NTV Telugu Site icon

Loan Apps :ప్రాణాలు తీస్తున్న లోన్ యాప్ లు..చేతులెత్తుస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు

Loan Apps

Loan Apps

ఒకప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. లోన్ కోసం దరఖాస్తు చేయడం, బ్యాంకు దరఖాస్తుని పరిశీలించడం, వెరిఫికేషన్ కోసం బ్యాంకు సిబ్బంది ఇంటికి రావడం, ఆదాయ వివరాలు పరిశీలించిన రుణం మంజూరు చేయాలో, వద్దో నిర్ణయించడం… ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఈ మొత్తం ప్రాసెస్‌కు రెండుమూడు వారాల సమయం పట్టేది. ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం నిమిషాల్లో పని. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటే 10 నిమిషాల్లో కూడా రుణాలు ఇచ్చే సంస్థలు, యాప్ లు ఉన్నాయి.

సకాలంలో రుణాలు చెల్లించకపోతే లోన్ యాప్​ల నిర్వాహకులు వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ యాప్​ల కారణంగా వందలాది మంది బాధితులు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. తాజాగా ఈ యాప్​ల వేధింపులు విపరీత పోకడలకు వెళ్లాయి. బాధితుల మిత్రుల ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మార్చడం కలకలం రేపుతోంది.

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. సకాలంలో చెల్లించకపోవడంతో నిర్వాహకులు నుంచి ఒత్తిడి మొదలైంది. అసలు, వడ్డీ చెల్లించేంత వరకు వదలం అంటూ వెంట పడ్డారు. అతను నుంచి స్పందన రాకపోవడంతో.. బాధితుడి ఫోన్ లోని నెంబర్ ఆధారంగా అతడి మిత్రుల వాట్సాప్ డీపీ నుంచి ఫోటోలు సేకరిస్తున్నారు. వాటిని నగ్న చిత్రాలుగా మార్కింగ్ చేసి.. వారికే పంపి మీ స్నేహితుడు అప్పు తీర్చుకుంటే ఇవన్నీ బయటకు పంపుతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

మగవాళ్ళు ఏదోవిధంగా ధైర్యంగా ఉన్నా.. మహిళలు, యువతులు స్నేహితుల జాబితాలో ఉన్నప్పుడు అడిగినంత సొమ్ము చెల్లించి పరువు కాపాడుకుంటున్నారు. ఓ మహిళ ఇంటి అవసరాలకు అధిక వడ్డీకి పలు రుణయాప్ ల నుంచి రెండు లక్షలు తీసుకుంది. చెల్లించడంలో ఆలస్యం కావడంతో ఆమె సహచర ఉద్యోగులకు ఫోన్ చేసి కించ పరిచారు. ఆమె ఫోన్ నెంబర్ ను 500 మంది యువకులకు ఇచ్చారు. వారి నుంచి అసభ్యంగా ఫోన్ రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మలక్పేట్ యువకుడు రూ.1.5 లక్షల అప్పు చెల్లించకపోవడంతో అతడు మరణించినట్లు శవానికి దండవేసి మార్ఫింగ్ ఫొటోను కుటుంబ సభ్యులు, స్నేహితులు ఫోన్ నెంబర్లకు వాట్సప్ ద్వారా చేరవేశారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఓ నివేదిక విడుద‌ల చేసింది. ఈ నివేదిక ఆధారంగా దేశంలో ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లలో దాదాపు 1100 ఆన్‌లైన్ లోన్ యాప్‌లు ఉన్నాయని వెల్లడించింది. ఈ ఆండ్రాయిడ్ యాప్‌ల‌లో 600 పైగా చ‌ట్ట విరుద్ధంగా ఉన్నట్టు ఆర్‌బీఐ గుర్తించింది. ఈ స్కామ్‌లను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంక్ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ ఈ డిజిటల్ లెండింగ్ యాప్‌ల నియంత్రణ కోసం చట్టాన్ని రూపొందించాల‌ని కోరింది. ఇటీవ‌ల కాలంలో లోన్ యాప్‌ల స్కామ్‌లు త‌రచుగా బ‌య‌ట‌ప‌డ‌డం ప‌లు చోట్ల ఫిర్యాదులు రావ‌డంతో వీటిపై నియంత్రణ అవ‌స‌రం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఫైనాన్స్ రంగంలో సాంకేతిక పురోభివృద్ధి ఆహ్వానించ‌ద‌గ్గదే అయిన‌ప్పటికీ వాటిపై నియంత్రణ అవ‌స‌రం. క‌స్టమ‌ర్ డేటా గోప్యత‌ , చ‌ట్టవిరుద్ధమైన పెట్టుబ‌డులు వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌సరం ఉందనే వాదన వినిపిస్తోంది.

హైదరాబాద్ లో లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం వెలుగు చూసింది. లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయి. తర్వాత లోన్ డబ్బులు చెల్లించాలంటూ వేధిస్తున్నారు. ఫొటో మార్ఫింగ్ లు చేసి వేధిస్తున్నారు. పైగా తిడుతున్నారు. హైదరాబాద్ పరిధిలో వందల సంఖ్యలో లోన్ యాప్ కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా తమ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని బాధితులు అంటున్నారు. అడక్కపోయినా అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు.

రుణం మంజూరు చేయడానికని సదరు వ్యక్తుల నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంటి అడ్రస్, వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంక్ ఎకౌంట్ డిటెయిల్స్ కూడా సేకరిస్తున్నారు. వీటితో పాటు దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి తెలియకుండానే అతని మొబైల్లోని పర్సనల్ డేటాని దొంగిలిస్తారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో ఆలస్యమైతే ఆ తర్వాత రెచ్చిపోతారు. బూతులు తిడుతూ వాయిస్ మెసేజ్ లు పంపిస్తారు. అంతేకాదు ఫోటోలు మార్ఫింగ్ చేసి కాంటాక్ట్ లిస్టులోని వారికి పంపుతారు. అదే మహిళలైతే ముందు మెత్తగా మాట్లాడి ఆ తర్వాత ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలో అవమానభారం, ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉంటున్నాయి.

ఫైనాన్స్ లో వస్తువు, రుణం తీసుకున్న వారికి సంబంధం లేని వ్యక్తులకు ఫోన్లు చేసి ఫలానా వ్యక్తి మా దగ్గర లోన్ తీసుకున్నాడని.. తిరిగి చెల్లించలేదని మీరు హామీ ఉన్నారు.. గనుక అతడితో మాట్లాడించండి అంటూ దూషించడం, బెదిరించడం వంటివి చేస్తున్నారు. అంతేకాదు పచ్చిబూతులు తిడుతూ, అసభ్యకరంగా మాట్లాడుతూ అవమానించడం, వినకపోతే ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎదుర్కొంటున్న బాధితులు తీవ్రంగా కుమిలిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఆన్లైన్ లోన్ ల పేరిట నకిలీ యాప్ లు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నాయి. అడగకుండానే రెచ్చగొట్టి మరీ లోన్లు ఇస్తూ, ఆపై అధిక వడ్డీతో లోన్లు చెల్లింపు కోసం రుణ గ్రహీతలను మానసిక వేధింపులకు గురి చేస్తున్నాయి. ఇక ఈ ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకున్న చాలామంది వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యాప్ ఆధారిత మనీ లెండింగ్ సంస్థల ద్వారా వేధింపులు ఎదుర్కొంటున్న వారు, సదరు యాప్ ల గురించి ఫిర్యాదు చేయాలని పోలీసులు నిరంతరం రుణగ్రహీతలను కోరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకులు అప్పులు చెల్లించాలని కోరుతూ పెద్ద ఎత్తున వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకొన్నాయి.

 

ఇన్​స్టంట్ లోన్, ఒక్క క్లిక్ తో లోన్​మీ సొంతం అంటూ ఊరిస్తారు. డాక్యుమెంట్స్​అవసరం లేదు. సిబిల్​స్కోర్​తో పనిలేదంటూ ఊదరగొడుతారు. ఈ ఆఫర్లకు ఆకర్షితులై వారి ట్రాప్​లో పడ్డామో.. ఇక అంతే సంగతి. వారు పంపిన లింక్​నుంచి యాప్​ లోన్​ డౌన్​లోడ్​ చేసుకుంటే ఇక మీ ఫోన్​మోసగాళ్ల చేతికి చిక్కినట్టే. మీ ఫోన్​లోని కాంటాక్ట్​నంబర్లతో సహా ఫొటోలు, మీ పర్సనల్​డేటా అంతా వారికి చిక్కుతుంది. లోన్​తీసుకొని టైంకు కట్టకున్నా.. లేటు అయినా.. టార్చర్​స్టార్టవుతుంది.

గూగుల్ ప్లేస్టోర్​లో 600కు పైగా ఇన్​స్టంట్ లోన్​ యాప్​లు ఉన్నాయి. ఇందులో 27 యాప్​లను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బ్లాక్​ చేసింది. మరో 137 యాప్​ల లిస్ట్ ను ఆర్బీఐ విడుదల చేసింది. ఆ యాప్​ల పట్ల యూజర్లు జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ వార్నింగ్ ఇచ్చింది. పోలీసులు కూడా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సైబర్​ దోస్త్ ద్వారా ఇలాంటి లోన్​ యాప్​లపై ప్రచారం చేస్తున్నారు. ఇన్ స్టాల్ చేసుకునేటప్పుడే యూజర్​ ఫోన్​కు సంబంధించిన డేటా, ఫొటోలు, కాంటాక్ట్ నంబర్స్​ను యాక్సెస్​ చేసుకునేలా పర్మిషన్స్​ఇవ్వాల్సి ఉంటుంది. అలా లోన్​ కావాలంటే తప్పనిసరిగా కండిషన్స్​కు ఓకే చెప్పాల్సి రావడం, ఆ తర్వాత లోన్​ తీసుకున్న వారి పాలిట శాపంగా మారుతోంది. లోన్ కట్టకపోయినా, లేట్​అయినా, వారు అడిగినంత చెల్లించకపోయినా వారి టార్చర్​స్టార్ట్​అవుతుంది. లేడీస్​ ఫొటోలను మార్ఫింగ్ చేసి, పోర్న్​ సైట్లలో పెడతామని హెచ్చరిస్తున్నారు. మాట వినని వాళ్ల మార్ఫింగ్ చేసిన అర్ధనగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తున్నారు. అప్పటికే వారి బంధువులు, ఫ్రెండ్స్ కాంటాక్ట్ నంబర్స్​ పంపించి ఇజ్జత్ తీస్తున్నారు. చిన్న అమౌంట్ కోసం లోన్​ యాప్​ల జోలికి వెళ్లొద్దని సైబర్​ క్రైమ్​ పోలీసులు సూచిస్తున్నారు.

లోన్​ డబ్బు తిరిగి చెల్లించినా కూడా యాప్ నిర్వాహకుల నుంచి బాధితులకు వేధింపులు తప్పడం లేదు. దీంతో అప్పటికప్పుడు బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఉపయోగం లేకుండా పోతోంది. గూగుల్ ప్లే స్టోర్​ లో ఉన్న యాప్​ లు చైనాలో తయారైనవి కావడం, నేపాల్ నుంచి ఆపరేట్ చేస్తుండడంతో వాళ్లను ట్రాక్​ చేయడం, అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేయడం సాధ్యం కాకపోవడంతో ఇలాంటి కేసులను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని సైబర్​ క్రైమ్​ పోలీసులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి యాప్​ల పట్ల అలెర్ట్​గా ఉండాలని సూచిస్తున్నారు. ఇన్​స్టంట్​లోన్​లు ఇస్తామంటూ ఆఫర్​చేసే యాప్​లను నమ్మొద్దు. బ్యాంక్​ లు, ఫైనాన్షియల్ గా ట్రస్టెడ్ కంపెనీలు తప్పించి ఇతర గుర్తింపులేని యాప్​ల జోలికి పోవద్దు. నగదు లావాదేవీల విషయంలో రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ సంస్థలనే ఆశ్రయించాలి. సైబర్​ దోస్త్ ప్రోగ్రామ్​ ద్వారా ఆన్​లైన్​ మోసాలపై అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. కొందరు సైబర్ నేరగాళ్లు పది నిమిషాల్లోనే రుణ సదుపాయం కల్పిస్తామని ఫోన్ కాల్స్, మెసేజెస్, ఈమెయిల్స్ వంటివి పంపి ప్రజలను ఆకట్టుకుంటున్నారు.

ఫోన్ యాప్స్ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని, సులువుగా రుణం పొందవచ్చు అని ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చూస్తుంటే కంపెనీలు.ఇలా రుణం ఇచ్చినట్లే ఇచ్చి ఆ తర్వాత యాప్ కు సంబంధించిన సిబ్బంది బాధితులను వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ తరుణంలో ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు
అలాగే ఇప్పటి వరకు ఎంత మంది బాధితులకు రుణాలు ఇచ్చారో, అలాగే వారి నుంచి ఎంత డబ్బు కాజేస్తున్నారన్న విషయాలపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఎలాంటి డాక్యుమెంట్స్, మధ్యవర్తి ఎవరు లేకుండానే కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లోనే వారు తెలిపిన వివరాలను స్మార్ట్ ఫోన్ లో అప్లోడ్ చేసి వెంటనే అకౌంట్ లోకి డబ్బులు పంపిస్తారు.
ఇక పది పదిహేను రోజుల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఫోన్లో మెసేజ్ ద్వారా వ్యవహారం కొనసాగిస్తారు.ఇచ్చిన గడువు కాస్త లేట్ అయితే బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పనిచేసే సంస్థ లకు, ఇలా మోసం చేశాడు అని వారికి మెసేజ్లు పంపుతారు. ఇలాంటి యాప్స్ అన్ని కూడా అధికంగా చైనా కు చెందినవి అని, సరైన ఫోన్ నెంబర్లు కానీ, కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు ఉండవు. ఇలా రుణ సదుపాయాలు కల్పిస్తున్న యాప్స్ ఎక్కువ శాతం ఆర్బీఐ వద్ద నమోదు కాలేదు. చైనా లోన్‌ యాప్‌ సంస్థలు అడ్డగోలుగా భారతీయులను కొల్లగొట్టాయి. ఒక్క ఏడాదిలోనే దాదాపు 12 వేల కోట్లను దోపీడీ చేశాయి. ఒక్క తెలంగాణలోనే రెండు నెలల్లో 300 కోట్లకుపైగా కొల్లగొట్టాయి. ఒక యాప్‌ను గుర్తించేలోపే మరో యాప్‌తో ప్రచారం చేస్తూ ఎరవేస్తున్నాయి. ముంబయికి చెందిన నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ పీసీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పేరిట ఆర్‌బీఐ జారీచేసిన లైసెన్స్‌ను అడ్డం పెట్టుకొని యాప్‌ ద్వారా చైనా సంస్థ సాగించిన కళ్లుబైర్లు కమ్మే దోపీడీ ఇది.

పీసీఎఫ్‌ఎస్‌లోకి అడ్డదారిలో విదేశీ పెట్టుబడుల్ని రప్పించి మరీ ఆ మేరకు కొల్లగొట్టినట్టు, ఆ సొమ్ముల్ని మళ్లీ దొడ్డిదారిలో చైనా, హాంకాంగ్‌, తైవాన్‌, సింగపూర్‌ తదితర దేశాలకు తరలించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా గుర్తించింది. అప్పుల మంజూరు, వసూళ్లలో రుణ సంస్థలు అనేక దారుణాలకు పాల్పడినట్టు తేల్చింది. క్యాష్‌బీన్‌, క్యాష్‌ బీయింగ్‌, ఈజీలోన్‌, లక్కీరుపీ, ఇన్ఫినిటీ క్యాష్‌, మినిట్‌ క్యాష్‌ వంటి యాప్‌ల ద్వారా రుణాలు మంజూరు వ్యవహారం నడిచింది. ఈ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరించి రుణాలు మంజూరు చేసేవారు. ఈ క్రమంలో దరఖాస్తుదారులకు తెలియకుండానే వారి ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేవారు. రుణ మంజూరులో 15-25 శాతం వరకు ప్రాసెసింగ్‌ రుసుం పేరిట ముందస్తుగానే తీసుకునేవారు. రుణం చెల్లింపునకు కొన్ని సందర్భాల్లో రెండు వారాలనే గడువుగా విధించారు.
కట్టలేని పక్షంలో ఏడాదికి రెండువేల శాతం వడ్డీ వేశారు. అంతమొత్తం కట్టలేని వారిపై వేధింపులకు పాల్పడ్డారు. దాని కోసమే ఏకంగా కాల్‌సెంటర్లనూ ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏడాదిలోనే 11వేల 717 కోట్లు కొల్లగొట్టారు. ఇలా అక్రమంగా దోపీడీ చేసిన సొమ్మును విదేశాలకు తరలించేందుకు లోన్‌ సంస్థలు కుయుక్తులు పన్నాయని, బోగస్‌ ఎయిర్‌వే బిల్లులతోపాటు కల్పితమైన క్లౌడ్‌ సీసీటీవీ స్టోరేజీ అద్దె ఛార్జీ పత్రాలను సృష్టించాయని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

ముంబయిలోని ఎస్‌బీఐ, ఎస్‌బీఎంలకు చెందిన కొన్ని ఎంపిక చేసిన శాఖల ద్వారా సొమ్మును విదేశాలకు తరలించినట్లు తేలింది. డొల్ల కంపెనీలకు చెందిన 621 బోగస్‌ ఫామ్‌-15సీబీ పత్రాలను సృష్టించినట్లు బహిర్గతమైంది. విదేశాల నుంచి సాఫ్ట్‌వేర్లను దిగుమతి చేసినట్లుగా చూపి అందుకోసం చెల్లింపుల పేరిట సొమ్మును చైనా సహా పలు దేశాలకు తరలించారని దర్యాప్తు సంస్థ తేల్చింది.

 

ఈరోజుల్లో మధ్య తరగతి కుటుంబం జీతంతో నడవాలంటే అద్భుతమే. అందుకే కొందరు అప్పులు చేస్తూ తిప్పలు పడుతుంటారు. అలాంటి వారికే ఆన్‌ లైన్‌ అప్పుల యాప్‌ లు ఎర వేస్తుంటాయి. ఒక్కసారి చిక్కితే అంతే సంగతులు. తీసుకునే దాకా ఫోన్లతో ఒక తంటా.. తీరా తీసుకున్నాక మరో తంటా. ఏజెంట్ల వేధింపులు, చట్టవిరుద్ధమైన విధానాలు, క్రూరమైన దురాగతాలతో నానా ఇబ్బందులు పడాల్సిందే.

కరోనా మహమ్మారి అన్ని రంగాలలోని ప్రజల జీవితాలను నాశనం చేసింది. చాలా మంది ఆర్థికంగా చితికిపోయారు. పైగా క్షీణిస్తున్న ఆర్థికవృద్ధి, ఉద్యోగుల తొలగింపు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దేశంలో కొత్త ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల కొరత కోట్లాది మంది భారతీయులను తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టాయి. ఈ కష్టకాలంలో సామాన్యులను ఆదుకోవాల్సిన సాధారణ బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ఈ కష్ట సమయాల్లో ప్రజలు రుణాల కోసం ఓకే రూపీ లాంటి ఆన్‌ లైన్ లోన్ యాప్‌ లను ఆశ్రయిస్తున్నారు.

ఈ యాప్‌ లు అధిక వడ్డీ రేట్లకు లోన్‌ లు, ప్రాసెసింగ్ ఫీజు, ఆలస్య రుసుం, ఇతర సాకులతో విపరీతమైన మొత్తాలను వసూలు చేస్తున్నప్పటికీ, సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థ మొండిచేయి చూపడంతో ప్రజలు వీటిని సంప్రదించాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. భాదాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు రెండూ డిఫాల్ట్ చేసే పలుకుబడి ఉన్న వ్యక్తులకు వేల కోట్ల రుణాలను అందజేస్తున్నాయి కానీ పేద, మధ్యతరగతి ప్రజలకు అవసరమైన సమయాల్లో చిన్న మొత్తాలను కూడా అందించడం లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బ్యాంకుల్లో కేవలం 900కు పైబడిన పలుకుబడి వున్న వ్యక్తులు సుమారు రూ.1.30 లక్షల కోట్ల రుణ మొత్తాలను ఎగవేసినట్లు ఇండిపెండెంట్ సిటిజన్ గ్రూప్ చేసిన అధ్యయనంలో తేలింది. కానీ.. దురదృష్టవశాత్తూ, బ్యాంకులు వివిధ నియమాలు, నిబంధనలను చెబుతూ రూ.10వేల రుణం కోసం సామాన్యులకు మొండిచేయి చూపిస్తున్నాయి. సాధారణ బ్యాంకింగ్ వ్యవస్థ వైఫల్యం, ప్రభుత్వాల అసమర్థత కారణంగా ఈ ఆన్‌ లైన్ లోన్ యాప్‌లు లక్షలాది మంది అమాయకులు, కష్టజీవులని కొల్లగొడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ యాప్‌ లు 30 శాతం నుండి ఊహకందని 200 శాతం వరకు వడ్డీలను వసూలు చేస్తున్నాయి. వివిధ కారణాలను చూపుతూ అనేక సందర్భాల్లో రెండింతలు, మూడు రెట్లు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నాయి. ఈ యాప్‌ లు చాలా వరకు చట్టవిరుద్ధమైనవి, ఎలాంటి రిజిస్ట్రేషన్‌ ను లేకుండా, అనైతిక పద్ధతులను అవలంబిస్తూ ప్రజలని దోచుకుంటున్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల ఒక వ్యక్తి రుణం చెల్లించలేని పక్షంలో రికవరీ కోసం దారుణంగా బలవంతం చేస్తూ హేయమైన పద్ధతులు అనుసరిస్తున్నాయి.

ఓకే రూపీ లాంటి ఆన్‌ లైన్ లోన్ యాప్‌ ల రికవరీ ఏజెంట్ల వేధింపుల కారణంగా చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇవి ఫిన్‌ టెక్ కంపెనీలుగా కాకుండా మాఫియా సంస్థలుగా పనిచేస్తున్నాయి. రుణాలు పొందిన మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాయి. రుణగ్రహీతలను అవమానపరిచేలా వారి పరిచయస్తులకు ఫోటోలు, వివరాలను షేర్ చేసి చిత్రహింసలు పెడుతున్నాయి. రికవరీ ఏజెంట్లుగా ఎక్కువగా రౌడీషీటర్లే ఉంటున్నారు. రుణగ్రహీతల ఇళ్ళపై ఆ గూండాలు దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఆన్‌ లైన్ లోన్ యాప్ ఆపరేటర్‌ లు చేసిన అవమానాన్ని తట్టుకోలేక చిన్నపాటి పారిశ్రామికవేత్తలు, ఐటీ రంగం, ఇతరులతో సహా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.

వారం రోజుల క్రితం కూడా ఈఎంఐ చెల్లించని ఓ హైదరాబాద్‌ మహిళ చిత్రాలను నగ్న ఫోటోలుగా మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. ఆతో పాటు కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గత సంవత్సరం కోవిడ్ సెకెండ్ వేవ్ సమయంలో హైదరాబాద్‌ కు చెందిన ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు ఆన్‌ లైన్ లోన్ యాప్‌ ల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అనైతికమైన ఆన్‌ లైన్ లోన్ యాప్‌ లపై పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అనేక దారుణమైన సంఘటనలు, బాధితుల నుండి ఫిర్యాదుల తర్వాత కూడా ఈ యాప్‌ లపై ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం ఆర్థిక మోసగాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చినట్లే అవుతుంది.

ఆన్‌లైన్‌లో అప్పులిచ్చే రుణయాప్‌ల నిర్వాహకుల ఆగడాలు మళ్ళీ మొదలయ్యాయి. గత రెండేళ్లలో గడువులోగా అప్పులు తీర్చలేక, నిర్వాహకుల వేధింపులు తాళలేక తెలంగాణలో పది మందికి పైగా బలవన్మరణానికి పాల్పడ్డారు. దాంతో వెనక్కి తగ్గినట్లు కనిపించిన యాప్‌లు- కాస్త సద్దు మణగగానే మళ్ళీ దందా మొదలుపెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఓ యువకుడు రుణ యాప్‌ల నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం ఈ వ్యవహారాన్ని మరోమారు తెరపైకి తెచ్చింది. ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమితమైన రుణయాప్‌ల దందా ఇప్పుడు చిన్నపట్టణాలకూ పాకడం ఆందోళన రేకెత్తించే పరిణామం.

బడుగు జీవులు, విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు… ఇలాంటి సూక్ష్మరుణాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కరోనా తొలి విడత లాక్‌డౌన్‌లో కొలువులు కోల్పోయిన చిరుద్యోగులు, చిరువ్యాపారులు ఎంత వడ్డీ అయినా అప్పు దొరకడమే మహద్భాగ్యమనుకున్న పరిస్థితుల్లో సూక్ష్మ రుణాలిచ్చే ఈ యాప్‌లు విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 1110కు పైగా రుణ యాప్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో 600 ఎలాంటి లైసెన్సు లేకుండా అక్రమంగా వ్యాపారం చేస్తున్నాయని ఆర్‌బీఐ రెండేళ్ల కిందటే తేల్చిచెప్పింది. ఈ తరహా యాప్‌లను చైనా, సింగపూర్‌, ఇండొనేసియా తదితర దేశాలకు చెందినవారు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. మన చట్టాలను పట్టించుకోకుండా ఇక్కడి వారికి అప్పులిచ్చి అడ్డగోలుగా వడ్డీలు వసూలు చేస్తున్నారు. తీర్చనివారిని రకరకాలుగా వేధిస్తున్నారు. ఈ వ్యవహారాలపై వేలకొద్దీ ఫిర్యాదులు అందుతున్నా- కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వీటి నియంత్రణకు ఇప్పటివరకు ఎటువంటి వ్యవస్థా లేదు. హైదరాబాద్‌కు చెందిన ధరణీధర్‌ అనే వ్యక్తి దిల్లీ హైకోర్టులో గత ఏడాది యాప్‌ల ఆగడాలపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆన్‌లైన్‌ రుణ యాప్‌లు 50శాతం వరకు వడ్డీ గుంజుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ దందాను అడ్డుకోవడానికి ప్రతి రాష్ట్రంలోనూ ఓ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆర్‌బీఐ నివేదిక రూపొందించింది.

రుణగ్రహీత ఫోన్‌లోని నంబర్ల జాబితాను, ఫొటోలు, వీడియోలను యాక్సెస్‌ చేసుకోవడానికి రుణ యాప్‌ అనుమతి అడుగుతుంది. అది ఇస్తేనే రుణం తీసుకోగలుగుతారు. చాలా యాప్‌ల నిర్వాహకులు వారం, పది రోజుల్లో తిరిగి తీర్చాలనే షరతుతో రుణం ఇస్తారు. రూ.10 వేల రుణం తీసుకుంటే ప్రాసెసింగ్‌ రుసుములు, అవీ ఇవీ అంటూ ముందే రెండు వేల నుంచి మూడు వేల రూపాయలవరకు తెగ్గోసి మిగతా మొత్తాన్నే రుణగ్రహీత బ్యాంకు ఖాతాలో వేస్తున్నారు. ఆపైన 30 నుంచి 50 శాతం వడ్డీ కలిపి తీర్చాలి. రుణం సకాలంలో తీర్చకపోతే ఆ వ్యక్తి ఫోన్‌లో ఉన్న నంబర్లన్నింటికీ దారుణమైన సందేశాలు వెళతాయి. కొన్నిసార్లు రుణగ్రహీత ఫొటోను నగ్నచిత్రాలతో కలిపి మార్ఫింగ్‌ చేసి, అసభ్యపదజాలంతో దూషిస్తూ సందేశాలు పంపుతారు. రుణగ్రహీతలు మహిళలైతే వారి ఫోన్‌ నంబర్లు మగవారికి ఇచ్చి అసభ్యంగా మాట్లాడిస్తారు. లేదంటే ‘డేటింగ్‌ వెబ్‌సైట్‌’లలో రుణగ్రహీత ఫొటో, ఫోన్‌ నంబర్‌ పెడతామంటూ బెదిరిస్తారు. గడువు ముగిసినా రుణం తీర్చలేనివారికి యాప్‌ నిర్వాహకులే మరో యాప్‌ ద్వారా ఇంకో అప్పు ఇప్పిస్తారు. దాన్ని తీర్చడానికి మరో రుణం… ఇలా ఈ చక్రబంధంలో చిక్కుకుని వేలకు వేలు వడ్డీలు కడుతున్నవారు ఎందరో! గత ఏడాది రూ.10 వేల రుణం తీసుకున్న ఒక బాధితుడు యాప్‌ నుంచి యాప్‌కు మారుతూ రూ.73 వేలు వడ్డీ కట్టాడు. అసలు కట్టాలంటూ యాప్‌ నిర్వాహకులు వేధించడంతో హైదరాబాద్‌లో సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఉదంతం రుణయాప్‌ల దోపిడికి పరాకాష్ఠ.

రుణ యాప్‌ల ఆగడాలను అడ్డుకునేందుకు ఆర్‌బీఐ నిబంధనలు రూపొందించింది. వాటిని పాటించని యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగిస్తోంది. వెంటనే యాప్‌ నిర్వాహకులు కొత్త పేరుతో ఇంకో యాప్‌ సృష్టించి జనం మీద పడి దందా మొదలుపెడుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఆర్‌బీఐ సమర్పించిన నివేదిక ప్రకారం… రుణ యాప్‌ను ప్లేస్టోర్‌లో పెట్టాలంటే ముందుగా ప్రభుత్వం లేదా ఆర్‌బీఐ నియమించిన నోడల్‌ ఏజెన్సీకి దరఖాస్తు చేసుకుని లైసెన్సు పొందాలి. రుణ గ్రహీతలు అప్పు తిరిగి చెల్లించడానికి కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలి. వడ్డీ కూడా ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాల మేరకే ఉండాలి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఇటీవలి ఉదంతాలే చాటిచెబుతున్నాయి. రుణ యాప్‌ల వేధింపుల నుంచి రక్షణకు భారతీయ శిక్షాస్మృతితోపాటు డిజిటల్‌ లావాదేవీల ఆంబుడ్స్‌మన్‌ పథకం-201’లోని నిబంధనల ప్రకారం ప్రత్యేక సెక్షన్లు ఉన్నాయి. యాప్‌ల ఆగడాలను అడ్డుకునేలా మరింత పటిష్ఠ చట్టాన్ని తెచ్చి, ప్రజలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ తక్షణ కర్తవ్యం కావాలి.

రుణ యాప్‌ల ఆగడాలపై ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. యాప్‌లను బ్లాక్ చేసేందుకు చర్యలు చేపట్టాలని మహిళా కమిషన్ డీజీపీని కోరింది. ఆన్‌లైన్‌ రుణ యాప్‌‌ల వలలో చిక్కి బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తేలికగా రుణాలు అంటగట్టి వడ్డీల మీద వడ్డీలు వేస్తూ రుణ యాప్‌లు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి.

రుణ యాప్‌ సంస్థలు ఎవరినీ వదలడం లేదు. యువతీ, యువకులకు రుణాల పేరుతో ఆశ చూపి, రుణం అందజేసి వసూళ్ల పేరుతో తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నాయి. చిన్న వయస్సులో అప్పుల ఊబీలో కూరుకుపోతున్న యువత ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రుణ యాప్‌ల ద్వారా రుణం తీసుకుంటే రణం తప్పదని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.