యాబినెట్ లో కూడా ప్రస్తావనకు వచ్చిందంటే.. యవ్వారం ఏ స్థాయిలో సాగుతుందో అర్ధమవుతోంది. కానీ ఇంత జరుగుతున్నా.. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు సదరు డీఎస్పీని వెనకేసుకొచ్చారు. అంతే కాకుండా పేకాట గోదావరి జిల్లాల్లో కామన్ అని సర్టిఫికెట్ ఇచ్చేశారు. అంతటితో ఆగకుండా పదమూడు ముక్కలాట తప్పుకాదంటూ వివరించే ప్రయత్నం చేశారు.
ఈ స్థాయిలో నేతలే వకాల్తా పుచ్చుకుంటే.. ఇక పేకాటరాయుళ్లు ఊరుకుంటారా..? అందుకే వారు రెచ్చిపోతున్నారు. ఇక్కడ భీమవరం ఒక్క చోటనే కాదు.. ఏపీ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలతో పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. త్వరలో పేకాట జోరు ఇంకా పెంచి.. చిన్నగా రిక్రియేషన్ క్లబ్బుల్లోనూ ఆడించాలని నేతలు ఫిక్సయ్యారు. ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని చెబుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల మనసు తెలుసుకున్న పోలీసులు కూడా యథాశక్తి సహకారం అందిస్తున్నారు. పేకాట డెన్‌లపై దాడులు చేయకుండా.. జస్ట్ వార్నింగులతో సరిపెడుతున్నారు. కొందరూ ఆ పనీ చేయకుండా.. ఎలా గుట్టుచప్పుడు కాకుండా.. నలుగురి కళ్లలో పడకుండా ఆడుకోవాలో ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. ఇలా అటు నేతలు, ఇటు పోలీసులు పోటీపడి ప్రోత్సాహం అందించడంతో.. పేకాట ఐపీఎల్‌కు మించిన క్రేజ్‌ను ఎంజాయ్ చేస్తోంది. పేకాటను నమ్ముకున్న నిర్వాహకుల సంపాదన రోజుకు రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరుకు ఉంటుందంటే ఏ స్థాయిలో పేకాటరాయుళ్లు పందాలు కాస్తున్నారో ఊహించుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఏపీలో పేకాట శిబిరాన్ని మించిన సంపాదన మార్గం లేదనే దుస్థితి వచ్చేసింది.
ఓ పెద్ద పరిశ్రమ రావాలంటే.. నగరం కావాలి. అదే ఓ చిన్న సంస్థ రావాలన్నా.. కనీసం కొన్ని సౌకర్యాలు కావాలి. కానీ పేకాట శిబిరానికి అవేమీ అక్కర్లేదు. జిల్లా కేంద్రాల దగ్గర్నుంచీ మారుమూల గ్రామాల దాకా.. ఎక్కడపడితే అక్కడే వెలుస్తున్నాయి. స్థలాలు, పొలాలు.. కొన్నిచోట్ల ఇళ్లలో పెరట్లో.. ఎక్కడ కాస్త జాగా కనిపించినా.. అక్కడ ముక్కలు పరిచేసి తెగ ఆడేస్తున్నారు. ఇక పేకాట ఆడే స్థాయి, ఆటగాళ్లను బట్టి నిర్వాహకులు అప్పటికప్పుడు ఇన్ స్టంట్ అరేంజ్‌మెంట్లు చేస్తున్నారు. దీంతో ఎక్కడైనా పేకాట శిబిరం వెలిసిందంటే.. అక్కడో చిన్న సైజు ఫంక్షన్ జరుగుతున్నంత హడావుడి కనిపిస్తోంది. కాబట్టి ఇదేదీ పోలీసులకు తెలియకుండా జరగటానికి వీల్లేదు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలతో నడుస్తున్న శిబిరాలు కాబట్టి.. ఖాకీలు కూడా చూసీచూడనట్టు పోతున్నారు. వారు కూడా ఎంతోకొంత వెనకేసుకుంటున్నారు. ఓవైపు ఏపీ ఖజానా ఖాళీ అయిందని ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు పేకాట శిబిరాలకు మాత్రం బాగా గిట్టుబాటవుతోంది. మినిమం డిపాజిట్ లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలన్నా.. ఎవ్వరూ ఎక్కడా తగ్గటం లేదు.
పేకాట శిబిరాల దగ్గర ఎక్కడా డబ్బు కట్టలు ఉండవు. శిబిరానికి వచ్చే ముందు నిర్వాహకుడు చెప్పిన కారు వద్దకు వెళ్లి డబ్బులు ఇస్తే ఆ మొత్తానికి సరిపడా కాయిన్లు ఇస్తారు. అయితే బ్యాంకును బట్టి పాయింట్ల విలువ మారుతుంది. ఒక్కో పాయింట్ విలువ రూ.50 వేల బ్యాంకు అయితే రూ.200, రూ.లక్షకు రూ.400గా నిర్ణయిస్తారు. ఊరు, శిబిరం ఎక్కడైనా పాయింట్ల రేటు మాత్రం ఇలాగే ఉంటుంది. ఒక్కో గేమ్ పది మంది ఆడతారు. కొన్ని సందర్భాల్లో ఏడుగురుంటారు. ఒక గేమ్ పూర్తయితే గెలిచిన వ్యక్తి ఖర్చుల కింద నిర్వాహకుడికి కొన్ని పాయింట్లు ఇవ్వాలి. రూ.50 వేలు బ్యాంకు ఆడేవారు 8 పాయింట్లు, రూ.లక్ష బ్యాంకు ఆడితే 6 పాయింట్లు ఇవ్వాలి. ఈ లెక్కన రూ.50 వేలు బ్యాంకు ఒక ఆటకు నిర్వాహకుడికి రూ.1600, రూ.లక్ష బ్యాంకు ఆటకు రూ.2,400 వస్తుంది. ఒక శిబిరంలో రోజూ కనీసం వంద ఆటలు జరుగుతాయి. ఈ లెక్కన రూ.50 వేలు బ్యాంకు రోజుకు రూ.1.60 లక్షలు, రూ.లక్ష బ్యాంకునకు రూ.2.40లక్షలు నిర్వాహకుడికి వస్తుంది. పేకాట ఆడేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి గదులు, రవాణా, కోరిన ఆహారం ఏర్పాటు చేస్తారు. రూ.2 లక్షల బ్యాంకు ఆడేవారికి డబుల్ బ్లాక్, గ్లెన్‌లివెట్ లాంటి విదేశీమందు ఇస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విమాన టికెట్లు బుక్ చేస్తారు. ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మందిని పేకాటకు తీసుకొచ్చేవారికి నెలకు రూ.లక్ష–2 లక్షలు గిఫ్ట్‌గా ఇస్తారు.
పేకాట శిబిరాల నిర్వహణ తీరు చూస్తే.. కార్పొరేట్ కంపెనీలకే మతిపోయేలా ఉంది. ఏ పెద్ద కంపెనీకి ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీల కంటే పేకాటరాయుళ్లకు పేకాట శిబిరాల నిర్వాహకులు ఇచ్చే ఆఫర్లే ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నాయంటే నమ్మాల్సిందే. ఈ స్థాయిలో ఆఫర్ల వల విసిరి పేకాటరాయుళ్లను రప్పిస్తున్నారు నిర్వాహకులు. తమ శిబిరాల దగ్గర ఎప్పుడూ రద్దీ ఉండేలా చూసుకుంటున్నారు. మళ్లీ ఓ ఊరికి, మరో ఊరికి.. ఒకే ఊరిలో రెండు పేకాట శిబిరాలుంటే.. వాటి మధ్య కూడా పోటీ సహజమే.అందులో ఏమీ తేడా ఉండదు. ఎవరెక్కువ సంపాదిస్తారనే పోటీలోనే మజా ఉందంటారు నిర్వాహకులు.
