Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?

Sb Bjp Strategy

Sb Bjp Strategy

Story Board: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను వచ్చే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించుకోవాలని సంకల్పించిన ఎన్డీయే ప్రభుత్వం అందుకు వీలుగా ఎంపీల సంఖ్యను పెంచుకునే దిశలో వ్యూహాలకు పదునుపెట్టింది. అందులో భాగంగా విపక్షాల్లో చీలికలు తెచ్చి వాటిని ముక్కలు చెక్కలు చేసే యత్నాలను ముమ్మరం చేసింది. ఉద్ధవ్‌ థాక్రే శివసేనలో తాజా తిరుగుబాటు, సమాజ్‌వాదీ కూడా అదే బాటలో నడుస్తోందన్న లీకులు అందులో భాగమే. ఉద్ధవ్‌ సారధ్యంలోని శివసేన యూబీటీ ఇప్పటికే చీలిపోయింది. ఆ పార్టీకి చెందిన 9 మంది ఎంపీల్లో ఆరుగురు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను ఢిల్లీలో కలిశారు. తమను ప్రత్యేకవర్గంగా గుర్తించాలని కోరారు. దీనికి ఆయన వెంటనే ఆమోదం తెలిపారు. ఓం బిర్లాను కలిసిన వారిలో సంజయ్‌ జాదవ్‌, సంజయ్‌ దేశ్‌ముఖ్‌, సంజయ్‌ పాటిల్‌, నగేశ్‌ పాటిల్‌, ఓమ్రాజే నింబాల్కర్‌, బాలా సాహెబ్‌ వాక్చౌరే ఉన్నారు. ఈ నెల 19న శివసేన 60వ సంస్థాపక దినోత్సవం సందర్భంగా ఏక్‌నాథ్‌ శిండే శివసేనలో ఈ వర్గం విలీనమైంది. దీంతో తాము మొదలుపెట్టిన ఆపరేషన్ టైగర్ పూర్తైందని కూడా షిండే ప్రకటించారు.

మరోవైపు, 37 మంది ఎంపీలున్న సమాజ్‌వాది పార్టీలోనూ చీలిక రానుందంటూ యూపీ మంత్రి ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ చేసిన ప్రకటన కలకలం రేపింది. ఎస్పీ ఎంపీలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వారి పేర్లతో ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్‌ యాదవ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారని, ఆ పేర్లు కూడా తనకు తెలుసున్నారు. ఎస్పీ ఎంపీల్లో కనీసం 25 మంది బీజేపీలో చేరతారని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య కూడా చెప్పారు. అయితే తమ పార్టీలో పూర్తి ఐక్యత ఉందని, అవన్నీ పుకార్లేనని ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ కొట్టిపారేశారు. వాస్తవంగా బీజేపీకి చెందిన చాలామంది నాయకులే తమ పక్షం వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.

ఏప్రిల్‌లో మహిళా రిజర్వేషన్ ప్యాకేజీలో భాగంగా వచ్చిన డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో 54 ఓట్ల తేడాతో ఆమోదం పొందలేదు. అయితే తాజా రాజకీయ పరిణామాల తరుణంలో అదే బిల్లు మళ్లీ ప్రవేశపెడితే ఆమోదం పొందే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం లోక్‌సభలో బలాబలాలు చూస్తే.. మొత్తం సభ్యుల సంఖ్య 543గా ఉంది. మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రస్తుత సభ్యుల సంఖ్య 540 మాత్రమే. మూడింట రెండొంతుల మెజార్టీ అంటే 360 మంది మద్దతు కావాలి. ఎన్డీఏకు ప్రస్తుతం 318 మంది సభ్యులున్నారు. ప్రతిపక్షానికి 184 మంది సభ్యుల బలం ఉంది. ఇతరులు 38 మంది ఉన్నారు. బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, రాజ్యాంగ సవరణ బిల్లుల ఓటింగ్ సమయంలో 528 మంది సభ్యులు హాజరయ్యారు. అప్పుడు బిల్లు ఆమోదానికి 352 ఓట్లు అవసరమయ్యాయి. NDAకు అనుకూలంగా 298 ఓట్లు మాత్రమే రావడంతో 54 ఓట్ల తేడాతో బిల్లు ఆగిపోయింది. కానీ అప్పటికి, ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం టీఎంసీ రెబల్ ఎంపీలు 20 మంది, ఉద్ధవ్ థాక్రే శివసేన ఎంపీలు ఆరుగురు కలిపి ఎన్డీఏ ఖాతాలోకి 26 ఓట్లు అదనంగా వస్తాయని అంచనా. అప్పుడు లోక్‌సభలో ఎన్డీఏ బలం 318 నుంచి 344కు పెరుగుతుంది.

స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కాంగ్రెస్‌తో విభేదాల తరుణంలో ఇండి కూటమికి దూరమైంది. ఇప్పటికే బీజేపీ డీఎంకేను ఎన్డీఏలోకి ఆహ్వానించిందనే ప్రచారం జరుగుతోంది. డీఎంకే ఎన్డీఏలో చేరకపోయినా.. లోక్‌సభలో ఎన్డీఏకు జై కొడితే.. ఆ పార్టీకి చెందిన 22 మంది ఎంపీల బలం కూడా జత కలుస్తుంది. అప్పుడు ఎన్డీఏ బలం ఏకంగా 344 నుంచి 366కు పెరుగుతుంది. ఇప్పటికే ఈ మేరకు స్టాలిన్ నుంచి హామీ ఉందని కూడా బీజేపీ వ్యూహాత్మకంగా ప్రచారం చేసుకుంటోంది. సరే ఇక్కడివరకు లోక్‌సభలో పరిస్థితి ఓకే. కానీ కీలకమైన రాజ్యసభ సంగతేంటి అనే ప్రశ్న వస్తుంది. రాజ్యసభలో రెండొంతుల మెజారిటీకి 164 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏ దగ్గర 150 మంది సభ్యులు ఉన్నారు. ఇక్కడ కూడా డీఎంకేకు చెందిన 8 మంది సభ్యుల మద్దతు లభిస్తే సంఖ్య 158కు చేరుతుంది. అప్పుడు మరో ఆరుగురు సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. అయితే వచ్చే సెషన్‌లో మహిళా, డీలిమిటేషన్ బిల్లులు వచ్చే సమయానికి.. ఏదో రకంగా ఈ బలం సమకూర్చుకోవచ్చనేది బీజేపీ ఆలోచనగా ఉంది. పైగా ఒక్కసారి బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందితే.. రాజ్యసభలో అనుకోని విధంగా మద్దతు లభిస్తుందనే లెక్కలు కూడా లేకపోలేదు.

ఇప్పటికే టీఎంసీ, శివసేన యూబీటీ నుంచి ఎంపీల్ని ఆకర్షించి మద్దతు కూడగట్టడంలో సఫలమైన బీజేపీ..ఇప్పుడు శరద్ పవార్ ఎన్సీపీ, నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్, పంజాబ్‌లో ఆప్ మీద కూడా కన్నేసినట్టు చెబుతున్నారు. త్వరలో ఈ ఆపరేషన్లు కూడా కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని చిన్న పార్టీలతో చర్చలు పూర్తయ్యాయని, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాక విపక్షానికి మరిన్ని షాకులిచ్చే ఉద్దేశంతో బీజేపీ ఉందనే చర్చ జరుగుతోంది. ఏదేైనా ప్రస్తుతం హస్తిన వేదికగా రాజకీయ వ్యూహాలు జోరుగా సాగుతున్నాయి. నయానో భయానో ఎంపీల బలం పెంచుకోవటానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కుదిరితే రాష్ట్ర స్థాయి నేతలు, పార్టీ సీఎంలు, అవసరమైతే అగ్రనేతలే నేరుగా రంగంలోకి దిగి పని పూర్తిచేయాలనే కార్యాచరణ సిద్ధమైంది. అన్నింటికీ మించి డీలిమిటేషన్ బిల్లును తిప్పికొట్టామనే ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతున్న ప్రతిపక్ష కూటమిని నైతికంగా చావుదెబ్బ కొట్టాలనేది కాషాయ పార్టీ లక్ష్యంగా ఉంది. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే రాజకీయ సమీకరణాలు మార్చే పని మొదలుపెట్టారనే అభిప్రాయాలు వస్తున్నాయి.

2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్‌ బిల్లు, మహిళా రిజర్వేషన్‌ బిల్లుల ఆమోదింప జేసుకోవాలన్న కృతనిశ్చయంతో ఉంది కేంద్రం. రెండింటికి పార్లమెంట్‌లో ఆమోదం పొందేలా…ప్రభుత్వం వ్యూహాత్మకంగా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అలా రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టే బిల్లులకు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ అవసరం. సభలో సభ్యుల హాజరు సగానికిపైగా ఉండాలి. హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆ బిల్లుకు మద్దతు తెలుపాలి. అప్పుడే ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 540 మంది ఎంపీలు సభకు హాజరైతే.. వారిలో 360 మంది తప్పనిసరిగా బిల్లుకు మద్దతు తెలపాలి. లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభ ముందుకు వస్తుంది. రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న 244 మంది సభ్యులు సభకు హాజరైతే.. 163 మంది బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టంగా మారుతుంది. కానీ అధికార ఎన్డీయే కూటమికి ఉభయ సభల్లో ఇప్పుడు అంత బలం లేదు. అందుకే ఆ బలం కూడగట్టానికి రకరకాల రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

ఇప్పటికే వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్‌ బిల్లును పునఃప్రవేశపెట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. మహిళా కోటా విషయానికొస్తే.. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం.. పునర్విభజన తర్వాతే 33 శాతం కోటా అమల్లోకి రావాలి. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో కూడా వన్-థర్డ్ కోటాను మహిళలకు కేటాయించనున్నారు. దీంతో అదే దామాషాలో ఆయా వర్గాల మహిళలకూ లబ్ధి చేకూరుతున్నట్టే. 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల బిల్లుతో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయి. నియోజకవర్గాల పునర్విభజన కాకపోవడంతో ఈ చట్టం అమల్లోకి రాలేదు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందుగానే ఈ చట్టాన్ని అమలు చేయాలంటే మరో రాజ్యాంగ సవరణ తప్పనిసరి. చట్టం ఏర్పడిన తర్వాత వచ్చే మొదటి జనాభా లెక్కల సేకరణ అనంతరం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళలకు రిజర్వేషన్‌ను అమలుచేయాలని చట్టం నిర్దేశిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనకు అతీతంగా ఇది అమలు చేయాలంటే ఈ చట్టంలోని సెక్షన్‌ 5ని ప్రభుత్వం సవరించాల్సి ఉంటుంది. ఇది పార్లమెంట్‌ ఉభయ సభల్లో హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది ఆమోదంతోనే చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని… రాజ్యాంగంలోని 368(2) అధికరణ నిర్దేశిస్తోంది.

లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్రం మరో ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది. లోక్ సభ నియోజకవర్గాలను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 824కి పెంచాలని ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి ఇప్పటికే సూచన చేసింది. . అంటే ప్రతీ రాష్ట్రంలో ఉన్న సీట్లలో మరో యాభై శాతం పెంచే బదులుగా…మరో కొత్త ఫార్ములాతో ఈ మండలి ప్రతిపాదనలు ఉండడం ఆసక్తిని పెంచుతోంది. మూడో వంతు పార్లమెంట్ సీట్లను మాత్రమే పెంచాలని ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. అంటే 170 పార్లమెంట్ నియోజకవర్గాలలోనే పునర్ విభజన ఉండనుంది. 59 పార్లమెంట్ నియోజకవర్గాలను రెండుగా విభజించాలని… మరో 111 సీట్లను మూడుగా చేయాలని మండలి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పుడు వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌ ముందుకొచ్చే బిల్లు ఇలాగే ఉంటుందా.. మరేదైనా మార్పు చేస్తారా అనేది చూడాల్సి ఉంది.

దేశంలో లోక్‌సభ, శాసనసభల నియోజక వర్గాల పెంపు… జనాభా ప్రాతిపదికన కాలానుగుణంగా పునర్వ్యవస్థీకరించాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్య కూడా కాలక్రమేణా పెరగాల్సి ఉంది. 1976లో జరిగిన రాజ్యాంగ సవరణ తర్వాత 2001 వరకు లోక్‌సభ నియోజకవర్గాల విస్తరణ నిలిపి వేశారు. మళ్లీ 2001లో రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు లోక్‌సభ నియోజక వర్గాల విస్తరణను ఆపేశారు. 2008లో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగి, దాని ప్రకారం 2009 నుంచి తదుపరి ఎన్నికలు జరిగాయి. కానీ సీట్ల సంఖ్య పెరగలేదు. దీంతో లోక్‌సభ సభ్యుల సంఖ్య 543గానే ఉండిపోయింది. అందుకే ఎమ్మెల్యే నియోజకవర్గాల డీలిమిటేషన్ ఎలా ఉన్నా.. ఎంపీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ను మొదట ఆమోదింపజేసుకోవాలనే లక్ష్యంతో కేంద్రం కనిపిస్తోంది. అంతేకాదు వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్‌ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదింపజేసుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ సారి ఎలాగైనా రెండు బిల్లులను ఉభయ సభల్లోనూ ఆమోదం పొందేలా…సభ్యుల మద్దతు కూడగట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది.

మోడీ ప్రధాని అయ్యాక పార్లమెంట్‌లో ఏ బిల్లు ఆమోదం విషయంలోనూ ఎన్డీఏ సర్కారు ఇబ్బంది పడలేదు. అందుకే రెండు నెలల క్రితం మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులు వచ్చినప్పుడు కూడా సర్కారు పకడ్బందీ ప్లాన్‌తోనే వచ్చుంటుందనే చర్చ జరిగింది. కానీ అధికార పక్షానికి షాకిస్తూ ఒక్కతాటిపైకి వచ్చిన విపక్షం.. ఆ రెండు బిల్లుల్ని తిప్పికొట్టింది. దీంతో ఎక్కడైనా అతివిశ్వాసానికి పోయామా అని ఎన్డీఏలో అంతర్గత చర్చ జరిగింది. ఆ సందర్భంగా పార్లమెంట్‌లో అనుసరించిన వ్యూహం.. విపక్షాల్ని ఎందుకు ఒప్పించలేకపోయామనే ప్రశ్నలకు సమాధానాలపై సమీక్ష జరిగింది. అప్పుడు జరిగిన పొరపాట్లు మరోసారి జరగకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకుని.. ఇంకా చెప్పాలంటే ప్లాన్‌ బీ కూడా రెడీగా పెట్టుకుని మరీ ఈసారి కేంద్రం రంగంలోకి దిగుతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక్కడ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల మద్దతే అసలు ఉద్దేశం కాదు. ప్రధానంగా 2/3 వ వంతు మెజార్టీ కూడగట్టడమే అసలు లక్ష్యం. అప్పుడే ఈ బిల్లులతో పాటు భవిష్యత్తులో యూనిఫామ్ సివిల్ కోడ్ అయినా.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులైనా సాఫీగా ఆమోదం పొందుతాయనేది బీజేపీ దూరాలోచనగా ఉంది. అందుకే ఈ లక్ష్యాన్ని తేలిగ్గా తీసుకోవటానికి కాషాయ పార్టీ సిద్ధంగా లేదు. ఈసారి విపక్షానికి పైచేయి సాధించే అవకాశం లేదని ఇప్పటికే జరుగుతున్న పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఓ రకంగా విపక్షాలే స్వయంగా తొలుత బీజేపీకి ఛాన్స్ ఇచ్చాయి. వచ్చిన అవకాశాన్ని రెండుచేతులా అందిపుచ్చుకోవటమే తమ కర్తవ్యమన్నట్టుగా బీజేపీ రాజకీయ వ్యూహరచన చేస్తోంది. ఇక్కడ రాజకీయ వ్యూహం, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్లానింగ్ సమాంతరంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.