ఉపఎన్నికలు తెలంగాణకు కొత్త కాదు. ఇప్పటికే నాలుగు ఉపఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఐదో ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. అయితే గత ఉపఎన్నికలకు, మునుగోడుకు ప్రధానమైన తేడా ఒకటుంది. గత ఉపఎన్నికలు ఏవో రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంది అనే వాతావరణంలో జరిగాయి. కానీ మునుగోడులో మాత్రం ముక్కోణపు పోటీ జరుగుతోంది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల ముందు సెమీఫైనల్ అనే హైప్ క్రియేటైంది.
మునుగోడు ఉపఎన్నిక ఓ పార్టీకి పరువు, మరో పార్టీకి ప్రతిష్ఠ.. ఇంకో పార్టీకి ఉనికి కోసం పోరాటంలా తయారైంది. తెలంగాణలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మునుగోడు ఉపఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. మునుగోడులో వివిధ పార్టీల సమీకరణాలేంటనే విషయమే.. ఫలితాన్ని తేల్చనుంది.
నిర్దిష్ట కాలవ్యవధిలో జరుగుతున్న ఉపఎన్నికలు తెలంగాణలో ఎప్పటికప్పుడు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఉపఎన్నికలు జరిగినా.. తర్వాత జరిగిన ఉపఎన్నికలు మరింత ఊపు తెచ్చాయి. ఇప్పటివరకు తెలంగాణ ఏర్పడ్డాక నాలుగు ఉపఎన్నికలు జరగ్గా.. మునుగోడు ఐదోది. మునుగోడు గెలుపుపై ఏ పార్టీ కాన్ఫిడెంట్ గా లేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపికి అనుకూలతలతో పాటు సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో ఎవరికి వారు పైకి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నా.. అంతర్గతంగా మాత్రం టెన్షన్ పడుతున్నారు. గెలవకపోతే పరువు పోతుందనే ఊహే పార్టీలకు నిద్ర పట్టకుండా చేస్తోంది.
ఓవైపు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో బీజేపీలో ఉత్సాహం వచ్చింది. కీలక నేతలు పార్టీ నుంచి వైదొలుగుతుండటంతో కాంగ్రెస్ లో కాస్త నిరాశ అలముకుంది. ప్రతిపక్షాల దూకుడు, ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న సూచనలతో టీఆర్ఎస్ లో అప్రమత్తత కనిపిస్తోంది. వెరసి మునుగోడు ఉపఎన్నికపై ప్రభావం చూపే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, మునుగోడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. రాజ్ గోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరనుండటంతో కాషాయ సైన్యం రెట్టింపు ఉత్సాహంతో ఉరకలేస్తోంది. అయితే, రాజ్ గోపాల్ రెడ్డితో పాటు తన క్యాడర్ మాత్రం బిజెపిలోకి తీసుకురావడంలో మాత్రం కొంత ప్రతికూల పరిస్థితులనే ఎదుర్కొంటున్నారనేది రాజకీయ విశ్లేషకుల వాదన. మునుగోడు ఎప్పటికీ కాంగ్రెస్ వశమే అవుతుందంటూ హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. బీజేపీ మాత్రం ఈ ఉపఎన్నికలో గెలిచి అసెంబ్లీలో ట్రిపుల్ ఆర్ ఎమ్మెల్యేలకి తోడుగా మరో ఆర్ ని తమ ఖాతాలో వేసుకుంటామని పక్కాగా చెబుతోంది.
బిజెపి దూకుడుతో కాంగ్రెస్ కొంత డీలా డినప్పటికీ.. పార్టీఓటుబ్యాంకు మాత్రం అలాగే ఉందని చెబుతోంది. అధికార టీఆర్ఎస్ మాత్రం బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేలా వ్యూహరచన చేస్తోంది. మొత్తానికి రానున్న మునుగోడు ఉపఎన్నికల వరకు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి మరి.
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని, బీజేపీలో చేరుతానని ప్రకటించడం రాజకీయ వేడి రాజుకుంది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలతోనూ అగ్గి రాజుకుంది. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీలతో ముక్కో ణపు పోటీ నెలకొంటుండటంతో.. నేతలు తమకు అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీల వైపు దృష్టి సారిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది. తెలంగాణలో అధికారం సాధిస్తామని ప్రకటించింది. తర్వాత కూడా వరుస పెట్టి జాతీయ నేతలతో పర్యటనలు చేయిస్తోంది. పార్టీ జాతీయ నేతల దిశానిర్దేశం, మద్దతుతో రాష్ట్ర బీజేపీ ఆపరేషన్ ఆకర్షన్ ను వేగవంతం చేసింది. పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల జాబితాను పార్టీ చేరికల కమిటీ ఇప్పటికే సిద్ధం చేసుకుందని.. జాతీయ నాయకత్వం ఆమోదం కోసం ఎదురుచూస్తోందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
కొన్నేళ్ల నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న తరుణంలో కాంగ్రెస్‌పై నేతల ఆసక్తి తగ్గిపోయిందనే అభిప్రాయం నెలకొంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు లేవనే ప్రచారం మొదలైంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా గాందీ, రాహుల్ గాందీలను విచారించడం ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నింపింది. దీంతో కాంగ్రెస్‌లో కొనసాగుతున్న నేతల్లో ఊగిసలాట మొదలైందని.. బయటి నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకూ ఇతర పార్టీల నేతలు సంశయిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో టెన్షన్ పడుతున్న కాంగ్రెస్ కూడా.. మునుగోడులో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది.
కాంగ్రెస్‌కు మునుగోడు సిట్టింగ్ సీటు, కేడర్ బలంగా ఉన్న నియోజకవర్గం కూడా. అయినా ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తమవుతోంది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని, ఇక్కడ హుజూరాబాద్ తరహా ఫలితం పునరావృతం కాకుండా చూడాలన్న కృతనిశ్చయంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల తరహాలో మునుగోడులోనూ చరిత్ర సృష్టించాలని బీజేపీ భావిస్తోంది. ఉప ఎన్నికల హ్యాట్రిక్ విజయం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవడంతోపాటు, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇది ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ మునుగోడులో విజయం సాధించాలని.. తద్వారా తమ బలం ఏమాత్రం తగ్గలేదని, బీజేపీది మాటలే తప్ప గెలుపు కాదనే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లాలని అధికార టీఆర్‌ఎస్ భావిస్తోంది. మరి మునుగోడు ఫలితం.. ఈ మూడు పార్టీలకు ఎలాంటి సందేశం ఇస్తుందో చూడాల్సి ఉంది.
గత ఉపఎన్నికలకు భిన్నంగా మునుగోడు ఉపఎన్నిక.. తెలంగాణ ప్రస్తుత రాజకీయాన్ని కళ్లకు కడుతోంది. ఏ పార్టీ భవిష్యత్ ఏంటి, అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం ఎంత అనే అంశాలే ఆసక్తి కలిగిస్తున్నాయి. మునుగోడు కాంగ్రెస్ కు సిట్టింగ్ సీటు. నిలబెట్టుకోకపోతే క్యాడర్లో కాన్ఫిడెన్స్ పోతుంది. గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగానే ఉందని చెప్పినట్టవుతుంది. మునుగోడు టీఆర్ఎస్ సీటు కాకపోయినా.. అధికార పార్టీ కాబట్టి పరీక్ష అనే చెప్పాలి. ప్రజలు తమతోనే ఉన్నారని చెప్పుకోవడానికి గెలుపు మంచి అవకాశం అవుతుంది. బీజేపీ అయితే మునుగోడు ఉపఎన్నికను చావోరేవో అన్నట్టుగా చూస్తోంది. గెలిస్తే పార్టీకి తిరగుండనదనే భావనతో ఉంది. ఓడితే మాత్రం బీజేపీది వాపే కానీ.. బలుపు కాదనే అభిప్రాయం ఏర్పడే ఛాన్స్ ఉంది.
మునుగోడులో అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. సామాజికవర్గాల్ని లెక్కలేసుకుని, సర్వేల ఫలితాలు బేరీజు వేసుకుని టికెట్లివ్వాలనే ఆలోచనతో ఉన్నాయి. పార్టీలకు తోడు ఆశావహులు కూడా సర్వేలు చేయించుకుంటుండటం.. మునుగోడును ప్రత్యేకంగా నిలుపుతోంది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో మూడు పార్టీలు బై పోల్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ టీఆర్‌ఎస్ తమ అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో జరిగిన పొరపాటు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతోంది. నియోజకవర్గంలో విస్తృత ప్రచారం తర్వాతే అభ్యర్థిని ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తోంది. పార్టీ అభ్యర్థులు దీటైన వారు కాకపోవడంతోనే దుబ్బాక, హుజూరాబాద్‌లో ఓడిపోయినట్లు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో మునుగోడు క్యాండేట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
బీజేపీ మినహా రెండు పార్టీలు టికెట్ ఆశిస్తున్నవారిపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. సామాజిక, ఆర్ధిక, ఇతర అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. పార్టీ ప్రాబల్యానికి తోడు అభ్యర్థి అదనపు బలం కావాలని ఆశిస్తున్నాయి. అయితే సర్వేల్లో తమకు అనుకూలంగా రిపోర్ట్ వస్తే టికెట్ ఇవ్వాలని చూస్తున్నాయి. పలు కీలక అంశాలను అన్ని పార్టీలు బేరీజు వేస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం వారు అధికంగా ఉన్నారు..? ఏ కులస్తుల ఓట్లు ప్రభావం చూస్తాయి..? బీసీల ఓట్లు ఎన్ని..? ఎస్సీ, ఎస్టీ ఓట్లు ఎలా ఉన్నాయనే అంశంపై చర్చ జరుగుతున్నాయి. మునుగోడులో మొత్తం ఓటర్లు 2 లక్షల 20 వేల520. వీరిలో గౌడ్ లు 15.94 శాతం, ముదిరాజ్ లు 15.37 శాతం, మాదిగలు 11.63 శాతం, యాదవులు 9.69 శాతం, పద్మశాలీలు 5.30 శాతం ఉన్నారు. లంబాడీలు, ఎరుకలు 4.77 శాతం, మాలలు 4.69 శాతం ఉన్నారు. వడ్డెరలు 3.79 శాతం, కుమ్మర్లు 3.56 శాతంగా ఉన్నారు. విశ్వబ్రాహ్మణుల ఓట్లు 3.55 శాతం ఉన్నాయి. రెడ్లు 3.49 శాతం, ముస్లింలు 3.47 శాతం, కమ్మవారు 2.58 శాతం, ఆర్యవైశ్యులు 1.71 శాతం, వెలమలు 1.07 శాతం, మున్నూరు కాపులు 1.07 శాతం ఉన్నారు. మొత్తానికి సామాజిక వర్గాల సమీకరణాలు, ఇతర పార్టీల అభ్యర్థులను పరిశీలించిన తర్వాతే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్, టీఆర్ఎస్ ఆలోచనగా తెలుస్తోంది. సర్వేలు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తామని రెండు పార్టీల అధిష్టానాలు చెబుతున్నాయి. కులాలవారీగా ఎంత లాభం చేకూరుతుందో పక్కాగా లెక్కలు వేసుకొని మరీ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు అన్ని పార్టీల పెద్దలు. కులలవారిగా వచ్చే సమరానికి సిద్ధమవుతున్నాయి.
మునుగోడు ఉప ఎన్నిక ముంచుకొస్తున్న తరుణంలో ఆశావహుల సర్వేలు జోరందుకున్నాయి. బరిలో నిలవాలనుకునే వారు ఎవరికివారే సర్వేలు చేయించుకుంటుండగా.. రాజకీయ పార్టీలు కూడా ప్రజల నాడి తెలుసుకునేందుకు సర్వే నిర్వహిస్తున్నాయి. ప్రజల్లో ఎవరి పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందన్న విషయాలతోపాటు ఎవరి టికెట్ ఇవ్వొచ్చు.. ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వివరాలను ఆయా రాజకీయ పార్టీలు రాబడుతున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సర్వేల్లో మునిగిపోయాయి. ముఖ్యంగా బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వంపైనా ప్రత్యేక సర్వే చేయించగా, ప్రశాంత్ కిషోర్ బృందం ఇప్పటికే నియోజవకర్గంలో మూడుసార్లు సర్వే చేసింది. దీనికితోడు మరో ఆరేడు సంస్థలు కూడా తమ సర్వేలను కొనసాగిస్తున్నాయి. నియోజకవర్గంలోని మండలాల వారీగా ఉన్న ఓటర్ల జాబితాను ఆధారంగా సర్వే చేస్తున్నారు. ఒక్కో మండలంలో ఐదు వేల నుంచి 15 వేల మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో సామాజిక వర్గం ప్రధానం కాబోతుందా? పార్టీల వారీగా సంప్రదాయ ఓటింగ్‌కే మొగ్గు చూపుతారా? అన్న వివరాలను తెలుసుకుంటున్నారు.
చండూరులోనూ పీకే టీంతోపాటు, పలు సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల నుంచి ఫలానా వారు అభ్యర్థులు అనుకుంటే అందులో ఒక్కొక్కరి పరిస్థితిపైనా ఆరా తీస్తున్నాయి. వారికి ఫాలోయింగ్ ఉందా? టికెట్ ఇస్తే గెలుస్తారా? అసలు అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు? ఏ ప్రాతిపదికన గెలుస్తారని భావిస్తున్నారన్న వివరాలను సేకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీల నుంచి టికెట్ ఎవరికి ఇవ్వాలి.. పాల్వాయి స్రవంతికి ఇవ్వాలా? టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేతకు ఇవ్వాలా? లేదంటే కొత్తగా తెరపైకి వస్తున్న వారికి ఇవ్వాలా? అందులో ఎవరికి టికెట్ ఇస్తే గెలిపిస్తారు? లేదంటే అధికార పార్టీ అభ్యర్థినే గెలిపిస్తారా? అన్న వివరాలను అడుగుతున్నారు. రాజగోపాల్‌రెడ్డికి ఓట్లు వేస్తారా? ఆయన్ని మళ్లీ గెలిపిస్తారా? కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరు బెటర్ అనే వివరాలను సేకరిస్తున్నారు.
సర్వేల్లో పార్టీల పనితీరును కూడా అడిగి తెలుసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ బెస్టా.. బీజేపీని గెలిపిస్తారా? కాంగ్రెస్‌కు పట్టం కడతారా? అన్న వివరాలను సేకరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. ఎన్నికలు జరిగితే పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరైతే మెరుగ్గా ఉంటుందని అనుకుంటున్నారు.. గ్రామాల్లో ఏయే సమస్యలు ఉన్నాయి.. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఎంత.. ఆగిపోయిన పనులు ఏంటి? అందుకు ఎవరు కారణం.. అభివృద్ధి జరగకపోతే ఎందుకు జరగలేదనుకుంటున్నారు.. ఉప ఎన్నికలు వస్తే అభివృద్ధి పనులు కొనసాగుతాయని అనుకుంటున్నారా? అన్న సమగ్ర వివరాలను తీసుకొని క్రోడీకరిస్తున్నారు.
కేంద్రం నిధులతో అభివృద్ధి జరుగుతుందనుకుంటున్నారా?. రాష్ట్రమే అభివృద్ధి చేస్తుందనుకుంటున్నారా?. ఎన్నికల్లో ఏయే పార్టీల నడుమ పోటీ ఉంటుంది.. ఏ పార్టీకి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఓటు వేసేందుకు రాజకీయ పార్టీలను చూస్తారా, వ్యక్తులను చూస్తారా, సాంప్రదాయ బద్ధంగా ఓటు వేస్తారా, సరి కొత్తగా మార్పు కోరుకుంటున్నారా అన్న వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
టికెట్‌కు ప్రయత్నిస్తున్న ఆశావహులు కూడా సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కోసం ప్రత్యేకంగా రెండు సర్వేలు సాగుతున్నాయి. బీజేపీ కూడా ఒక సర్వే చేయిస్తోంది. చౌటుప్పల్ మండలంలో సర్వేలు కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీలు, నాయకులతోపాటు మీడియా సంస్థలు సర్వే నిర్వహిస్తున్నాయి. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కర్నాటి విద్యాసాగర్, నారబోయిన రవి తరఫున కూడా కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఎన్ని సర్వేలు చేసినా.. ప్రజల నాడి పట్టామా.. లేదా అనే సందేహం అందరికీ ఉంది.
మునుగోడును అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాన పార్టీలు తమ బలాలు, బలహీనతలను సరిచూసుకుంటున్నాయి. తమ బలం పెంచుకోవడంతో పాటు.. ప్రత్యర్థిని ఎలా దెబ్బకొట్టాలనే వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు కేంద్రంగా రాజకీయం నడుస్తోంది. గుజరాత్ ఎన్నికలతో పాటు ఇక్కడ ఉప ఎన్నిక ఉంటుందని పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. రాజగోపాల్ రాజీనామాను వెంటనే స్పీకర్ ఆమోదించటంతో అన్ని పార్టీలు అలర్ట్ అయిపోయి కీలక వ్యూహాల్లో ఉన్నాయి. ముఖ్యంగా అభ్యర్థి విషయంలో తలమునకలయ్యాయి. బీజేపీకి ఆ తలనొప్పి లేకపోయినా.. మిగిలిన పార్టీలకు తర్జనభర్జన తప్పడం లేదు. ఎందుకంటే.. ఈ ఎన్నిక 2023 ఎన్నికలకు సెమీ ఫైనల్ లాంటిది. ఇక్కడ గెలిస్తేనే దీని ప్రభావం తర్వాతి ఎన్నికలపై కచ్చితంగా ఉంటుంది. అందుకే పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టులు బలంగా ఉంటారు. ముఖ్యంగా సీపీఐ క్యాడర్ ఎక్కువ. 1967 ఎన్నికల నుంచి చూసుకుంటే.. 1985 వరకు కాంగ్రెస్ తరఫున పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి నాలుగుసార్లు వరుసగా గెలిచారు. 1985 నుంచి 1999 వరకు సీపీఐ మూడు సార్లు గెలిచింది. ఆ తర్వాత గోవర్ధన్ రెడ్డికి మరో అవకాశం దక్కింది. మళ్లీ 2004 నుంచి 2014 వరకు సీపీఐ ఏలింది. అప్పటిదాకా కాంగ్రెస్, సీపీఐకి మాత్రమే అవకాశం ఇచ్చిన జనం.. 2014లో టీఆర్ఎస్ కు ఛాన్స్ ఇచ్చారు. కానీ.. అది నాలుగేళ్లకే పరిమితం అయింది. 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు సీపీఐ బరిలో ఉంటుందా లేదా అన్నది ఇంట్రస్టింగ్ పాయింట్. ఉంటే మాత్రం ఓట్లు చీలడం ఖాయం.
నియోజకవర్గంలో బీజేపీకి ఎలాంటి బలం లేదు. రాజగోపాల్ రెడ్డి మీదే భారం వేసింది. ఒకవేళ ఆయన బలం నిరూపించుకోలేకపోతే కిందకు దిగజారిపోయి.. రాష్ట్రంలో పార్టీ బలం పుంజుకుంది అనేది ఉత్తితి మాటలుగానే మిగిలిపోతాయి. అందుకే పక్కాగా గెలిచి తీరాల్సిందే. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలంటే కచ్చితంగా బీజేపీకి విజయం కావాలి. ఇక మునుగోడులో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది. అయితే.. రాజగోపాల్ రెడ్డి ప్రభావం చూపిస్తే గనక షాక్ తప్పదు. ఎందుకంటే.. ఆయన్ను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఎన్నికల నాటికి నాటకీయ పరిణామాలు ఎన్నో చోటు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ లో కిందిస్థాయి లీడర్లు ఎంత మంది ఉంటారో, వెళ్తారో అనేది తేలిపోతుంది. అప్పుడు అసలు ఆట మొదలవుతుంది. టీఆర్ఎస్ సర్కార్ ను కూల్చేది తామేనని కాంగ్రెస్ నేతలు బలంగా చెప్తున్నారు. ఇప్పుడు మునుగోడులో గెలిస్తేనే జనాల్లో కాస్తో కూస్తో నమ్మకం కలుగుతుంది.
మరోవైపు టీఆర్ఎస్ పరిస్థితే ఎటూ కాకుండా ఉంది. ఈ ఉప ఎన్నిక మిగిలిన పార్టీలు సెమీ ఫైనల్ గానే భావిస్తున్నాయి. టీఆర్ఎస్ కూడా తప్పకుండా దాన్ని పాటించాల్సిందే. ఇప్పుడు ఓడిపోతే తర్వాత ఎన్నికల్లో నష్టం చూడాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ కొత్త పింఛన్లు, నేతన్న బీమా సహా పలు అంశాలను తెరపైకి తెచ్చారని అనుకుంటున్నారు. మొత్తానికి ఈ సెమీస్ లో గెలిచే పార్టీ ఫేవరేట్ గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. ప్రజలు ఎటువైపు నిలబడతారా? అనేది ఉత్కంఠగా మారింది.
మునుగోడు ఉపఎన్నిక ఫలితం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుందని గట్టిగా చెప్పలేం. కానీ పీపుల్స్ పల్స్ ఏంటో మాత్రం తేలిపోతుందనే అంచనాలున్నాయి. మునుగోడు ఫలితాన్ని బట్టి.. ప్రధాన పార్టీలు రాజకీయ వ్యూహాలు మారే అవకాశాలున్నాయి. మునుగోడులో బీజేపీ గెలిస్తే.. మరిన్ని ఉపఎన్నికలు తప్పవనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ విజయం సాధిస్తే.. ప్రతిపక్షాల హడావుడి తగ్గుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే.. రాజకీయం సరికొత్త మలుపు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఉద్యమ సమయం నుంచీ తెలంగాణ రాజకీయాల్ని ఉపఎన్నికలే శాసిస్తూ వచ్చాయి. ఇప్పుడు మరోసారి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ఓ ఉప ఎన్నిక ఫలితం నిర్ణయించే పరిస్థితి వచ్చింది.
మునుగోడు నియోజక వర్గంలో వరుసగా 1985, 1989, 1994లో వరుసగా మూడు సార్లు ఉజ్జినీ నారాయణ రావు సీపీఐ నుండి ఎమ్మెల్యే గా గెలిచారు. ఆ తర్వత పల్లా వెంకట్ రెడ్డి 2004లో, ఉజ్జీనీ యాదగిరి రావు2009లో అదే పార్టీఆ నుండి గెలిచారు. 2014లో ఇక్కడ టియ్యారెస్ గెలిచింది. అయితే, 2018 లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుండి గెలిచింది కూడా సీపీఐ మద్దతు తోనే. ఒకప్పుడు ఇక్కడ కమ్యూనిస్టులకు ఒంటరిగా గెలిచే స్థాయి ఉంటే, ఇప్పుడు బలమైన క్యాడర్ మాత్రం మిగిలి ఉంది. సుమారు 10 నుండి 15 వేల సొంత ఓటు బ్యాంక్ ఈ పార్టీక ఉండే ఛాన్సుంది. దీంతో ఈ ఓట్లు ఎటు మళ్లుతాయనే చర్చ నడుస్తోంది. పైగా, ఈ ప్రాంతంలోనే జరిగిన హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఎన్నికల్లో టియ్యారెస్ కి అనుకూలంగా వ్యవహరించింది సీపీఐ. అయితే ఆ రెండు నియోజక వర్గాల్లో లెఫ్ట్ బలం… 2 వేల వరక్కే పరిమితం. కానీ మునుగోడు లో గెలిచే బలం లేకున్నా, ఫలితాలను తారుమారు చేసే శక్తి మాత్రం ఉంది..
ఇటు, బీజేపీ..కాంగ్రెస్ ఎన్నికలకు సిద్దం అవుతున్న నేపథ్యంలో సీపీఐ కూడా ఉప ఎన్నికకు రెడీ అవుతోంది. స్వయంగా పోటీ చేయాలా..? లేక ఎవరికైనా మద్దతు ఇవ్వాలా..అనే దానిపై చర్చించనుంది. ఈ నెల 12న చండూరు లో పార్టీ మండల అధ్యక్షులతో సమావేశం కానున్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి. ఒకవేళ పోటీ చేస్తే నెల్లికంటి సత్యంని బరిలో నిలిపే ఆలోచన లో సీపీఐ ఉన్నట్టు సమాచారం. ఒకవేళ పోటీ చేయకుంటే, టియ్యారెస్, కాంగ్రెస్ పార్టీల్లో దేనికి మద్దతు పలుకుతారనేది ఆసక్తికరంగా మారింది.