Congress lost the chance to question GST and ED?
పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే ముందు కాంగ్రెస్ చాలా అనుకుంది. ఈసారి బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేయడానికి కావల్సినన్ని అస్తశస్త్రాలు ఉన్నాయని సంతోషించింది. ఇతర పార్టీల ఎంపీలు కూడా కాంగ్రెస్ తో కలిసి నిరసన తెలపడంతో.. అనుకున్న లక్ష్యాన్ని సాధించేలాగే కనిపించింది. కానీ సొంత పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి. అధికారపక్షాన్ని నిలదీసే స్థితి నుంచి అధీర్ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవాల్సిన అగత్యం పట్టింది.
పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే నాటికే.. జీఎస్టీ పెంపు కారణంగా కేంద్రంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. 90 శాతం నిత్యావసరాల్ని జీఎస్టీ పరిధిలోకి తేవడం అందరికీ షాకిచ్చింద. సామాన్యుల దగ్గర్నుంచి.. కిరాణా షాపు యజమానుల వరకూ అందరూ రోడ్డెక్కారు. అన్ని రాష్ట్రాల్లో విపక్షాల నిరసనకు కూడా మంచి స్పందన వచ్చింది. సోషల్ మీడియా కూడా బాగా ట్రోలింగ్ నడిచింది. ఇక పీల్చే గాలికి, తాగే నీటికి కూడా జీఎస్టీ వేస్తారనే విమర్శలు వచ్చాయి. అప్పుడు విపక్షాలు ఉన్న వేడికి.. ఈసారి సెషన్ చాల హాట్ గా నడుస్తుందని అంతా అనుకున్నారు. అధికార పక్షం సమాధానం చెప్పడానికీ ఇబ్బందిపడాల్సిన వాతావరణం ఉంది.
మరోవైపు అనారోగ్యంతో ఉన్న సోనియాను ఈడీ గంటల తరబడి విచారించడం కాంగ్రెస్ కు సానుభూతి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఆ పార్టీ చేసిన ధర్నాలు.. మొత్తం క్యాడర్లో జోష్ నింపాయి. ప్రతిపక్షాల్ని ఈడీ వేధిస్తోందని ప్రతిపక్షాలు ఉమ్మడి లేఖ కూడా విడుదల చేశాయి. కానీ అలా సోనియా ఈడీ విచారణ ముగిసిందో లేదో.. ఇలా అధీర్ రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యలు.. మొత్తం సీన్ మార్చేశాయి. విపక్షాలకు ఉన్న అడ్వాంటేజ్ పోయి.. అధికార పక్షం ఎదురుదాడి చేయడానికి అవకాశం ఇచ్చినట్టైంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశిస్తూ.. రాష్ట్రపత్ని అని సంబోధించడం చర్చనీయాంశంగా మారింది.. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీని బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించిన కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తోంది.
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ సభ్యులు రాజ్యాంగ పదవుల్లో ఉన్న మహిళలను కించపరుస్తూనే ఉంటారని.. మన దేశ తొలి గిరిజన రాష్ట్రపతిని కించపరిచినందుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో, బయట కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపత్ని అని సంభోదించడం.. అత్యున్నత రాజ్యాంగ పదవిని కించపరిచేలా ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేవారు. కాంగ్రెస్ పార్టీ గిరిజన వ్యతిరేకి, దళిత, మహిళ వ్యతిరేకి అని దేశానికి తెలుసని స్మృతి ఇరానీ విమర్శించారు. అధీర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీలు నిరసన తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిరసనల్లో పాల్గొన్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. అయితే తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని.. పొరపాటున రాష్ట్రపత్ని అని అన్నానని.. ఈ వ్యాఖ్యలను గోరంతది కొండతగా చేసి బీజేపీ వివాదం చేస్తోందని అధీర్ అన్నారు. పార్లమెంట్ లో ధరల పెంపు, ఎంపీల సస్పెన్షన్ పై కేంద్రంపై విపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. రాష్ట్రపతికి, దేశానికి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లో ఆందోళనకు దిగారు. కొద్దిరోజులుగా విపక్షాలు చేస్తున్న ఆందోళనలో ఈ సంఘటనతో మరుగున పడిపోయాయి. సోనియా లోక్‌సభలో తమ ఎంపీలను బెదిరించారని నిర్మలా సీతారామన్ ఆరోపించగా.. రెండు వర్గాల మధ్య పెద్ద రాద్ధాంతమే జరిగింది.
రాష్ట్రపతిపై అధీర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన బీజేపీ.. నేరుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపైనే గురిపెట్టింది. రాష్ట్రపతికి, దేశానికి ఆమె క్షమాపణ చెప్పాల్సిందేనని కమలదళం పట్టుబడుతోంది.అధీర్ రంజన్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు, అధికార పక్షం నిరసనల నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సోనియా గాంధీ ప్రయత్నించారు. అప్పటికే ఈడీ విచారణతో తలనొప్పులు ఎదుర్కుంటున్న సోనియాకు.. అధీర్ కొత్త చికాకు తెచ్చపెట్టారు. దీనికి తోడు బీజేపీ కూడా ఉద్దేశపూర్వకంగా ఆమెను టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో సోనియా అసహనానికి గురయ్యారు.
ఓ దశలో పార్లమెంట్ లో సోనియాను బీజేపీ మహిళా ఎంపీలు చుట్టుముట్టడంతో.. టీఎంసీ, ఎన్సీపీ ఎంపీలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దేశంలో 8.6 శాతం ఎస్టీలున్నారు. గతంలో ఎస్టీలు కాంగ్రెస్ కు బలమైన ఓటుబ్యాంకుగా ఉండేవాళ్లు. ఇటీవలి కాలంలో బీజేపీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై టార్గెట్ పెట్టి మెరుగైన ఫలితాలు రాబడుతోంది. తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎంపిక కూడా ఆ వ్యూహంలో భాగమే. ఎస్టీలను దగ్గర చేసుకోవాల్సిన కాంగ్రెస్.. ద్రౌపదిపై అధీర్ వ్యాఖ్యలతో డిఫెన్స్ లో పడిపోయింది. ఇప్పుడు ఎస్టీ నియోజకవర్గాల్లో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు.. మొత్తం పార్టీ కొంప ముంచేలా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమౌతోంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్న బీజేపీ.. గాంధీ కుటుంబంపై మహిళా వ్యతిరేకులు, ఆదివాసీ వ్యతిరేకులని ముద్ర వేయడానికి చూస్తోంది. అధీర్ వ్యాఖ్యలను సోనియా అనుమతించారన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ మరింత నష్టం తప్పదనే అంచనాలు లేకపోలేదు. ఇంత జరిగినా అధీర్ ను లోక సభ పక్ష నేత పదవి నుంచి ఎందుక తొలగించలేదన్న బీజేపీ ప్రశ్నకు కూడా కాంగ్రెస్ దగ్గర సరైన సమాధానం లేదు.
మహారాష్ట్రలో ఉద్దవ్ సర్కారు కూల్చివేత, ప్రతిపక్షాలపై ఈడీ దాడులు, జీఎస్టీ రేట్ల పెంపుపై బీజేపీని నిలదీసి.. ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని విపక్షాలు అనుకున్నాయి. కానీ అధీర్ మొత్తం రివర్స్ చేశారని భావిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా వివాదాన్ని ముగించకుండా.. అనవసరంగా సాగదీసే అవకాశం కల్పిస్తోందనే ఆలోచనతో ఉన్నాయి. ఇప్పటిదాకా ఎన్నికల క్షేత్రంలో విపక్షాల పోరాటాన్ని పలుచన చేస్తున్న కాంగ్రెస్.. ఇప్పుడు పార్లమెంట్ లోనూ అదే రీతిలో తయారైందనే వాదన వినిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఇతర పార్టీల్ని కూడగట్టి.. ప్రభుత్వంపై పోరాడాల్సిందిపోయి.. వివాదాస్పద వ్యాఖ్యలతో తానే అధికార పక్షానికి అస్త్రాలు అందిస్తోంది.
ఈసారి పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యేనాటికి జీఎస్టీ రేట్ల పెంపుతో ప్రజల్లో కేంద్రంపై వ్యతిరేకత ఉంది. అదే సమయంలో అనారోగ్యంతో ఉన్న సోనియాను ఈడీ గంటల తరబడి విచారించడం కూడా కాంగ్రెస్ కు సానుభూతి పెంచే అంశం. ఇలా ప్రజల్లో బలపడే రెండు సువర్ణావకాశాల్ని అధీర్ కారణంగా కాంగ్రెస్ పోగొట్టుకోవాల్సి వచ్చింది.
నోరుజారాను, క్షమించాలి అంటూ కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకు లేఖ రాయడంతో వివాదం ముగిసిపోయిందని అనుకోలేం. ఈ లేఖతో కథ కంచికని కాంగ్రెస్ నేతలు అంటున్నప్పటికీ, అధికారపక్షం అంత తేలికగా వదిలేలా కనిపించడం లేదు. సెషన్ మొత్తం ఈ అంశంపైనే నడవాలని బీజేపీ కోరుకుంటోంది.
ప్రవక్తనే దూషించిన నేతలను మీ దగ్గర పెట్టుకొని, మా వాడు ఏదో నోరుజారితే ఇంత రాద్ధాంతం చేస్తారా అని కాంగ్రెస్ నాయకులు దబాయిస్తున్నప్పటికీ, జరిగింది తప్పేనని ఆ పార్టీ ఒప్పుకోకతప్పదు. వివాదాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు కూడా చుట్టి, ఆమె కూడా క్షమాపణలు కోరాలని అధికారపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సోనియా సభలో దురుసుగా వ్యవహరించారన్న అధికారపక్ష నేతల విమర్శకు ప్రతిగా, ఆమె మీద కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యల సంగతేమిటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రదర్శిస్తున్న దూకుడు వెనుక, గోవాలో ఆమె కుమార్తెను కాంగ్రెస్ ఒక వివాదంలో ఇరికించిన కక్ష ఉన్నదని కొందరి అనుమానం. ఇదంతా చూస్తుంటే, సభను సజావుగా సాగించడం అధికారపక్షానికే కాదు, విపక్షాలకు కూడా ఇష్టం లేదేమోనని అనుమానం కలుగుతోంది.
సభారంభానికి ముందు విపక్షాలు ఈసారి గట్టిగా నిలదీస్తాయని జనం ఆశలు పెట్టుకున్నారు. ధరల పెరుగుదల, జీఎస్టీ కొత్తబాదుడు, దేశరక్షణలో కూడా కాంట్రాక్టువిధానాన్ని తెచ్చిపెట్టిన అగ్నిపథ్ పథకం, బుల్‌డోజర్ విధ్వంసాలు, మతవిద్వేషాలు, పరస్పర దాడులు వంటి విషయాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయని అనుకున్నారు. పాలకపక్షం సహకరించదనీ, తమకు అడ్డుపడుతుందనీ తెలిసినప్పుడు ప్రజలపక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసినవారు మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలి. కానీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్సే అధికార పక్షానికి అస్త్రం అందించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
మొదట అధీర్ రంజన్ రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. తర్వాత కూడా వెంటనే క్షమించమని అడగకుండా.. అధికార పక్షం ఎక్కువ రచ్చ చేసే ఛాన్స్ ఇవ్వడం మరీ తప్పు. అప్పుడు కూడా రాష్ట్రపతికి ఇబ్బంది కలిగిందని సారీ చెప్పడం కంటే.. తమ అధినేత్రి సోనియాకు వివాదం చుట్టుకుంటోందనే భావనే ఎక్కువగా వ్యక్తమైంది. ఆయన చెప్పిన క్షమాపణలో చిత్తశుద్ధి లేదని అందరికీ తెలిసిపోతోంది. ఇది మరింత విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రపతిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఇంకా లోక్ సభ పక్ష నేత పదవిలో కొనసాగిస్తూ.. కాంగ్రెస్ ప్రజలకు ఏం సందేశం ఇస్తోందన్న ప్రశ్నకు జవాబు చెప్పాల్సింది ఆ పార్టీనే. ఇప్పటికైనా ఈ వివాదానికి అర్థవంతమైన ముగింపు పలక్కపోతే.. సెషన్ మొత్తం అధికార పక్షం డామినేషన్ సాగడం.. విపక్షాలు మరోసారి ప్రేక్షక పాత్రకు పరిమితమవడం తప్ప.. జరిగేదేమీ ఉండదు.
పొరపాటున అన్నానని అధీర్ చెబుతున్నా.. ఆయన వ్యాఖ్యల వీడియో చూస్తే అలా అనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న బీజేపీకి.. చక్కని ఆయుధం ఇచ్చినట్టైంది. అధీర్ వ్యాఖ్యలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇమేజ్, గాంధీ కుటుంబ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయి. దగ్గర్లో ఎన్నికలున్న రాష్ట్రాల నేతలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. అధీర్ పై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికే చేతులు కాల్చుకున్న కాంగ్రెస్.. ఇంకేం చూస్తుందో చూడాల్సి ఉంది.
కాంగ్రెస్ సిల్లీ మిస్టేక్స్ చేస్తోందని విపక్ష ఎంపీలు మొత్తుకుంటున్నారు. అధీర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఓ వర్గం వాదిస్తుంటే.. అలా చేస్తే బీజేపీ ఇంకా రెచ్చిపోతుందని మరో వర్గం అంటోంది. ఏదేమైనా అధీర్ వ్యవహారాన్ని బీజేపీ హైజాక్ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో ఏమీ లేదనే కామెంట్లు కూడా వస్తున్నాయి. అధికార పక్షానికి అవసరమైనన్ని రోజులు ఈ వ్యవహారాన్ని సాగదీస్తే.. కాంగ్రెస్ ఏం చేయనుందనేది క్లారిటీ లేదు. కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీతో సభకు వస్తుందా. లేకపోతే ఎప్పటిలాగే బీజేపీ ట్రాప్ లో కంటిన్యూ అవుతుందా అనేది కీలకం కానుంది.
సోనియాను ఈడీ ప్రశ్నిస్తుంటే.. కక్ష సాధింపు అని విపక్షాలన్నీ మద్దతిచ్చాయి. కానీ అధీర్ నిర్వాకంతో మళ్లీ కాంగ్రెస్ ఒంటరయ్యే దుస్థితి వచ్చింది. ఇప్పుడు ఏ పార్టీ కూడా ఈ వ్యవహారంలో నోరెత్తే సాహసం చేయడం లేదు. మధ్యలో దూరితే వివాదం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అని భయపడుతున్నాయి. కాంగ్రెస్ తనతో పాటు అన్ని విపక్షాల ముందరి కాళ్లకు బంధం వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఇక ఏ అంశంపై విపక్షాలు నిలదీసే ప్రయత్నం చేసినా.. అధీర్ వ్యాఖ్యల్ని హైలైట్ చేయాలని బీజేపీ ఫిక్సైపోయింది. తమ వ్యూహాల విషయంలో ఆ పార్టీ ఎక్కడా సీక్రెసీ పాటించడం లేదు. ఉభయసభల్లోనూ మహిళా మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడటం అధికార పక్షం అజెండాకు అద్దం పట్టింది. భవిష్యత్తులోనూ ఈ దాడి కొనసాగుతుందనే సంకేతాలు అందాయి. మూడు రోజుల పాటు ఒకే అంశంపై పార్లమెంట్ స్తంభించినా.. కాంగ్రెస్ మాత్రం అయోమయ స్థితిలో ఉండిపోవడం, వివరణ ఇచ్చుకోవాల్సి రావడం మొత్తం విపక్షాన్ని వీక్ చేసింది. విపక్షాల్ని లీడ్ చేయాల్సిన పార్టీ.. అందర్నీ డిఫెన్స్ లో పడేయటమేంటని ఇతర పార్టీలు కూడా నొచ్చుకుంటున్నాయి. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కూడా కాంగ్రెస్ వైఖరి బీజేపీకి అడ్వాంటేజ్ అయిందని విపక్షాలు గుర్తుచేస్తున్నాయి. గత పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోకపోగా.. కొత్త కొత్త తప్పులు చేయడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నిస్తున్నాయి.
ఆదివాసీ రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమిటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతం. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడం నష్టమే కానీ లాభం కాదు. మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న అధీర్ రంజన్ ఇంత చిన్న లాజిక్ మిస్సవడమే ఇప్పుడు కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారింది.
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చేసిన కామెంట్ దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య మరింత ఆజ్యం పోసినట్లయ్యింది. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తం కాదు. గతంలోనూ ఇలాంటి కామెంట్లు చేశారాయన. సున్నితమైన అంశాలపై మాట తూలి.. కాంగ్రెస్‌ను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టారు. రచ్చ అయిన తర్వాత వెనక్కి తగ్గడం మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిపోయింది. రెండేళ్ల కిందట అధీర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ సర్కార్‌ను టార్గెట్ చేయబోయి కాంగ్రెస్‌ను ఇరకించేశారు. ఆర్టికల్ 370 రద్దు దేశ అంతర్గత విషయమని కేంద్రం చెప్పగా, అధీర్ రంజన్ మాత్రం అంతర్గతం కాదన్నారు. కశ్మీర్ ఇష్యూని 1948 నుంచి ఐక్యరాజ్యసమితి పర్యవేక్షిస్తూనే ఉంది కాదా అని ప్రశ్నించారు. ఆ కామెంట్లు రచ్చగా మారాయి. బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ విధానం ఇదేనా అంటూ నిలదీసింది.
తన వ్యాఖ్యలు వివాదాస్పదమైన తీరు మాత్రం మార్చుకోలేదు. మరోసారి ఆర్టికల్ 370 విషయంలో తలదూర్చి కాంగ్రెస్‌కు చిక్కులు తెచ్చిపెట్టారు. కశ్మీర్ పునర్‌విభజన తర్వాత.. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ సభ్యులు కశ్మీర్ సందర్శనకు వెళ్లారు. వారిని విమర్శించబోయి మాట తూలారు. కిరాయికి పనిచేసేవారుగా అభివర్ణించి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నారు అధీర్.
పంజాబ్ ఎన్నికల సమయంలో పార్టీకి కొత్త సమస్య తెచ్చిపెట్టారు అధీర్. ఇందిరా గాంధీ హత్య తర్వాత సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి. దానిపై స్పందించిన అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ…మహావృక్షం కూలినప్పుడు భూమి కొద్దిగా కంపించడం సహజమే అన్నారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అలాంటి సున్నితమైన ఇష్యూను మళ్లీ తెరపైకి తెచ్చారు. రాజీవ్ వ్యాఖ్యలను ట్వీట్ చేశారు. ఆ వెంటనే ట్వీట్ డిలీట్ చేశారు. అప్పటికే పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
C విషయంలోనూ ఇదే రచ్చ. ఎన్డీఏ విధానాలపై సెటైర్ వేయబోయి ఇరుక్కున్నారు. ప్రధాని మోడీ, అమిత్‌షా వలసవాదులంటూ హాట్ కామెంట్లు చేశారు. గుజరాత్ నుంచి ఢిల్లీకి వలసరాలేదా అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
మోడీ సర్కార్ రెండో విడత ప్రభుత్వ ఏర్పాటుపై లోక్‌సభలో అధీర్ చేసిన కామెంట్లు రచ్చకు దారి తీశాయి. ప్రధాని మోడీని మురికి కాలువతో పోల్చారు. ఇందిరా గాందీ, మోడీ మధ్య చాలా వ్యత్యాసం ఉందన్న ఆయన… గంగానదిని మురికి కాలువతో పోల్చలేమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి చాలా హుందాగా ఉండాలి. కానీ అధీర్ రంజన్ ఆ హోదాకు తగ్గట్టుగా ఎప్పుడూ నడుచుకోలేదు. ఎవరైనా ఎంపీలు నోరుజారితే సరిదిద్దాల్సిన పొజిషన్లో ఉండి.. ఆయనే నోరు జారుతూ.. పార్టీకి, మొత్తం విపక్షానికి చిక్కులు తెచ్చిపెడుతున్నారు. అసలు లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత బాధ్యతలు రాహుల్ కు ఇవ్వాలని అనుకున్నారు. అయితే ఎంత చెప్పినా ఆయన వినకపోవడంతో.. తప్పనిసరై అధీర్ కు బాధ్యతలిచ్చారు. ఆయనేమో నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసి పరువు తీస్తున్నారు. అధీర్ మినహా సభా పక్ష నేత బాధ్యతలు తీసుకునేవాళ్లు కాంగ్రెస్ లో ఎవరూ లేరా అనే ప్రశ్న దూసుకొస్తోంది. జ్యోతిమణి సెన్నిమలై లాంటి జూనియర్ ఎంపీలు కూడా చురుగ్గా ఉంటున్న తరుణంలో.. అలాంటి వారికైనా పదవులిస్తే.. కాస్తైనా పరువు దక్కుతుందని సీనియర్లు సలహా ఇస్తున్నారు. అసలు ఇంత డ్యామేజ్ చేస్తున్న అధీర్ ను భరించాల్సిన అవసరం ఏముందని ఏఐసీసీలోనూ చర్చ జరుగుతోంది.
పరిస్థితి ఇలాగే ఉంటే.. బీజేపీ మరింతగా ఇష్యూను హైలైట్ చేస్తే.. అప్పుడు కాంగ్రెస్ నేతలే అధీర్ ను తొలగించాలని సోనియా ఇంటి ముందు ధర్నా చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. విషయం మరింత పెద్దది కాకముందే ఇకనైనా ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శిస్తే.. సరైన వ్యూహం అవుతుంది. లేకపోతే కాంగ్రెస్ పొరపాట్లు.. విపక్షం మొత్తానికీ గ్రహపాటుగా మారడమే కాదు.. అధికారపక్షం దూకుడు ఇంకా పెరిగే అవకాశం ఉందనే విశ్లేషణలున్నాయి.
ఇప్పటికే కొన్ని పార్టీల నేతలు కూడా అధీర్ వ్యాఖ్యల్ని ఖండించాయి. ఇంకా కాంగ్రెస్ కాలయాపన చేస్తే.. బీజేపీ మరోసారి పైచేయి సాధిస్తుంది. ఈ పరిణామం భవిష్యత్తులో విపక్షాల ఐక్యతకు గండికొట్టే అవకాశం ఉంది. తాను బలం పుంజుకుని.. మిత్రుల్ని పెంచుకుని బీజేపీతో యుద్దం చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. కానీ అధీర్ వ్యాఖ్యలు ఆ పార్టీని మళ్లీ ఏకాకిని చేసే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికైనా సోనియా అధీర్ పై చర్యలు తీసుకుంటే.. బురద కడుక్కున్నట్టు అవుతుందంటున్నారు విశ్లేషకులు. మరి సోనియా వివాదానికి ముగింపు పలుకుతారా.. వివాదం కొనసాగడానికి అవకాశం ఇస్తారా అనేది మాన్ సూన్ సెషన్ నడిచే తీరునే కాదు.. కాంగ్రెస్ భవిష్యత్తును కూడా నిర్దేశించనుంది.