Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ మొదలుకాక ముందు నుంచే రాజకీయ పార్టీలు అభ్యంతరాలు చెబుతున్నాయి. కానీ సర్ మొదలయ్యాక సాధారణ ఓటర్లను కూడా సవాలక్ష సందేహాలు ముసురుకుంటున్నాయి. సర్ విషయంలో ఈసీ చెప్పినదానికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్నదానికీ పొంతన కుదరడం లేదు. బీఎల్వోల అవగాహన రాహిత్యం మరింత గందరగోళానికి దారితీస్తోంది. దీనికి తోడు ఎప్పుడో 2002 నాటి ఓటర్ల జాబితా వివరాలు అడగటం.. పెద్ద బ్రహ్మపదార్ధంగా మారింది. ఇక ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారాలు నింపడం మరింత పెద్ద ప్రహసనంగా తయారైంది. ప్రస్తుత పరిస్థితుల్లో అనుకున్న గడువు లోగా సర్ పూర్తవుతుందా.. లేదా అని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. సర్ నడుస్తున్న తీరుపై ఈసీ ఓ రకమైన లెక్కలు చెబుతుంటే.. అసలు అంత సీన్ లేదనేది పార్టీలు చెబుతున్న మాట. ఈసీ, పార్టీల మధ్య జరుగుతున్న పంచాయితీ తర్వాత.. మధ్యలో తమ ఓట్లు ఏమౌతాయోననేది ఓటర్లకు అంతుచిక్కడం లేదు.
సర్ ప్రక్రియ మొదలుకాకముందు.. నిరక్షరాస్యులకు ఇబ్బంది అవుతుందేమోననే అనుమానాలు వచ్చాయీ. కానీ తీరా ఎన్యూమరేషన్ ఫారాలు చేతికి వచ్చాక.. అక్షరాస్యులకూ తలబొప్పి కడుతోంది. దీనికి తోడు బీఎల్వోలు కూడా ఫారాలు నింపే విషయంలో చేతులెత్తేయడం.. సమస్యను మరింత పెద్దది చేస్తోంది. దేశంలో ఓటర్ల జాబితాను అప్పుడప్పుడూ సవరించడం తప్పనిసరి. అర్హులకు చోటు కల్పించి అనర్హులపై వేటు వేసేందుకు సర్ నిర్వహించడమూ అవసరమే. దీని పై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ప్రజాప్రాతినిధ్య చట్టం -1951 పూర్తి స్వేచ్ఛను కల్పించింది. ఈసీ ఈ విషయం లో ఎవరి అనుమతి తీసుకోవాల్సిన లేదా ఎవరికీ జవాబుదారీ వహించాల్సిన అవసరం లేదు. దేశంలో ఇలాంటివి జరగడం ఇదే కొత్త కూడా కాదు. 1952 నుంచి 2004 వరకు 13 సార్లు సర్ జరిగింది. కానీ, ప్రస్తుత సర్వే స్థాయిలో అవేవీ వివాదాల్లో చిక్కుకోలేదు.
Also Read
గతంలో 2002-03లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ.. సర్ కార్యక్రమం ఎలాంటి హడావుడి లేకుండా జరిగిపోయింది. కానీ ఇప్పుడు నిర్వహిస్తున్న సర్ మాత్రం బాగా చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుత ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ పత్రంలో ప్రతి ఓటరు వ్యక్తిగత వివరాలను నింపాలి. పుట్టిన తేదీని, ఆధార్ కార్డు సంఖ్యను, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి పేర్లను, ఓటరు కార్డు గుర్తింపు సంఖ్య ఉంటే దానినీ ఇవ్వాలి. అంతవరకు బాగానే ఉంది. ఎస్ఐఆర్ పత్రంలో రెండో భాగంతోనే పేచీ వస్తోంది. అందులో ప్రతి ఓటరు తమ కుటుంబం గత 23 ఏళ్లుగా భారతదేశంలోనే నివసిస్తున్నట్లు ధ్రువీకరించే వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఓటర్లు ఈ దేశ పౌరులేనని నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రమాణమిది. ఈ వివరాలను ఇవ్వనివారి పేర్లను ఓటరు జాబితాల నుంచి కొట్టేసే ప్రమాదం ఉంది. అయితే ఈ మాటను అధికారికంగా బయటకు చెప్పకపోవడం వేరే సంగతి. పైగా 2002 ఓటర్ల జాబితాలో వివరాలు అడగటంతో.. ఓటర్లు షాక్ అవుతున్నారు. ఆ సమయంలో ఓట్లు లేని వారి బాధ ఒకలా ఉంటే.. ఉన్నా సరే వివరాలు గుర్తులేని వారి కష్టం మరోలా ఉంది. 2002 ఓటర్ల జాబితాలో వివరాలు సరిచూడాల్సిన బాధ్యత బీల్వోలదేనని ఈసీ చెప్పినా.. వారు మాత్రం ఓటర్ల దగ్గరున్న వివరాలుంటే ఓకే.. లేదంటే మీ ఖర్మ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆనాటి ఓటర్ల జాబితా కోసం నానాపాట్లు పడుతున్న ఓటర్లు వివరాలు తెలిస్తే.. ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందపడుతున్నారు. ఎంత ప్రయత్నించినా వివరాలు తెలియనివారు.. తమ సంగతేంటోనని మథనపడుతున్నారు.
అసలు విషయం ఏమిటంటే 24 ఏళ్ల క్రితం నాటికీ, ఇప్పటికీ నియోజకవర్గాలు, పోలింగ్ బూతులు చాలా వరకు మారిపోయాయి. అప్పట్లో ఓటేసిన చాలామందికి అప్పటి పోలింగ్ కేంద్రం గుర్తులేదు. అలా లేకపోతే తామేం చేయలేమని కొందరు బీఎల్వోలు భయపెడుతున్నారు. మరికొందరైతే అప్పటి ఓటర్ ఐడీ ఇస్తేనే పనౌతుందని అదరగొడుతున్నారు. కొన్నిచోట్ల బీఎల్యేలు జోక్యం చేసుకుని.. సమస్య పరిష్కరిస్తున్నా.. చాలాచోట్ల ఓటర్ల పరిస్థితి పద్మవ్యూహంలో అభిమన్యుడిని తలపిస్తోంది. ఏదో వివరాలు అడుగుతారు అనుకున్నాం కానీ.. ఇదేం సర్ పరీక్ష అని ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు. పేరుకి సర్ హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేసినా.. అవెలా పనిచేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో కూడా సహకరించాల్సిన బీఎల్వోలు.. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీనే గొప్ప అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది ఓటర్లకు నేరుగా ఫోన్ చేసి.. తమ దగ్గరకు వచ్చి ఫారాలు తీసుకెళ్లాలని దబాయిస్తున్నారు. అసలు సర్ కోసం ఈసీ పెట్టిన గడువు ఒకటైతే.. బీఎల్వోలు మరో అడుగు ముందుకేసి సొంత డెడ్లైన్లు పెడుతూ.. ఓటర్లను హడలెత్తిస్తున్నారు. అదేమంటే మేం తీసుకోవాలంటే అంతే.. కావాలంటే మీరు ఆఫీసులకు వెళ్లి ఇచ్చుకోండి అని దురుసుగా సమాధానం చెబుతున్నారు. ఇప్పటికే ఎన్యుమరేషన్ ఫారాన్ని బూచిగా చూస్తున్న ఓటర్లు.. బీఎల్వోలతో ఎందుకొచ్చిన తంటా అని పనులు మానుకుని మరీ వారి చుట్టూ తిరగాల్సి వస్తోంది.
సర్ విషయంలో ఈసీకి సహకరించాలనుకున్న ఓటర్లకు.. బీఎల్వోలు అగ్నిపరీక్షలు పెడుతున్నారు. ఈసీ చెప్పింది కొంతైతే.. దానికి సొంత పైత్యం జోడించి ఠారెత్తిస్తున్నారు. చాలా మంది బీఎల్వోలకు ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంపై కనీస అవగాహన లేకపోవడం.. ఈసీ అసలు ఉద్దేశాన్ని దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది. ఈ విషయంలో పార్టీల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాలని ఓటర్ల నుంచి కూడా డిమాండ్ వస్తోంది. ఓవైపు అధికారులు బీఎల్వోకు ట్రైనింగ్ ఇచ్చామని చెబుతున్నా.. ఎన్యుమరేషన్ ఫారాలిచ్చే వారిలో చాలామంది నింపడం తమతో కాదని.. మీ తిప్పలు మీరే పడాలని ముందే చెప్పేస్తున్నారు. దీంతో ఎవర్ని అడగాలో తెలియక సాధారణ ఓటర్లు తికమక పడుతున్నారు. కొంత అవగాహన ఉన్నవారు కూడా ఎన్యుమరేషన్ ఫారం ఎలా నింపితే ఏమౌతుందోనని కంగారు పడుతున్నారు. అంతకుముందు ఎన్యుమరేషన్ ఫారాలు నింపిచ్చాక.. అధికారులు ఇచ్చే నోటీసుల్లో ఏం కొర్రీలు పెడతారోననే అనుమానాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు అసలు ఎన్యుమరేషన్ ఫారం నింపి ఇవ్వడమే పెద్ద ప్రహసనంగా మారుతోంది. దీంతో చాలా మంది ఓటర్లు సర్ ప్రక్రియ తమ చావు కొచ్చిందని నిట్టూరుస్తున్నారు.
సర్ దరఖాస్తు పత్రం దిగువ భాగంలో 2002నాటి ఎస్ఐఆర్ పత్రంలో ప్రచురితమైన ఓటరు వ్యక్తిగత వివరాలను కానీ, అతడు లేదా ఆమె తాతతండ్రుల పేర్లను కానీ ఇవ్వాలి. 2002నాటి ఓటరు జాబితాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉంచారు. ఏ ఓటరుకైనా 2002 జాబితాలోని తన అసెంబ్లీ నియోజకవర్గం కానీ, పోలింగ్ బూత్ కానీ స్పష్టంగా తెలియకపోతే చిక్కులో పడినట్లే. తల్లిదండ్రులు, తాతనాయనమ్మల పేర్లను వెబ్సైట్లో వెతకడం కష్టం. ఓటరు దీర్ఘకాలంగా ఒకేచోట నివసిస్తున్నా, నియోజక వర్గం, పోలింగ్ కేంద్రం మారిపోయి ఉండవచ్చు.
సర్ ఫారం ఎగువన బీఎల్వోల ఫోన్ నంబర్లు ఇవ్వడం కొంత నయమని చెప్పాలి. అయితే, ఓటరు వారికి ఫోన్ చేసి బూత్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఆ సమయంలో బీఎల్వోలు వేరే పనుల్లో ఉండి ఫోన్ ఎత్తలేకపోవచ్చు. అంతకన్నా పై అధికారుల పరిస్థితి కూడా అలాగే ఉండవచ్చు. కొంతమంది బీఎల్వోలు, ముఖ్యంగా గ్రామాల్లోని వారు సర్ పత్రంలో మొదటి భాగాన్ని నింపి ఇచ్చేయాలని ఓటర్లకు సూచిస్తున్నారు. రెండో భాగంలోని వివరాలను వారే భర్తీ చేస్తున్నారు. ఒకవేళ బీఎల్వోలు ఫారం దిగువ భాగాన్ని నింపలేకపోతే పత్రం సగం ఖాళీగా మిగిలిపోతుంది. ఖాళీ పత్రాలను సమర్పించిన తరవాత ఓటరుకు 2002నాటి వివరాలు, ముఖ్యంగా తాతతండ్రుల వివరాలు తెలిసివస్తే, వాటిని స్వీకరించడానికి తమకు అధికారం లేదంటూ బీఎల్వోలు నిరాకరిస్తున్నారు. గడువులోగా పని పూర్తిచేయాలని పైవాళ్ల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక కొందరు బీఎల్వోలు తమకు తోచిన వివరాలతో ఫారాలను నింపేస్తున్నారు. ఇలాంటి ఓటర్ల పేర్లు గడువు తేదీకల్లా ప్రచురితమయ్యే తొలి జాబితాలో లేకపోతే, కొత్త ఓటరుగా రిజిస్టరు కావడానికి ఆరో నంబర్ ఫారాన్ని సమర్పించాల్సి వస్తుంది. కొంతమంది ఓటర్ల పేర్లు, వారి తాతతండ్రుల పేర్లు 2002 ఓటర్ల జాబితాలో ఉన్నప్పటికీ ప్రస్తుత జాబితాలలో లేకపోవడంతో ఎస్ఐఆర్ ఫారాన్ని పొందలేకపోతున్నారు. వీరి పేర్లను ఉద్దేశపూర్వకంగా కానీ, కాకతాళీయంగా కానీ జాబితా నుంచి తొలగించి ఉండవచ్చు. ఇలాంటివారు కూడా కొత్త ఓటర్లుగా ఆరో నంబర్ ఫారాన్ని సమర్పించాల్సి వస్తోంది.
సర్ విషయంలో ఈసీకి సదుద్దేశాలున్నా.. క్షేత్రస్థాయికి వచ్చేసరికి అది నానారకాలుగా భ్రష్టు పడుతోంది. అలా జరగకుండా ఇప్పటికైనా అధికారులు జాగ్రత్తపడాలి. ఏదోలా ఓటర్ల నుంచి సమాచారం తీసుకోవాలే కానీ.. వారిని అదరగొట్టి.. బెదరగొడితే మొదటికే మోసం వస్తుందన్న సంగతి మర్చిపోకూడదు. మొత్తం మీద సర్ విషయంలో నిర్దిష్టంగా సమాచారం అందిస్తూ ప్రజల భయాందోళనలను ఉపశమింపజేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని రాజకీయ పార్టీలు మొత్తుకుంటున్నాయి. కేవలం తమ అభ్యంతరాలను గుడ్డిగా నమ్మాల్సిన పని లేదని.. ఏ నియోజకవర్గంలో, ఏ పోలింగ్ బూత్ లో పారదర్శకంగా విచారణ చేసినా.. అసలు ఓటర్ల కష్టాలేంటో ఈసీకి తెలుస్తాయని బీఎల్యేలు పార్టీలకతీతంగా తేల్చిచెబుతున్నారు.
- Tags
- NTV Telugu
- SIR
- story board
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!