Story Board: తెలంగాణ సర్కార్… పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుతో…కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చింది. ఇదే ఊపులో పంచాయతీ ఎన్నికలను నిర్వహించి…రాష్ట్రవ్యాప్తంగా పార్టీబలంగా పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీసీలకు పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలు పూర్తిచేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో మరో వారం లేదంటే పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం వద్ద, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలే అవకాశం లేకపోవడం, మార్చిలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే రూ. 3 వేల కోట్ల నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. దీంతో కేబినెట్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
గ్రామాల్లో పాలన వ్యవస్థ దెబ్బతింటున్నందున వీలైనంత తొందరలోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చిత్తశుద్ధితో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నం చేసినా.. కేంద్ర ప్రభుత్వం సహకారం లేనందున బిల్లులు రాష్ట్రపతి దగ్గరే పెండింగ్లో ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి 2026 మార్చి 31తో ముగుస్తుందని, అప్పటిలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయకపోతే గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపు రూ. 3 వేల కోట్లు రాకుండా పోతాయి. అందుకే ఈ డిసెంబర్ నెలలోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాల కోసం డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని తీర్మానం చేసినట్లు పొంగులేటి తెలిపారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి కేబినెట్ ఆమోదం తీసుకోనున్నారు. 42 శాతం రిజర్వేషన్లపై కోర్టులో తేలిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్లాల్సి ఉందన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రకటించారు. గతంలో డెడికేటెడ్ కమిషన్ బీసీలకు 42 శాతం ప్రకారం రిజర్వేషన్ల జాబితాను ఇచ్చిందని, దాని ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైందన్నారు. అయితే, కోర్టు కేసులతో ఎన్నికల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయిందని, ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే 50 శాతం మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుందని పొంగులేటి వెల్లడించారు.
తెలంగాణలో కొన్ని నెలలుగా స్థానిక ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీకాలం ఫిబ్రవరిలోనే ముగిసింది. మొదట అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అనే చర్చ జరిగింది. కానీ నిర్ణీత గడువులోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో.. ప్రక్రియ ఆలస్యం కావచ్చనే అంచనాలు వచ్చాయి. బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ కు పంపినా.. అది రాష్ట్రపతికి వెళ్లి అక్కడ పెండింగ్ లో ఉంది. సీఎం మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లినా ఫలితం లేకపోవడంతో.. ఇక ఆర్డినెన్స్ మార్గంలో రిజర్వేషన్లు ఇవ్వాలని సర్కారు భావించింది.
చివరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ.. హైకోర్టు ఇచ్చిన గడువు లోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం విర్ణయం తీసుకుంది. ఒక్కసారి సర్కారు ఫిక్సయ్యాక.. చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. నిజానికి అంతకుముందే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల కోసం ప్రాథమిక కసరత్తును పూర్తిచేసింది. దీంతో పెద్దగా హైరానా పడాల్సిన అవసరం లేకుండానే.. రోజుల వ్యవధిలోనే షెడ్యూల్ విడుదలైంది. మొదట్లో స్థానిక ఎన్నికలు పెట్టడానికి సర్కారు భయపడుతుందని విపక్షాలు చేసిన ప్రచారాన్ని కూడా సర్కారు దీటుగా తిప్పికొట్టినట్టైంది. స్థానిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. అలాగే తన వ్యూహాలు ప్రతిపక్షాలకు అంతుచిక్కకుండా గుంభనంగా ఉంటూ వచ్చింది. గత నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 9పై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా హైకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ తరువాత ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాల దాఖలుకు పిటిషనర్లకు 2 వారాల గడువు విధించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోయింది.