Story Board: పార్లమెంట్ సమావేశాల నిర్వహణ పైన కొంత కాలంగా సాగుతున్న సస్పెన్స్ కు తెర పడింది. ఎట్ట కేలకు పార్లమెంట్ సమావేశాల నిర్వహణ పైన నిర్ణయం జరిగింది. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్రం వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. పార్లమెంట్ భేటీ.. మహిళా రిజర్వేషన్లు- డీలిమిటేషన్ బిల్లు ఆమోదం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కేంద్రం.. తాజాగా కేబినెట్ సమావేశంలో వీటి పైన చర్చించింది. మంత్రులకు ఇదే అంశం పైన ప్రధాని మోడీ దిశా నిర్దేశం చేసారు.
పార్లమెంట్ సమావేశాలను డిసెంబర్ 15వ తేదీ లోగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తేదీలను అధికారికంగా ప్రకటించనుంది. విదేశీ పర్యటనలు పక్కన పెట్టి, మంత్రులు ఇందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోడీ ఇప్పటికే సూచించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాయిదాపడి 103 రోజులైనా, ఇంకా ప్రొరోగ్ కాకపోవడంపై విపక్షాలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి. విపక్షాల ప్రశ్నలకు దీటుగా సమాధానం ఇచ్చేందుకు మంత్రులు సమాయత్తం కావాలని కూడా ప్రధాని సంకేతాలిచ్చారు. అయితే, ఈ సమావేశాలను వర్షాకాల సెషన్ కు కొనసాగింపుగా నిర్వహిస్తారా.. శీతాకాల సమావేశాల కోసం నిర్ణయం తీసుకుంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక, వచ్చే నెలలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా మహిళా రిజర్వేషన్లు- డీ లిమిటేషన్ బిల్లులు కేంద్రానికి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఏప్రిల్ లో సభలో ప్రవేశ పెట్టిన డీ లిమిటేషన్ బిల్లు వీగిపోయింది. కాగా, ఇప్పుడు మరోసారి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రతిపాదించి ఆమోదం పొందేలా కేంద్రం వ్యూహాలు సిద్దం చేస్తోంది. డీఎంకే, సమాజ్ వాదీ, ఎన్సీపీ తో సహా ఆప్ ఎంపీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ బిల్లులు ఆమోదం పొందాలంటే ప్రస్తుతం లోక్ సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 361 మంది మద్దతు ఇస్తేనే ఆమోదం సాధ్యం అవుతోంది. ఎన్డీఏ కు 320 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో.. మరో 41 మంది మద్దతు కోసం బీజేపీ ముఖ్య నేతలు చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో.. పార్లమెంట్ సమావేశాల పై కేంద్రం అధికారికంగా చేసే ప్రకటన పైన ఆసక్తి నెలకొంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గత వంద రోజులకు పైగా ప్రొరోగ్ కాకుండా సరికొత్త రికార్డును నెలకొల్పాయి. వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభలను ఆగస్టు 13నే నిరవధికంగా వాయిదా వేశారు. అయినా ప్రొరోగ్ అయినట్టు రాష్ట్రపతి ఇంతవరకు ప్రకటించలేదు. లోక్‌సభలో బిల్లు ఆమోదానికి 15 నుంచి 18 ఓట్ల ఆధిక్యం లభిస్తుందనే స్పష్టమైన ధీమాను ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేశాయి. ఈ తరుణంలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడిన తర్వాత ప్రొరోగ్ చేయడానికి రాజ్యాంగంలో నిర్దిష్ట గడువు ఏమీ లేదు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850కి పెంచడం, అలాగే, 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ఈ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది. దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్న తరుణంలో ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 50 శాతం పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఇప్పటికే సంకేతాలొచ్చాయి.
ప్రతిపాదిత శాసన ప్యాకేజీలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన చట్టం ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ల అమలుకు ఒక చట్రాన్ని ఏర్పాటు చేస్తూ , లోక్‌సభ సభ్యుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి గరిష్టంగా 850కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది . 2026 ఏప్రిల్ 17న జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ఇదే తరహా రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజారిటీని సాధించడంలో ప్రభుత్వం గతంలో విఫలమైన తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, రాజకీయ పార్టీలతో జరిపిన చర్చలు, ప్రతిపాదిత రాజ్యాంగ సవరణలకు మద్దతు కూడగట్టే విషయంలో ఎన్డీఏ అవకాశాలను మెరుగుపరిచాయి. అయితే, ఈ బిల్లుకి ఏ ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇవ్వవచ్చో లేదా కొంతమంది చట్టసభ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉంటారో లేదో అనే విషయాలు తేలాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ శాశ్వతంగా రాజకీయ ప్రయోజనం పొందేందుకు పార్లమెంటులో ప్రాంతీయ సమతౌల్యతను మార్చివేసేందుకు ప్రయత్నిస్తోందనే భయసందేహాలు ప్రతిపక్షాలలో బలంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితి రాకుండా అవి ఏకతాటిపైకి వచ్చి పోరాడుతున్నాయి. 2027 జనాభా గణన వివరాల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునఃకేటాయింపునకు సంబంధించిన రాజ్యాంగ సవరణకు పార్లమెంటు ఆమోదం లభిస్తే అది బీజేపీకి పెద్ద విజయం అవుతుంది.
గత ఏప్రిల్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం పొందడంలో అధికార పక్షం వైఫల్యం ఈ ప్లాన్ ఏ పరిమితులను తేటతెల్లం చేసింది. బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలు కూడా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనకు అంగీకరించే పరిస్థితి లేదని స్పష్టమైంది. మరోవైపు దక్షిణాదిలో ఇప్పుడిప్పుడే ఎన్నికల విజయాలు రుచి చూస్తున్న బీజేపీ, ఈ ప్రాంతంలో తన తలుపులను శాశ్వతంగా మూసుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ కారణంగానే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్లాన్ బి వైపు మొగ్గు చూపుతోంది. ప్రస్తుతానికి సమాఖ్య సమతుల్యత కు భంగం కలిగించకుండా డీలిమిటేషన్ ప్రక్రియను శీఘ్రగతిన పూర్తి చేయడమే ఈ ప్లాన్ బి. విస్తరించిన లోక్‌సభలో ప్రతి రాష్ట్రం సీట్ల వాటాను యథాతథంగా కొనసాగించేందుకు అధికార పార్టీ సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతి రాష్ట్రంలోనూ ప్రస్తుతమున్న లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50శాతం మేరకు పెంచుతామని గతంలో మౌఖికంగా ఇచ్చిన హామీని కొత్త డీలిమిటేషన్ బిల్లులో చేర్చేందుకు సైతం బీజేపీ సిద్ధమవుతోంది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలును జనగణన, ఆ తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టడంతో అధికార, విపక్షాల మధ్య రాజకీయ రగడ కొనసాగుతోంది. ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లు ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త జనగణన గణాంకాలను ప్రతిబింబించేలా చేయడానికి, లోక్‌సభలో 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి డీలిమిటేషన్ ఒక రాజ్యాంగబద్ధమైన అవసరమని బీజేపీ నేతృత్వంలోని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ వాదిస్తోంది. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండి కూటమి మాత్రం ఈ వాదనను వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఉన్న 543 మంది సభ్యుల లోక్‌సభలోనే తక్షణమే 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టడాన్ని తప్పుబడుతున్నాయి.
మహిళా రిజర్వేషన్లతో ముడిపెట్టి కొత్త డీలిమిటేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందేందుకు గతంలో చేసిన ప్రయత్నం విఫలమవడంతో, రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని కూడగట్టుకునేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. ఈ ప్రయత్నాలన్నీ పూర్తికావచ్చాయి కాబట్టే.. మోడీ పార్లమెంట్ సెషన్ గురించి చెప్పారని అంటున్నారు. ఇప్పటికే సుప్రియా సూలే లాంటి విపక్ష నేతలు చేస్తున్న బహిరంగ ప్రకటనలను గమనిస్తే పాలక పక్షం వ్యూహాలు కొంత పనిచేస్తున్నట్టే కనిపిస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రోరోగ్ చేయకపోవడం, అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు అధికార పక్షం ససేమిరా అనడం, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో జనాభా గణనను ముందుగానే చేపట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూస్తుంటే, డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం పొందే లక్ష్యంతో అడుగులు పడుతున్నాయని స్పష్టమవుతోంది.
ఎన్నికల సంఘం తీరుతెన్నులపై దేశవ్యాప్తంగా ప్రజా నిరసనలు వెల్లువెత్తడం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోతుండడం, తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనడం, అంతర్జాతీయ రాజకీయాలలో పెనుమార్పులు, వాతావరణ మార్పును నిరోధించడంపై కీలక చర్చలు విఫలమవడం తదితర జాతీయ, అంతర్జాతీయ సమస్యల నడుమ, నియోజకవర్గాల పునర్విభజనను వచ్చే లోక్‌సభ ఎన్నికలలోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. అధికార పక్షం స్వల్పకాలిక, దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలకు నియోజకవర్గాల పునర్విభజన అత్యంత కీలకమైనదనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు డీలిమిటేషన్‌పై ర్చ వివిధ రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్ల పునఃకేటాయింపుపైనే ప్రధానంగా జరుగుతోంది. కానీ డీలిమిటేషన్లో మరో రెండు కీలక అంశాలు కూడా ఉన్నాయి. అవి.. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను సరికొత్తగా నిర్ణయించడం, ఎస్సీ, ఎస్టీలకు, ఇప్పుడు మహిళలకు రిజర్వ్డ్ నియోజకవర్గాలను పునఃకేటాయించడం. బీజేపీ రాజకీయ భవిష్యత్తుకు ఈ రెండు అంశాలు చాలా కీలకమనేది కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తోంది.
అయితే డీలిమిటేషన్‌పై వ్యతిరేకతకు కొన్ని ప్రాతిపదికలున్నాయి. డీలిమిటేషన్‌తో దక్షిణ, తూర్పు భారత రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, ఉత్తర భారతావనిలోని హిందీ భాషా రాష్ట్రాల ప్రాబల్యం పెరుగుతుందనీ బలమైన వాదన ఉంది. అంతేకాకుండా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా బీజేపీ అమలు చేయాలనుకున్న ప్లాన్ ఏ ఇదే అనేది బిల్లు వ్యతిరేకుల అభిప్రాయం. లోక్‌సభలో హిందీయేతర భాషా రాష్ట్రాల సీట్ల వాటా తగ్గిపోవడమనే వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఆ సభలో మొత్తం సీట్ల సంఖ్యను 850కి పెంచడం ప్లాన్ ఏలో ఒక ప్రధాన ప్రతిపాదన అనే అనుమానాలు కూడా లేకపోలేదు. దీని ప్రకారం కేరళలో ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య 20 యథాతథంగా ఉంటుంది. అయితే అది ప్రస్తుతమున్న 545 స్థానాల్లో 20 కాదు; విస్తరించిన 850 స్థానాల్లో 20 మాత్రమే అవుతుంది. ఇది బీజేపీ దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలకు, శాశ్వత మెజారిటీ సాధనకు మాత్రమే సరిగ్గా ఉపయోగపడుతుందని విమర్శలొస్తున్నాయి. అలా కాకుండా యాభై శాతం సీట్ల పెంపు ప్రాతిపదికను అమలు చేస్తే..
కేరళంలో ప్రస్తుత లోక్‌సభ సీట్ల సంఖ్య 30కి పెరుగుతుంది. ఈ ఉపశమనం ఇవ్వడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలలో డీలిమిటేషన్ పట్ల ప్రతిపక్షాల వ్యతిరేకతను తగ్గించవచ్చని, తద్వారా అసలు రాజ్యాంగ సవరణ బిల్లును, సవరించిన డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటులో సులభంగా ఆమోదింపజేసుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

