Story Board: సర్ పేరుతో ఏమిటీ ప్రహసనం..? సామాన్యుల దగ్గర్నుంచీ వీవీఐపీల దాకా ఎవర్నీ వదలరా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Story Board: దేశంలో ఓటర్ల జాబితా సమగ్ర ప్రక్షాళనకు ఉద్దేశించిన సర్ ప్రక్రియ.. తీవ్ర గందరగోళానికి తెరతీస్తోంది. తొలి దశలో బీహార్, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. కాకపోతే అక్కడ రాజకీయ వేడి ఉండటంతో.. మిగతా రాష్ట్రాలు పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. కానీ అంత రాజకీయ వేడి లేని.. ఎన్నికలు ఇప్పట్లో లేని రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నడూ లేని విధంగా సర్ ప్రక్రియ వివాదాస్పదం కావడం చర్చకు దారితీసింది. ఏకంగా లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతు కావడం చిన్న విషయం కానే కాదని రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా చిత్రం ఏమిటంటే మొదట్లో బీజేపీ వ్యతిరేక ఓట్లు తొలగిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆ పార్టీ అనుకూల ఓట్లూ పోతున్నాయని కొందరు కాషాయ పార్టీ నేతలూ ఆందోళన వ్యక్తం చేసిన దాఖాలలు కనిపించాయి. దీంతో అసలు సర్‌కు దారీతెన్నూ లేదని తేలిపోయింది. అంతేకాదు సర్ ప్రక్రియ ఎవరి నియంత్రణలోనూ లేకపోగా.. కొత్త సమస్యలకు దారితీస్తుందని కూడా ఇప్పటికే తేలిపోయింది.
మన దేశంలో మామూలుగా వీవీఐపీలకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ సర్ లో మాత్రం వారికీ చిక్కులు తప్పటం లేదు. కోట్ల మంది సామాన్యులతో దారుణంగా ఆడుకున్న సర్.. ఇప్పుడు వీవీఐపీలకూ అదే గేమ్‌ను పరిచయం చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రముఖులైన వారి పేర్లలో చిన్న చిన్న తేడాలున్నాయని, మ్యాప్ కాలేదని, సర్ నోటీసులు వెళ్లాయి. దీంతో సర్ కష్టాలు ప్రముఖులకూ తెలిసొస్తాయని, ఇప్పటికైనా ఈసీకి విషయం తెలిసొస్తుందని సామాన్య ఓటర్లు భావిస్తున్నారు. సామాన్యులకు సర్ నోటీసుల విషయంలోనూ సరైన సమాధానం చెప్పలేకపోయిన ఈసీ.. ఇప్పుడు వీవీఐపీలకు నోటీసుల విషయంలోనూ అదే వైఖరి కనబరుస్తోంది. అదేమంటే నోటీసులు వచ్చినంత మాత్రాన ఓట్లు తొలగిస్తున్నట్టు కాదని సమర్థించుకుంటోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లక్షల మందికి సర్ నోటీసులు రావడం, మెజార్టీ ఓటర్లు విచారణకు విముఖత చూపిస్తున్న తరుణంలో.. రేపు వీవీఐపీల విచారణలో ఎన్ని సిత్రాలు జరుగుతాయో చూడాల్సి ఉంది.
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
- Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
- Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
నోటీసులు అందుకున్న వారందరికీ ఆన్లైన్లో తప్పులు సరిచేసుకునే అవకాశా లిస్తున్నామని ఈసీ చెబుతోంది. వాదన వినిపించుకునే అవకాశం ఇచ్చి మాట్లాడాకగానీ ఎవరి పేరూ తొలగించబోమని కూడా ఎంతో పెద్ద మనసుతో చెబుతోంది. అంతేకాదు వీవీఐపీల పేర్లు ఏదోలా తుది జాబితాలో ఉంటాయనే విషయంలో ఎవ్వరికీ సందేహాలు అక్కర్లేదు. కానీ సామాన్యుడి గతేమిటి? సర్‌లో చోటు దొరక్కపోతే ఓటు కోల్పోవడం ఒక్కటే సమస్య కాదు. ఏదో ఒకరోజు మీరు ఈ దేశ పౌరులు కాదని అలాంటి వారందరూ వర్తమానం అందుకునే ప్రమాదం లేకపోలేదనే భయాలు వ్యక్తమతున్నాయి. పింఛన్ అందుకునే వారికి ప్రతియేటా ఒక తప్పనిసరి తంతు సాగుతుంటుంది. లైఫ్ సర్టిఫికెట్ పేరుతో ఎవరికి వారు తాము బతికేవున్నట్టు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే తదుపరి నెల పింఛన్ అందుతుంది. అంటే ఏడాదిలో మిగతా 364 రోజులూ ఆ పేరుతో ఎవరు తీసుకున్నా పట్టించుకోరు. ఆ ఒక్కరోజూ మాత్రం నిరూపించు కోవాలి. సర్ ప్రక్రియ అందుకు భిన్నమేమీ కాదు. ఇంతకూ గతంలో ఉన్నత పదవుల్లో పనిచేసి నిష్క్రమించినవారికీ, ఆ పదవుల్లో కొనసాగుతున్నవారికీ ఈసీ నోటీసులిచ్చి అడగటం మాటేమోగానీ సర్ ప్రక్రియ ప్రహసనం గమనించి, ఇందుకా కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నారన్న ప్రశ్న అయితే సాధారణ పౌరుల్లో తలెత్తుతుంది. ఢిల్లీ వరకూ చూసినా అక్కడ గత జాబితాలోని 33 శాతంమంది పేర్లు గల్లంతయ్యాయి. ఇప్పటికే మిగతా రాష్ట్రాల్లోనూ సర్ తుది జాబితాల విషయంలో లెక్కలేనన్ని అభ్యంతరాలొచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో లక్షల మంది ఓట్లు గల్లంతవుతున్నా సరే .. ఈసీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటం.. ఆందోళనకు దారితీస్తోంది.
మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రతి ఎన్నిక కేవలం రాజకీయ పార్టీల మధ్య పోటీకి ఒక వేదిక మాత్రమే కాదు, పౌరుల ప్రజాస్వామ్య విశ్వాసానికి నిదర్శనం కూడా. ఎన్నికల ప్రక్రియలో ఉండే నిష్పాక్షికత, పారదర్శకతే ఈ విశ్వాసానికి పునాది. ఏ పౌరుడు తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుంటాడో నిర్ధారించేది ఓటరు జాబితానే కాబట్టి, ఈ ప్రక్రియకు ఓటరు జాబితానే ఆధారం. ఈ తరుణంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. సర్ వివాదాలకి కేంద్రంగా మారటం ఎవరికీ మంచిది కాదు. ఓటర్ల జాబితా కచ్చితంగా, తాజాగా ఉండేలా చూసుకోవడానికి ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను క్రమం తప్పకుండా సవరిస్తుంది. కానీ ఆ ప్రక్రియలో ఎక్కడా అభ్యంతరాలు రాకుండా, పొరపాట్లు జరగకుండా చూసుకోవడం అత్యవసరం అనడంలో మరో మాటకు తావే లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం, ఓటర్ల జాబితాల సమగ్రతను నిర్ధారించే అధికారం, ఆ బాధ్యత ఎన్నికల సంఘానికి అప్పగించారు. ఇక్కడ సర్ లక్ష్యాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, దాని అమలుపై పలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మన దేశానికి ప్రజాస్వామ్యమే దాని అతిపెద్ద బలం, ఎన్నికల సంఘం దానికి కాపలాదారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వంటి కార్యక్రమాలను పారదర్శకతతో, విస్తృత భాగస్వామ్యంతో అమలు చేస్తే, అవి ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయగలవు. కానీ వాటిపై సందేహాలు మిగిలి ఉంటే, అది సంస్థాగత విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది.
ఇక్కడ పార్టీలు రాజకీయం చేస్తున్నాయా.. లేదా అనే విషయం గురించి పట్టించుకోకుండా.. ఈసీ తన వంతుగా రాజ్యాంగ నైతిక విలువలు, సాంకేతిక పారదర్శకత, పౌర భాగస్వామ్యం ఆధారంగా తన ప్రక్రియలను పునర్నిర్వచించుకోవడం.. ఆ సంస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మరీ ముఖ్యంగా సర్ పై ఓటర్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం, వారి ఇబ్బందుల్ని పరిష్కరించడం చాలా ముఖ్యం. ఈసీకి ఓటర్లకు మధ్య సమాచార మార్పిడి సరిగ్గా ఉంటే.. సవాలక్ష సందేహాలకు తావుండనేది ప్రాథమిక సూత్రం. కానీ ఈసారి సర్ విషయంలో ఈసీ ఎక్కడలేని తొందరపాటు ఎందుకు ప్రదర్శిస్తుందనేది ఎవరికీ అంతుచిక్కని భేతాళ ప్రశ్న. ఓటర్లు ఎక్కడికీ పారిపోరు. ఓటర్ల జాబితాలు ఎలాగూ ఈసీ దగ్గరే ఉన్నాయి. అలాంటప్పుడు కొన్ని నెలల తరబడి సర్ జరిగితే మాత్రం ఏం కొంప మునుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈసీ తీరు ఇలాగే ఉంటే.. అసలు ఓటర్ల జాబితా గురించి మర్చిపోవడం మంచిదని జనం అనుకునే ప్రమాదం.. తద్వారా ఓట్ల శాతం కనీస స్థాయికి పడిపోయే ముప్పు పొంచి ఉన్నాయనేది కాదనలేని సత్యం.
ఇప్పటికైనా ఈసీ సర్ అసలు ఉద్దేశాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. రాజ్యాంగ నిర్మాతలు ఈసీకి సర్ చేపట్టే అధికారం ఇచ్చిన మాట నిజం. కానీ ఆ అధికారాన్ని ఈ దేశ పౌరులందరికీ ఓటేసే హక్కు ఇవ్వడం కోసమే కానీ.. అవగాహన లేని బీఎల్వోలతో సర్ నిర్వహించి.. అసలుకు మోసం తేవటానికి కాదని పార్టీలు గుర్తుచేస్తున్నాయి. ఇకనైనా సర్ విషయంలో సరైన రీతిలో వ్యవహరించకపోతే.. ఈసీ సకాలంలో మేలుకోకపోతే.. భవిష్యత్తులో ఓట్లు భారీగా గల్లంతైతే.. ఓటర్లలో అనవసర ఆందోళన తలెత్తితే దానికి ఆ సంస్థే బాధ్యత తీసుకోవాలని బీఎల్యేలు హెచ్చరిస్తున్నారు. చేతులు కాలాక తమను సాయం అడిగినా.. మేం కూడా ఏమీ చేయలేయమని వారు ముందే చేతులెత్తేస్తున్నారు. ఏదేమైనా అర్హత గల ఓటర్లెవరో తేల్చాల్సిన సర్ ప్రక్రియ.. ఇలా అడుగడుగునా వివాదాలకు, లెక్కలేనన్ని సందేహాలకు ఆస్కారం ఇవ్వడం ఎవరికీ మంచిది కాదనే విషయంలో మరో మాటకు తావు లేదు. ఏతావాతా ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కును నిర్ధారించే కీలకమైన సర్ ప్రక్రియలో అసలు సీరియస్‌నెస్ కనిపించడం లేదనే వాదనలో నిజం లేకపోలేదు. ఇంత ప్రసహనంగా తయారైన సర్‌ను చూసి ఓటర్లే కాదు. మాజీ ఎన్నికల కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటిదాకా ఈసీ నిర్వహించిన సర్ లు.. ఓటర్లకు వెసులుబాట్లు ఇచ్చి మరీ ఓటర్ల జాబితాలో పేర్లు కొనసాగేలా ఉండేవి. కానీ ఈసారి సర్ మాత్రం ఓట్ల తొలగింపుకే కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే సర్ ప్రక్రియలో అడుగడుగునా ఈసీ నిర్వాకాలు బట్టబయలౌతున్నాయనే అభిప్రాయాలు వస్తున్నాయి.
సర్ విషయంలో పై నుంచి కింది దాకా తలో మాట చెబుతున్నారు. ఈసీ ఇచ్చిన నిర్దేశాలకు, బీఎల్వోల వ్యవహారశైలికి మొదటే పొంతన కుదరలేదు. ఇది చాలదన్నట్టు బీఎల్వోల పర్యవేక్షణకు నియమితులైన సూపర్వైజర్లు, చివరకు జిల్లా ఎన్నికల అధికారులు కూడా సర్‌ను స్పీడందుకునేలా చేయడం మానేసి.. సకాలంలో ఫారాలు ఇవ్వకపోతే ఓట్లు పోతాయని ఓటర్లను బహిరంగంగా బెదిరించడం విడ్డూరంగా ఉంది. ఎంతసేపూ సర్‌ను షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయాలనే తొందరే కానీ.. ఓటర్ల సాధకబాధకాలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పైగా ఓటర్లకు నోటీసులిచ్చినా స్పందించడం లేదని వారిపైనే నెపం నెట్టేస్తున్నారు. నిజానికి ఆ నోటీసులు కూడా ఓటర్లే బీఎల్వోల చుట్టూ తిరిగి తీసుకోవాల్సి వస్తుంది. తమ పనులు మానుకుని.. బీఎల్వోల చుట్టూ తిరిగితే ఎలాగనేది ఓటర్ల నుంచి వస్తున్న ప్రశ్న. వారింత మొత్తుకుంటుున్నా.. బీఎల్వోల పద్ధతి మార్చాలనే ఆలోచన అధికారులకు రావడం లేదు. దీంతో విసిగిపోతున్న ఓటర్లు.. ఓట్లపైనా నిరాసక్తి పెంచుకుని.. విచారణకు దూరంగా ఉంటున్నారు. ఇక్కడే సర్ అసలు ఉద్దేశం దెబ్బతినడమే కాకుండా.. మొత్తంగా దేశంలో ఓటర్ల సంఖ్యలోనూ దారుణమైన తగ్గుదల నమోదైతే.. ఇక ఎన్నికలకు విశ్వసనీయత ఎలా ఉంటుందనే కొత్త ప్రశ్నలు మొగ్గ తొడుగుతున్నాయి.
అసలు కొత్తగా ఒక వ్యక్తిని ఓటరుగా నమోదుచేయటానికి ఎన్నో పత్రాలు చూడాలి. స్వయంగా బీఎల్ఓ ఆ వ్యక్తి నివసించే ఇంటిని సందర్శించాలి. ఆషామాషీగా ఒక వ్యక్తిని ఓటరుగా నమోదు చేయకూడదనేది నియమం. ఆ నియమాన్ని కచ్చితంగా పాటించే.. ఓటర్లుగా నమోదుచేశామని చెప్పే ఎలక్షన్ కమిషన్ తాను జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డులనే సర్‌లో ప్రామాణికంగా తీసుకోలేమని సుప్రీంకోర్టుకు స్వయంగా చెప్పింది. అలాగే ఆధార్ కార్డూ అందుకు ఉపయోగపడదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టూ చివరకు ఎలక్షన్ కమిషన్ వాదననే పరిగణనలోకి తీసుకుంది. ఆధార్ కార్డుని విదేశీవ్యక్తులకు కూడా జారీచేస్తారని, అందుకే అది ప్రామాణికం కాదనే వాదన ఎంత లోపభూయిష్ఠమో మన ఇంగితజ్ఞానం చెబుతూనే ఉంటుంది. ఎంతమంది విదేశీయులకు అధికారికంగా ఆధార్ కార్డులు జారీ అయివుంటాయో లెక్కలుతీస్తే వారి సంఖ్య చాలా పరిమితంగానే ఉంటుంది. వాళ్లు అయినా కొన్ని పత్రాలు సమర్పించకుండా కార్డులు పొందలేరు. అతి స్వల్పసంఖ్యలో విదేశీయులు ఆధార్ పొందుతుంటే మొత్తం ఆధార్ కార్డుల ప్రామాణికతనే శంకించటం సామాన్యుల తర్కానికి అందదు. పర్యాటకులుగానో, విద్యార్థులుగానో, ఉద్యోగులుగానో, పరిశోధకులుగానో వచ్చిన విదేశీ వ్యక్తులకు ఆధార్ ఇవ్వాలన్న నిబంధనను అధికారికంగానే పెట్టుకుని ఈ వాదనను చేయటం విడ్డూరంగానూ, వైపరీత్యంగానూ భావించాలి. ఇక ఇతర దేశాల సరిహద్దులను దాటి దేశంలోకి అక్రమంగా ప్రవేశించినవాళ్లు ఆధార్ కార్డులు పొందటం ఎక్కువగానే ఉందని అనుకుందాం. మరి అందుకు కారణం ఎవరు? అని ప్రశ్నించుకుంటే వేళ్లన్నీ అధికారయంత్రాంగం వైపే చూపుతాయి.
సందేహాస్పద ఓటర్లందరినీ మనం అక్రమ వలసదారులుగా భావించలేం. బీఎల్ఓలకు సరైన పత్రాలను అందించలేని వాళ్లనూ ఆ జాబితాలో చేర్చుతారు. ఇక్కడే సర్ ఉద్దేశం నీరుగారుతోంది. ఉదాహరణకు తెలంగాణలో 2002లో చేపట్టిన సర్ తర్వాత ఏడుసార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటువేసిన వారందరూ కూడా ఇప్పుడు మళ్లీ తమని తామే నిఖార్సైన ఓటర్లుగా నిరూపించుకోవాలి. ఇంటర్నెట్‌ని ఉపయోగించగలిగినవాళ్లు కూడా 2002 నాటి సర్ జాబితాలో తమ పేర్లు వెతుక్కోటానికి కిందామీదా పడుతున్నారు. గంటలపాటు దానికోసం ప్రయత్నించి విఫలమై చివరకు 2002నాటి సర్‌లో తమపేరు లేదనే వెసులుబాటును ఉపయోగించుకుని ఎన్యూమరేషన్ ఫారాన్ని ఆన్లైన్లో పూర్తిచేస్తున్నారు. దీనికి ఫోన్‌నంబరు, ఆధార్ కార్డు వివరాలను సమర్పించి వాటి ఆధారంగా వచ్చే ఓటీపీలతో ప్రక్రియను పూర్తిచేస్తున్నారు. 2002 నాటి సర్ జాబితాతో సంబంధం లేకుండానే ఓటర్లుగా కొనసాగే అవకాశం ఉంటే.. అసలు దాంతో మొత్తం ప్రక్రియను ఎందుకు ముడిపెట్టాల్సి వచ్చిందనే ప్రశ్నకు ఈసీ ఇప్పటికైనా సమాధానం చెప్పగలదా అంటే సందేహమే.
2002 నాటి సర్ ఎలా జరిగిందో చూస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడు సర్‌కు సంబంధించి ప్రత్యేక హడావుడి కనపడలేదు. మామూలు ఓటర్ల జాబితా సవరణ లాగే అది జరిగిపోయింది. బహుశా అప్పుడు ఎన్నికలు లేకపోవటం కూడా అందుకు కారణమై ఉంటుంది. దీనికి భిన్నంగా ఇటీవల బిహార్, బెంగాల్, తమిళనాడుల్లో తగిన సమయం ఓటర్లకు ఇవ్వకుండా హడావుడిగా సర్ చేపట్టటంతోనే తీవ్రస్థాయిలో వివాదాలు చెలరేగాయి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రచారాల్లో మునిగిపోయిన సందర్భంలో సర్ చేపట్టటం అనుచితంగానే కనపడుతుంది. ఆ అనుచిత చర్యలే ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతను ప్రశ్నించేలా ఆస్కారం కల్పించాయి. అధికార వ్యవస్థలన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం కావాల్సిన రీతిలో ఒరిగిపోతున్న నేపథ్యంలో ఎన్నికల ముందు చేపట్టిన సర్‌పై అనుమానాలు కలగకుండా ఉండవు. ఇప్పుడే బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లలేని పరిస్థితి ఉంటే 2002లో సర్ అంతా సక్రమమని భావించి దాన్ని ప్రామాణికంగా తీసుకోవటం ఏ మాత్రం సహేతుకంగా అనిపించదు. అప్పటికి మొబైల్ ఫోన్లు లేవు. ల్యాండ్‌లైను ఫోను ఉన్న వాళ్లూ తక్కువే. సోషల్ మీడియా లేదు. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే ఇప్పటి స్థాయిలో విస్తృత ప్రజానిఘా లేని ఆనాటి పరిస్థితిలో 2002 నాటి సర్‌కు చాలా పరిమితులు ఉంటాయి. పేర్లలో, ఇంటిపేర్లలో, వయస్సుల నమోదులో ఎన్నో తప్పులు ఆనాటి జాబితాలో కనపడతాయి. వీటన్నిటినీ సరిదిద్దుకోవాల్సిన బాధ్యతను ఇప్పుడు ఓటర్లపైనే పెట్టారు. అర్హులైన వారిని ఓటర్లుగా నమోదుచేయటం రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ విధి. అలా నమోదుచేసిన వాళ్లను కొన్నేళ్ల తర్వాత .. మిమ్మల్ని మీరు ఓటర్లుగా నిరూపించుకోండి అని చివరికి అదే కమిషన్ ఆదేశించటం ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని పలుచన చేయటమేనని ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. వస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: సర్ పేరుతో ఏమిటీ ప్రహసనం..? సామాన్యుల దగ్గర్నుంచీ వీవీఐపీల దాకా ఎవర్నీ వదలరా..?
-
OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
-
Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
-
AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
-
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!