అత్యంత ఉత్కంఠగా అత్యున్నత సమరం…వ్యూహప్రతివ్యూహాల్లో అధికార, విపక్షాలు..విపక్ష కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా…వాజ్ పేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేసిన సిన్హా..ఒకప్పటి తన సొంత పార్టీపైనే ఇప్పుడు పోటీకి సై…ఊహకందని వ్యూహాలతో కాషాయదళం.మహారాష్ట్రలోని ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలకు వల ..రాష్ట్రపతి ఎన్నికల్లో మెజారిటీ కోసమేనని జోరుగా ప్రచారం..దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి
ఆర్టికల్ 53, 74(2) ప్రకారం రాజ్యాంగ పరిరక్షకుడిగా సర్వాధికారాలు..రాష్ట్రపతి పాలన, ఆర్థిక అత్యవసర స్థితి విధించే అధికారం..భారత రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ఏంటి?ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల విలువను ఎలా లెక్కిస్తారు?
ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ఓట్ వ్యాల్యూ ఏంటి?ఈసారి ప్రెసిడెంట్ పోల్స్ లో వైసీపీ కీలకంగా మారిందా?
రాష్ట్రపతిని పరోక్షంగా ఎన్నుకుంటారు..అభ్యర్థిని ఎలక్టోరల్ కాలేజీలోని 50మంది ప్రతిపాదించాలి
మరో 50మంది బలపరచాలి…రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ
ఎలక్టోరల్ కాలేజీలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు…
ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీల సంఖ్య 776,
ఎంపీల ఓట్ల విలువ 5,43,200,4033 ఎమ్మెల్యేల ఓట్ల విలువ 5,43,231,ఓట్ల విలువలో ఎన్డీయేకి 49శాతం, యూపీయేకి 24.02 శాతం,ఇతర పార్టీల ఎమ్మెల్యేల ఓటు విలువ 26.98శాతం,ఎంపీ ఓటు విలువ 700,ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఎమ్మెల్యే విలువ,1971 జనాభా లెక్కలు, అసెంబ్లీ సీట్లను బట్టి విలువ గణన,అత్యధికంగా యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208,అత్యల్పంగా సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ 7,
తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ132,ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 159,ప్రత్యర్ధి పార్టీలన్నీ ఒక్కటైతే బీజేపీకి తక్కువయ్యే 4శాతం ఓట్లు,అందుకే వైసీపీ కీలక భూమిక పోషించబోతోందా?
భారత రాష్ట్రపతి. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత దేశానికి అధినేత. దేశ ప్రథమ పౌరుడు. సర్వ సైన్యాధ్యక్షుడు. పార్లమెంటు ఉభయ సభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమించేదే ప్రెసిడెంటే. దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను అపాయింట్ చేసేది కూడా రాష్ట్రపతే. కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రివే అయినా, రాష్ట్రపతి రాజముద్ర లేనిదే ఏ బిల్లూ చట్టం కాదు. రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనా, అత్యంత ప్రాముఖ్యమైనది. ప్రజాస్వామ్య సంక్షోభ సమయంలో కీలక భూమిక పోషించేది. రాజ్యాంగాన్ని పరిరక్షించే బ్రుహత్తర బాధ్యత కలిగినది రాష్ట్రపతి పదవి.
దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు ఎన్నడూలేనంతగా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ప్రెసిడెంట్ ఎన్నికల ప్రక్రియ, ఎలక్టోరల్ కాలేజీ, ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ…ఇలా రాష్ట్రపతి ఎన్నికల ప్రాసెస్ పై అత్యంత ఆసక్తి నెలకొంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53, 74(2) ప్రకారం దేశాధ్యక్షుడిగా రాష్ట్రపతికి రాజ్యాంగ పరిరక్షకుడిగా సర్వాధికారాలూ ఉంటాయి. దేశ రాష్ట్రపతికి రాజ్యాంగ అధికారాలు, ఎగ్జిక్యూటివ్ అధికారాలు, జ్యూడిషియల్ అధికారాలతో పాటు అపాయింట్‌మెంట్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్, మిలటరీ పవర్స్ కూడా ఉంటాయి. అన్నింటినీ మించి… దేశంలో రాజకీయంగా ఎమర్జెన్సీ విధించే అధికారం, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అధికారం, ఆర్థిక అత్యవసర స్థితి విధించే అధికారాలు ఆయనకుంటాయి. దేశంలో ఉన్న త్రివిధ దళాలకు ఆయనే సర్వసైన్యాధ్యక్షుడు. ఇప్పటి వరకూ 14మంది రాష్ట్రపతులుగా ఆ స్థానం గౌరవాన్ని మరింత పెంచారు.
ప్రధానమంత్రిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటే, రాష్ట్రపతిని పరోక్షంగా ఎన్నుకుంటారు. ప్రజలు ప్రజాప్రతినిధులను గెలిపిస్తే, ఆ ప్రజాప్రతినిధులు ఓటు వేసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడు అయి ఉండి, 35 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలన్నది నిబంధన. రాష్ట్రపతి పదవికి పోటీపడాలనుకువారికి నామినేషన్లతో ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ పత్రాలు ఢిల్లీలో మాత్రమే ఇస్తారు. అభ్యర్థుల నామినేషన్‌ను తప్పనిసరిగా ఎలక్టోరల్ కాలేజీలోని 50 మంది ప్రతిపాదించాల్సి వుంటుంది. మరో 50 మంది బలపరచాలి. 15 వేల రూపాయలను డిపాజిట్ చెయ్యాలి.
రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ సభ్యులుంటారు. వీరంతా ఓటు హక్కు ద్వారా ప్రెసిడెంట్ ను ఎన్నుకొంటారు. రాజ్యసభ, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని నామినేటెడ్ సభ్యులు, రాష్ట్రాల శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో ఉండరు. అందుకే వాళ్లకి ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదు.
ఓటింగ్ బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతుంది. ఓటింగ్ సమయంలో వాడే పెన్నును కేంద్ర ఎన్నికల సంఘమే అందిస్తుంది. ఆ పెన్నుతోనే ఓటేయ్యాలి. వేరే పెన్నుతో వేస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదు. ఓటు చెల్లుబాటు కావాలంటే తొలి ప్రాధాన్యత సంఖ్యను తప్పనిసరిగా మార్క్ చేయాలి. ప్రథమ ప్రాధాన్యత సంఖ్య వేయకుండా, ఇతర ప్రాధాన్యత నంబర్లు వేస్తే ఆ ఓటు రద్దు అవుతుంది. ఓటింగ్‌లో పాల్గొనేవారు రహస్య ఓటింగ్ తప్పకుండా పాటించాల్సి వుంటుంది. బ్యాలెట్‌ను ఎవరికైనా చూపితే ఆ ఓటు చెల్లదు. రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీచేయకూడదు. ఓటేయడానికి, గైర్హాజరు కావడానికి ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పటివరకూ ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
ఎంపీలు పార్లమెంటులో ఓటు వేస్తారు. ఎమ్మెల్యేలు వారి అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. అనారోగ్యం లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రం, మరెక్కడైనా ఓటు వేసేందుకు అనుమతి కోరాలి. కనీసం పది రోజులు ముందుగా కమిషన్ పర్మిషన్ పొందాలి. బ్యాలెట్ బాక్సులు ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానులకు వెళ్తాయి. ఓటింగ్ అనంతరం వాటిని తిరిగి ఢిల్లీకి తరలిస్తారు. రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఓట్లు లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది.
పోలయిన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 50 శాతం +1, మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు ఎన్నికల అధికారులు.
జులై 24వ తేదీన రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. 25వ తేదీలోపు కొత్త రాష్ట్రపతి ఎన్నుకోవాల్సి ఉంది. వచ్చే నెల 18న ఎన్నికలు, 21న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఎలక్టోరల్ పద్ధతిలో రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు ఎలక్టరోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు.
2017 రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు 65.65శాతం ఓట్లు లభించాయి. అప్పట్లో బీజేపీ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. శివసేన, అకాలీదళ్ వంటి పార్టీలు బీజేపీకి దూరమయ్యాయ్. 2017లో దళిత వర్గానికి చెందిన రాంనాథ్ కోవింద్…ఎన్డీఏ బరిలోకి దింపింది. కాంగ్రెస్ మిత్రపక్షాలు…లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను రంగంలోకి దించింది. రాంనాథ్ ఏకగ్రీవానికి మద్దతు ఇవ్వాలంటూ…అన్ని రాజకీయ పార్టీలను కోరింది బీజేపీ. అయితే చివరి నిమిషంలో ప్రతిపాదన చేయడంతో…ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఇప్పుడు రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తుండటంతో, మరోసారి రాష్ట్రపతి ఎన్నికల చుట్టూ జాతీయ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏ పార్టీ అనుకూలంగా ఓటెస్తుంది? ఏ పక్షం వ్యతిరేక గళం విప్పుతుంది? తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎన్డీయేకు పూర్తిస్థాయి బలం వుందా? ఏ ప్రాంతీయ పార్టీ కీలక భూమిక పోషించబోతోంది వంటి అంశాలపై ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు కీలకం. ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీల సంఖ్య 776. వారి ఓట్ల విలువ 5,43,200. ఇక 4033 ఎమ్మెల్యేలు ఉంటే.. వారి ఓట్ల విలువ 5,43,231గా ఉంది. ఈ ఓట్ల విలువలో ఎన్డీయేకి 49శాతం, యూపీయేకి 24.02శాతం, ఇతర పార్టీలకు 26.98శాతం బలం ఉంది. గతంలో కంటే ఈ సారి ఎన్డీయే బలం కొంత పెరిగింది.
ఎలక్టోరల్ కాలేజ్ మొత్తం ఓట్ల విలువ దాదాపు 10.86లక్షలుంటే, అందులో బిజెపికి లక్షదాకా మెజారిటీ ఉంటుందనే అంచనాలున్నాయి. బిజెపికి 5.42లక్షల ఓట్లు వస్తాయని భావిస్తుంటే, విపక్షాలకు 4.49 లక్షల ఓట్లుంటాయని భావిస్తున్నారు.
ఎంపీ ఓటు విలువ 700
కర్నాటక ఎమ్మెల్యే ఓటు విలువ 131
యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208
ఎంపీ ఓటు విలువ 700ఉంటే, ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్రానికి ఒకలా ఉంటుంది. కర్నాటక ఎమ్మెల్యే ఓటు విలువ 131 ఉంటే, యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208 ఉంటుంది. సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ అతి తక్కువగా 7మాత్రమే.
రాష్ట్ర జనాభాను ఎమ్మెల్యేల సంఖ్యను వెయ్యితో మల్టిప్లై చెయ్యాలి,ఫలితాన్ని ఎమ్మెల్యేల సంఖ్యతో గుణిస్తారు
ఆ ఫలితంతో రాష్ట్రం మొత్తం ఓటు విలువ లెక్కిస్తారు
ఎమ్మెల్యేలకు సంబంధించి రాష్ట్రాల్లో 1971 జనాభా లెక్కల ప్రకారం, మొత్తం అసెంబ్లీ సీట్లను పరిగణనలోకి తీసుకుని విలువను లెక్కించారు. అప్పటికి రాష్ట్ర జనాభాను.. ఎమ్మెల్యేల సంఖ్యను వెయ్యితో మల్టిప్లై చేయగా వచ్చిన సంఖ్యనే డివైడ్ చేస్తారు. ఇలా వచ్చిన ఫలితాన్ని ఎమ్మెల్యేల సంఖ్యతో గుణించి, ఈ రాష్ట్రం మొత్తం ఓటు విలువను లెక్కిస్తారు. ఎంపీలకు సంబంధించి, దేశంలోని ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువను, మొత్తం ఎంపీల సంఖ్యతో డివైడ్ చేస్తారు. ఈ మేరకు ఈసారి ఒక్కో ఎంపీ ఓటు విలువను 700గా లెక్కించారు.
యూపీఏ పార్టీల ఎమ్మెల్యే ఓట్లు 2.77లక్షలు.ఎన్డీఏ ఎమ్మెల్యేల ఓటు విలువ 2.22లక్షలు మాత్రమే
ఎలక్టోరల్ కాలేజీలో అన్ని ఓట్లు పోలైతే, గెలవాల్సిన అభ్యర్థికి 5లక్షల 49 వేల 452 ఓట్లు రావాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం 13 పార్లమెంట్ స్థానాలు ఖాళీగా ఉంటే, రాష్ట్రాల్లో కొన్ని అసెంబ్లీ సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి. ఎన్డీఏ ప్రత్యర్థి పార్టీలకు ఎమ్మెల్యే ఓట్లు 2.77లక్షలున్నాయి. అటు ఎన్డీఏ పార్టీలకున్న ఎమ్మెల్యేల ఓటు విలువ 2.22లక్షలు మాత్రమే. అయితే పార్లమెంట్ లో మాత్రం ఎన్డీఏకి 3.20 లక్షల ఓట్లుంటే, విపక్షాలకు 1.72 లక్షల ఓట్లు మాత్రమే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 159,ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 27,825
ఎంపీల ఓటు విలువ అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుంది. 1971 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 159. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 27,825. ఇటు తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 132. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం ఓట్ల విలువ 15,708.
2017లో ఎంపీ ఓటు విలువ 708ఉంది. కానీ, ఈసారి జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుల ఓటు విలువ 700కు తగ్గుతోంది. జమ్మూకశ్మీర్ ఈసారి ఎన్నికల్లో పాల్గొనకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఆ మేరకు ఓటు విలువ తగ్గనుందని తెలుస్తోంది.
వాయిస్ విత్ గ్రాఫిక్స్ విత్ విజువల్స్ ,రెండు కూటముల మధ్య హోరాహోరీ తప్పదా?
అదే జరిగితే ఏ పార్టీది కీ రోల్?వైసీపీ కీలక భూమిక పోషించబోతోందా?
రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార, విపక్ష కూటముల మధ్య టఫ్ ఫైట్ జరిగితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ అత్యంత కీలక పాత్ర పోషించబోందని తెలుస్తోంది. ఎవరి ప్రయత్నాల్లో వారు ఎంత వరకూ సక్సెస్ అవుతారో ఇంకా క్లారిటీ లేదు కానీ, ఈ ఎన్నికల్లో YSRCP కీలక భూమిక పోషించబోతోంది అన్నది మాత్రం స్పష్టం.
ప్రత్యర్ధి పార్టీలన్నీ ఒక్కటైతే బీజేపీ తక్కువయ్యే 4శాతం ఓట్లు
మొత్తం ఎలక్ట్రోల్ కాలేజీలో ఉన్న 776 ఎంపీలు, 4033 ఎమ్మెల్యేలను కలుపుకుంటే వారి ఓట్ల విలువ 10, 86, 431 ఉంది. ప్రత్యర్ధి పార్టీల కూటమి కంటే బిజెపి బలం దాదాపు లక్ష వరకూ ఉంది. బిజెపి మినహా దేశంలోని ప్రత్యర్ధి పార్టీలన్నీ ఒక్కటైతే మాత్రం, బిజెపి బలం 4 శాతం తక్కువగా ఉండే పరిస్దితి ఉంది. అందుకే విపక్షాలన్నీ ఒక్క తాటిపైకి రావాలంటూ మమత, శరద్ పవార్ లు చాలా ప్రయత్నాలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా, తమ కూటమి అభ్యర్థికి మద్దతిచ్చారని పవార్ చెప్పారు.
అయితే అన్ని విపక్ష పార్టీలు ఒక్క తాటి మీదకి వస్తాయా అంటే, అనుమానమే అనే సంకేతాలు కనబడుతున్నాయి. చివరి నిమిషంలో ఏదైనా ఏకాభిప్రాయం కుదిరి వీరంతా ఒక్కటైనా, తన జాగ్రత్తలో తాను ఉండాలనుకుంటోంది మోడీ సేన. అందుకోసమే వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ తో ముందు నుంచి టచ్ లోనే ఉంది బిజెపి. జగన్ ని ఢిల్లీకి ఆహ్వానించి రాష్ట్రపతి ఎన్నికలపై చర్చలు జరిపారు మోడీ, షాలు.
ఏపీలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ, మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువగానే ఉంది. అసెంబ్లీలో ఎన్నికల్లో వైసిపి గెలిచింది మొత్తం 151 సీట్లు. ఆత్మకూరు ఎమ్మెల్యే, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోవడంతో ఒక స్ధానం ఖాళీగా ఉంది. ప్రస్తుతం వైసిపికి ఉన్న 150 మంది ఎమ్మెల్యేలతో పాటు, టిడిపి నుంచి గెలిచిన మరో నలుగురు ఎమ్మెల్యేలు, జనసేన నుంచి గెలిచిన ఇంకో ఎమ్మెల్యే కూడా అధికార వైపిసితోనే కలిసి పని చేస్తున్నారు. జనాభా లెక్కల ప్రకారం ఏపీలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159గా ఉంది. ఆ లెక్కన మొత్తం 155 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 24,645 వరకూ ఉంటుంది. ఆ విలువ వైపే చూస్తోంది కమలం.
ఇక పార్లమెంట్ విషయానికొస్తే, ఒక్కో పార్లమెంట్ నే తీసుకుంటే, మొత్తం లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు 776మంది ఉంటే, వారి ఓట్ల విలువ 5,43,200. ఆ లెక్కన వైసిపికి ఉన్న 22మంది లోక్ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యుల మొత్తం ఓట్ల విలువ 6,322. ఈ నెంబర్లే ప్రస్తుతం వైసిపి ని అత్యంత కీలకమైన, నిర్ణయాత్మక శక్తిగా మార్చాయి. ఇప్పటి వరకు అటు ఎన్డీయేకు కానీ, ఇటు విపక్ష కూటమి అభ్యర్థికి గాని, మద్దతివ్వబోతున్నట్టు వైసీపీ అధికారికంగా ప్రకటించలేదు. బిజెపి బలం 4 శాతం తక్కువగా ఉన్న పరిస్థితుల్లో, వైసీపీ మీదే బీజేపీ ఆశలు పెట్టుకుంది.
వైసిపి చెంత ఉన్నంత కాలం తమ అభ్యర్ధి గెలుపుకి ఎలాంటి ఢోకా ఉండదని కాషాయదళం నమ్ముతోంది. ఎందుకంటే వైసిపికి ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్యా ఎక్కువే. వారి ఓట్ల విలువ కూడా ఎక్కువే. అందుకోసమే, వైసిపి విలువని గుర్తించిన బిజెపి, ముందుగా ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని తమవైపే ఉంచుకుని, రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపుకి ఎలాంటి ఢోకా లేకుండా చేసుకుంటోంది.
వైసీపీనే కాదు, బిజూ జనతా ఓటు కూడా కీలకం కాబోతోంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది అధికారపక్షం. అటు విపక్షాలు కూడా ఎన్నికల సమరాంగణ ఎత్తుల్లో బిజీగా వున్నాయి.
భారత ఎన్నికల సంఘం 1952 మే 2న తొలిసారి రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించింది. డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల్లో విజయం సాధించి తొలి భారత రాష్ట్రపతి అయ్యారు. 83 శాతం ఓట్లు, అంటే 5 లక్షల ఏడు వేల 400 ఓట్లు బాబూ రాజేంద్ర ప్రసాద్ కు వచ్చాయి. రాజేంద్ర ప్రసాద్ సమీప అభ్యర్థి కేటీ షాకు 92 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఒకసారి రాష్ట్రపతి అయినవారు ఎన్నిసార్లయినా ఆ పదవికి పోటీ చెయ్యొచ్చు. ఇప్పటివరకు మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ మాత్రమే రెండోసారి ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్య అత్యున్నత విలువలను అనుసరించి రెండోసారి పోటీచేయకూడదన్న సంప్రదాయం ప్రకారం, బాబూ రాజేంద్ర ప్రసాద్ తరువాత ఎవరూ రెండోసారి పోటీకి దిగలేదు.
మొదట్లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ ప్రతిపాదించి, మరో ఎమ్మెల్యే లేదా ఎంపీ బలపరిస్తే సరిపోయేది. 1974లో రాజ్యాంగ సవరణ చేసి ప్రతిపాదించేవారి సంఖ్య పది, బలపరిచేవారి సంఖ్యనూ పదికి పెంచారు. 1997లో మళ్లీ రాజ్యాంగ సవరణతో ప్రతిపాదించేవారి సంఖ్య 50కి, బలపరిచేవారి సంఖ్యను 50కి పెంచుతున్నట్టు ప్రకటించారు.
దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికల్లో ఎలక్టరోల్ కాలేజ్ సభ్యులు ఎటువంటి ప్రలోభాలకూ లొంగకూడదనే ఉద్దేశంతో విప్ వర్తించని విధానాన్ని అమలు చేశారు. 1969లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. పార్టీకుండే బలంతో ఆయన గెలుపు లాంఛనమే. కానీ ఇందిరాగాంధీ ఆశీస్సులతో పార్టీకి సంబంధం లేకుండా వీవీ గిరి నామినేషన్ వేశారు. అందరూ పార్టీతో సంబంధం లేకుండా ఓటు వేయడంతో నీలం సంజీవరెడ్డి ఓడిపోయారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటికీ బ్యాలెట్ బాక్స్ ఉపయోగిస్తున్నారు. ఈ బ్యాలెట్ బాక్స్ తరలింపు ప్రక్రియలో చాలా విశేషాలున్నాయి. బ్యాలెట్ బాక్స్‌కి విమానంలో టికెట్, సీటు వుంటుంది. ఒక వస్తువుకి ప్రయాణికుడితో సమానంగా విమాన టికెట్ కొనడం రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగానే కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానులకు, ఓటింగ్ ముగిసిన తర్వాత మళ్లీ ఢిల్లీకి బ్యాలెట్ బాక్స్‌లను తరలించడానికి విమానంలో టికెట్లు కొంటారు. బ్యాలెట్ బాక్స్‌ను తీసుకెళ్లే ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారితో పాటు.. బ్యాలెట్ బాక్స్‌కూ టికెట్ కొంటారు. దాన్ని ప్రయాణికుడి మాదిరిగానే సీటులోనే ఉంచి తీసుకెళ్తారు. విమాన ప్రయాణికుల జాబితాలోనూ ఈ పేరు ఉంటుంది. దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది.
1967లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధికంగా 17మంది పోటీ చేశారు. నాలుగో రాష్ట్రపతి ఎన్నికల్లో, ఐదో రాష్ట్రపతి ఎన్నికల్లో 15 మంది చొప్పున రేసుకు సై అన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ లేదా లోక్‌సభ సెక్రెటరీ జనరల్ వుంటారు. రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి సహాయ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. చీఫ్ కో ఆర్డినేటర్ ఆఫ్ ఎలక్షన్‌గా ఎన్నికల ప్రధానాధికారి, రాష్ట్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో బాధ్యతలు తీసుకుంటారు.
రాష్ట్రపతి పదవీకాలం ఐదేళ్ళు,ప్రతి సంవత్సరం ఉభయసభల్లో ప్రసంగం,ఏ బిల్లునైనా వెనక్కు పంపొచ్చు
రాష్ట్రపతి సంతకంతో ఆర్డినెన్సును జారీ చెయ్యొచ్చు
రాష్ట్రపతి ఐదేళ్ళు పదవిలో వుంటారు. ప్రెసిడెంట్ కు శాసన వ్యవస్థకు సంబంధించిన కొన్ని అధికారాలు ఉంటాయి. పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరుస్తారు, ముగిస్తారు, లోక్ సభను రద్దుచేస్తారు. ప్రతి సంవత్సరం ఉభయసభల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. పార్లమెంటు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేశాకే చట్టంగా మారుతాయి. ఏ బిల్లునైనా తిరిగి పరిశీలించవలసిందిగా వెనక్కు పంపొచ్చు. అయితే పార్లమెంటు మళ్ళీ ఆ బిల్లును సంతకం కొరకు పంపినపుడు, రాష్ట్రపతి తప్పనిసరిగా సంతకం చేయవలసి ఉంటుంది. పార్లమెంటు సమావేశాలు జరగని సమయంలో చట్టాలు చెయ్యవలసి వస్తే, రాష్ట్రపతి సంతకంతో ఆర్డినెన్సును జారీ చెయ్యొచ్చు. అయితే తరువాత సమావేశాల్లో సదరు ఆర్డినెన్సును పార్లమెంటు ఆమోదించాల్సి వుంటుంది.
మెజార్టీ వున్న నాయకున్ని పీఎంగా నియమస్తారు,యుద్ధం, సంధి ప్రకటన చేసే రాష్ట్రపతి,ఉరిశిక్ష పడిన నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదిస్తారు,356వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి పాలనకు ఆదేశిస్తారు.
రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి కార్యనిర్వాహక అధికారాలుంటాయి. లోక్ సభలో మెజార్టీ వున్న పార్టీ లేదా కూటమి నాయకుణ్ణి ప్రధానమంత్రిగా నియమిస్తారు. భారత రక్షణ వ్యవస్థ సర్వ సైన్యాధ్యక్షుడు అయిన రాష్ట్రపతి యుద్ధ ప్రకటన, సంధి ప్రకటన చేస్తారు. విదేశాలలో రాయబారులను నియమిస్తారు. ఇక న్యాయవ్యవస్థకు సంబంధిచిన అధికారాలను పరిశీలిస్తే, ఉరిశిక్ష పడిన నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదించవచ్చు, శిక్ష తగ్గించవచ్చు, శిక్షను మార్చనూ వచ్చు. 352వ ప్రకరణం ప్రకారం యుద్ధం, విదేశీ దురాక్రమణ, సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. అలాగే 356వ అధికరణ ప్రకారం ఏదైన రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలనకు ఆదేశిస్తారు. 360వ ప్రకరణం ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడినప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తారు.