చావు పుట్టుకలు దైవాధీనం అంటారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. చావు ఎటువైపు నుంచి ఎలా వస్తుందో కూడా తెలియదు. కొన్ని సంఘటనలు చూస్తే కలో నిజమో అర్ధకాని పరిస్థితి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతున్నారో చెప్పలేని పరిస్థితి. వయసుతో సంబంధం లేకుండా ముంచుకొస్తున్న కార్డియాక్ అరెస్ట్.. ప్రాణాల్ని బలితీసుకుంటోంది.
ఆధునిక జీవనశైలి.. యువతకు పెనుముప్పుగా మారుతోంది. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులన్న శ్రీశ్రీ మాట.. ఇప్పుడు అందరికీ వర్తిస్తోంది. ఒత్తిడి, జీవనశైలి, కాలుష్యం.. ఇలా కారణాలు ఏమైనా.. చిన్న వయసులోనే శరీరానికి ముసలితనం వచ్చేస్తోంది. పైకి మిలమిలా మెరిసిపోతున్నా.. లోపల అవయవాలన్నీ గుల్లబారిపోతున్నాయి. చిన్నవయసులోనే చావు తరుముకొస్తోంది.
రెండ్రోజుల వ్యవధిలో రెండు కార్డియాక్ అరెస్ట్ ఘటనలు జరిగాయి. తమిళనాడులో కబడ్డీ పోటీల్లో పాల్గొన్న ఓ వ్యక్తి పిల్లి మొగ్గ వేస్తూ… కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. అలాగే నిన్న హైదరాబాద్‌లో జాతీయ జెండా ఎగరేసిన ఓ వ్యాపారి మాట్లాడుతూ మాట్లాడుతూ గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. ఈ రెండు హృదయ విదారక ఘటనలు మనసును కలచివేస్తున్నాయి. ఇక్కడ ఎవరికీ ఎలాంటి మెడికల్ హిస్టరీ లేదు. అనుకోకుండానే ప్రాణాలు వదిలారు.
కొన్ని నెలల క్రితం కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి కూడా చిన్నవయసులోనే చనిపోయారు. వాళ్లకు డైలీ వర్కవుట్ చేసే అలవాటున్నా.. బాడీ చాలా ఫిట్ గా ఉన్నా.. కార్డియాక్ అరెస్ట్ తప్పలేదు. దీంతో జిమ్ లో చేసే వర్కవుట్లపైనా చర్చ జరిగింది. కార్డియాక్ అరెస్ట్ అనేది ఆకస్మికంగా వస్తుంది. దానికి సంబంధించిన ముందస్తు లక్షణాలు కూడా శరీరంలో ఏమీ కనిపించవు.
సాధారణంగా గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడే దీనికి కారణం. ఈ అలజడి ఫలితంగా హృదయ స్పందనలో, అంటే గుండె కొట్టుకోవడంలో సమతుల్యం దెబ్బతింటుంది. దీని వల్ల గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. దాంతో మెదడు, గుండె, శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ జరగకుండా పోతుంది. దీని వల్ల కొద్ది క్షణాల్లోనే రోగి అపస్మారక స్థితిలోకి వెళ్తారు. నాడి కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. కార్డియాక్ అరెస్ట్‌కు సరైన సమయంలో, సరైన చికిత్స లభించనట్టయితే రోగి కొద్ది సెకన్లు, నిమిషాల్లో మరణిస్తారు.
గుండెలో ఎలెక్ట్రికల్ సిగ్నల్స్‌లో తలెత్తిన లోపం కారణంగా శరీర భాగాలకు రక్త సరఫరా జరగక పోవడంతో అది కార్డియాక్ అరెస్ట్‌గా మారుతుంది. శరీరం రక్తాన్ని పంప్ చెయ్యడం మానెయ్యగానే మెదడులో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. అలా జరిగినప్పుడు మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. శ్వాస ప్రక్రియ ఆగిపోతుంది. అసలు సమస్య ఏంటంటే, కార్డియాక్ అరెస్ట్‌కు ముందు ఏ విధమైన లక్షణాలూ కనపించవు.
అందువల్లే కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు ప్రాణాలు పోయే అవకాశాలు చాలా ఎక్కువ.గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడమే దీనికి కారణం. దీనిని వైద్య పరిభాషలో వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ అంటారు.
గుండెకు సంబంధించిన విద్యుత్ కార్యకలాపాలు ఎంతగా అస్తవ్యస్తమవుతాయంటే, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఒక విధమైన వణుకు వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ అనేక కారణాల వల్ల రావొచ్చు. అయితే కొన్ని గుండె సంబంధిత వ్యాధుల వల్ల కూడా ఇది వచ్చే అవకాశాలున్నాయి.
చాలామంది కార్డియాక్ అరెస్ట్, గుండె పోటు రెండూ ఒకటే అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. కరోనరీ రక్తనాళంలో అడ్డంకి లేదా క్లాట్ ఏర్పడినప్పుడు గుండె కండరాల వరకు రక్తం సరఫరాలో ఆటంకం ఏర్పడటంతో గుండె పోటు వస్తుంది. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు గుండెల్లో తీవ్రమైన నొప్పి వస్తుంది. కానీ కొన్ని సార్లు ఈ లక్షణాలు బలహీనంగా ఉండొచ్చు. అయినా గుండె మాత్రం బాగా బలహీనపడుతుంది. ఇందులో శరీరంలోని మిగతా భాగాలకు గుండె రక్త ప్రసరణ చేస్తూనే ఉంటుంది. రోగి స్పృహలోనే ఉంటారు. అయితే హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తికి కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు గుండె తక్షణమే రక్త ప్రసరణను నిలిపివేస్తుంది. అందువల్లనే కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వ్యక్తి తక్షణం స్పృహ కోల్పోతాడు. శ్వాస ప్రక్రియ కూడా నిలిచిపోతుంది.
ఇప్పుడు యువతలో కూడా షుగర్ వ్యాధి పెరిగిపోయింది. ముప్ఫైల్లోనే మధుమేహం బారిన పడుతున్నారు. ఈ కారణంగా 40 ఏళ్లు వచ్చేసరికి దీర్ఘకాలిక మధుమేహ బాధితులుగా ఉంటున్నారు. దీంతో నలభైలలో ఆరోగ్యంపై మరింత తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఈ కారణంగానే హఠాత్తుగా గుండెపోట్లు వస్తున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. కేవలం గుండెపోటే కాదు.. రకరకాల కారణాలతో పెరుగుతున్న కేన్సర్లు కూడా ప్రాణాలు కబళిస్తున్నాయి.
ఒకప్పుడు రిటైర్మెంట్ వయసు వచ్చేవరకు ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు యవ్వనంలోనే అనుకోని సమస్యలు చుట్టుముడుతున్నాయి. రిటైర్మెంట్ ఏజ్ కు ఒకటి, రెండు దశాబ్దాలు ముందుగానే శరీరం మొండికేస్తోంది.
మనసు ఎప్పుడూ మనిషి చెప్పినట్టు వినదు. ఇప్పుడు శరీరం కూడా మన మాట వినడం మానేస్తోంది. శరీర భాషను అర్థం చేసుకోవడంలో ఆధునిక మానవుడు విఫలమౌతుండటంతో.. అన్ని సమస్యలకూ మూలకారణమని చెబుతున్నారు. పరుగెత్తి పాలు తాగే కంటే.. నిలబడి నీళ్లు తాగాలంటారు. అందం, ఆరోగ్యం మీద అతి శ్రద్ధతో చేసే పనులు లేనిపోని అనర్థాలకు దారితీస్తున్నాయి. అంతా బాగానే ఉన్నా.. ఇతరులతో పోల్చుకుని.. దేనికోసమే తాపత్రయపడి చేస్తున్న పనులే కొంప ముంచుతున్నాయి. నేటి తరం యువతలో కెరీర్ స్పృహ ఉన్నంత రేంజ్ లో ఆరోగ్య స్పృహ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం అనే సంగతి చాలా మంది పట్టించుకోవడం లేదు. ఏది దొరికితే అది తింటున్నారు. సమయ పాలన అసలే పాటించడం లేదు. ఎంత షిఫ్ట్ డ్యూటీలైనా.. ఓ టైమ్ ప్రకారం తినాలనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తున్నారు. ఇవన్నీ పైకి చిన్న విషయాలుగా కనిపిస్తున్నా.. లోలోపల మన శరీరానికి చేస్తున్న డ్యామేజ్ అంతా ఇంతా కాదు.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు చిన్నవయస్సు వారినే జబ్బులకు గురయ్యేలా చేస్తున్నాయి. ఈ పరిణామాలు ముఖ్యంగా యువత బంగారు భవిష్యత్తును దెబ్బతీసేవిగా పరిణమించాయి. జబ్బులను నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన అవసరం యువతకు ఏర్పడింది. చిన్నవయస్సులోనే యువత జబ్బుల బారిన పడి మరణిస్తుండటం పట్ల నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మధుమేహం, హైపర్ టెన్షన్, క్యాన్సర్, పెరాలసిస్, గుండె జబ్బులు వంటివి వ్యాధులు యువతను చుట్టుముడుతున్నాయి. వీటితోపాటుగా మానసిక జబ్బులు యువతపై ముప్పేట దాడి చేస్తున్నాయి.
ఒత్తిడి కారణంగా.. అధిక రక్తపోటు, ఛాతీ నొప్పి, హృదయ స్పందన పెరగడం లాంటి సమస్యలు ఏర్పడుతాయి. దీని కారణంగా గుండె కండరాలు బలహీనపడి.. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. ధూమపానం చేసేవారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. గుండె జబ్బులతో మరణించిన ప్రతి ఐదుగురిలో.. ఒకరు ధూమపానానికి సంబంధించిన వారే ఉన్నారు. జంక్ ఫుడ్ తినడం వల్ల కేలరీలు, చెడు కొలెస్ట్రాల్ అమితంగా పెరుగుతాయి. ఇలా నిరంతరం తినడం వల్ల బరువు పెరుగుతారు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు కూడా పెరుగుతాయి.
యువత గుండె వీక్ అవడానికి జీవనశైలి ప్రధాన కారణం. సమయానికి భోజనం, నిద్ర ఉండట్లేదు. ఒత్తిడి ఎక్కువవుతోంది. జంక్‌ఫుడ్ పట్ల ఆకర్షితులవుతున్నారు. రోజుకు 14 గంటలు పని చేస్తున్నారు. వీకెండ్స్‌లో హెవీ వర్కవుట్లు, మారథాన్లు అంటూ శరీరంపై ఒత్తిడిని పెంచే ఎక్సర్‌సైజులు చేస్తున్నారు. ఇది మీ శరీరానికి ఎంత వరకు మేలు చేస్తుందో చూసుకొని చేయాలి.
అప్పటి వరకు బాగానే ఉంటారు.. తమంత ఆరోగ్య వంతులే లేరనుకుంటారు.. ఆహార నియమాలు పాటిస్తారు.. వర్కవుట్లెన్నో చేస్తుంటారు.. అయినా అలసట ఏ మాత్రం లేకుండా, నిరంతరాయంగా పని చేసే గుండె ఒక్కసారిగా పని చేయడం మానేస్తుంది. గుండె ఆగిపోతుంది.. మనమధ్యే ఉన్నాడునుకున్న మనిషి కాస్తా మరణిస్తాడు.. అసలు ఎందుకు ఇంత సడెన్ గా ఇలా జరుగుతుంది..?
కార్డియోవాస్కులర్ వ్యాధుల మూలంగా ప్రపంచంలో ఏటా 1.7 కోట్ల మంది మరణిస్తున్నారు. మొత్తం మరణాల్లో ఇవి 30 శాతం.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో హెచ్ఐవీ, మలేరియా, టీబీ వ్యాధుల మూలంగా సంభవిస్తున్న మొత్తం మరణాలకు రెట్టింపు సంఖ్యలో ఈ మరణాలున్నాయి. గుండె సంబంధిత వ్యాధుల ఫలితంగా సంభవిస్తున్న మరణాలలో ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌తో జరుగుతున్న మరణాలు 40-50 శాతం వరకు ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ కేసులలో ప్రాణాలతో బయటపడే కేసులు ప్రపంచంలో కేవలం ఒక శాతం మాత్రమే కాగా, అమెరికాలో 5 శాతం మంది బయపడగల్గుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్డియాక్ అరెస్ట్ మూలంగా సంభవిస్తున్న మరణాలను బట్టి చూసినప్పుడు ఇదెంత ప్రాణాంతకమైందో తెలుస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం.. గుండెపోటులు, స్ట్రోక్‌లు సాధారణంగా తీవ్రమైన సంఘటనలు. అంటే ప్రాణాంతకమైన సంఘటనలు. ముఖ్యంగా గుండె లేదా మెదడులోకి రక్తం ప్రవేశించకుండా నిరోధించే అడ్డంకుల కారణంగా గుండెపోటు సంభవిస్తుంది. ముఖ్యంగా 60 ఏళ్లలోపు వారిలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. దీని వల్ల సిద్ధార్థ్ శుక్లా, పునీత్ రాజ్ కుమార్, రాజ్ కౌశల్ వంటి 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ప్రముఖులను ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురూ ఆరోగ్యకరమైన జీవనశైలి, ఫిట్‌నెస్ వంటివి పాటిస్తారు. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
శారీరకంగా ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్ గుండెపోటుతో మరణించడం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆశ్చర్యానికి గురయ్యారు. దాంతో ఇప్పుడు అందరికీ జిమ్‌లో హెవీ వర్కవుట్లు చేయాలంటే భయం పట్టుకుంది. అయితే ఏదైనా మితంగా తింటే భోజనం రుచిగా ఉన్నట్లు.. వ్యాయామం కూడా శరీర సూచనల మేరకు చేస్తేనే ఆరోగ్యం అని వివరిస్తున్నారు హృదయ సంబంధిత నిపుణులు.
మనిషి ధృఢంగా ఉన్నంత మాత్రాన ఫిట్‌గా ఉన్నట్లు కాదు.. వర్కవుట్లు ఎక్కువగా చేసినప్పుడు శరీరంలో హార్ట్‌బీట్ రిథమ్ దెబ్బతింటుంది. దీంతో సడెన్ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే శరీరంలోని అదనపు కాల్షియం ముక్కలుగా ఏర్పడి రక్తనాళాల్లో అతుక్కొని ఉంటుంది. శక్తికి మించి వ్యాయామాలు చేసినప్పుడు గుండె, ఊపిరితిత్తుల్లో ఆ ముక్కలు ఇరుక్కుపోతాయి. దీంతో ఆరోగ్యంగా ఉన్నవారిలోనూ గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. జన్యపరమైన కారణాలు కూడా గుండెపోటుకు దారితీస్తాయి. గుండె వేగం పెరిగి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. సాధారణంగా రోజుకు 30 నిమిషాల పాటు వర్కవుట్ చేస్తే సరిపోతుంది. ఉన్నపళంగా బరువు తగ్గిపోవాలని ఎక్కువ సేపు వ్యాయామాలు చేయడం అంత శ్రేయస్కరం కాదని చెబుతున్నారు కార్డియాలజిస్టులు. ఇలా చేయడం వలన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గుండె శరీరంలోని మిగతా భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడంలో ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఫలితం హార్ట్ స్ట్రోక్‌కి దారితీస్తుంది. తీసుకునే ఆహరం కూడా ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. హెవీ వర్కవుట్లు చేశాక తగినంత రెస్ట్ కూడా ముఖ్యం.
జీవనశైలి మార్పులు అకాల గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. వాకింగ్, సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని 30 శాతం వరకు తగ్గించవచ్చు. రోజూ కనీసం 10 వేల అడుగులన్నా నడవాలి. జంక్ ఫుడ్‌కు బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ రోజుల్లో ప్రజలు ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌లపై ఎక్కువ సమయం గడుపుతున్నారు. కాబట్టి గుండె ఆరోగ్యానికి యోగా, వ్యాయామం చాలా ముఖ్యం. ఇది కాకుండా, ముందు జాగ్రత్త చాలా ముఖ్యం. యువకులు తమ గుండెను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి.
లాక్‌డౌన్ సమయంలో చాలామంది యాప్స్, యూట్యూబ్, సామాజిక మాధ్యమాల ద్వారా దొరికే సమాచారం.. ఆన్‌లైన్ శిక్షకుల సూచనలతో వ్యాయామం, యోగ సాధన చేశారు. జిమ్‌లు తెరచినా ఇప్పటికీ ఇంటివద్ద వ్యాయామం చేస్తున్నవారే ఎక్కువ ఉంటున్నారు. కొందరు ఎలాంటి శిక్షణ లేకుండా కసరత్తులు చేస్తూ.. సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. యూట్యూబ్ వీడియోలను అనుసరించి యోగాసనాలు, వ్యాయామం చేయటం వల్ల కొత్త సమస్యలు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జిమ్ లో వ్యాయం చేసినా.. బయట కసరత్తులు చేసినా.. అన్నీ శారీరక ఆరోగ్యం కోసమే. ఎప్పటికప్పుడు మన శరీరంతో మనం టచ్ లో ఉండాలి. శరీరం నుంచి వచ్చే స్పందనలు, ప్రతిస్పందనలు జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా వయసు పెరిగేటప్పుడు శరీరంలో వచ్చే మార్పుల్ని అర్థం చేసుకోవాలి. 30ల్లో ఉన్నప్పటిలా శరీరం.. 40ల్లో.. 50ల్లో ఉండదనే వాస్తవాన్ని అంగీకరించాలి. అంతేకానీ 60 ఏళ్లు వచ్చాక సెకండ్ థర్టీస్.. అంటూ అతి ఉత్సాహం పనికిరాదు. ఈ వయసులో ఇంత ఫిట్ గా ఉండాలి అనే లెక్కలేవీ పక్కాగా ఉండవు. ఎంత వయసు వచ్చినా ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యం. మనం చేయగలిగిన పనులే చేయాలి. చేయలేనివి వదిలేయాలి.
మితంగా తింటే అమృతం.. అతిగా తింటే విషం అని మన పెద్దలు చెప్పే మాట ఫిట్‌నెస్ విషయంలోనూ వర్తిస్తుంది. వ్యాయామం శరీరానికి చాలా అవసరం. ఆరోగ్యానికి మంచిది కూడా. కానీ అది మితిమీరితే మాత్రం అత్యంత ప్రమాదకరం. శరీరం ఎంతమేరకు సహకరిస్తుందో అంతవరకు మాత్రమే కసరత్తులు చేయాలి. కొంతమంది ఊబకాయం వచ్చినా నాలుగడుగులు వేయడానికి బద్ధకిస్తారు. మరికొందరు ఫిట్ గా ఉన్నా.. సిక్స్ ప్యాక్.. మంచి షేప్ అంటూ జిమ్ లో గంటల తరబడి చెమటోడుస్తున్నారు. హేతుబద్ధంగా ఆలోచిస్తే.. ఈ రెండు ధోరణులూ ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు.
ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లతో కూడిన జీవనశైలి కూడా లేనిపోని సమస్యలకు దారితీస్తోంది. కెరీర్ తో పాటు ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోతే కష్టమే అంటున్నారు నిపుణులు. ఓవైపు పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్స్ గురించి చర్చ జరుగుతున్న సమయంల.. హఠాన్మరణాలు అందర్నీ భయపెడుతున్నాయి.
చదువులు, వృత్తి పరంగా ఎదురవుతున్న వత్తిడుల కారణంగా చాలా మంది అనేక మానసిక ఆందోళనలకు లోనవుతున్నారు. అవి క్రమేపి వివిధ రకాల అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. ఉద్యోగాలు, చదువుల్లో గతంతో పోలిస్తే యువతలో ఎక్కువ మంది ఒత్తిడికి లోనవుతున్నారు. సరైన వ్యాయామం లేకపోవడం, ఒత్తిడితో కూడిన జీవితం, వేళకు తిండి, నిద్ర లేకుండా గడపటం వంటి వాటివల్ల 35 ఏళ్లలోపు యువకులు హార్ట్ స్ట్రోక్‌ల బారినపడుతున్నారు. డయాబెటిక్ బాధితుల సంఖ్య పెరగడానికి ఇవేకారణంగా నిపుణులు చెబుతున్నారు.చాలా మంది ఖర్చులకు తగ్గట్టు ఆదాయం లేకపోవడం వల్ల మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
ఈ మధ్యకాలంలో ప్రొటీన్ రిచ్ డైట్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కార్బోహైడ్రేట్ తక్కువ తినాలనేది ఇంకో ఫ్యాషన్. ప్రోటీన్లు అధికంగా ఉన్న డైట్‌ని అధికంగా తీసుకొని బాగా వర్కవుట్ చేస్తున్న కొందరిలో యూరిక్ యాసిడ్ స్థాయిలు బాగా పెరిగి కీళ్ల నొప్పులు వస్తున్నాయి. మన దగ్గర చాలా మంది కేవలం ప్రోటీన్లే అధికంగా తీసుకొని కార్బోహైడ్రేట్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆహారంలో ప్రొటీన్లతో పాటు కార్బోహైడ్రేట్ల సమతుల్యతపై దృష్టిపెట్టాలి. కానీ చాలా మంది కార్బోహైడ్రేట్లు తక్కువ తీసుకొని గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్లు చేసి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తక్కువ భోజనం తీసుకొని ఎక్కువ వర్కవుట్లు చేసి సన్నబడిపోవాలనుకోవద్దు. అదనంగా వర్కవుట్లు చేయాలని అనుకుంటే ఆ రోజు అదనంగా కార్బోహైడ్రేట్లు తీసుకుంటే తగినంతగా శక్తి వస్తుంది. అది శరీరానికి మంచిది. పరిమితికి మించి వ్యాయామం చేస్తే అనర్థమే. ఫిజికల్ వర్కవుట్ చేశాక శరీరం రికవరీ అయ్యాకే మళ్లీ వర్కవుట్‌కు వెళ్లాలి తప్ప.. మళ్లీ మళ్లీ వర్కవుట్ చేస్తే శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. రికవరీ పీరియడ్ చాలా ముఖ్యం. కంటి నిండా మంచి నిద్ర అవసరం.
గుండెపరమైన సమస్యలు యువతలో పెరుగుతున్నాయి. దీనికి మారుతున్న జీవనశైలే ప్రధాన కారణం. గతంతో పోలిస్తే ఈ పర్సంటేజ్ పెరుగుతోంది. ఈ పోటీ ప్రపంచంలో యువతకు నిద్ర కరవవుతోంది. ఒత్తిడి పెరిగిపోతోంది. జంక్‌ఫుడ్ అలవాటైంది. మద్యం, సిగరెట్లకు బానిసలవుతున్నారు. ఇలాంటి ప్రతికూల జీవనశైలితో ఆరోగ్యం దెబ్బతింటోంది. చిన్న వయస్సులోనే అద్భుతమైన ఉద్యోగావకాశాల్ని అందిపుచ్చుకొంటున్న నేటి యువత రోజుకు 14గంటల పాటు పనిచేస్తున్నారు. వీకెండ్ వారియర్స్ సంస్కృతి పెరుగుతోంది. వారం రోజుల పాటు కూర్చొని పనిచేసి వీకెండ్‌లో కొవ్వును కరిగించుకొనేందుకు ట్రెక్కింగ్, లాంగ్ మారథాన్‌కు వెళ్లడం వంటివి అనుసరిస్తున్నారు. ఒకేసారి శరీరంపై ఒత్తిడి పెంచే ధోరణిని వీడి రెగ్యులర్ ఫిట్‌నెస్‌ని అలవరచుకోవడం, ఆహార సమతుల్యతను పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వ్యాయామం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అతిగా చేస్తే అనర్థమే. శరీరం ఎంతమేరకు సహకరిస్తుందో అంతవరకే చేయాలి.
కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బులు ఉన్న మెడికల్ హిస్టరీ ఉన్నట్టైతే చిన్నవయసులోనే పరీక్షలు చేయిస్తుండాలి. 40 ఏళ్లు దాటిన ప్రతివారూ తరచూ హైబీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజెస్ కోసం సాధారణ పరీక్షలు చేయించుకోవాలి. అవసరాన్ని బట్టి ఆ పరిస్థితిని నియంత్రించుకోవడం కోసం తగిన మందులు వాడుతూ ఉండాలి. వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో ఒత్తిళ్లపై కూడా ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచాలి. ఎప్పటికప్పుడ పర్సనల్ స్పేస్ తీసుకుని.. మనసుకి నచ్చినట్టుగా రిలాక్స్ అవ్వడం కూడా ముఖ్యమే. ఆధునిక జీవనశైలిలో.. స్ట్రెస్ రిలీఫ్ కు మించిన మందు లేదంటున్నారు డాక్టర్లు. ప్రొఫెషన్ ఏదైనా.. ఒత్తితి కామన్ అయిపోయిన ఈరోజుల్లో.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొత్త తరహా ప్రయత్నాలు చేయక తప్పదు. జీవించే విధానం, చేసే పని, తినే తిండి అన్నింటిలోనూ వస్తున్న తేడాలు.. అనుకోని ప్రమాదాల్ని కొనితెస్తున్నాయి. వీటికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే.. మరిన్ని ముప్పులు పొంచి ఉన్నాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. కోవిడ్ తర్వాత ఆరోగ్య స్పృహ పెరిగిన మాట నిజమే అయినా.. ఇది చాలదని, ఇంకా చేయాల్సింది చాలా ఉందంటున్నారు నిపుణులు.
ఏదేమైనా ఆరోగ్యమే మహాభాగ్యమని అందరూ గుర్తుంచుకోవాలి. ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదనే విషయాన్ని కచ్చితంగా నమ్మాలి. ఎన్ని డబ్బులు సంపాదించినా.. ఎంత ఉన్నత హోదాలో ఉన్నా.. గుండెపోటు వస్తే ఎవరూ చేసేదేమీ లేదనే విషయం గ్రహించాలి. ఎన్నాళ్లు బతుకుతామో ఎవరికీ తెలియదు. కానీ బతికినన్ని రోజులు ఆరోగ్యకరంగా జీవించడం మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.