Story Board : రాజీనామాలతో చేసిన తప్పు సరైపోతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేల ఏళ్ల చరిత్రకు చెదలు పట్టించారు. వందల ఏళ్ల నిరీక్షణకు విలువ లేకుండా చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. అయోధ్య రాముడి సొమ్ముని తేరగా తినేశారు. సీసీ కెమెరాల కళ్లు గప్పి మరీ జరిగిన బాగోతం చూసి.. సిట్ కూడా విస్తుబోతోంది. ఇద్దరు ట్రస్ట్ సభ్యుల రాజీనామాను ఆమోదించినంత మాత్రాన.. జరిగిన మహాపరాధానికి పరిహారం దక్కినట్టేనా..? దేశం పరువు తీసిన దొంగలకు ఎలాంటి శిక్ష వేయాలి..? దేవుడిపై భక్తివిశ్వాసాలను, నమ్మకాన్ని అమ్మకానికి పెట్టినట్టుగా జరిగిన వ్యవహారం.. ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టాలి..?
స్కూల్ టీచర్.. సడెన్‌గా కోటీశ్వరుడయ్యాడు. బైక్ మెకానిక్.. ఉన్నపళంగా విల్లా కొన్నాడు. చివరకు మాజీ హోం సెక్రటరీ ఇచ్చిన బంగారు రాంచరిత్ మానస్కూ కాళ్లు తెచ్చారు. మరో ప్రబుద్ధుడు రాముడి సొమ్ముని గాళ్ ఫ్రెండ్‌కు కట్టబెట్టాడు. ఇలా ఒకటా.. రెండా సిట్ విచారణలో తవ్వేకొద్దీ.. అయోధ్య రామాలయంలో జరిగిన బాగోతాలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. రాముడి సాక్షిగా జరిగిన ఈ దోపిడీ కాండను చూసీచూడనట్టుగా వదిలేసిన ట్రస్ట్.. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తోంది.
Also Read
ఇందుగలడందులేదని సందేహము వలదు చక్రి సర్వో పగతుండు.. ఎందెందు వెదకిచూచిన అందందే కలడు అనే పోతన భాగవతంలోని పద్యతాత్పర్యం ఆలకిస్తే విష్ణువు అలవైకుంఠపురంలోనే కాదు ఎక్కడ చూసినా అన్ని చోట్లా ఉంటాడని అర్థం. దేవుడున్నచోట మకిల ఉండదని చెప్పుకునేవారిని ఆశ్చర్యానికి గురిచేస్తూ దైవ క్షేత్రాల్లోనూ అవినీతి మూడుపువ్వులు ఆరుకాయలుగా విలసిల్లుతూ ఉంటుందనే విషయం అయోధ్య విరాళాల స్కామ్‌తో రచ్చకెక్కింది. బాబ్రీ మసీదు, రామజన్మభూమి అంశంపై హిందూ ముస్లింల మధ్య పొరపొచ్చాలను ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం క్షీర నీర న్యాయం అన్న చందాన తేల్చేశాక అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎంతో శ్రద్ధాసక్తులతో రామభక్తులు పూనుకున్నారు. భరతుడు రామపాదుకలకు పట్టం కట్టినట్టుగా.. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి రామ మందిర నిర్మాణానికి పేర్చనున్న ఇటుకలను పరమభక్తి భావంతో పూజలు చేసి మరీ అయోధ్యకు తీసుకెళ్లారు రామభక్తులు.
అలా భక్తిపారవశ్యంలో అయోధ్య రామమందిర నిర్మాణం జరగడం, బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన చరిత్రలో అతి ప్రాధాన్యమైన విషయంగా నిలిచి పోయింది. రామో విగ్రహవాన్ ధర్మ: అనేమాట భక్తుల నోట ఎప్పుడూ నానేమాట. రాముడంటేనే ధర్మం మూర్తీ భవించిన వ్యక్తి అతని రాజ్యంలో ధర్మం నాలుగు పాదా లతో నడుస్తుందని ప్రతీతి. కాగా ప్రస్తుత కలియుగధర్మం కుంటినడక నడుస్తోందని చెప్పక తప్పదు. చివరకు అయోధ్యలో రాముడి పేరిట, దేవుడి దోసిట ప్రసాదాలు, ధానధర్మాలుగా వచ్చినవి ఎటువంటివైనా కైంకర్యమే. వాటిని అడ్డుకునేందుకు ఎలాంటి భక్తిభావం కానీ, ధర్మా చరణ కానీ అందుబాటులో లేవు. హుండీల్లో నగలు, నగదు కూడా మాయ మే. తన కళ్లెదుట అపవిత్ర కార్యాలు జరుగుతున్నా ట్రస్ట్ చోద్యం చూసిందే కానీ నోరెత్తలేదు. పైగా ట్రస్ట్‌లోనూ ఇంటి దొంగలున్నారనే విషయం తెలిసి.. దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది.
అయోధ్య రామాలయ విరాళాల అక్రమాలపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకు ఏకంగా రూ.6 నుంచి రూ.8 లక్షల మధ్య రాముడి సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లి ఉంటుందని అంచనా. బ్యాంక్ అధికారులను ప్రత్యేక దర్యాప్తు బృందం .. సిట్ ప్రశ్నించినప్పుడు ఈ విషయాలు వెల్లడయ్యాయి. అక్రమాలు వెలుగుచూడక ముందు వరకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బ్యాంక్ ఖాతాకు రోజూ రూ.16-18 లక్షలు వరకు జమయ్యేవి. ఆ తర్వాత ఇవి ఒక్కసారిగా రూ.24-26 లక్షలకు పెరిగినట్టు దర్యాప్తులో గుర్తించారు. ఈ ప్రకారం రోజుకు 8 లక్షల వరకు కాజేసినట్టు తెలుస్తోంది. ఎనిమిది మంది నిందితుల్లో ఐదుగురు అనుమానాస్పదంగా సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించారు. వీరు విరాళాలను లెక్కించే సమయంలో, బ్యాంకుకు తరలించే సమయంలో జేబులు, షూ సాక్సులో దాచేసి, పక్కదారి పట్టించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమితులైన వీరు, భక్తుల కానుకలను బాగానే బొక్కేసి ఉంటారనే అనుమానాలున్నాయి. సిట్ నివేదిక ఇంకా వెలుగు చూడాల్సి ఉన్నప్పటికీ ఇందులోని కొన్ని సంచలన విషయాలు ఇప్పటికే బయటకు వచ్చాయి.
అయోధ్య శ్రీరాముడికి భక్తులు ప్రేమతో సమర్పించిన కానుకలు, విరాళాల్లో అసలు ఎన్ని భద్రంగా ఉన్నాయి? ఎన్ని బకాసురుల జేబుల్లోకి వెళ్లాయన్నది? ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. బంగారంతో చేసిన రూ.5కోట్ల విలువ చేసే రామచరిత మానస్ కూడా కనిపించడం లేదన్న విషయం వెలుగు చూసింది. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఎస్.లక్ష్మీనారాయణ దీన్ని శ్రీరాముడి భవ్య మందిరానికి 2024 ఏప్రిల్‌లో విరాళంగా అందించారు. తొలుత కొంత కాలం పాటు ఆలయంలో భక్తుల కోసం ప్రదర్శించగా, ఆ తర్వాత నుంచి అది కనిపించడం లేదంటూ ఆయన తాజాగా బయట పెట్టారు. ఈ విషయమై ఆలయ అధికారుల నుంచి స్పష్టత కోరినప్పటికీ ఫలితం లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. బంగారం పూతతో చేసిన 522 పేజీలతో కూడిన ఈ పుస్తకం బరువు 147 కిలోలు. తయారీకి బంగారంతోపాటు వెండి, రాగిని వాడారు.
రామాలయం విరాళాల స్కామ్ నిందితుల్లో ఒకరు తన స్నేహితురాలికి రూ. 2 లక్షల నగదుతో పాటు ఒక ఖరీదైన మొబైల్ ఫోన్‌ను బహుమతిగా ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఈ డబ్బు మూలాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. నిందితుని సోదరుడు అభిషేక్ తెలిపిన వివరాల ప్రకారం.. అవినాష్ డ్యూటీ ముగిసిన తర్వాత పలుమార్లు యోగా కేంద్రానికి నగదు తీసుకెళ్లడం గమనించినట్లు పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నించగా నిందితుడు దాటవేసే సమాధానం ఇచ్చాడని వెల్లడించారు. ఈ ఘటనల తరుణంలో రామాలయ ట్రస్ట్ విరాళాల లెక్కింపు గదిలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇకపై టేబుళ్లు, కుర్చీలకు బదులుగా నేలపై పరుపులు, ప్లైవుడ్ ఏర్పాటు చేసి నగదు లెక్కిస్తున్నారు. లెక్కింపు సమయంలో సిబ్బంది ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదని, క్యాంటీన్, బాత్రూమ్లకు తరచూ వెళ్లేవారిపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిఘా విభాగం సిబ్బంది కూడా విధి నిర్వహణలో సీట్లను వదిలి వెళ్లకూడదని స్పష్టం చేస్తూ, గది మొత్తాన్ని సీసీటీవీల పర్యవేక్షణలోకి తెచ్చారు.
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్నారన్న రీతిలో అయోధ్యలో జరిగిన దోపిడీ కాండ.. కోట్లాది మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇంత నిర్వాకం జరుగుతుంటే.. ప్రేక్షక పాత్ర పోషించిన ట్రస్ట్.. ఇప్పుడు చేతులు కాలాక తూతూ మంత్రంగా మీటింగ్ పెట్టి.. ఇద్దరు ట్రస్ట్ సభ్యుల రాజీనామాకు ఆమోదం తెలిపి చేతులు దులుపుకుంది. ఇప్పటికే ట్రస్ట్‌పై భక్తులు నమ్మకం కోల్పోగా .. సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. ఇప్పటిదాకా సిట్ విచారణ జరుగుతుంటే.. ఇప్పుుడు కొత్తగా హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
రాముడు పతితపావనుడు, రామజన్మ భూమి ఎంతో పవిత్రమైనది అని పదేపదే మనం గొంతు చించుకోవడం తప్పితే ఆయా దేవుళ్లకు, ఆయా ప్రాంతాలకు పవిత్రతను సమకూర్చే ఎలాంటి కార్యాచరణ అక్కడ కనపడదు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ప్రతీ అంశంలోనూ ఎన్నో చిత్రవిచిత్రాలు తారసపడుతున్నా యి. అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తాజాగా స్పందించింది. ఆరెస్సెన్ తొలిసారి ఈ అంశంపై దుర దృష్టకరమని వ్యాఖ్యానించింది. అసాధారణ అవినీతిని నొచ్చుకుంది కూడా.
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోన్న అయోధ్య రామ మందిర విరాళాల గోల్ మాల్, నిధుల దుర్వినియోగం కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు ఆలయం నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలను కరిగించి.. కరిగించిన బంగారాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా బిస్కెట్ల రూపంలోకి మార్చినట్లు సిట్ అనుమానిస్తోంది. అసలు విరాళాల లెక్కింపు లాంటి అత్యంత గోప్యమైన పనుల కోసం జరిగిన సిబ్బంది నియామకం అత్యంత లోపభూయిష్టంగా జరగడంతోనే అక్రమాలకు బీజాలు పడ్డాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇష్టారాజ్యంగా సిఫార్సు లేఖలపై ఉద్యోగాలిచ్చేశారు. కనీసం తర్వాతైనా జాగ్రత్తపడలేదు. రాముడి సొమ్మును భద్రంగా కాపాడాలనే బాధ్యతను పూర్తిగా పక్కనపెట్టేశారు. మంది సొమ్మేగా.. ఎంత తింటే ఏంటనే ధోరణితో రెచ్చిపోయారు. దీనికి తోడు భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాలకు రసీదులు ఇచ్చే పద్ధతి లేకపోవడంతో.. అవినీతిపరుల పంట పండింది. అందుకే అప్పటిదాకా అతి సామాన్యులుగా ఉన్నవారు.. రాముడి సొమ్ము తేరగా కొట్టేసి.. చుట్టుపక్కల వారు కూడా అసూయతో కుళ్లుకునేలా కళ్లు మూసి తెరిచేలోగా కోటీశ్వరులయ్యారు. ఏ నిందితుడి ఇంట్లో చూసినా భారీగా సొమ్ముల డంప్ దొరుకుతోంది. ఇంకా పెద్ద తలకాయల ఇళ్లు కూడా సోదా చేస్తే.. ఇంకేం దొరుకుతాయోనని అధికార వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. మరి రేపొద్దున హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎంక్వైరీలో మరిన్ని నేరాలు ఘోరాలు వెలుగుచూస్తాయనే భావన వ్యక్తమౌతోంది.
తాజావార్తలు
-
Story Board : రాజీనామాలతో చేసిన తప్పు సరైపోతుందా..?
-
Trump-Meloni: ‘ఆమె అంటే ఇష్టం.. కానీ తప్పు చేసింది’.. టర్కీ టూర్లో మెలోనిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వ కృషి ఫలించింది.. సింగరేణికి ‘తాడిచర్ల-2’ బొగ్గు బ్లాక్..
-
Indonesia: ‘నా డీఎన్ఏలో భారతీయ రక్తం ఉంది’.. ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలకు మోడీ హర్షధ్వానాలు
-
New Players: టీమిండియాలోకి ముగ్గురు కొత్త యువ ఆటగాళ్లు.. మొదటిసారి టీ20 జట్టులోకి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!