Jagdeep Dhankhar : ధన్ ఖడ్ హఠాత్తుగా రాజీనామా చేయడం వెనుక రాజకీయ కారణాలున్నాయనే చర్చ బాగా జరుగుతోంది. ఇదే సమయంలో బీహార్ ఎన్నికలు, విపక్ష కూటమిని బలహీనం చేసే చర్యలకు ఈ పరిణామం నాంది పలుకుతుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సెప్టెంబర్ లో ఏం జరుగుతుందో చూడాలంటూ శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన ట్వీట్ కూడా కొత్త సందేహాలకు తావిస్తోంది. ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నా.. ఉపరాష్ట్రపతి పదవికి జగ్ దీప్ ధన్ ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలని చెప్పారు. కానీ నిజంగా అదే కారణమైతే.. ఉపరాష్ట్రపతిగానే ఎక్కువ సౌకర్యాలుంటాయి కదా అనే చర్చ జరిగింది. అది కచ్చితంగా అసలు కారణం కానే కాదని విపక్షాలు ముందే రగడ మొదలుపెట్టాయి. ధన్ ఖడ్ ను అవమానకరంగా తప్పించారనే పల్లవి ఎత్తుకున్నాయి. ఆయన్ను అర్థాంతరంగా పంపించాలనుకున్నా.. గౌరవంగా వ్యవహరించాల్సి ఉందనే అభిప్రాయం వెలిబుచ్చాయి.
ధన్ ఖడ్ రాజీనామా విషయంలో తెర వెనుక పెద్ద కథే ఉందనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజు ప్రొసీడింగ్స్ జాగ్రత్తగా చూస్తే.. ప్రభుత్వంతో ధన్ ఖడ్ కు ఎంతగా చెడిందో తెలిసిపోతుందనే విశ్లేషణలు వస్తున్నాయి. సాధారణంగా సుప్రీంకోర్టు జడ్జిపై అభిశంసన అంటే చాలా సీరియస్ వ్యవహారం. అభిశంసన పెట్టాలని సర్కారు నిర్ణయం తీసుకున్నా.. దాన్ని ఎలా పెట్టాలనే విషయంలో ఓ ప్లాన్ ఉంటుంది. రాజ్యసభ ఛైర్మన్ గా ఉన్న వ్యక్తి అటు ప్రతిపక్షం, ఇటు అధికార పక్షంతో మాట్లాడి.. ఇద్దరి అభిప్రాయం తెలుసుకుని.. అందుకు అనుగుణంగా అభిశంసనపై ముందుకెళ్లాలి. కానీ ఇక్కడ జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన విషయంలో.. సర్కారు ఉద్దేశమేంటో ధన్ ఖడ్ తెలుసుకోలేదు. అధికార పక్షం ఆయన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా.. ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అదే సమయంలో ప్రతిపక్షంతో మాత్రం సంప్రదింపులు జరిపారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా.. సభలో విపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని టేకప్ చేశారు. దీంతో అధికార పక్షం జోక్యం చేసుకుని.. అదే రోజు లోక్ సభలో అభిశంసన తీర్మానం పెట్టిన సంగతి చెప్పాల్సి వచ్చింది.
అప్పుడు కూడా ధన్ ఖడ్ ఊరుకోకుండా.. సభా సంప్రదాయాల ప్రకారం.. రూల్ పొజిషన్ ప్రకారం.. ఇద్దరు సభాపతులు వేసే సంయుక్త కమిటీ ఈ అభిశంసన విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఇక్కడే అధికార పక్షం మనస్తాపానికి గురైంది. సాధారణంగా అయితే మొదట ఏ సభలో అభిశంసన తీర్మానం పెడితే.. అక్కడే తదుపరి చర్యలు ఉంటాయి. లోక్ సభలో ప్రతిపక్షాల్ని కలుపుకుని ఏకగ్రీవంగా తీర్మానం పెట్టిన సర్కారు.. రాజ్యసభలోనూ అలాగే ప్లానే చేద్దామని భావించింది. కొద్ది రోజులు సమయం తీసుకుందామనుకుంది. కానీ అధికార పక్షంతో సంప్రదించని ధన్ ఖడ్.. తనకు తోచినట్టుగా చేసేశారు. ఇది సర్కారుకు ఆరోజు ఇచ్చిన మొదటి షాక్ అనుకోవాలి. ఇక్కడితో ఆపేసినా.. వ్యవహారం మరో విధంగా ఉండేదేమే. కానీ ఇదే ఊపులో జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన గురించి కూడా పట్టించుకున్నారు ధన్ ఖడ్. అసలు ఆ అభిశంసన పెట్టడానికే అధికారపక్షం వ్యతిరేకంగా ఉంది. అయినా సరే వారి ఉద్దేశాల్ని ధన్ ఖడ్ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇలా రెండు అభిశంసన తీర్మానాల విషయంలోనూ విపక్ష వైఖరికి అనుగుణంగానే ప్రవర్తించారు. దీంతో అధికార పక్షం అసంతృప్తి కాస్తా ఆగ్రహంగా మారింది.
ఓవైపు ఇంత జరిగాక.. మళ్లీ ఆపరేషన్ సిందూర్ గురించి ఖర్గే సుదీర్ఘ ప్రసంగం చేస్తున్నా.. ఆపకుండా చోద్యం చూశారు ధన్ ఖడ్. అక్కడ కూడా సభా నాయకుడి హోదాలో జేపీ నడ్డా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో విపక్ష సభ్యులు గొడవ చేయడంతో.. నేను చెప్పేదే రికార్డుల్లోకి వెళ్తుంది.. మీ రభస కాదని నడ్డా అన్నారు. ఆ వ్యాఖ్యలపై విపక్షం కూడా పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయినా సరే ధన్ ఖడ్ నడ్డా వ్యాఖ్యల్ని భూతద్దంలో చూశారు. ఏకంగా నడ్డా వ్యాఖ్యలపై బీఏసీ మీటింగ్ పెట్టారు. ఇది సర్కారుకి తలకొట్టేసినట్టైంది. ధన్ ఖడ్ తీరుకు నిరసనగానే మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు బీఏసీకి గైర్హాజరయ్యారనే చర్చ జరిగింది. అప్పటికీ అధికార పక్షం బీఏసీకి పూర్తిగా దూరం కాలేదు. మరో మంత్రి మురుగన్ ప్రభుత్వ ప్రతినిధిగా అటెండ్ అయ్యారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వంతో మాట్లాడాలని ధన్ ఖడ్ అనుకోలేదు. ఇవన్నీ కాకుండా కొద్ది రోజుల ముందు ఆప్ అధినేత కేజ్రీవాల్ కు ఆయన అపాయింట్ మెంట్ ఇచ్చారు. పైగా కేజ్రీవాల్ తో కొన్ని అనవసర విషయాలు పంచుకున్నారని, మాట్లాడారని సర్కారు అభిప్రాయపడింది. ఇలా పదేపదే రాజకీయంగా ఇబ్బందులు సృష్టిస్తున్న ధన్ ఖడ్ ను ఉపేక్షిస్తే కోరి కష్టాలు కొనితెచ్చుకున్నట్టేనని ప్రభుత్వం ఫిక్సైంది. దీంతో అసాధారణ రీతిలో అవిశ్వాసానికీ సిద్ధమేననే సంకేతాలిచ్చింది. అంటే తప్పుకుంటారా.. తప్పించమంటారా అనే స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. అందుకే వారం రోజుల క్రితమే 2027 దాకా పదవిలో ఉంటానని చెప్పిన ధన్ ఖడ్.. అనూహ్యంగా తప్పుకోవాల్సి వచ్చిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ధన్ ఖడ్ స్థానంలో ఎవర్ని ఉపరాష్ట్రపతిని చేస్తారనే విషయంలోనూ రాజకీయ కోణమే ఎక్కువగా బయటపడుతోంది. బీహార్ ఎన్నికల తరుణంలో.. నితీష్ ను ఢిల్లీ తీసుకొచ్చి.. బీజేపీ సీఎం ఫేస్ తో అక్కడ ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ఓ ఆర్జేడీ ఎమ్మెల్యే కూడా నితీష్ ఉపరాష్ట్రపతి అవుతారనే హింట్ ఇచ్చారు. మరో ఎమ్మెల్యే నితీష్ వైస్ ప్రెసిడెంట్ అయితే బీహార్ కు మంచిదని కామెంట్ చేశారు. అలాగే కొంతకాలంగా బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న కాంగ్రెస్ నేత థరూర్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. గతంలో కాంగ్రెస్ ను వీడిన గులాం నబీ ఆజాద్ కూ ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ఫైనల్ గా ఎవరెన్ని ఊహాగానాలు చేసినా.. మోడీ మనసులో ఉన్న వ్యూహమేంటో మాత్రం చివరివరకూ అంతుచిక్కే అవకాశం లేదు. మరి నిజంగా వీరి పేర్లలో ఏదొకటి ఫైనల్ చేస్తారా.. లేదంటే బీజేపీ సీనియర్ నేతలు ఎవర్నైనా అదృష్టం వరిస్తుందా అనేది చూడాల్సి ఉంది.
నిజానికి ధన్ ఖడ్ కు రాజకీయ ఉద్దేశాలుండే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన కొన్నాళ్లుగా యాక్టివ్ పాలిటిక్స కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ధన్ ఖడ్ వ్యవహారశైలి చూశాక ఏ పార్టీ కూడా ఆయనకు అవకాశాలిచ్చే అవకాశం కూడా తక్కువే. మరి ఉపరాష్ట్రపతి పదవిని నేర్పుగా నిభాయించకుండా.. ప్రభుత్వంతో సరైన రీతిలో సంప్రదింపులు జరపకుండా.. స్వతంత్రించి ఏం సాధించారనేది ఆయనకే తెలియాలి. ఉపరాష్ట్రపతిగా హుందాగా ఉండాల్సిన ధన్ ఖడ్ అలా వ్యవహరించలేదు. ఆయన తీరుకు తగ్గట్టుగానే సర్కారు కూడా వీడ్కోలు విషయంలో గౌరవం ఇవ్వలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.