Story Board: సాధారణంగా అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షంగా సాగాల్సిన రాజకీయం.. ఇప్పుడు ఈసీ వర్సెస్ ప్రతిపక్షంగా మారింది. ఈసీ కూడా ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష నేతల ఆరోపణలకు దీటుగా కౌంటర్లు ఇవ్వడం.. పరిశీలకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. స్వతంత్ర భారతంలో ఎన్నికల నిర్వహణ బాధ్యత ఈసీకి అప్పగించింది రాజ్యాంగం. ఇప్పటివరకు ఎన్నో ఎన్నికలు నిర్వహించిన ఈసీ.. ఎన్నికల షెడ్యూల్ విడుదల కోసం తప్ప.. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తే.. సహజంగా అధికారుల స్థాయిలోనే సమాధానాలు, వివరణలు వస్తాయి. అంతేకానీ నేరుగా సీఈసీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఎప్పుడూ ఏర్పడలేదు. కానీ కొంతకాలంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు శృతి మించుతున్నాయి. జనామోదంతో గెలవాల్సిన ఎన్నికల్ని ఈసీ సాయంతో గెలుస్తున్నారన్న ఆరోపణలు ఎన్నికల సంఘాన్ని ఇరుకునపెడుతున్నాయి. దీంతో తన ప్రతిష్ఠ కాపాడుకోవటానికి ప్రయత్నించిన ఈసీ.. ఆ సందర్భంగా సవాల్ కు ప్రతిసవాల్ విసురుతున్నట్టుగా స్పందించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈసీ టోన్ లో మార్పు ఎందుకొచ్చిందనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ఇండియా కూటమి.. ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రీపోల్ సర్వేలు, ముందస్తు అభిప్రాయాలకు విరుద్ధంగా ఫలితాలు రావడంపై సందేహాలు వెలిబుచ్చింది. మొదట హరియాణా, తర్వాత మహారాష్ట్రలో ఫలితాలు ఇదే రీతిగా వచ్చాయని గగ్గోలు రేగింది. హరియాణాతో పోలిస్తే మహారాష్ట్ర ఫలితాన్ని సీరియస్ గా తీసుకున్న ఇండియా కూటమి.. అప్పట్నుంచి ఓట్ల శాతం విషయంలో తేడా జరిగిందని చెబుతూనే వచ్చింది. అయితే ఈసీ నుంచి సరైన వివరణ రాలేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ రగడ ఇలా జరుగుతుండగానే.. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియ మొదలుకావడంతో.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఫైరైంది. మహారాష్ట్రలో జరిగిందే.. బీహార్లోనూ జరుగుతుందనే అనుమానం వ్యక్తం చేసింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేసి.. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని ఓ అసెంబ్లీ సెగ్మెంట్‌లో భారీగా ఓట్ల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే ఈసీ జాబితాలో చనిపోయిన ఓటర్లంటూ.. వారితో కలిసి భోజనం చేశారు. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఈసీ.. బీజేపీతో కుమ్మక్కైందని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఒకే ఓటరు పేరు పలుమార్లు నమోదు కావడం, ఇతర రాష్ట్రాల ఓటర్ల జాబితాలోనూ అదే వ్యక్తి పేరు ఉండటం, ఉనికిలో లేని చిరునామాలలో ఓటర్లు ఉండటం, ఒకే ఇంటి నంబర్‌పై వందలాది ఓట్లు ఉండటం, ఫొటోలు సరిగా లేని గుర్తింపు కార్డులు, కొత్త ఓటర్ల కోసం ఉద్దేశించిన ఫారం-6 దుర్వినియోగం లాంటి అనేక అవకతవకలను తాము తమ సర్వేలో గుర్తించామని తన ప్రజెంటేషన్‌లో రాహుల్‌గాంధీ వివరించారు. అదేవిధంగా అధికార బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందించిందని, డిజిటల్ ఓటర్ల జాబితాను తమకు ఇవ్వడానికి నిరాకరించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అనుకూలురైన వ్యక్తులను ఓటర్ల జాబితాలో చేర్చి, వ్యతిరేకుల పేర్లు తొలగించి ఎన్నికల్లో నెగ్గేలా పెద్ద కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. బిహార్‌లోని సస్రాంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటర్ అధికార్ యాత్రను రాహుల్ ప్రారంభించారు. ఓటర్ అధికార్ యాత్ర బిహార్‌లో 20 జిల్లాలను చుడుతూ 16 రోజుల పాటు.. 1300 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో ఈ యాత్ర ముగుస్తుంది. ఆదివారం రాహుల్ సభలో ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్, తేజస్వీ యాదవ్, సీపీఎం, సీపీఐ ఎంఎల్ నేతలు పాల్గొన్నారు.
ఓట్ల చోరీని బయటపెట్టాక ఈసీకి దిక్కుతోచడం లేదని ఎద్దేవా చేశారు రాహుల్. అందుకే అఫిడవిట్ దాఖలు చేయాలనే డిమాండ్లను తెరపైకి తెస్తోందని ఆరోపించారు. ఓట్ల చోరీపై బీజేపీ నేతలు కూడా ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. అఫిడవిట్ దాఖలు చేయాలని వారినెందుకు అడగలేదని నిలదీశారు రాహుల్. ఎన్నికల వీడియో పుటేజీ కోరితే ఈసీ స్పందించకపోవడం వెనక మతలబేమిటని ప్రశ్నించారు. అధికార పక్షం అడ్డగోలుగా మాట్లాడుతోందని, ఈసీ స్పందన కూడా వారికి వంత పాడుతున్నట్టుగానే ఉందని రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నారు. ఇటీవల లోక్‌సభతో పాటు పలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీతోనే బీజేపీ గెలిచిందినేది కాంగ్రెస్ ఆరోపణ. మహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లను చేర్చి అధికారంలోకి వచ్చింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆదే కుతంత్రం మొదలైంది. అడ్డదారిలో నెగ్గజూస్తున్నారు. వారి కుట్రలు సాగనివ్వమంటోంది ఆ పార్టీ. ఓట్ల చోరీపై రాహుల్ ఆందోళనతో ఇండియా కూటమి కూడా ఒక్కతాటిపైకి వచ్చింది. ఇండియా కూటమి పక్షాలన్నీ ఈ విషయంలో రాహుల్ కు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే కలిసికట్టుగా ఆందోళన చేస్తున్నాయి ఇండియా కూటమి పార్టీలు. ఇదే అంశంపై ఈసీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన ఇండియా కూటమి ఎంపీలు సామూహికంగా అరెస్ట్ కూడా అయ్యారు. ఏం చేసినా.. ఈసీ తప్పించుకోలేదని, కచ్చితంగా దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఇండియా కూటమి ఎంపీలు నినదిస్తున్నారు. చివరకు పార్లమెంట్ లో కూడా ఓట్ల చోరీ గురించే రగడ చేస్తున్నాయి ప్రతిపక్షాలు.
ఈ రోజున దేశంలో అతి పెద్ద చర్చకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దారి చూపించారు. ప్రజాస్వామ్యానికి మూలాధారం అయిన ఎన్నికల వ్యవస్థ మీదనే ఆయన అనేక సందేహాలను వ్యక్తం చేశారు. దేశంలో ఓట్లు పెద్ద ఎత్తున చోరీకి గురి అవుతున్నాయని రాహుల్ చేసిన తీవ్ర ఆరోపణలు దేశవ్యాప్తంగా రచ్చకు అవకాశం ఇస్తున్నాయి. ఎన్నికల్లో ఫేక్ ఐడీలు దొంగ ఓట్లు తప్పుడు చిరునామాలు లక్షల ఓట్ల గల్లంతు, జత చేయడాలు ఇవన్నీ రాహుల్ గాంధీ దేశం ముందు ప్రశ్నలు గా పెట్టారు. రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం ద్వారా అనేక సందేహాలు లేవనెత్తారు. రాహుల్ వాదనను దేశ ప్రజలు ఎంతవరకు నమ్ముతారనే విషయాన్ని పక్కనపెడితే.. ఓటర్ల జాబితా తయారీలో ఏదో జరుగుతోందనే అనుమానమైతే దేశ ప్రజల్లో మొదలైందనే భావనకు ఇండియా కూటమి అంకురార్పణ చేసింది.