కంటెంట్ లేని సినిమాల్ని ప్రేక్షకులు తిప్పికొడుతున్నారు. వంద కోట్లు పెట్టినా.. కథ లేకపోతే కనికరించడం లేదు. పరిస్థితుల చూస్తుంటే.. స్టార్ డమ్ కాలం పోయి.. మళ్లీ కథకే పెద్దపీట వేసే రోజులు మొదలయ్యాయనిపిస్తోంది. బడాస్టార్లు ఉన్నా.. కథ లేని సినిమాలు ఫ్లాప్ అవుతుంటే.. కంటెంట్ ఉన్న ఊరూ పేరు లేని సినిమాలు కూడా హిట్టవుతున్నాయి.
సినీ పరిశ్రమ మారాలి. కథల ఎంపిక, సినిమా తీసే విధానం అన్నింట్లోనూ కొత్తదనం అవసరం. నటీనటులు కూడా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏళ్ల తరబడి రొడ్డకొట్టుడు ఫార్మాట్ అంటే.. ప్రేక్షకులు సహించడం లేదు.
సినీ ఇండస్ట్రీకి ప్రేక్షకుల నాడి దొరకడం లేదు. క్రేజీ కాంబినేషన్లు, రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లు, భారీ బడ్జెట్లు ఏవీ వర్కవుట్ కావడం లేదు. సూపర్ స్టార్ల సినిమాలు కూడా మంచి టాక్ లేకపోతే.. కనీసం అడ్వాన్స్ బుకింగులు కూడా కావండ లేదు. అదే సైలంట్ గా రిలీజయ్యే చిన్న సినిమాలైనా కంటెంట్ ఉందనే టాక్ వస్తే.. పెద్ద హిట్ అవుతున్నాయి. తెలుగు సినిమాల్లో కంటెంట్ ని పక్కనపెట్టి.. కటౌట్లతో నెట్టుకురావడం అలవాటైపోయింది. కానీ ఆడియన్స్ మాత్రం నో కటౌట్.. ఓన్లీ కంటెంట్ అంటున్నారు. హీరోలు స్టార్ డమ్ పేరుతో కథను చంపేస్తే సహించడం లేదు. నిర్దాక్షిణ్యంగా తిప్పికొడుతున్నారు. అభిమాన హీరో సినిమా అయినే బాగుంటేనే చూస్తున్నారు. ఒకప్పుడు కొత్త సినిమా రిలీజైతే.. మొదటి రోజే థియేటర్ కు వచ్చేవాళ్లు. ఇప్పుడు సినిమా బాగుందనే టాక్ వచ్చాకే సినిమా హాల్ ముఖం చూస్తున్నారు. లేకపోతే ఓటీటీకి వస్తుంది కదా అని లైట్ తీస్కుంటున్నారు. ఇప్పటి ఓటీటీ యుగంలో ప్రేక్షకుల్ని థియేటర్లో రెండున్నర గంటలు కదలకుండా కూర్చోబెట్టడం పెద్ద అగ్నిపరీక్ష అయిపోయింది. చిన్న చిన్న కారణాలతోనే భారీ సినిమాలు బోల్తా కొడుతున్నాయి. అదే ఏ చిన్న పాయింట్ కనెక్టైనా.. భారీ హిట్లు పడుతున్నాయి. ప్రేక్షకుల నాడి పట్టడం ఎవరి వల్లా కావడం లేదు.
మొరటు డైలాగులు, రొడ్డకొట్టుడు స్టోరీలకు కాలం చెల్లింది. హీరోయిజం పేరుతో ఓవరాక్షన్ చేస్తే చూసేవాళ్లెవరూ లేరు. ఇప్పుడంతా అండర్ ప్లే ట్రెండ్ నడుస్తుంది. కథలో ఒదిగితేనే ఎంత పెద్ద స్టార్ అయినా చూస్తున్నారు. అంతేకానీ స్టార్ డమ్ పేరుతో కథనే ఓవర్ టేక్ చేస్తామంటే.. చూడటానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఎన్టీఆర్,ఏఎన్నార్ స్టార్లు కాకముందు.. ప్రేక్షకులు కథను బట్టే సినిమా చూసేవాళ్లు. ఆ తర్వాత స్టార్ డమ్ కి ప్రాధాన్యం పెరిగి.. స్టోరీ బ్యాక్ బెంచ్ కే పరిమితమైంది. కానీ కరోనా తర్వాత ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. కథను తీసుకొచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టారు. హరోయిజం పేరుతో అతిని చూడటానికి ఇష్టపడటం లేదు. ఎంత పెద్ద హీరో అయినా కథను బట్టే బిహేవ్ చేయాలని, సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా లాజిక్ ఉండాలని. ఇలా చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారు. ఎలాంటి మొహమాటాలకు పోకుండా కట్ త్రోట్ గా ఉంటూ.. పెద్ద సినిమాలక కూడా చుక్కలు చూపిస్తున్నారు. లేన నక్సలైట్ల పేరు మీద సినిమా తీసి.. నక్సలైట్లకు, ఆలయాల రక్షణకు లింక్ పెట్టాలనే ప్రయత్నం బెడిసికొట్టింది. అదే సమయంలో పూర్వజన్మల బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఓ ఫిక్షన్ సినిమా హిట్టైంది. క్రేజీ కాంబినేషన్ తో వచ్చిన సినిమా ఫ్లాప్ కాగా.. ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమా.. ఊహించని విధంగా హిందీ బెల్ట్ లోనూ దుమ్ము దులుపుతోంది.
బాలీవుడ్ లో నడుస్తున్న బాయ్ కాట్ ట్రెండ్ అక్కడి స్టార్లకు చుక్కులు చూపిస్తోంది. మిస్టర్ పర్ఫెక్షనిస్టుగా పేరున్న ఓ హీరో ఏళ్ల తరబడి చెక్కిన సినిమాను ప్రేక్షకులు తిప్పికొట్టారు. వేగంగా సినిమాలు చేసే మరో స్టార్ హీరోకి కూడా చేదు అనుభవం తప్పలేదు. త్వరలో రాబోయే మరో భారీ బడ్జెట్ సినిమాకు కూడా బాయ్ కాట్ థ్రెట్ ఉంది. హీరో కలెక్టర్ గా మాస్ ఫైట్లు చేయడం, అర్థం పర్థం లేని కథనం, హీరో పోలీస్ గా చేసే లాజిక్ లేని పనుల్ని ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు. ఎవరు ఎలా ఉండాలో.. అలాగే ఉండాలని బుద్ది చెబుతున్నారు. కరోనా టైమ్ లో క్రాకింగ్ హిట్ కొట్టిన సీనియర్ హీరోకి వరుసగా రెండు డిజాస్టర్లు తప్పలేదు. కంటంట్ చూసుకోవాలని సలహా ఇస్తున్నారు ప్రేక్షకులు. మనకు పెద్దగా పరిచయం లేనివాళ్లు హీరోహీరోయిన్లుగా ఉన్నా.. కంటెంట్ ఉంటే చాలు సినిమా హిట్టైపోతోంది. ఈ లాజిక్ ను ఇప్పటికైనా ఇండస్ట్రీ అర్థం చేసుకుంటందో.. లేదో చూడాలి.
పాన్ ఇండియా బిల్డప్పులు.. వందల కోట్ల లెక్కలు.. ఇవేవీ ప్రేక్షకుల్ని ఆకర్షించడం లేదు. సినిమా ప్రమోషన్ కోసం హీరోలు వేసే డైలాగుల్ని కూడా గుర్తుపెట్టుకుంటున్న ప్రేక్షకులు.. ఫలితం తేడా వచ్చిన వెంటనే నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నారు. సినిమా అనేది శక్తివంతమైన మాధ్యమమే కాదు.. సెన్సిటివ్ కూడా. ఇప్పుడు ప్రేక్షకులు ఓవర్ సెన్సిటివ్ అయ్యారు. సినిమాలో కంటెంట్ బాగుంటేనే చాలదు.. హీరో, హీరోయిన్లు ఎలాంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కోకుండా ఉండటం కూడా ముఖ్యమే. ఐదేళ్ల క్రితం ఎక్కడో మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపుతున్నాయి. దీంతో నటీనటులు కూడా నోరు అదుపులో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా బయ్యర్లు కూడా ఫలానా వాళ్లు ఉంటే సినిమా కొనేది లేదని తేల్చిచెప్పేస్తున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. అదేమంటే పీపుల్స్ పల్స్ ను బట్టే వెళ్లాలని చెప్పేస్తున్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కే తెలుగు సినిమాల కంటే.. సింపుల్ పాయింట్ ఆధారంగా తీసే మలయాళ సినిమాల్లో కంటెంట్ బాగుంటోంది. బ్రోడాడీ, అయ్యప్పనుమ్ కోషియుమ్, కప్పెలా లాంటి సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. ఓటీటీలో ఇతర భాషల ప్రేక్షకులు కూడా వాటిని ఆదరించారు. అయితే మన నిర్మాతలు, దర్శకులు మంచి కంటెంట్ ఉన్న మలయాళ సినిమాల్ని కూడా రీమేక్ చేసి పాడు చేస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే రిలీజై చేదు ఫలితం చవిచూసిన సినిమాలైనా.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలైనా.. అన్నింటికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఒకటి కథ బాగుండాలి. లేకపోతే స్క్రీన్ ప్లే బాగుండాలి. అదీ కాదంటే కనీసం పాత్రోచిత నటన అయినా ఉండాలి. అంతేకానీ కటౌట్ తో కథ నడిపిస్తామంటే కుదరదు. మూస పద్ధతిలో సినిమాలు తీస్తే.. రిజల్ట్ బ్యాడ్ గానే ఉంటుందని చెప్పేస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు అంతా ఆన్ డిమాండ్ కంటెంట్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా ఎన్ని థియేటర్లలో నడవాలో కూడా పరోక్షంగా ప్రేక్షకులే నిర్ణయిస్తున్నారు. ఓ చిన్న సినిమాకి తొలి రోజు 50 థియేటర్లే దక్కినా.. కంటెంట్ బాగుండి హిట్ టాక్ రావడంతో.. పది రోజుల్లోనే 2వేల థియేటర్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకుముందు ఇలాంటి ఘటనలు ఊహించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు డైనమిక్ గా ఉంటూ.. ఇండస్ట్రీ కూడా అలాగే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్రేమ్ వారీగా సినిమాని ఏకిపారేస్తున్నారు. ఓ రకంగా సినిమాని పోస్ట్ మార్టమ్ చేస్తున్నారు. అసలు ప్రేక్షకులు చెప్పే పాయింట్లలో చాలా వాటిని డైరక్టర్లు ఆలోచించడం లేదు. ఓ స్టార్ హీరో డేట్లు పట్టుకోవడం, నిర్మాతను ఓకే చేసుకోవడం, క్రేజీ హీరోయిన్ ను బుక్ చేసుకుంటే చాలు.. కథ ఎలా ఉన్నా జనం చూసేస్తారనే భ్రాంతిలో బతికేస్తున్నారు. కొంతమందికి ట్రెండ్ అర్థం కాక.. ఓటీటీలే కొంప ముంచుతున్నాయని ఆడిపోసుకున్నారు. కానీ హిట్ అయిన చిన్న సినిమాలని చూస్తే.. కంటెంట్ ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు థియటర్ కు వస్తారని అర్థమవుతోంది. ప్యాన్ ఇండియా పిచ్చిల పడిపోయి, రకరకాల లెక్కలేసుకుంటూ సినిమాకి ఆత్మ లాంటి కథను పట్టించుకోకపోవడమే కొంప ముంచుతోంది.
కథ, కథనం ఉంటే హిట్ గ్యారెంటీ. ఏమాత్రం తేడా వచ్చినా.. ఎంత పెద్ద హీరో అయినా డోంట్ కేర్. ఇదే ఇప్పటి ట్రెండ్. దీన్ని ఫాలో అయి సినిమాలు తీస్తే.. ఓకే. లేకపోతే తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు.
సినిమా బడ్జెట్ రేంజ్ లో ప్రమోషన్ బడ్జెట్ పెట్టినా.. కంటెంట్ లేకపోతే మొదటిరోజే బిచాణా ఎత్తేస్తుందని ఇటీవలే వచ్చిన ఓ సినిమా నిరూపించింది. ఇంటర్నేషనల్ ఫేమస్ క్యాస్టింగ్ ఉన్నా.. ఎంత యాటిట్యూడ్ చూపించినా.. అసలు విషయం కావాల్సిందే. మా సినిమాలో ఏదో ఉందని ఎక్కువగా ఊరించినా కూడా తేడా కొట్టేస్తుంది. ఇలాంటి డబ్బా కొట్టుకున్న సినిమాల్లో.. చిన్న లోపాలున్నా సహించడం లేదు ప్రేక్షకులు.
హీరో ముఖం చూసి సినిమా చూసే రోజులు పోయాయి. అభిమానం పేరుతో చెత్త సినిమాను నెత్తిన పెట్టుకునే కాలం చెల్లింది. ఇప్పుడు కంటెంటే హీరో. ఓటీటీ పుణ్యమా అని ప్రపంచంలో అన్ని భాషల్లో ఉన్న ది బెస్ట్ సినిమాలు చూసేస్తున్నారు. వాటితో పోల్చితే మన సినిమాలు అస్సలు ఆనడం లేదు. ఇలాగే ఉంటే క్వాలిటీపై దృష్టి పెట్టరని గ్రహించే.. వచ్చిన సినిమాని వచ్చినట్టే తిప్పికొడుతున్నారు ప్రేక్షకులు. డైరక్టర్లు కచ్చితంగా కొత్తగా ఆలోచించాలి. హీరోలు నటనకు మెరుగులు దిద్దుకోవాలి. నిర్మాతలు అవసరమైన వాటికే డబ్బులు ఖర్చుపెట్టాలి. సినిమాలో విషయం ఉంటే ప్రమోషన్ లేకపోయినా పర్లేదు. అదే కంటెంట్ లేకపోతే మాత్రం ఎంత్ ప్రమోషన్ అయినా బూడిదలో పోసిన పన్నీరే.
నిజ జీవిత కథలతో నేల విడిచి సాము చేయటం నేరం. ప్రేమ కథల పేరుతో లాజిక్ లేకుండా తీయటం ఇంకా ఘోరం. ఇప్పుడు సినిమా తీయడమంటే రీసెర్చ్ కు థీసిస్ సబ్మిట్ చేసినట్టే. ఏ యాంగిల్లో తేడా వచ్చినా ప్రొఫెసర్ రిజెక్ట్ చేస్తారు. హోమ్ వర్క్ చేయకుండా క్లాస్ కి రావడం ఎంత తప్పో.. సరైన ప్రిపరేషన్ లేకుండా బొమ్మను థియేటర్ కు తీసుకురావడం కూడా అంతే తప్పంటున్నారు ప్రేక్షకులు. గతంలో రివ్యూ ఎలా ఉంటుందో అని భయపడేవాళ్లు సినీ పెద్దలు. ఇప్పుడు ఆడియన్స్ టాక్ కీ రోల్ ప్లే చేస్తోంది.
ఒకప్పుడు పేజీల తరబడి డైలాగులు చెప్పటం గొప్పగా ఉండేది. ఇప్పుడు అండర్ ప్లేకి పెద్దపీట వేస్తున్నారు. కేవలం నటనే కాదు.. హావభావాల్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. డబ్బింగ్ లిప్ సింక్ అవ్వకపోయినా ఒప్పుకోవడం లేదు. అదే కంటెంట్ బాగుంటే చిన్న చిన్న తప్పులున్నా క్షమించేస్తున్నారు. స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేయగలిగే వారికే ఇప్పుడు డిమాండ్. నటన కూడా నేచురల్ గా ఉండాలి. ఎక్కడా తెచ్చిపెట్టుకున్న పైత్యం ఉండకూడదు. కథలో భాగంగా ఎంత బిల్డప్ అయినా ఓకే.. హీరోయిజం కోసం స్టైల్ మాత్రం నాట్ ఓకే. ఇంత పర్టిక్యులర్ గా ఉంటున్నారు ప్రేక్షకులు. మరి హీరోలు, డైరక్టర్లు, నిర్మాతలకు అర్థమవుతోందా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
తెలుగు వాళ్లకు సినిమా అనేది ఓ కల్చర్. అత్యంత చవకైన వినోద సాధనం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఒకప్పుడు చాలా మంది ప్రేక్షకులు టైమ్ పాస్ కోసం సినిమాకి వెళ్లేవాళ్లు. ఏ సినిమా అయినా పర్లేదనే ధోరణి కూడా ఉండేది. కానీ టికెట్ ధరలు పెరిగాక.. సినిమా లగ్జరీ అయిపోయింది. టైమ్ పాస్ కోసం సినిమా అనే కల్చర్ పోయింది. దీంతో ఓ వర్గం ప్రేక్షకులు పూర్తిగా థియేటర్లకు రావడం మానేశారు. ఓటీటీలు వచ్చాక మధ్యతరగతి కూడా పూర్తిగా థియేటర్ కు దూరమైపోయింది. అంతంత రేట్లు పెట్టి టికెట్లు కొని సినిమా చూసే బదులు.. కొద్దిరోజులైతే ఓటీటీలో ఫ్యామిలీ మొత్తం చూడొచ్చనే భావన పెరిగింది. దీనికి తోడు సినిమా కంటెంట్ విషయంలో కూడా మేకర్స్ దృష్టి పెట్టడం లేదనే ఫిర్యాదులున్నాయి. గతంతో పోలిస్తే ప్రేక్షకుల ఆలోచన ధోరణి మారిందని తెలిసినా.. విభిన్నమైన ఆలోచనలకు ఆదరణ దక్కుతున్నా.. టాలీవుడ్ మాత్రం మూస పద్ధతిలో వెళ్తోందనే విమర్శలున్నాయి.
గతంలో మాదిరిగా హడావుడి, హంగామాకు ఆడియన్స్ ఎట్రాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. స్టార్ హీరో సినిమాకు, చిన్న సినిమాకు ఒకే రేటు పెట్టడానికి వాళ్లు సిద్ధంగా లేరు. టికెట్ రేటుకు తగ్గ క్వాలిటీ కోరుకుంటున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఈ సంగతి గుర్తించి పద్ధతి మార్చుకోకపోతే.. కష్టాలు తప్పవనే అభిప్రాయాలున్నాయి. ఒకప్పుడు ఐదు రూపాయల సినిమా టికెట్ కూడా ఉండేది. కానీ ఇప్పుడు సినిమా అంటే ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లినంత బిల్లవుతోంది. అందుకే చాలా మంది థియేటర్లకు ముఖం చాటేస్తున్నారు. ఓటీటీలు విస్తృతంగా అందుబాటులోకి రావడం, విపరీతమైన ధరలు.. థియేటర్లను కళ తప్పేలా చేశాయి.
సినిమాలో ప్రతి ఫ్రేమ్ ను విశ్లేషించే స్థాయిలో ప్రేక్షకులు ఉన్నప్పుడు, 24 కళల పనితీరులో తప్పులు వెతికే పరిస్థితి ఉన్నప్పుడు.. చాలా జాగ్రత్తగా సినిమాలు తీయాలి. ఏమాత్రం తేడా వచ్చినా నష్టాలకు సిద్ధపడాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతోంది. ఎంత బడ్జెట్ పెట్టినా.. ఎంత క్రేజీ కాంబినేషన్ అయినా.. ఎంత ప్రచార ఆర్భాటం చేసినా.. సినిమా హిట్ అవుతుందనే గ్యారెంటీ లేదు. లాభాల మాట దేవుడెరుగు.. కనీసం పెట్టిన డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని నిర్మాతలు వాపోతున్నారు. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలని ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నా.. అవి అమలు కావడం లేదు. హీరోల రెమ్యూనరేషన్లు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కరోనా సమయంలో రెమ్యూనరేషన్లు తగ్గించుకోవాలనే సూచనలు వచ్చినా..హీరోలు మాత్రం పెంచుకుంటూ పోతున్నారు.
ఒకప్పుడు స్క్రిప్ట్ పూర్తయ్యాక, నటీనటుల డేట్స్ అన్నీ కుదిరితేనే దర్శక-నిర్మాతలు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేవారు. రానురానూ మార్పులు వచ్చాయి. షూటింగ్ మొదలయ్యే ముందు కూడా సన్నివేశాలు రాసుకుంటూ కూర్చోవడం వల్ల సినిమా వ్యయం పెరిగిపోవడమే కాకుండా, నాణ్యతా దెబ్బతింటోందని సీనియర్ నటులు, రచయితలు వివిధ ఇంటర్వ్యూల్లో చెప్పారు. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత మరింత మెరుగు కోసం చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు కానీ, అప్పటికప్పుడు కొత్త సన్నివేశాలు రాయడం కూడా నిర్మాణ వ్యయం పెరగడానికి కొన్నిసార్లు కారణమవుతోంది. ఇక సృజనాత్మకత పేరుతో దర్శకులు వేయించే సెట్లు, అనవసర హంగులు, విదేశీ ప్రయాణాలు.. ఇవన్నీ నిర్మాణ వ్యయాన్ని తడిసి మోపెడు చేస్తున్నాయి. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా హీరో-హీరోయిన్ల రెమ్యునరేషనూ ఓ కారణమే. అవసరం ఉన్నా లేకపోయినా విజువలైజేషన్ పేరుతో చేస్తున్న గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండటమే కాకుండా, సినిమాపై అదనపు భారాన్ని పెంచుతున్నాయి.
థియేటర్‌కు రావాలా? వద్దా? అన్నది ప్రేక్షకుడి వ్యక్తిగత అభిరుచి, అభిప్రాయానికి అనుగుణంగా ఉంటుంది. సినిమాలో సత్తా ఉన్నప్పుడే ప్రేక్షకుడు రెండున్నర గంటల పాటు థియేటర్‌లో కూర్చొనేందుకు ఆసక్తి చూపుతాడు.
థియేటర్లకు పూర్వవైభవం రావాలంటే.. గతంలో మాదిరిగా కథకు పెద్దపీట వేయాలనే వాదన పెరుగుతోంది. ఇప్పుడున్న రెమ్యూనరేషన్ విధానానికి స్వస్త పలికి.. కొత్త పద్ధతి ఆలోచించాలని కింది స్థాయి నుంచి డిమాండ్ ఉంది. సినిమా సినిమాకు హీరో, హీరోయిన్, డైరక్టర్ రెమ్యూనరేషన్లు మాత్రమే పెరిగిపోతున్నాయి. మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు అవే రెమ్యూనరేషన్లు ఉంటున్నాయి. ఈ గ్యాప్ కారణంగా అసంతృప్తి పెరిగినా.. ఇబ్బందులు తప్పవు. నిర్మాతలు ఇవన్నీ ఆలోచించి.. సముచిత నిర్ణయాలు తీసుకోవాలి. పరిశ్రమ చల్లగా ఉండాలంటే.. కొందరు నష్టపోయినా పర్లేదనే వైఖరి తీసుకోవాలి. మొదట ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే మార్గాలు అన్వేషించాలి. అందరికీ అందుబాటులో రేట్లు పెట్టడం చాలా ముఖ్యం. ఎవరైనా థియేటర్ కు వచ్చి సినిమా చూసేలా ఉండాలి కానీ.. థియేటర్లోకి ఎంటరవ్వాలంటే.. వందలకు వందలు ఖర్చు పెట్టాలనడం కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టవుతుంది. ప్రేక్షకుల క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే ధోరణి ముదరడమే ప్రస్తుత సంక్షోభానికి కారణమని సినీ విమర్శకులు చెబుతున్నారు.
లైఫ్ చాలా వేగంగా మారిపోతోంది. ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. స్పీడ్ యుగానికి తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడంలో సినిమా రంగం విఫలమైంది. ప్రేక్షకులతో లింక్ లేకుండా సినిమాలు తీయడంతో.. ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకప్పుడు హీరోలకు అభిమాన సంఘాలుండేవి. గ్రౌండ్ రిపోర్టులు తెలుసుకునే వీలుండేది. ఇప్పుడు రివ్యూల్ని కూడా భరించలేకపోతున్నారు. పొగిడితే పొగడాలి కానీ విమర్శించడమేంటనే స్థాయికి ఇగోయిజం పెరిగిపోయింది. దీంతో సినిమావాళ్ల ఊహా ప్రపంచానికి, ప్రేక్షకుల వాస్తవ ప్రపంచానికి పొంతన కుదరడం లేదు. ఏమాత్రం అనుభవం, వనరులు లేని ఔత్సాహికులు చేస్తున్న షార్ట్ ఫిల్మ్ లు కూడా హిట్ అవుతున్నప్పుడు.. కోట్లు ఖర్చుపెట్టి తీసే సినిమా ఎందుకు ఆడదనేది సినీ ఇండస్ట్రీ వేసుకోవాల్సిన ప్రశ్న.
తెలుగు సినిమాకు ముందునుంచి నిర్మాతే హీరో.ఆ తర్వాత కథానాయకుడు వచ్చి పీఠమెక్కాడు.అక్కడనుంచి దర్శకునివైపు కెప్టెన్ ఆఫ్ ది షిఫ్ గా సినిమా ప్రయాణం మొదలైంది.ఈ క్రమంలో నిర్మాత రానురాను తన మునుపటి వైభవాన్ని కోల్పోతూ వచ్చాడు.కేవలం ప్రొడక్షన్ మీద గ్రిప్ ఉన్న సంస్థలు మాత్రమే అప్పటినుంచి ఇప్పటికీ తమ పలుకుబడిని చూపిస్తూ సినిమాలను కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అప్పట్లో పోస్టర్ పై వచ్చే నిర్మాతల పేర్లు చూసి…. సినిమా ఎలాంటిదో ఇట్టే చెప్పేసేవారు.నిర్మాతలు తమ అభిరుచులకు తగ్గ కథలనే దర్శకులతో తీయించేవారు.రానురాను ఆ కల్చర్ కనుమరుగైపోతుంది.కేవలం కొందరు హేమాహేమీలు మాత్రమే ఇప్పటికీ ఆ పాత కల్చర్ ను కొంతలో కొంత మెయిన్ టైన్ చేయగలుగుతున్నారు.
వీలైనంత వరకు స్ట్రైట్ కథలు తెరకెక్కించాలి. అవి వాస్తవికంగా ఉండాలి. డబ్బింగ్ అయినా, రీమేక్ అయినా.. అవి కూడా మన నేటివిటీకి దగ్గరా ఉండాలి. ఇవన్నీ ఇండస్ట్రీ దశాబ్దాలుగా పాటిస్తున్న ప్రాథమిక సూత్రాలు. అయితే కొన్నాళ్లుగా ఇవన్నీ వదిలేసి.. అనవసర హంగు, ఆర్భాటాలకు పెద్దపీట వేయడమే కొంప ముంచుతోంది. అసలు కొన్ని సినిమాలు చూస్తుంటే.. వాటిని కనీసం డైరక్టర్ అయినా ఫైనల్ కాపీ చూశారా అనే అనుమానాలు వస్తున్నాయి. కథ మీద నెలల తరబడి చర్చ చేసే పరిస్థితి లేదు. కనీసం షాట్ ఓకే కాకపోత రీటేక్ అయినా చేస్తున్నారో. లేదో డౌటే. కానీ ఏవో కారణాలు చెప్పి షూటింగ్ టైమ్ మాత్రం పెంచుకుంటూ పోతున్నారు. నటీనటులు చేసే పావలా యాక్షన్ కు.. పది రూపాయల బిల్డప్ ఇవ్వడం బూమరాంగ్ అవుతోంది.
హీరో ఎవరనేది అనవసరం. ప్రమోషన్ అనేది పట్టించుకోవడం లేదు. కంటెంట్ ఉందా.. అయితే హిట్టే. అంతే అంతకుమించి టైమ్ వేస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు ప్రేక్షకులు. కథ నిలబెట్టడానికి గ్రాఫిక్స్ చూపిస్తే ఓకే. అంతే కానీ వీక్ కంటెంట్ కవర్ చేయడానికి గ్రాఫిక్స్ అంటే మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. కథ బాగుంటే ఎలాంటి డెకరేషన్లు అవసరం లేదు. కథే లేనప్పుడు స్టార్ ప్యాడింగ్, ఐటమ్ సాంగులు ఏవీ సినిమాని కాపాడలేవు. కాస్త కామన్ సెన్స్ ఉపయోగిస్తే.. మన చుట్టూ చాలా కథలు కనిపిస్తాయి. వాటికి స్క్రీన్ ప్లే అల్లుకుంటే.. అద్భుతమైన సినిమాలు తయారౌతాయి. కానీ డైరక్టర్లు సమాజాన్ని పట్టించుకోవడం మానేశారు. అందుకే మారిన ప్రేక్షకుల మైండ్ సెట్ ను అంచనా వేయలేకపోతున్నారు. డైరక్టర్, హీరో ట్రాక్ రికార్డ్ ని కూడా కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు ట్యాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సిందే. లేకపోతే ఎంత పెద్దవారైనా మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తామంటున్నారు ప్రేక్షకులు.
ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఎలాంటి సినిమాలు చూస్తామో ప్రేక్షకులకు క్లారిటీ ఉంది. ఎలాంటి కథలు తీయకూడదనే క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఇండస్ట్రీ. ఈ పాయింట్ పట్టుకుంటే చాలు.. టాలీవుడ్ ట్రైన్ ట్రాక్ ఎక్కుతుంది. లేకపోతే మాత్రం జరిగే డ్యామేజ్ ను ఎవరూ ఆపలేరు. ఆడియన్స్ డిమాండ్ మేరకు కంటెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఇండస్ట్రీదే. డైరక్టర్లు, నిర్మాతలు, హీరోలు ఎవరికివారు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే.. ప్రేక్షకులు సినిమాకే గుడ్ చెబుతారనే ఆందోళన కూడా ఉంది. అలాంటి దుస్థితి రాకముందే.. తప్పులు దిద్దుకుంటే పరిశ్రమ పదికాలాలు బతికే అవకాశం ఉంటుంది.