జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి బయటకు రావడం, కేసీఆర్ బీజేపీ ముక్త్ భారత్ నినాదం ఎత్తుకోవడాన్ని విపక్షాలు సానుకూల పరిణామాలుగా చూస్తున్నాయి. భారత్ జోడో యాత్ర విపక్షాలను ఏకతాటిపైకి తెస్తుందని రాహుల్ కూడా ప్రకటించారు. అయితే పిల్లిమెడలో గంట కట్టేదెవరు..? ప్రతిపక్షాలను నడిపించేదెవరు..? నాయకత్వం వహించేదెవరు అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
దేశంలో విపక్షాలు ఏకం కావాలని రాహుల్ గాంధీ నుంచి మమతా బెనర్జీ వరకూ అందరూ ఆకాంక్షిస్తున్నారు. అందరూ ఒక్కటైతే తప్ప బీజేపీని, మోడీని అడ్డుకోలేమనే నిర్ణయానికి వచ్చారు. కానీ అందుకు తగ్గ రూట్ మ్యాప్ మాత్రం రెడీ కాలేదు. ప్రతిపక్షాలు కూటమి కడితే.. నాయకత్వం వహించేదెవరనేది అతి పెద్ద చిక్కు ప్రశ్నగా మిగలనుంది.
ప్రతిపక్షాలను ఒక్కతాటిపై నడిపేదెవరనే ప్రశ్న ఎదురవుతోంది. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, శరద్ పవార్, కేసీఆర్, నితీష్, కేజ్రీవాల్ అందరూ బీజేపీకి వ్యతిరేకమే. విపక్షాలు ఒక్కటవ్వాలని అంతా కోరుకుంటున్నారు. కానీ వీరిలో నాయకుడెవరనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అది దొరికేవరకు తమకు దిగుల్లేదని బీజేపీ ఫీలవుతోంది. ఇక్కడ మోడీ.. అక్కడ ఎవరు అని నిలదీస్తోంది. గత ఎన్నికల్లోనూ ఇదే వ్యూహంతో నెట్టుకొచ్చింది కాషాయ పార్టీ. రాహుల్ నాయకత్వాన్ని ప్రతిపక్షాలు ఒప్పుకుంటాయా.. లేదా అనేది ఇంతవరకూ తేలలేదు. అసలు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలే వద్దన్న రాహుల్.. కూటమి బాధ్యతలు తీసుకుంటారా అనేది కూడా అనుమానమే. పవార్, నితీష్ ముందుగానే ప్రధాని పదవిపై ఆశ లేదని ప్రకటించారు. మమతా బెనర్జీ దూకుడుగా ఉన్నా.. ఆమెను ఎంతంమంది నేతగా అంగీకరిస్తారో తెలియదు. కేసీఆర్ కూ అదే సమస్య ఎదురవుతోంది. కేజ్రీవాల్ ఇప్పటికైతే ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆయన మనసులో ఏముందనేది తేలాల్సి ఉంది.
ప్రతిపక్షాల మధ్య ఐక్యతను తీసుకురావడానికి భారత్ జోడో యాత్ర తోడ్పడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలను నేరుగా కలవడం, వారు చెప్పింది వినడం, వారి కష్టాలు తెలుసుకోవడం, వారికి తన సందేశాన్ని అందచేయడమే యాత్ర లక్షమని రాహుల్ అంటున్నారు. సమైక్యంగా ఉండాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందని నొక్కిచెప్పారు. ఇందులో కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కదానికే ఆ బాధ్యత లేదని, అన్ని పార్టీలకు ఆ బాధ్యత ఉందని ఆయన అన్నారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతపై చర్చ నడుస్తోన్న వేళ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నితీశ్ కుమార్, హేమంత్ సోరెన్, తాను ఒక్కటవుతామని వెల్లడించారు.
2024లో ప్రారంభమయ్యే ఆట బెంగాల్ నుంచే మొదలవుతుందని జోస్యం చెప్పారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూల్చుతోందని ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ఒక్కటవ్వాలని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీని గద్దె దించాలని ఎవరికివారు ప్రయత్నాలు చేస్తున్నారు. మమతా బెనర్జీ, నీతీశ్ కుమార్, శరద్ పవార్ వంటి నేతలు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావాలని జేడీయూ సీనియర్ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. పార్టీలన్నీ తమ మధ్యనున్న విభేదాలను పక్కనపెట్టి, ప్రజా సంక్షేమం కోసం చేతులు కలపాలని అన్నారు.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో విపక్షాల మధ్య అభిప్రాయ భేదాలు తేటతెల్లమయ్యాయి. పైచేయి కోసమే కాంగ్రెస్, తృణమూల్ ఆరాటపడటం, బహిరంగంగా విమర్శలు గుప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కూడా విపక్షాలకు పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించడం వెనక ఘనత తమదేనని చాటుకునేందుకు అటు కాంగ్రెస్, ఇటు తృణమూల్ గట్టిగానే ప్రయత్నించాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక వ్యవహారం వాటి మధ్య అభిప్రాయ భేదాలను స్పష్టంగా బయటపెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ ఆళ్వా ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలవగా.. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తృణమూల్ ప్రకటించింది. ఇద్దరు తిరుగుబాటు నేతలు మినహా ఆ పార్టీకి చెందిన ఎంపీలెవరూ ఓటు వేయలేదు. ఈ వ్యవహారంలో తృణమూల్ తీరుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బాహాటంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాకు మిత్రపక్షమేమీ కాదు. భావసారూప్యమున్న పార్టీ మాత్రమే అని టీఎంసీ నేతలు కూడా గట్టిగా కౌంటరిచ్చారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కూడా విపక్షాలకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రధానంగా అస్సాం, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల్లో గణనీయ సంఖ్యలో ఎన్డీయే అభ్యర్థి వైపు మొగ్గారు. ఫలితంగా విపక్షాల అభ్యర్థికి ముందుగా ఊహించినన్ని ఓట్లు కూడా రాలేదు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా వంటి కొన్ని విపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించడమూ వాటి మధ్య ఐకమత్య లోపాన్ని బయటపెట్టినట్లయింది.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేను గద్దె దించాలన్న ప్రతిపక్షాల లక్ష్యాన్ని తాజా పరిణామాలు మరింత క్లిష్టతరంగా మార్చేశాయన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ విపక్ష కూటమిలో తమకు అతిపెద్ద భాగస్వామ్య పక్షమన్న సంగతిని కాంగ్రెస్ గుర్తించాలి. అలాగే దేశంలో కాంగ్రెస్సే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనే విషయాన్ని దీదీ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్ ఎన్నికల నాటి నుంచి మోడీపై ఘాటైన విమర్శలు చేసిన దీదీ.. మధ్యలో సడెన్ గా సైలంట్ కావడం.. మళ్లీ యాక్టివ్ కావడం ఆమె నిలకడలేమిని సూచిస్తున్నాయి .
ప్రతిపక్షాల కూటమికి నాయకత్వం వహించాలని కాంగ్రెస్ ఏమీ పట్టుబట్టడం లేదు. ఆపార్టీకి అంతర్గత సమస్యలున్నాయి. అవి సరిదిద్దుకోవటానికే సమయం చాలడం లేదు. కాంగ్రెస్ స్వచ్ఛందంగా నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగినా.. ప్రతిపక్షాలు మాత్రం నాయకత్వం కోసం కీచులాడుకుంటున్నాయి. ఇప్పటివరకు నితీష్, పవార్ మాత్రమే ప్రధాని పదవిపై ఆశలేదని బహిరంగంగా ప్రకటించాయి. మమత, కేసీఆర్ లాంటి నేతలు మొదట ఏకమవుదాం.. నాయకత్వం సంగతి తర్వాత అంటున్నారు. కేజ్రీవాల్ అయితే నా రూటే సెపరేటు అన్నట్టుగా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తర్వాత అంతటి ప్రభావం చూపేది తమ పార్టీయేనని ఆప్ నేతల అంచనా. ఇలా ప్రతిపక్షాల్లో ఎవరి లెక్కలు వాళ్లకున్నాయి. బీజేపీ వ్యతిరేకత కామన్ పాయింట్ గా ఉన్నా.. కూటమిలో తమ పాత్రేంటి అనే స్పష్టత కోరుకుంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే ఎన్నికల ముందు కూటమి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాతే విపక్షాలు ఓ అవగాహనకు రావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
విపక్షాలు ఏకం కావడం, కూటమి కట్టడం కొత్తేం కాదు. ఇప్పటికే దేశంలో ఎన్నో కూటములు ఏర్పడ్డాయి. కొన్ని అధికారం దక్కించుకున్నాయి. మరికొన్ని విఫలం అయ్యాయి. అయితే అప్పట్లో బలంగా ఉన్న ఏదో ఒక జాతీయ పార్టీ అండ ఉండేది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బలహీనపడ్డ తరుణంలో.. విపక్షాల ఐక్యతకు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.
ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలకు సుదీర్ఘమైన చరిత్రే ఉంది. 1967లో మొట్టమొదటిసారి ప్రతిపక్షాల మధ్య ఐక్యత తొమ్మిది రాష్టాలలో సంయుక్త విధాయక్ దళ్ మంత్రివర్గాలకు దారి తీసింది. ఆ ప్రయోగం ఎక్కువ కాలం నిలవలేదు. మళ్లీ ఎమర్జెన్సీ నేపథ్యంలో కొన్ని పార్టీలు కలిసి జనతా పార్టీ ఏర్పాటు చేశాయి. లోకనాయక్ జై ప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో జరిగిన సంపూర్ణ విప్లవ నేపథ్యంలో కేంద్రంలో మూడు దశాబ్దాల తరవాత కాంగ్రెస్‌ను గద్దె దించగలిగారు. జనతా ప్రభుత్వమూ రెండున్నరేళ్లకన్నా ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తరవాత 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ రూపంలో ప్రతిపక్షాల ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిరది. రెండేళ్ల కాలంలో ఇద్దరు ప్రధానమంత్రులు మారారు. ఆ తరవాత జాతీయ ప్రజాస్వామ్య కూటమి పేరుతో అటల్ బిహారీ నాయకత్వంలో మూడుసార్లు అధికారం లోకి రావడం అప్పటి సమీకరణల ప్రకారం ప్రతిపక్ష ప్రభుత్వం కిందే జమ. ఈ కూటమిలో దాదాపు పాతిక ముప్పై పార్టీలు ఉండేవి. ఆ తర వాత కాంగ్రెస్ నాయకత్వంలో 2004లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం పదేళ్లు కొనసాగింది. ఈ వరస క్రమం చూస్తే ప్రతిపక్షాల ఐక్యత మొదట కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పడడానికి, ఎన్.డి.ఎ. అధికారంలోకి వచ్చిన తరవాత బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 2014లో మోడీ నాయ కత్వంలో ఎన్.డి.ఎ. అధికారంలోకి రావడం, 2019లో మరింత ఎక్కువ ఆధిక్యత సంపాదించడం, ఈ క్రమంలో కాంగ్రెస్ అంతకంతకూ బలహీన పడడంతో ప్రతిపక్ష ఐక్యతా యత్నాలు ముందుకు సాగలేదు. అనేక రాష్ట్రా లలో బీజేపీ అధికారంలో ఉండడం కూడా ప్రతిపక్ష ఐక్యతకు అవకాశం లేకుండా చేసింది. మోడీ ఏలుబడిలో ఏకపక్ష పోకడలు పొడసూపడంతో ప్రతిపక్షాలలో మళ్లీ కదలిక వచ్చింది. మోడీ పాలనలో రాజ్యాంగం విచ్ఛిన్నం అవుతోందన్న అభిప్రాయం బలంగా నాటుకుంది.
బీజేపీయేతర పక్షాల మధ్యే వైరుధ్యాలు ఉండడం, ఆ పక్షాలు రాష్ట్ర స్థాయిలో పోటీ పడవలసిన అగత్యం ఉండడం వల్ల బీజేపీ ఆటలు సాగుతున్నాయి. బీజేపీయేతర పక్షాలన్నింటినీ ప్రతిపక్షాల కింద జమ కట్టే అవకాశం లేదు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాయి. అప్పుడు కాంగ్రెసేతర, బీజేపీ యేతర పక్షాల ఐక్యత అన్న సూత్రం పని చేసింది. మోడీ బలపడుతూ, దేశమంతటా ఇప్పటికీ అస్తిత్వం ఉన్న కాంగ్రెస్ కునారిల్లుతున్న స్థితిలో ప్రతిపక్షాల ఐక్యత అంటే బీజేపీయేతర పక్షాల ఐక్యత అన్న అభిప్రాయం మొదలైంది. మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ప్రాంతీయ పార్టీల ప్రభ తగ్గింది. ఇప్పుడు ఉమ్మడి అజెండా తేలకుండా.. ఐక్యత అంటే కష్టమే అనే వాదన ఉంది. కేవలం మోడీని గద్దె దించాలనే ఆలోచనే తప్ప.. ప్రత్యామ్నాయ పాలన విధానం ఏంటో విపక్షాలు బలంగా చెప్పడం లేదు. ఒకవేళ చెప్పినా.. అందరిలో ఏకాభిప్రాయం లేదు. మొదట ఉమ్మడి అజెండాపై క్లారిటీ వస్తే.. అప్పుడు కూటమి, నాయకత్వం లాంటి విషయాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
నితీశ్ బీజేపీని వదిలించు కోవడంవల్ల మళ్లీ ప్రతిపక్ష ఐక్యతా యత్నాలకు కొత్త చిగుళ్లు తొడిగాయి. నితీశ్ సోషలిస్టు సిద్ధాంత నేపథ్యం నుంచి వచ్చినవారు. సోషలిస్టు నేపథ్యం ఉన్న ఆర్.జె.డి. తో కలవడంతో నితీశ్ ఇప్పుడు సైద్ధాంతిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న భావన కలిగింది. ఒకప్పుడు నితీశ్ ప్రతిపక్షాల ఐక్యతకు కేంద్రంగా ఉండడమే కాకుండా ప్రతిపక్షాలకు అధికారమే దక్కితే ఆయనే ప్రధాని అన్న మాట వినిపించేది. ప్రతిపక్షాలను ఏకం చేయడానికి మమతా బెనర్జీ, కేసీఆర్ లాంటి వాళ్లు ప్రయత్నాలు చేసినా ఆధిపత్యం తమకే దక్కాలన్న రీతిలో ప్రవర్తించారు. బీజేపీయేతర పక్షాలలో చాలా వాటికి కాంగ్రెస్‌తో కలిసి పని చేయడం గిట్టదు. ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ ఈ పక్షాలకు ప్రధాన ప్రత్యర్థి కావడమే దీనికి కారణం. ఆయినా కాంగ్రెస్‌ను మినహాయించే ప్రతిపక్ష ఐక్యత అసంపూర్ణం. చిన్న చిన్న ఇబ్బందుల్ని పక్కనపెట్టి.. విశాల ప్రజాహితం కోసం అంతా కలిసిరావాలని ఎవరికి వారే విపక్ష నేతలు పిలుపు ఇస్తున్నారు. కానీ ప్రతిపక్షాలన్నీ ఒప్పుకునేలా ఓ కామన్ అజెండానూ రూపొందించడానికి ప్రయత్నించడం లేదు. దేశంలో బీజేపీకి వ్యతిరేకత ఉందనుకున్నా.. దాన్ని ఉపయోగించుకునే స్థితిలో విపక్షాలు ఉన్నాయా అనేదే అసలు ప్రశ్న. 2019 ఎన్నికల సమయంలోనూ ఐక్యత లేకే బీజేపీకి రెండోసారి అధికారం అప్పగించాయి విపక్షాలు. మరి 2024 నాటికైనా సరైన వ్యూహం వర్కవుట్ చేయకపోతే ఫలితం ఉండదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈసారి ఏమౌతుందో చూడాల్సి ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అక్కడి ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉందన్న వార్తల తరుణంలో.. విపక్షాలు పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఎన్నికల ముందు విపక్షాల కూటమి సాకారమౌతుందా అంటే గట్టిగా ఔను చెప్పలేని స్థితి. ఇలాగే నాన్చుతూ పోతే.. ఎన్నికల ముందు కూటమి కష్టమేనని.. ఎన్నికల తర్వాతే అవగాహనకు రావచ్చనే అంచనాలున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని చూస్తే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ దయనీయమైన స్థితికి చేరి కేవలం రెండు రాష్ట్రాలలోనే అధికారంలో ఉంది. మరి కొన్ని చోట్ల ఇతర పార్టీలతో కలిసి అధికార పక్షంగా ఉంది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా అస్తిత్వం ఉన్న పార్టీ కాంగ్రెసే అయినా సంస్థాగతంగా ఉన్న గందరగోళం, అంతర్గత వైరుధ్యాలు, సీనియర్ నాయకుల రాజీనామాల వెల్లువ ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. ప్రతిపక్షాల ఐక్యత కోసం లీడ్ తీసుకోవాల్సిన కాంగ్రెస్.. సొంతిల్లు చక్కదిద్దుకునే పనిలో ఉంది. ఈలోగా మోడీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటున్నట్టు స్పష్టంగా గోచరిస్తోంది. కాంగ్రెస్ ఎంత బలహీన పడిపోయినప్పటికీ 170 నుంచి 180 సీట్లలో బీజేపీకి ప్రత్యక్ష ప్రత్యర్థి కాంగ్రెసే. బీజేపీ మీద పెరుగుతున్న వ్యతిరేకతను వినియోగించుకోగలిగితే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా మరో 50 సీట్లలో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగలిగిన అవకాశం ఉంది. అసలు కాంగ్రెస్ ఉన్న కూటమి కావాలా.. కాంగ్రెస్ లేని కూటమి కట్టాలా అనే విషయంలోనూ విపక్షాల్లోనూ భిన్నాభిప్రాయాలున్నాయి.
జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీని కచ్చితంగా వ్యతిరేకిస్తున్న పార్టీలలో మోదీ వ్యతిరేకతకు ఏ మాత్రం కొదవలేదు. కానీ ప్రతిపక్షాల ఐక్యతకు కృషి చేస్తున్న నాయకులలోనే నాయకత్వం తమ చేతిలోనే ఉండాలన్న ఆకాంక్ష బలంగా కనిపిస్తోంది.
ప్రతిపక్షాల ఐక్యతకు నడుం కట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేవలం ప్రతిపక్షాల ఐక్యత గురించే మాట్లాడకుండా ఇక మీదట తాను జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తానని చెప్పుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో కేసీఆర్ బీజేపీ మీద ఒంటి కాలి మీద లేస్తున్నారు. తెలంగాణాలో పాగా వేయడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీజేపీని నిలువరించడమే తక్షణ కర్తవ్యం అని కేసీఆర్ భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ, అమిత్ షా ద్వయం నాయకత్వంలో పదిలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా బీటలూ స్పష్టం గానే ఉన్నాయి. అందువల్ల జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకోసం ప్రయత్నించడం మేలు కదా అన్నది కేసీఆర్ వ్యూహంగా ఉంది. మరో వేపు కేజ్రీవాల్ మోడీని ఎదుర్కోగలిగిన ధీరుడినని అనుక్షణం నిరూపించుకుంటున్నారు. ఆయన ఢిల్లీకి పరిమితం కాకుండా పంజాబ్‌కు విస్తరించినట్టుగానే రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కూడా తన బలం ప్రదర్శించాలని భావిస్తున్నారు.
ప్రతిపక్షాల ఐక్యత గురించి మొట్టమొదట మాట్లాడిన వారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇటీవలి కాలంలోనే కాకుండా అంతకు ముందూ ఆమె ప్రతిపక్ష నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి కావాలన్న కోరిక ఆమెకూ లేకపోలేదు. కానీ ఆమె సన్నిహితుడు పార్థా చటర్జీని ఇటీవల అరెస్టు చేయడంవల్ల ఆమె పాలనకూ అవినీతి కళంకం అంటింది. అందుకని ఆమె కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నారు. వీలు కుదిరితే ప్రధానమంత్రి అభ్యర్థి గోదాలోకి దిగడానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వెనుకాడబోరు. మోడీ ప్రభుత్వ నిర్వహణతోనే గాక ఆ ప్రభుత్వం అనుసరించే విధానాలతో కూడా జనం విసిగిపోయి ఉన్న మాట వాస్తవం. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా కనిపించలేదు. అయితే 2014లో కన్నా ఎక్కువ సీట్లు సంపాదించి ఆశ్చర్య పరిచింది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ నిర్వీర్యమై పోవడమే. 2014 నుంచి కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగదుడుపుగా మారుతోంది. 2014లో 44 సీట్లు సంపాదించిన కాంగ్రెస్ 2019లో మరో ఎనిమిది సీట్లు పెంచుకోగలిగింది.
ఓవైపు విపక్ష ఐక్యతకు ప్రయత్నాలు జరుగుతుండగానే.. విపక్షాల్లో మోడీ, బీజేపీకి కోవర్టులున్నారన్న ప్రచారం జరుగుతోంది. కొందరు నేతల తీరుపై అనుమానాలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల మీద కసి తీర్చుకోవాలనుకున్నప్పుడు మోడీ సర్కారు ఓ విశిష్టమైన పద్ధతి అనుసరిస్తోంది. కేజ్రీవాల్ మీద విమర్శలకు మాత్రమే పరిమితం అవుతూ ఆయన తరవాతి స్థానంలో ఉన్న మనీశ్ సిసోడియా మీద సీబీఐ చేత దాడులు చేయించింది. దిల్లీ ప్రభుత్వ ఆబ్కారీ విధానంలో అవకతవకలు, అక్రమాలు ఉన్నాయన్న కారణం చూపి సీబీఐని దాడులకు పురి కొల్పారు. సీబీఐ కాకపోతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్‌ను ప్రయోగించడం పరిపాటి అయిపోయింది. అంతమాత్రం చేత మనీశ్ సిసోడియా రూపొందించిన ఆబ్కారీ విధానం లోపరహితమైందని కాదు. ఏ రాష్ట్రంలోనూ ఆబ్కారీ విధానం నిష్కల్మషంగా ఉండదు. ఇదివరకే మరో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేంద్ర జైన్ ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. అవినితి వ్యతిరేక ఉద్యమ కెరటాల ఆసరాగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అవినీతికి అతీతం కాదు అన్న అభిప్రాయం కలిగించడమే మోడీ సర్కారు ప్రధాన లక్ష్యం. ఈ ఏడాది నవంబర్ లో హిమాచల్ శాసనసభకు డిసెంబర్ లో గుజరాత్ శాసన సభకు జరగనున్న ఎన్నికలలో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధం అవుతోంది. పంజాబ్ శాసనసభ ఎన్నికలలో సాధించిన విజయం ఆమ్ ఆద్మీ పార్టీలో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించగలమన్న ఆత్మ విశ్వాసం పెంచింది. 2024 ఎన్నికలలోనూ మళ్లీ అధికారంలోకి రాగలమన్న ధీమా బీజేపీలో బలంగానే ఉంది. ప్రతిపక్షాలు ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నా అవి ఏకోన్ముఖంగా లేవు. ఇద్దరు ముగ్గురు ప్రతిపక్ష నాయకులు తామే ప్రతిపక్ష శిబిరానికి నాయకులం కావాలన్న దృష్టితోనే ప్రయత్నిస్తున్నారు. మమతా బెనర్జీ, కేసీఆర్ వేస్తున్న అడుగులు నాయకత్వం తమదేనన్న రీతిలో ఉన్నాయి. అయితే ఈ ఇద్దరు నాయకులూ దేశవ్యాప్తంగా ఆమోద యోగ్యులవుతారన్న భరోసా లేదు. పైగా ఈ ఇద్దరు నాయకులకూ అధికారం ఉన్నది తమ రాష్ట్రాలలోనే. విస్తరించడానికి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఇటీవల కొన్ని రాష్ట్రాలలో లాంఛన ప్రాయంగా పోటీ చేసినా పెద్దగా ఫలితం దక్కలేదు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితికి అసలు ఇతర రాష్ట్రాలలో పోటీ చేయాలన్న ఆలోచనలోనే లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ రెండు చోట్ల అధికారంలో ఉంది కనక మోడీని నిలవరించగలనన్న అభిప్రాయం కేజ్రీవాల్ లో ఎక్కువగా ఉంది. ప్రతిపక్ష నాయకులందరూ అవినీతిపరులేనన్న అభిప్రాయం కలగజేస్తే తనకు తిరుగు ఉండదని మోడీ గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను అవినీతిపరుడిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
చాలా ప్రతిపక్ష పార్టీలు మోడీ వ్యతిరేకత విషయంలో నిలకడగా ఉండటం లేదు. ప్రధాని అపాయింట్ మెంట్ వస్తే ఒకలా, సీబీఐ దాడులు జరిగితే మరోలా స్పందించడం గందరగోళానికి తావిస్తోంది. మరికొందరు తమకేం సమస్య లేదు కదా అనుకుంటున్నారు. ఎవరికి వారు ఇతర పార్టీలకు బీజేపీతో బ్లాక్ డీల్స్ ఉన్నాయని అనుమానిస్తున్నారు. అసలు విపక్షాల్లోనే ఒక పార్టీపై మరోదానికి అపనమ్మకం కలిగేలా బీజేపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా ఈ వ్యూహాన్ని ఛేదించి.. మోడీ పాలనకు ప్రత్యామ్నాయంగా మోడల్ ను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం విపక్షాలకు ఉంది. ఓ అజెండా, నిర్దేశిత కార్యాచరణ లేకుండా ఎవరు కలిసొస్తారనేది చెప్పడం కూడా కష్టమౌతుంది. నిర్దిష్ట యాక్షన్ ప్లాన్ తోనే బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటవుతుందనే అభిప్రాయాలున్నాయి.
విపక్షాలు జాతీయ స్థాయిలో ఒక్కతాటిపైకి వచ్చినా.. రాష్ట్రాల్లో ప్రత్యర్థులుగా పోటీపడాల్సిన పరిస్థితి. జాతీయ రాజకీయాల కోసం రాష్ట్రాల్లో కాంప్రమైజ్ కావడానికి ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా లేకపోవచ్చు. కాంగ్రెస్ కూడా బలంగా ఉన్న రాష్ట్రాల్లో.. ప్రాంతీయ పార్టీలతో సీట్ల పంచుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. ఈ విషయాలు తేలకుండా కూటమి అంటే కష్టమే. మొదట ఈ సమస్యలన్నీ సామరస్యంగా పరిష్కరించుకుంటేనే విపక్ష కూటమి సాకారమౌతుంది. లేకపోతే ఎప్పటిలాగే మాటలకే పరిమితమయ్యే అవకాశం ఉంది.