రెండు వేవ్ లు సృష్టించిన విధ్వంసం ప్రపంచం ఇంకా మర్చిపోలేదు..ఒమిక్రాన్ చడీ చప్పుడు లేకుండా దాటిపోయినా, ఇంకా కరోనా భయం పోలేదు.
దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మళ్లీ వైరస్ వ్యాప్తి పెరిగింది. దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. లేటెస్ట్‌గా కొత్త కేసులు 8 వేలకు పైగా రిపోర్ట్ అయ్యాయి. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేలను దాటేసింది.
శుక్రవారం దాదాపు మూడున్నర లక్షలమందికి టెస్టులు చేస్తే, అందులో 8,329 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 103 రోజుల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు కనిపించాయి. పాజిటివిటీ రేటు వరుసగా మూడోరోజు రెండు శాతం పైనే నమోదైంది. మహారాష్ట్రలో 3,081 మందికి కరోనా సోకగా.. ఒక్క ముంబయిలోనే ఆ సంఖ్య 1,956గా ఉంది. దాంతో ఆ నగరంలో పాజిటివిటీ రేటు 12.74 శాతానికి చేరి, ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేరళలో 2,415, దిల్లీలో 655 మంది వైరస్ బారినపడ్డారు.
మళ్లీ కరోనా కేసులు పెరగటంతో బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం వైరస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య40,370కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే కరోనాతో 10 మంది మరణించారు. మరోపక్క దేశ రాజధానిలో కరోనా కేసులు కొద్దిరోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. మాస్కులను ధరించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహించటంతోనే వైరస్ వ్యాప్తి పెరుగుతోందని వైద్యనిపుణులు చెప్తున్నారు.
ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ లో ప్రజల ప్రయాణాలు, విహారయాత్రలు పెరిగాయి. ఒకరాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళుతున్నారు. అందుకే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందనే వాదనలున్నాయి. అందువల్లనే ఢిల్లీలో పది రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యాయి.
అటు మహారాష్ట్రలో కోవిడ్ కేసులు మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో మూడువేలకుపైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య నాలుగు నెలల్లో అత్యధికం కావడంతో కరోనా ఫోర్త్ వేవ్ భయాందోళనలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని జనవరి 23 తర్వాత మళ్లీ ఇప్పుడకే కేసులు పెరుగుదల కనిపిస్తోంది.
జూన్ 1 నుండి 10 మధ్య, మేలో 11,397 కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో మేలో మూడు కరోనా మరణాలు సంభవించగా, జూన్ మొదటి 10 రోజుల్లోనే నాలుగు మరణాలు రికార్డయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 13,329కి చేరుకుంది. గోండియా జిల్లాలో మాత్రమే సున్నా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హర్యానాలు ఉన్నాయి.
గత వారంలోనే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొవిడ్ విస్తరణ పెరగడంతో వైద్యవర్గాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాయి. ఈ పెరుగుదలను గమనిస్తే,దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభమయినట్టే అని కొందరు వైద్యులు భావిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి కరోనా కేసుల సంఖ్య దేశంలో మరింత పెరిగే అవకాశాలున్నట్లు కూడా వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు అధికంగా కన్పిస్తున్నా మరో రెండు వారాల్లో అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, గుంపులుగా తిరగవద్దని కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిజానికి చాలామందిలో కరోనా ఇక పూర్తిగా మాయమైందనే అభిప్రాయం ఉంది. ఇదే కొంపముంచుతోంది. వైరస్ వేవ్ లు గా వస్తుందని గత చరిత్ర చెప్తోంది. అంటే కొద్ది నెలలు ఉధృతంగా ఉన్న వైరస్, కొంచెం గ్యాప్ తీసుకుని మళ్లీ సరికొత్త వేరియంట్లతో విరుచుకుపడుతుంది. ఇప్పుడు కరోనా కూడా నాలుగువేవ్ ముంగిట ఉంది. అయితే, కరోనాను చాలా కాలం నుంచే లైట్ తీసుకుంటున్న జనం, ఫోర్త్ వేవ్ సంగతి పూర్తిగా వదిలేశారు. కనీసం గుంపులో ఉన్నపుడు కూడా మాస్క్ లు ధరించడం లేదు. భౌతిక దూరాన్ని పాటించడం లేదు. కనీసం శానిటైజ్ కూడా చేసుకోవడం లేదు. ఇప్పుడు కనిపిస్తున్న లెక్కలు చూస్తుంటే కరోనా ఫోర్త్ వేవ్ ఖాయమంటున్నరు కొందరు వైద్యనిపుణులు
మరోపక్క విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. అన్ని ఎయిర్ పోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేని ప్రయాణికులను ఇక ఎయిర్ పోర్టులోకి కూడా అనుమతించరు. ప్రయాణంలో కూడా పూర్తి సమయం మాస్క్ ను ధరించాల్సిందేనని డీజీసీఏ చెప్తోంది. మాస్క్ లేని ప్రయాణికులను బోర్డింగ్ కు ముందే నిలువరించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణ హైకోర్టు సయితం కోవిడ్ నియంత్రణపై ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ఫోర్త్ వేవ్ పొంచి ఉందంటున్న వైద్య నిపుణుల హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
మాస్కులు లేకుండానే విహారయాత్రలు చేయటం, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరుగటమే భారీగా కేసుల పెరుగుదలకు కారణమవుతోందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే, వైరస్‌కు గురైనవారు మూడు, నాలుగు రోజుల్లో కోలుకుంటున్నా, కొందరిలో జ్వరం, ఒంటి నొప్పులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఊపిరితిత్తులకు ఎలాంటి సమస్యలూ ఎదురుకాకపోవడం ఊరటనిస్తున్న అంశం. దీంతో ఆక్సిజన్ అవసరం లేకుండానే కరోనా రోగులు కోలుకుంటున్నారు. ఇప్పటివరకైతే ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ, వైరస్ వ్యాప్తి పెరిగితే ఈ పరిస్థితి మారే ప్రమాదం ఉందనే చెప్పాలి..
మరోవైపు ఫోర్త్ వేవ్ ముప్పు ఉందనే అంశాన్ని, ఐసీఎంఆర్ కొట్టిపారేస్తోంది. భారత్‌లో కేసులు నమోదవుతున్నప్పటికీ వైరస్ మునుపటిలా ప్రమాదకరంగా మారి వ్యాప్తి జరిగే అవకాశం లేదంటోంది. మరోపక్క ప్రజలు కోవిడ్-19 ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండేలా చూసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులకు సూచించింది. పరీక్షల సంఖ్యను పెంచాలని, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను పంపాలని కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలను కోరింది.
మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.తెలంగాణలో గత వారం 355 కేసులు నమోదు కాగా.. ఈ వారం 555 కేసులు నమోదయ్యాయి. దాదాపు 56శాతం పైగా కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 40వేలకు పైనే ఉంటే, తెలంగాణలో వెయ్యిలోపు బాధితులున్నారు. థర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ కేసులు భారీగా వచ్చిన తర్వాత తగ్గుముఖం పట్టి.. మళ్లీ గత రెండు వారాలుగా కొత్త కేసుల పెరుగుదల కనిపిస్తోంది. అటు ఏపీలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది..
అయితే రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్నా.. ఆస్పత్రిలో చేరికలు, మరణాలు ఇప్పటివరకైతే నమోదు కాలేదు. వెయ్యి మందిలో ఒకరిద్దరు మాత్రమే ఆస్పతుల్లో చేరుతున్నారు. మరణాలు ఇప్పటి వరకైతే నమోదు కాలేదు. అయితే గత మూడు రోజుల నుంచి రోజుకు 100కు పైగా కేసులు రావటం ప్రమాదకర పరిస్థితిని సూచిస్తోంది.
అయితే, దేశంలో గానీ, తెలంగాణ రాష్ట్రంలో గాని ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ అంటున్నారు. ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు అతి స్వల్పంగానే ఉండే అవకాశం ఉందంటున్నారు. వ్యాక్సినేషన్ కవరేజీ దాదాపు వంద శాతం కావడం వల్ల ఎక్కువ మందిలో ఇమ్యూనిటీ తీసుకురాగలిగామంటున్నారు.. ఇప్పుడు కేసులు కొంచెం పెరుగుతున్నా.. ఫోర్త్‌వేవ్‌కు కారణం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. మే నెల నుంచి ఇప్పటివరకు ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఏ 2 కేసులే దాదాపు 65శాతం నమోదయ్యాయి. గత రెండు రోజుల నుంచి బీఏ 4, బీఏ 5 వేరియంట్లకు సంబంధించిన కేసులు పెరుగుదల చూస్తున్నాం. ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతో ఫోర్త్‌వేవ్ వచ్చే అవకాశం లేదని డీహెచ్ అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇప్పటి వరకు కరోనా వ్యాపించినా ప్రమాదం లేదనుకున్నా, ఎక్కువగా వ్యాపించినపుడు, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారిపై కరోనా తీవ్రప్రభావం చూపుతుందని ఇప్పటికే స్పష్టమైన అంశం. ఇప్పుడు కూడా లక్షల్లో కరోనా కేసులు వ్యాప్తి చెందితే, ఆసుపత్రుల్లో చేరాల్సిన వారి సంఖ్య కూడా పెరుగుతుంది.
అయితే, ఇప్పటికే వ్యాక్సినేషన్ అన్ని డోస్ లు వేసుకున్న వారికి సయితం కరోనా సోకదన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. ఇప్పటికే థర్డ్ డోస్ కూడా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. రోజువారీ డోసుల సంఖ్యను కూడా పెంచింది.
అయితే రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరగటం ఆందోళన కలిగిస్తున్న అంశం.ముఖ్యంగా మే చివరి వారంలో రెండు వేల కేసులు నుండి ప్రస్తుతం రోజుకి ఎనిమిది వేల పైచిలుకు కేసులకు కరోనా కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే, వైద్య సంస్థలు ఫోర్త్‌వేవ్ ని కొట్టిపారేస్తున్నా, కొందరు వైద్యులు మాత్రం నాలుగో వేవ్ వచ్చే అవకాశం ఉందనే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా ఉన్నాయంటున్నారు. అటు కర్ణాటకలో కూడా కేసుల పెరుగుదల మొదలైంది. తెలుగు రాష్ట్రాలకు పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగటంతో జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే, కేసుల సంఖ్య పెరిగినా ఆందోళన అవసరం లేదంటున్న తెలంగాణ వైద్య శాఖ,అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. రెగ్యులర్ ఫ్లూ లక్షణాలతో పాటు జ్వరం, తలనొప్పి, స్మెల్ లేకపోవడం ఉంటే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలని స్పష్టం చేసింది.. తెలంగాణలో పాజిటివిటీ రేటు 1 శాతానికి పెరిగిందని ప్రకటించారు., కరోనా ఇప్పట్లో పూర్తిగా పోదని, వచ్చే డిసెంబర్ వరకు ఇదే పరిస్థితి ఉండే ఉండే అవకాశం ఉందని తెలంగాణ వైద్య శాఖ చెప్తోంది. కేసులు పెరిగినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే, మాస్క్ ధరించి, .. భౌతిక దూరం పాటించాలని సూచిస్తోంది.
ఇప్పటికే కరోనా మూడు వేవ్స్ చూశాం. నాలుగో వేవ్ కూడా అనివార్యం అంటున్న కొందరు వైద్యులు, అది సెకెండ్ వేవ్ అంత ఇబ్బంది పెట్టదని వైద్యులు చెప్పటం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇప్పుడున్న గణాంకాలనుబట్టి చూస్తే, జులై నుంచి దేశంలో ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముంది. కరోనా ఒకటి రెండు వేవ్ ల సమయంలో ప్రభుత్వాలు కొన్ని నియంత్రణలు, నిబంధనలు విధించాయి. ఇప్పుడలాంటి పరిస్థితి కనిపించటం లేదు. అంటే, ఈసారి బాధ్యత మాత్రం ప్రజలదే. ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రజలే ఎక్కువ బాధ్యతతో ఉండాలి. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాయి. హర్యానా లాంటి రాష్ట్రాలైతే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పేస్తున్నాయి. ఢిల్లీతో పాటు గురుగ్రామ్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో.. కరోనాపై చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
సెకెండ్ వేవ్ తరహాలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటుచేయడం లాంటివి ఫోర్త్ వేవ్ లో ఉండవని హర్యానా తెగేసి చెప్పేసింది. దాదాపు ఇదే విషయాన్ని ఢిల్లీ కూడా పరోక్షంగా చెబుతోంది. సో.. దాదాపు రాష్ట్రాలన్నీ ఇదే పద్ధతి ఫాలో అయ్యేలా ఉన్నాయి. ఇకపై కరోనా కేసుల వ్యాప్తి ఎక్కువైతే, దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రజలది కూడా. ఫోర్త్ వేవ్ లో భయపడాల్సిన విషయం ఏంటంటే ఇది పిల్లల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది. అయితే ఇది ప్రాణాంతకం కాదంటున్నారు వైద్యులు. గొంతు నొప్పి, ముక్కు కారడం, అలసట, దగ్గు లాంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని చెబుతున్నారు. అయినప్పటికీ వ్యాపిస్తోంది పిల్లల్లో కాబట్టి అశ్రద్ధ తీసుకోవద్దని సూచిస్తున్నారు.
కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదంటూ స్వయంగా ప్రధాని మోడీ ఈ మధ్య ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాలు ఏదో చేస్తాయని ఎదురుచూడకుండా, అంతా స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలు పాటించడం ఉత్తమం అని చెప్పవచ్చు. వైరస్ వ్యాప్తి ఎప్పుడైనా అనూహ్యమే. వేవ్ లుగా వ్యాపించే వైరస్ ఎప్పుడు ప్రమాదకర మ్యుటేషన్ కు గురవుతుందో ఎవరూ చెప్పలేరు. సెకండ్ వేవ్ లో వచ్చిన తరహా వేరియంట్ వస్తే జరిగే నష్టాన్ని మాటల్లో చెప్పలేం.
మరోపక్క ఉత్తర కొరియాలో కరోనా ఉద్ధృతి.. చైనాను బెంబెలెత్తిస్తోంది. దీంతో కోవిడ్ జీరో వ్యూహానికి ఇబ్బంది రాకుండా అక్కడి అధికారులు వింత ఆదేశాలు ఇస్తున్నారు. ఉత్తర కొరియా నుంచి వీస్తున్న కోవిడ్ గాలి నుంచి రక్షించుకునేందుకు సరిహద్దు ప్రాంత ప్రజలు కిటికీలు మూసుకోవాలని సూచిస్తున్నారు. ఆ గాలి ద్వారా చైనా వైపునకు మహమ్మారి ప్రయాణిస్తుందని ఆందోళన చెందుతున్నారు.అధికారులు చేస్తున్న ఈ సూచనలు వైద్య సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
మరోపక్క కరోనా కట్టడి విషయంలో ప్రపంచ దేశాలకు భిన్నంగా చైనా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఆ దేశం పాటించే కొవిడ్ జీరో వ్యూహంపై సొంత ప్రజలే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కానీ, చైనా నాయకత్వం మాత్రం తన విధానాన్ని సమర్థించుకుంటోంది. విమర్శకులపై చర్యలు తీసుకుంటోంది. ఇక ఈ ఏడాది టెస్టింగ్, వైద్య సదుపాయాలు, ఇతర కొవిడ్ కట్టడి చర్యల కోసం 52 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనుంది.
అదే సమయంలో కరోనా విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన పలు ఆంక్షలను అగ్రరాజ్యం అమెరికా సడలిస్తోంది. అమెరికా వెళ్లాలంటే ప్రయాణానికి ముందు రోజు తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాకే విమానాలను ఎక్కాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. కొత్త వేరియంట్ వచ్చి సమస్య జటిలమైతే తిరిగి ఈ నిబంధనను పునరుద్ధరించే అవకాశం ఉంటుందని చెప్పారు.
విదేశాల్లో పరిస్థితి అలా ఉంటే, మన దగ్గర మాత్రం మరి కొన్ని నెలలు జాగ్రత్త పడక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. అయితే, ఓవైపు ఫోర్త్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో.. ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాలపై కూడా వివాదం నెలకొంది. కరోనా మరణాల లెక్కింపులో ప్రపంచ ఆరోగ్య సంస్థ పాటించిన పద్ధతిపై భారత్ ప్రశ్నలు లేవనెత్తింది. డబ్ల్యూహెచ్‌వో అనుసరించిన పద్ధతి భారత్ వంటి దేశానికి సరైనది కాదని వ్యాఖ్యానించింది. పెద్ద సంఖ్యలో జనాభా నివసించే భారత్‌కు ఆ ఫార్ములా వాడకూడదని చెప్పింది. అయితే, కరోనా ముప్పు తగ్గలేదని జాగ్రత్తగా ఉండాల్సిందేనని WHO పదే పదే హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఒమిక్రాన్‌కి సంబంధించిన మ్యూటెంట్ కేసులు పలు రాష్ట్రాల్లో కనిపించటంతో జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కేసులు ఇదే తీరులో పెరిగితే ఫోర్త్ వేవ్ ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. ప్రతి ఒక్కరూ కరోనా రూల్స్ పాటించాలని హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని, శానిటైజర్లను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న కరోనా కాటు వేయడం ఖాయమంటున్నారు. పొరుగు దేశం చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. చైనా వాణిజ్య రాజధాని షాంఘై ఇంకా వైరస్ గుప్పిట్లోనే ఉంది. ఇప్పటికే ఉత్తరాదిలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత మూడు వేవ్ ల మాదిరిగానే ఈసారి కూడా మెట్రో నగరాల్లోనే కరోనా కలకలం మొదలైంది. దేశంలో ఫోర్త్ వేవ్ జూన్ లో రావచ్చని కాన్పూర్ ఐఐటీ గతంలో అంచనా వేసింది. ఇప్పటికైనా జాగ్రత్తపడకపోతే.. ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీంతో, భారత్‌లో కరోనా మళ్లీ కలవరం కలిగిస్తోంది. మహమ్మారి ఇంకా ఉందని, దాన్ని ఏ స్థాయిలోనైనా తేలిగ్గా తీసుకొని తప్పు చేయొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. చిన్న చిన్న అజాగ్రత్తలు పరిస్థితిని మరింత దిగజారుస్తాయని చెప్పింది. అన్ని దేశాలు టీకాల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించింది. కరోనా థర్డ్ వేవ్ అనంతరం ఎపిడెమియాలజిస్టులు అనేక నివేదికల్లో వైరస్ స్థానిక దశకు చేరుకుందని, దీంతో ప్రజలకు ఎక్కువగా ప్రమాదం ఉండదని పేర్కొన్నారు. అయితే, ఈ వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండిస్తోంది. ఇప్పటికీ పెను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.
కరోనా మహమ్మారికి ఇప్పట్లో అంతం లేదా? దాదాపు ముగింపు దశకు వచ్చిందని భావిస్తున్న కొవిడ్, పలు దేశాల్లో తిరిగి పడగ విప్పడం చూస్తుంటే మరోసారి భయాందోళనలు సృష్టిస్తోంది. పరిస్థితులు ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశం కనిపించడంలేదు. వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగడంతో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. రూపు మార్చుకుంటున్న కొత్త వేరియంట్లతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒమిక్రాన్‌లోనూ రకరకాల సబ్ వేరియంట్లు విజృంభిస్తున్నాయి. కరోనా పుట్టిల్లు చైనా అందరికన్నా ముందు కోలుకున్నట్లు ప్రకటించినా, ఇప్పుడు మహమ్మారి మరోసారి విజృంభించడంతో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి.
స్పాట్‌సింపుల్ గా చెప్పాలంటే, కరోనా వైరస్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. మనతో పాటే ఉంది. ఇది పూర్తిగా నిర్మూలన అయ్యేందుకు ఇంకా సమయం పడుతుంది. పాండమిక్‌గా మొదలైన ఈ మహమ్మారి.. ప్రస్తుతం ఎండమిక్ స్టేజిలో కొనసాగుతోంది. ఈ డిసెంబర్ నాటికి లేదా వచ్చే ఏడాది మధ్య కల్లా పూర్తిగా ఎండమిక్ స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఇంకో ఆర్నెళ్ల పాటు ఇలాంటి కేసుల పెరుగుదల కనిపిస్తుంది. ఇలా కేసులు పెరగడాన్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏకైక అస్త్రంగా మాస్క్ పెట్టుకోవాలి. బహిరంగ ప్రదేశాలు, ప్రజారవాణాలో ప్రయాణించేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం మరిచిపోవద్దు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అంత ప్రమాదకరంగా లేకున్నా, అజాగ్రత్తగా ఉంటే మాత్రం పరిస్థితి చేయిదాటానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు.