చట్టాలు కొందరికే చుట్టాలు. మన దేశంలో చాలా ఈజీగా ఈ కామెంట్ పాస్ అవుతూ ఉంటుంది. దీనికి కారణాలు లేకపోలేదు. చట్టాల అమలు తీరు అలా ఉంటుంది. రాజకీయ, వ్యక్తిగత కక్షలకు దుర్వినియోగం అయ్యే చట్టాలు అనేకం. వీటిల్లో కొన్ని ప్రమాదకర చట్టాలు కూడా ఉంటాయి. ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా శతాబ్దాల క్రితం బ్రిటిషర్లు రూపొందించిన IPCలో కొన్ని సెక్షన్లు ఇప్పటికీ భారతీయులకు ఉరితాడుగానే ఉన్నాయి. అందులో 124A ఒకటి. తదుపరి సమీక్ష జరిగేవరకు ఈ సెక్షన్ అమలును నిలిపివేసింది సుప్రీంకోర్టు. ఇది రాజద్రోహానికి సంబంధించిన సెక్షన్. దీని కోరలు ఎంత పదునో.. బాహువులు కూడా అంతే పెద్దవి. ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేయడంలో అధికారంలో ఉండే పార్టీలు పోటీ పడుతున్నాయనే చెప్పాలి. గిట్టని వారిపై కేసు పెట్టడానికి ప్రభుత్వానికి చిక్కిన బ్రహ్మాస్త్రం. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనా.. రాజద్రోహం వంటి సెక్షన్ల వల్ల ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటోంది. ఏలిన వారు తలుచుకోవాలనే కానీ.. కాళ్లు చచ్చుబడి చక్రాల కుర్చీలకే పరిమితమైన వారిపైనా.. కాడి రమ్మంటోంది ఊరిపొమ్మంటోంది అనే వృద్ధులపైనా సెక్షన్ 124A ప్రయోగించేస్తారు. దీనికి ప్రొఫెసర్ సాయిబాబా, విరసం నేత వరవరరావు ఒక ఉదాహరణ మాత్రమే. 124A నుంచి తప్పించుకుంటారని అనుమానం వల్లో ఏమో.. మరిన్ని కఠిన చట్టాల సెక్షన్లతో జైలు గొడలకే పరిమితం చేస్తాయి దర్యాప్తు సంస్థలు. ఇలాంటి పోకడలు మనకు అవసరమా అనే ఆలోచన ఎవరికీ రాదు. ఒకవేళ వచ్చినా ప్రశ్నించలేరు. కారణం 124A వారిపై ఎక్కడ ప్రయోగిస్తారో అనే భయం. ఇదే కాదు.. కాలం చెల్లిన చట్టాలు. ప్రభుత్వం చేతిలో పశుపతాస్త్రాలుగా మారిన యాక్టులు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. మరెన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. అనేకమంది జీవితాలను చిద్రం చేశాయి. ఆ విషయం పాలకులకు తెలియంది కాదు. కానీ.. వారి లక్ష్యం వేరు. ఈ అంశంలోనే ప్రజస్వామ్య పునాదులు కదులుతున్నాయి.
ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 1500 చట్టాలను రద్దు చేసినట్టు కమలనాథులు చెబుతారు. వివిధ సందర్భాలలో ప్రధాని మోడీ సైతం కాలం చెల్లిన పురాతన చట్టాలను రద్దు చేయాలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే కేంద్రం దృష్టిలో కాలం చెల్లిన చట్టాలకు నిర్వచనం ఏంటి అనేది పెద్ద బ్రహ్మపదార్థం. ప్రస్తుతం దేశం అభివృద్ధి దిశగా ఎంతో పురోగమిస్తోంది. అగ్రదేశాల సరసన నిలుచోడానికి చేయని ప్రయత్నాలు లేవు. కానీ.. మేడిపండు చందంగా మారిన చట్టాల విషయంలో సాఫ్ట్ కార్నర్ ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తుందన్నది న్యాయ నిపుణులు తరచూ ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. సామాన్య జనాల అభిప్రాయం కూడా ఇదే కానీ. ఆచరణకు వచ్చేసరికి పాలకుల్లో చలనం ఉండదు. విపక్షాలు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తవు. రైతులు, వృద్ధులు, విద్యార్ధులు, రాజకీయ నాయకులపై కాలం చెల్లిన చట్టాలను ప్రయోగిస్తుంటే ఎలా చూడాలి? ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే.. వారి గొంతు నొక్కడానికి ఏం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కేంద్రం చెబుతున్నట్టుగా ఇప్పటి వరకు రద్దు చేసిన 1500 చట్టాల్లో ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారినవి ఎన్నో? చిన్నా చితకా చట్టాలు రద్దు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు కొన్నే. కానీ… ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసి.. శాంతియుత వాతావరణంలో జీవించడానికి వీలులేని కఠిన చట్టాలు మన దేశంలో ఇంకా అనేకం ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో జనం ఆంక్షల మధ్యే రోజుల వెళ్లదీస్తున్నారు. అలాంటి ఆంక్షలకు ఆస్కారం కల్పించే చట్టాలపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. 124Aపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వాటిపై అదే పనిగా ప్రశ్నలు సందిస్తున్నారు న్యాయ నిపుణులు.
భారత శిక్షాస్మృతి IPCని 1860లో బ్రిటిషర్లు తీసుకొచ్చారు. ఇప్పటికీ అదే అమలులో ఉంది. కొన్ని మార్పులు.. చేర్పులు చేసినా.. మారిన కాలానికి అనుగుణంగా ఛేంజస్ రాలేదన్నది నిపుణుల మాట. పురాతన చట్టాలకు కాలం చెల్లితే.. 1860నాటి IPCలోని దేశద్రోహం సెక్షన్‌ను కేంద్రం ఎందుకు రద్దు చేయలేదు. వాస్తవానికి 2018లోనే లా కమిషన్ 124Aను రద్దు చేయాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని ప్రకటించింది. కానీ.. నాలుగేళ్లు గడిచినా.. లా కమిషన్ సిఫారసులకు అతీగతీ లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పాక.. తామూ అదే పనిలో ఉన్నామని చెబుతోంది కేంద్రం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంలో ఒక్కొక్కరిదీ ఒక్కోమాట. ఆ మధ్య మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో సుదీర్ఘ పోరాటం చేశారు. చివరకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాటిని రద్దు చేసింది కేంద్రం. ఇదే వైఖరి ఇతర చట్టాల విషయంలో ఎందుకు లేదన్నదే ప్రశ్న. వ్యవసాయ కార్మికులు, పరిశ్రమల్లో పనిచేసే కష్టజీవులు తమ జీవన ప్రమాణాలు మెరుగు పర్చాలని.. కొత్త చట్టాలు తేవాలని కోరుతున్నా.. పాలకులకు పట్టదు. పైగా ప్రమాదకరంగా ఉన్న దశాబ్దాల నాటి చట్టాలనే ఇప్పటికీ అమలు చేస్తున్న పరిస్థితి మన దేశంలో ఉంది.
దేశానికి స్వాతంత్యం వచ్చాక అమలులోకి వచ్చింది కేవలం రాజ్యాంగం మాత్రమే. కానీ.. అనేక చట్టాలు అంతకుముందు నుంచీ ఉన్నవే. రాజ్యాంగ హక్కులను అవి కాలరాస్తున్నా.. టచ్ మీ నాట్‌గా ఉంటున్నారు పాలకులు. తమ ప్రాంతానికి మరణశాసనం రాస్తున్న చట్టాలను రద్దు చేయాలని దశాబ్దాలుగా దీక్షలు చేసిన ఉద్యమకారులు మన దేశంలో ఉన్నారు. చట్టాలు దుర్వినియోగం అవుతున్నా.. అమాయకుల ప్రాణాలు పోతున్నా.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేదో అర్ధం కాదు. ఆ మధ్య చట్టాల దుర్వినియోగంపై అనేక మంది నిరసన వ్యక్తం చేస్తూ కేంద్రం ద్వారా తాము అందుకున్న పురస్కారాలను తిరిగి ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. కోర్టుకు ఎక్కి న్యాయ పోరాటం చేస్తున్నవాళ్లు కోకొల్లలు.
హక్కుల కోసం పోరాడే వారిపై నిరంకుశ చట్టాలను ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ప్రయోగిస్తున్నాయి. ఈ విషయంలో ఒక్కరినే తప్పుపట్టడానికి లేదు. విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరోమాట చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. మన దేశ చరిత్రలో చీకటి రోజులుగా మిగిలిన చట్టాలే అందుకు ఉదాహరణ.
ప్రస్తుతం IPC 124A గురించి చర్చిస్తున్నాం కానీ.. మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చాక కాలం చెల్లిన చట్టాల వల్లే కాదు.. చీకటి చట్టాల వల్ల కూడా ప్రజాస్వామం ప్రమాదంలో పడిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. వీటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి టాడా.. పోటా చట్టాలే. ఒక లక్ష్యం కోసం తీసుకొచ్చిన చట్టాలను మరోవిధంగా ప్రయోగించిన ఉదంతాలు అనేకం కనిపిస్తాయి. ఇందుకు 1985లో వచ్చిన టాడా చట్టమే పెద్ద ఉదాహరణ. పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణిచి వేయడానికి టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ ఆక్టివిటీస్ నిరోధక చట్టం.. టాడాను తీసుకొచ్చారు. పదేళ్లపాటు ఈ చట్టం అమలులో ఉంది. ఖలిస్తాన్‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన టాడా యాక్ట్‌ను తర్వాతి కాలంలో ఏవిధంగా ప్రయోగించారో చరిత్ర సాక్ష్యం. తొలుత ఆర్డినెన్స్‌గా వచ్చిన టాడా.. తర్వాత 1987లో పూర్తిస్థాయి చట్టంగా రూపొందింది. దేశంలో ఉగ్రవాద కార్యలపాల నిరోధానికి టాడాను అస్త్రంగా ఉపయోగించుకున్నా.. దానిని దుర్వినియోగం చేసిందే ఎక్కువ. ఆ సమయంలో దేశవ్యాప్తంగా గగ్గోలు పెట్టారు హక్కుల ఉద్యమకారులు. రాజకీయ అణిచివేతలకు.. ఒకవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని టాడాను ఎడాపెడా వాడేశారు. చివరకు ప్రజా ఆందోళనలకు పాలకులు తలగ్గొక తప్పలేదు. 1995లో అంటే పదేళ్ల తర్వాత దానికి మంగళం పలికారు.
టాడా స్థానంలో 2002లో వచ్చిన పోటా చట్టం మరింత ప్రమాద ఘంటికలు మోగించింది. ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ పేరుతో తీసుకొచ్చిన పోటాపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ సెగ అప్పటి రాజకీయ పక్షాలను ఉక్కిరి బిక్కిరి చేసిందనే చెప్పాలి. నాటి కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అధికారంలోకి వస్తే పోటాను రద్దు చేస్తుందని హామీ ఇచ్చి.. చెప్పినట్టుగానే 2004లో రద్దు చేశారు. ఇలా టాడా.. పోటాలు రద్దయినా.. రూపు మార్చుకుని అమలులోకి వచ్చిన చీకటి చట్టాలు ఇంకా ఉన్నాయి. వాటిపై ఇంకా పోరాడుతూనే ఉన్నారు బాధితులు. పలు సందర్భాలలో చట్టాల దుర్వినియోగంపై న్యాయస్థానాలు అక్షింతలు వేసినా పాలకులకు చీమకుట్టినట్టు అయినా లేదు. కోర్టులు అంటూ ఉంటాయి.. మనం చేసేది చేస్తూనే ఉండాలనే ధోరణి పెరిగిపోయింది.
మన దేశంలో దశాబ్దాలుగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మరో చట్టం AFSPA. ఇది సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం. 1958లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఉగ్రవాదులు.. సాయుధ దళాలకు అంతరాయం కలిగించే ప్రాంతాలలో ప్రజాశాంతి నెలకొల్పానే ఉద్దేశంతో ఈ చట్టానికి ప్రత్యేక అధికారాలు కల్పించారు నాటి పాలకులు. అయితే అపరిమిత అధికారాల వల్ల సైన్యం అతిక్రమణలకు.. హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గత ఏడాది చివరిలో నాగాలాండ్‌లో ఉగ్రవాదులుగా భావించి సైన్యం జరిపిన కాల్పుల్లో 14 మంది కూలీలు చనిపోయారు. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న కూలీలపై తుటాలు వర్షం కురిసింది. చిన్నపాటి పొరపాటు కారణమే అయినా.. క్షణాల్లో 14 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కూలీల శరీరాలను తూటాలు ఛిద్రం చేశాయి. AFSPA చట్టం ప్రధానంగా ఈశాన్య రాష్ట్రల్లో అమలులో ఉంది. అక్కడ ఉగ్రవాద కార్యకలపాలను అరికట్టడానికి తీసుకొచ్చినా.. ప్రజల హక్కులు కాలరాసిందే ఎక్కువన్నది న్యాయ నిపుణులు చెప్పేమాట. అసోం, నాగాలాండ్, మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాలు.. అరుణాచల్ ప్రదేశలోని కొన్ని ప్రాంతాల్లో ఈ చట్టం అమలులో ఉంది. మేఘాలయలో 2018 ఏప్రిల్‌లో ఈ చట్టం అమలు కేంద్రం ఎత్తివేసింది. ఇటీవల అసోంలో పర్యటించిన ప్రధాని మోడీ సైతం.. AFSPA చట్టాన్ని ప్రస్తావించారు. అసోంలో క్రమంగా శాంతి నెలకొంటోందని.. ఇదే విధంగా ఉంటే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఎత్తివేసే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు. ప్రధాని మాటలు అసోం ప్రజలకు ఊరట ఇచ్చినా.. ఇన్నాళ్లూ ఆ చట్టం వల్ల అక్కడి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు.. ఇక్కట్లకు ఎవరు సమాధానం చెబుతారు. అసలు లక్ష్యం పక్కకు వెళ్లి.. అమాయకుల జీవితాలు నాశనమైన దానికి ఎవరు జావాబుదారీ. వీటికి ఎవరు బదులిస్తారు?
2000 సంవత్సరంలో మణిపూర్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న 10 మంది పౌరులను అసోం రైఫిల్ దళం కాల్చి చంపింది. ఆ ఘటనకు నిరసనగా.. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 28 ఏళ్ల వయసులో ఇరోమ్ షర్మిల నిరాహారదీక్ష చేపట్టారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నా దీక్ష ఆపలేదు. 2000 నుంచి 2016 వరకు పోలీసుల కస్టడీలోనే దీక్ష చేసి ఉక్కు మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇరోమ్ షర్మిల. లక్ష్యం చేరుకోకుండానే ఆమె దీక్ష విరమించి రాజకీయాల్లోకి వచ్చారు. అన్నేళ్లు దీక్ష చేసినా ప్రజలు ఆమెను ఆదరించలేదు. ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నిచోట్ల ఇలాంటి చీకటి చట్టం చట్రంలోనే భారంగా కాలం వెళ్లదీస్తున్నారు జనం.
ఇప్పుడు ప్రస్తావించినవి కొన్ని చట్టాలే. ఈ జాబితాలో ఉన్నవి మరెన్నో. ఒకప్పుడు మీసాతోపాటు ఎమర్జెన్సీ సమయంలో వచ్చిన చట్టాలు.. అవి దుర్వినియోగమైన ఉదంతాలు అనేకం. జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి ఏంటో.. మనం చూస్తున్నదే. సైన్యం పహారా లేకుండా అక్కడ జనం క్షేమంగా ఉండలేరు. ఎన్ని చట్టాలు చేసినా.. మరోన్నో యాక్టులు రద్దు చేశామని చెప్పుకొన్నా.. కశ్మీర్‌లో నిర్భందాలు ఆగడం లేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో రాజకీయ నాయకులు అనేక రోజులు నిర్బంధంలోనే ఉన్నారు. ఇక్కడో విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. చట్టాల అమలు విషయంలో అధికారంలో ఉన్న పార్టీల వైఖరి ఒక్కోవిధంగా ఉంటుంది. అంతిమంగా లక్ష్యం ఒక్కటే హక్కులు కాలరాయడమే. నిరంకుశ చట్టాలపై ఎప్పటి నుంచో వ్యతిరేకత ఉన్నా.. హక్కుల రక్షణ కోసం పోరాడేవారిపై ప్రయోగించడానికి వెనకాడటం లేదు ప్రభుత్వాలు. గతంలో చేశాం.. ఇప్పుడు చేస్తున్నాం.. భవిష్యత్‌లోనూ అదే జరుగుతుంది అనేలా ఉంటుంది వాటి వైఖరి. చట్టాలను ప్రభుత్వాలు అవసరానికి మించి ప్రయోగిస్తాన్నాయనే ఆందోళన న్యాయ నిపుణులది. చట్టాలను ప్రయోగించే పద్ధతి చూస్తుంటే అసలు ప్రభుత్వాలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి.. స్పృహ ఉన్నాయా అనే అనుమానాలు కలుగుతాయి. ఇప్పుడు దేశద్రోహం సెక్షన్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించే సరికి చీకటి చట్టాలపై చర్చ మొదలైంది.
చీకటి చట్టాల నుంచి ప్రజల హక్కులను కాపాడే విషయంలో మన దేశ న్యాయవ్యవస్థదే కీలక పాత్ర. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులకు భంగం వాటిల్లితే కోర్టులు చూస్తూ ఊరుకోలేదు. న్యాయదేవత కళ్లకు గంతలు ఉన్నాయి కానీ.. న్యాయస్థానానికి కాదని నిరూపించిన సంఘటనలు అనేకం. ఇప్పుడు 124A సెక్షన్ విషయంలో జరిగింది అదే.
భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఆంగ్లేయులు మనవాళ్లపై సెక్షన్ 124Aను విచ్చలవిడిగా ఉపయోగించారు. బాలగంగాధర్ తిలక్ నుంచి నెహ్రూ వరకు ఈ సెక్షన్ రుచి చూసినవారే. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఈ సెక్షన్ కొనసాగింపుపై పెద్ద చర్చే జరిగింది. రాజ్యంగ సభలోనూ తమ అభిప్రాయాలు వెల్లడించారు నిపుణులు. విచిత్రం ఏంటంటే.. భారత్‌లో 124A సెక్షన్ తీసుకొచ్చిన బ్రిటన్‌లోనే దేశద్రోహం చట్టాన్ని రద్దు చేయడం. 1977లో అక్కడ లా కమిషన్ రద్దుకు సిఫారసు చేస్తే.. 2009లో దేశద్రోహానికి సంబంధించిన చట్టాన్ని రద్దు చేసింది బ్రిటన్ ప్రభుత్వం. భారత సుప్రీంకోర్టు సైతం వివిధ కేసుల్లో 124A ప్రయోగంపై కేంద్ర, రాష్ట్రాలపై ప్రశ్నించిన ఉదంతాలు ఉన్నాయి. కాకపోతే తాజాగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. పౌరుల హక్కుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ కీలక ఆదేశాలు ఇవ్వడానికి వెనకాడ లేదు. సెక్షన్ 124Aపై పునః సమీక్ష చేస్తామని చెబుతూ.. అప్పటి వరకు ఈ సెక్షన్ అమలు నిలిపివేసింది. అంతేకాదు… సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు కొత్తగా కేసులు పెట్టవద్దని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం.
వాక్ స్వాతంత్ర్యం.. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కుకు దేశద్రోహం అనేది అవరోధం కారాదనే అంశంపై ఆనాడు రాజ్యాంగ సభలో విస్తృతంగా చర్చ జరిగింది. రాజ్యాంగం నుంచి దేశద్రోహం అనే పదాన్ని తొలగించినా.. ఐపీసీ నుంచి తీయలేకపోయారు. వాక్ స్వాతంత్ర్యం హక్కుకు పరిమితులు విధించడానికి 124A సరైనదే అని 1962లో సుప్రీంకోర్టు కేదార్‌నాథ్ కేసులో చెప్పినా.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం.. లేదా హింసను ప్రేరేపించేలా చర్యలు ఉండాలాని ఒక గీత గీసింది కోర్టు. 1995లో మరో కేసులో సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చింది. ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదా ప్రతిస్పందనను ప్రేరేపించని నినాదాలు దేశద్రోహం కిందకు రాబోవని తేల్చేసింది.
తాజా విచారణలో సుప్రీంకోర్టు వెల్లడించిన అభిప్రాయాలను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. సెక్షన్ 124Aపై పెండింగ్‌లో ఉన్న విచారణలు, అప్పీళ్లు, ప్రొసీడింగ్స్‌ను ఆపాలని ధర్మాసనం ఆదేశించింది. దేశద్రోహం కింది కొత్తగా FIRలు నమోదు చేయవద్దని స్పష్టం చేసింది. అత్యున్నత న్యాయస్థానం చేసిన ఈ పరిశీలనను చరిత్రాత్మకంగా అభివర్ణిస్తున్నారు న్యాయ నిపుణులు. అత్యంత కఠినమైన వలసవాద చట్టంగా అభివర్ణించడం మరో కీలక అంశం. ఈ సెక్షన్ ప్రకారం ప్రభుత్వానికి అంతులేని అధికారం ఉంది. ఒకసారి ప్రయోగిస్తే.. అది ఎంత వరకు వెళ్తుందో తెలియదు. అయితే కేదార్‌నాద్ కేసులో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన కేంద్రం.. తర్వాత గొంతు సవరించుకుంది. ఈ వలసవాద చట్టాన్ని పునః పరిశీలించాలని ఆదేశించినట్టు కోర్టుకు తెలిపారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.
సుప్రీంకోర్టు తాజా పరిశీలన తర్వాత కేంద్రంపైనా ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలోనే సమీక్షకు ప్రతిపాదన వచ్చినా.. అది పట్టాలకు ఎక్కలేదు. 2019లో కాంగ్రెస్ ఎన్నికల హామీలో సెక్షన్ 124 A రద్దు ఉంది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి. విప్లవాత్మకంగా అడుగులు వేయాల్సిన పరిస్థితి తప్పదు. సుప్రీంకోర్టు పూర్తిస్థాయి ఫోకస్ పెట్టడంతో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది పెద్ద ప్రశ్న. అయితే ఇది సెక్షన్ 124Aకే పరిమితం కావడం హక్కుల ఉద్యమకారులకు.. న్యాయ నిపుణులకు పెద్దగా రుచించని అంశం. ఎందుకంటే దేశంలో అమలులో ఉన్న చీకటి చట్టాలను కూడా రద్దు చేయాలన్నది వారి డిమాండ్.
హక్కులకు భంగం కలిగినప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమ నిరసన వ్యక్తం చేస్తారు. కొందరు హింసాత్మక పద్ధతులు అవలంభిస్తే.. మరికొందరు మీడియాలో తమ అభిప్రాయాలు బయటపెడతారు. ఇంకొందరు శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తారు. అయితే అన్నింటినీ ఒకే గాటన చూడటమే ఇప్పుడు సమస్య. అందరిపైనా ఒకే మంత్రం ప్రయోగిస్తున్నారు. ఢిల్లీ జవహర్‌లాల్ యూనివర్సిటీలో నినాదాలు చేసిన విద్యార్థులను ఇదే సెక్షన్ కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. చివరకు రాజకీయ కక్షలకు కూడా దీనిని వాడేస్తున్నాయి పాలకపక్షాలు. అధికారంలో ఉన్నవారిపై చిన్న విమర్శ చేసినా.. ఆరోపణలు గుప్పించినా వెంటనే 124A కింద కేసు పెట్టేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నది ఇదే. దుర్వినియోగం తారాస్థాయికి చేరడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోక తప్పలేదు. అందుకే విచారణ సమయంలో అంతే ఉన్నతంగా ఆదేశాలిచ్చారు న్యాయమూర్తులు.
ప్రశ్నించినా.. గొంతెత్తినా సంకెళ్లు వేస్తున్న ఇలాంటి కాలం చెల్లిన సెక్షన్లు.. చట్టాలకు ముగింపు పలకాల్సిన ఆవశ్యత ఉంది. ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుతోపాటు కేంద్రంపైనా ఉంది. కాకపోతే అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించే వరకు కేంద్రం స్పృహ లేకపోవడమే ప్రశ్న. ఇలాంటి తరుణంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలి వేటులా మారిన చీకటి చట్టాలకు ఎప్పుడు మంగళం పాడతారో చూడాలి.