Site icon NTV Telugu

Story Board: నేతల పార్టీ జంప్‌కు చెక్ పడే మార్గమేంటి ? సుప్రీం బ్రేక్ వేస్తుందా ?

Story Board

Story Board

Story Board: పార్టీ ఫిరాయింపుల విషయంలో నిర్దేశిత గడువులోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దని, పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించింది. అనర్హత పిటిషన్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడం సరికాదని, అలాచేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లే అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ పొడిగించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే.. స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చునని కూడా న్యాయస్థానం పేర్కొంది. ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. స్పీకర్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు.. పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు పార్లమెంట్ చట్టం తీసుకురావాలని అభిప్రాయ పడింది.

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై విజయం సాధించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ లు కొంతకాలం తరువాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ను కోరారు. అయినా, స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో.. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారి తీసింది. హైకోర్టులో మొదలైన విచారణపర్వం.. చివరగా సుప్రీంకోర్టు వరకు వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల తరుణంలో ఈ కేసుపై అనేక కోణాల్లో చర్చ మొదలైంది. అసలు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. సుప్రీం సూచించిన గడువులోపు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే.. కోర్టే ఏం చేయబోతుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

2023లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ 39 స్థానాలతో ప్రతిపక్షంలో ఉంది. అయితే కొద్ది నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. వీరిపై చర్యల కోసం న్యాయపోరాటానికి దిగింది. ఆ పార్టీకి చెందిన నేతలు 2024 ఏప్రిల్లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్​రెడ్డి సైతం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. 2024 సెప్టెంబర్ లో స్పీకర్ ఆఫీస్ కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ ఇవ్వాలని ఆదేశించింది.లేదంటే తామే సుమోటో కేసుగా తీసుకుని విచారిస్తామని స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై హైకోర్టు సింగిల్‌‌ బెంచ్‌‌ ఇచ్చిన తీర్పును రద్దు చేయడానికి డివిజన్ బెంచ్ లో అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్‌‌ పిటిషన్ దాఖలు చేశారు. అయితే నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. స్పీకర్‌కు టైమ్‌ బాండ్‌ లేదని ధర్మాసనం పేర్కొంది. పదో షెడ్యూల్ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది.

హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై జనవరి 2025లో కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.వీరి పిటిషన్లపై ఫిబ్రవరిలో విచారించిన కోర్టు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది.రీజనబుల్‌ టైం అంటే ఎంతో కచ్చితంగా చెప్పాలంటూ తెలంగాణ స్పీకర్‌ను కోరింది. ఫిరాయింపుల వ్యవహారంపై స్పీకర్‌ దృష్టికి వెళ్లి పది నెలలు అవుతోంది. ఇంకెంత సమయం కావాలి? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టు 10 మంది ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ కు కూడా నోటీసులు జారీ చేసింది. వీరి తరపు వాదనలను కూడా వినింది. ఏప్రిల్ 3వ తేదీన వాదనలు పూర్తి చేసిన అత్యున్నత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. జూలై 31న వెలువరిస్తామని పేర్కొంది. చివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాల్సిందని, స్పీకర్‌కు 3 నెలలతో కూడిన కాలపరిమితి విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది.

పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. ప్రస్తుతం స్పీకర్ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. స్పీకర్ విశేషాధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని.. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాతే న్యాయ సమీక్షకు అవకాశం ఉందన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. అక్కడ కేసు పెండింగ్‌లోనే ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముకుల్ రోహత్గి వాదనలు గతంలో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులకు భిన్నంగా ఉందని జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని ముకుల్ రోహత్గి వాదించారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు జోక్యం చేసుకోకూడదా అని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. స్పీకర్ ఐదేళ్ల వరకూ నిర్ణయం తీసుకోకపోతే అంతవరకూ కోర్టులు నిర్ణయం తీసుకోకూడదా అని నిలదీశారు. అందుకు ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని ముకుల్ రోహత్గి తెలిపారు. అయితే స్పీకర్‌కు సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని విజ్ణప్తి చేయడమో, ఆదేశించడమో కోర్టులు చేయకూడదా అని ముకుల్‌ను జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు.

ఫిరాయింపులపై పిటీషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని.. రోహత్గి తెలిపారు. స్పీకర్‌పై నమ్మకం లేక రిట్‌ల పైన రిట్‌లు దాఖలు చేయడం ఎందుకు?…స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకూ ఎందుకు పిటీషనర్లు ఆగరని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే కోర్టులో పిటిషన్ వేశారని కోర్టుకు తెలిపారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారన్నారు. కనీసం ఆలోచించే అవకాశం కూడా లేకుండా కోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారన్నారు. సింగిల్ జడ్జి బెంచ్ నాలుగు వారాల్లో షెడ్యూల్ చేయాలని చెప్పిందని.. ఆ ఆదేశాలను డివిజన్ బెంచ్ కొట్టేసిందని తెలిపారు. రోహత్గి వాదనల్లో జస్టిస్ బీఆర్ గవాయ్ జోక్యం చేసుకున్నారు. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. స్పీకర్ చర్య తీసుకోకపోతే.. నాలుగు సంవత్సరాలు స్పీకర్ ఏమీ చేయకపోతే, కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.

మొత్తం మీద ఫిరాయింపుల విషయంలో ఏదొకటి తేల్చాలని సుప్రీం స్పీకర్ కు గడువు పెట్టడంతో.. రాబోయే 90 రోజుల్లో ఏం జరుగుతుందనేది ఉత్కంఠకు దారితీస్తోంది.

Exit mobile version