Dolo 650 Mafia : కరోనా టైంలో డోలో 650 ట్యాబెట్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కరోనా వస్తే కచ్చితంగా వేసుకోవాల్సిన మాత్రల జాబితాలో ఈ ట్యాబ్లెట్‌ను డాక్టర్లు చేర్చారు. అయితే డోలో ఉత్పత్తిదారులు ఇందుకోసం డాక్టర్లకు వెయ్యి కోట్ల రూపాయల మేర తాయిలాలు ఇచ్చారని పిటిషన్ దాఖలైంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. పది రోజుల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
జ్వరం వస్తే డోలో. వ్యాక్సిన్ తర్వాత బాడీ పెయిన్స్ వస్తే డోలో. అసలు వచ్చినా.. రాకపోయినా.. డోలో వేసుకుంటే దిగులుండదు. ఇదీ డాక్టర్లు కరోనా వచ్చిన దగ్గర్నుంచీ చెబుతూ వచ్చిన మాట. ఇప్పుడు ప్రతి ఇంట్లో డోలో ట్యాబ్లెట్ నిత్యావసర వస్తువైపోయింది. అవసరం ఉన్నా.. లేకపోయినా డోలో ట్యాబ్లెట్ షీట్లు తెచ్చకుని పెట్టుకుంటున్నారు. జనంలో ఈ డోలో పిచ్చి రేపడం వెనుక.. డాక్టర్లకు భారీగా ముడుపులు పుట్టాయన్న విషయం ఇప్పుడు బట్టబయలైంది.
ఇప్పుడంతా డోలో రాజ్. దగ్గినా తుమ్మినా జలుబు చేసినా కంప్లేంట్ ఏదైనా అందరికీ ఒకటే మందు.. అదే డోలో 650(DOLO 650). జస్ట్ జ్వరం వచ్చినా.. ఎలాంటి సింటమ్స్ కనిపించినా డోలో 650.. ఇది ఇప్పుడు ట్రెండ్. జ్వరం వచ్చిందా? డోలో వేస్కో. కాస్త తలనొప్పిగా ఉందా? డోలో దాలో. ఒకప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్. ఎంతలా అంటే మార్కెట్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోన్న డోలో 650 ట్యాబెట్లను పేరిస్తే ఎవరెస్ట్ అంత హైట్ కావడం ఖాయమనేంత. ఇది అతిశయం కాదు గురూ. మార్కెట్‌లో డోలో 650 దూకుడు ఆ రేంజ్‌లో ఉంది.
దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో డోలో ట్యాబ్లెట్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయ. కరోనా సోకిన వారు, జ్వరం లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ డోలో ట్యాబెట్లను వేసుకున్నారంటే ఆశ్చర్యమేం లేదు. డాక్టర్లు సైతం పేషెంట్లకు కచ్చితంగా డోలో ట్యాబెట్లను రిఫర్ చేశారు. అయితే ఇందుకోసం డోలో 650 ట్యాబ్లెట్ తయారీదారులు డాక్టర్లకు ఏకంగా రూ.1000 కోట్ల తాయిలాలు ఇచ్చారని.. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ & సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. సీబీడీటీ జరిపిన సోదాల్లో ఈ విషయం బహిర్గతమైందని సుప్రీం కోర్టుకు తెలిపింది. ఆరోగ్యంగా ఉండే హక్కు అనేది జీవించే హక్కులో భాగమేనని.. ఫార్మా కంపెనీలు నైతిక మార్కెటింగ్ విలువను పాటించాలని ఆ వ్యాజ్యంలో కోరినట్లు తెలుస్తోంది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడి ధర్మాసనం దీన్ని తీవ్రమైన విషయంగా పరిగణించింది. ఈ విషయమై పది రోజుల్లో స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
తమ ట్యాబెట్లను ప్రమోట్ చేసుకోవడం కోసం డోలో వెయ్యి కోట్లకుపై మొత్తాన్ని డాక్టర్లకు తాయిలాలు ఇచ్చిందని ఫెడరేషన్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ తెలిపారు. బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్‌కు సంబంధించిన 36 ప్రాంగణాల్లో సీబీడీటీ జరిపిన సోదాల్లో.. రూ.300 కోట్లు పన్ను ఎగవేతకు పాల్పడ్డారని తేలిందని.. డోలో ఉత్పత్తిదారులు అనైతిక పద్ధతులు పాటించారని ఫెడరేషన్ ఆరోపించింది. ఇలా చేయడం వల్ల మందులు ఓవర్ డోస్ కావడంతోపాటు.. పేషెంట్ల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని, ఇలాంటి అవినీతికి పాల్పడటం వల్ల మార్కెట్లోకి ఎక్కువ ధరలు ఉన్న, అహేతుకమైన మందులు వస్తాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు కఠినంగా లేకపోవడం వల్ల ఫార్మా సంస్థలు అనైతిక పద్ధతులను అవలంభిస్తున్నాయని.. కోవిడ్ పాండమిక్ సమయంలో ఈ విషయం బయటపడిందన్నారు.
కరోనా కాలంలో అమ్మకాల్లో అదరగొట్టిన డోలో 650 కంపెనీ.. పన్నులు కట్టడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. దీంతో కరోనా కాలంలో ఎంతో పేరును సంపాదించుకున్న ఈ కంపెనీ.. పన్నులు ఎగవేసి కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైంది. దీంతో ఒకేసారి 200 మందికి పైగా ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. కంపెనీకి ఊపిరి సలపకుండా ఐటీ రైడ్స్ చేపట్టారు. దేశవ్యాప్తంగా ఈ కంపెనీకి ఉన్న కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు జరిగాయి.
కోవిడ్ సమయంలో అత్యంత ఎక్కువగా అమ్ముడుపోయిన డోలో.. ఐటీ రిటర్న్స్ దాఖలు విషయంలో అవకతవకలు జరిగాయని సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ గుర్తించింది. దీంతో దేశవ్యాప్తంగా మైక్రోల్యాబ్స్ సంస్థ ఆఫీసులపై దాడులు చేసి జరిగిన అవకతవకలను బయటకు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువన గిఫ్టులని డాక్టర్లకు, మెడికల్ ప్రొఫెషనల్స్‌కి పంచినట్లు తేలింది. ఇది చట్టవిరుద్ధమే కాదు.. అనైతికం కూడా. తమ ప్రాడక్ట్‌ని అమ్ముకోడానికి డాక్టర్లకి లంచాలు ఇచ్చి ప్రిస్క్రైబ్ చేయించడం దారుణమైన చర్య అంటోంది CBDT. గత నెలలో మైక్రోల్యాబ్స్ సంస్థకి సంబంధించి 36కేంద్రాల్లో రెయిడ్లు జరిగాయి. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోడమే కాకుండా.. కోటిన్నర రూపాయల క్యాష్, గోల్డు, జువెలరీ కూడా దొరికినట్లు తెలుస్తోంది. ఇక డోలో 650ని ప్రిస్క్రైబ్ చేయడానికి డాక్టర్లకు విలువైన వస్తువులను గొఫ్టుల కింద ఇచ్చినట్లు తేలింది. అనేక పేర్లతో ఈ గిఫ్టుల పంపిణీ కూడా జరిగినట్లు విచారణలో బయటపడింది. ప్రమోషన్ అండ్ ప్రాపగాండ, సెమినార్స్ అండ్ సింపోసియమ్స్, మెడికల్ అడ్వైజరీస్ అంటూ.. విలువైన గిఫ్టులను డాక్టర్లకు ఇచ్చింది మైక్రోలాబ్స్.
ఇందులో కాస్ట్‌లీ ఫోన్లు కూడా ఉన్నట్లు తేలింది. మైక్రోల్యాబ్స్ యాభై దేశాల్లో తమ ఔషధాలను విక్రయిస్తోంది. వీటిలో డోలో 650 సేల్సే ఎక్కువ. ఈ ఒక్క డ్రగ్‌తో ఈ సంస్థ వేలాది కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. డోలో 650 అనేది జ్వరానికే కాదు.. ఒళ్లు నొప్పులు, తలనొప్పికి కూడా ఇదే రాస్తున్నారు డాక్టర్లు.
ఇలా డోలోని చీటీలో రాసివ్వడానికి డాక్టర్లకు విలువైన గిఫ్టులు ఇచ్చిపడేస్తున్నారు. మెడికల్ రెప్రజెంటేటివ్స్ ఈ బాధ్యత తీసుకుంటున్నారు. తమ టార్గెట్ పూర్తిచేస్తే.. మెడికల్ రెప్‌లకు కూడా గిఫ్టులు, విదేశీ ట్రిప్పులు ఉంటాయని విచారణలో తేలింది. మైక్రోలాబ్స్ దీనికే వెయ్యికోట్లు ఖర్చుచేసిందంటే.. దాని వెనుక ఎన్ని వేల కోట్లు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
డోలో 650 అనేది సాధారణంగా జ్వరం తగ్గించే పారసిటమాల్ ఔషధం. అయితే డాక్టర్లు కోవిడ్ సహాయక చికిత్సలో భాగంగా ఎక్కువగా డోలో టాబ్లెట్లను ప్రిస్క్రయిబ్ చేశారు. డేటా ప్రకారం, మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ 2021లో రూ.307 కోట్ల వ్యాపారం చేసింది. అదే సమయంలో ఫార్మా దిగ్గజం GSK ఫార్మాస్యూటికల్స్ కాల్‌పాల్ అనే ఔషధం టర్నోవర్ రూ. 310 కోట్లుగా ఉంది, అలాగే క్రోసిన్ గత ఏడాది రూ. 23.6 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత రెండేళ్లలో డోలో 650 బ్రాండ్ అత్యుత్తమ ఫీవర్ ఔషధానికి పర్యాయపదంగా మారింది. Dolo 650 టాబ్లెట్ జ్వరాన్ని వేగంగా తగ్గించడంతో పాటు ఇది శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించే లక్షణాలు లేవని పలువురు డాక్టర్లు సూచిస్తున్నారు. డోలో మంచి సేఫ్టీ ప్రొఫైల్‌ను కలిగి ఉందని నిపుణులు కూడా చెప్పారు. అలాగే ఖరీదు కూడా చాలా తక్కువ.
ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ వ్యవస్థకు ఏకీకృత విధానం తెచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. తద్వారా పర్యవేక్షణ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందని.. ఫలితంగా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని న్యాయస్థానానికి తెలిపారు. రోగులకు డ్రగ్స్ సిఫార్సు చేయించడం కోసం ఫార్మా కంపెనీలు వైద్యులకు ఎలాంటి ఉచితాలు అందించకుండా అడ్డుకోవాలంటూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రెగ్యులేషన్స్ 2002 ప్రకారం.. వైద్యులు ఫార్మా కంపెనీ నుంచి ఎలాంటి బహుమతులు స్వీకరించకూడదు. ఒకవేళ తీసుకున్నట్లు తేలితే డాక్టర్ ప్రాక్టీస్ మూడు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు నిలిపివేస్తారు. కానీ ఫార్మా కంపెనీలు, డాక్టర్ల మధ్య చట్టానికి వ్యతిరేకంగా ఒక అనుబంధం కొనసాగుతుందన్నది చేదు నిజం.
దేశంలోని చాలా మంది డాక్టర్లు నిజాయితీగా ఉన్నారు. కానీ కొంతమంది వల్ల వారికి చెడ్డపేరు వస్తోంది. దేశంలో 3 వేల ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉన్నాయి. ఫార్మాస్యూటికల్ మార్కెట్ విలువ 42 బిలియన్లు. వీటిలో నాల్గవ వంతు మందుల ధరను నిర్ణయించే అధికారం మాత్రమే ప్రభుత్వం చేతిలో ఉంది. వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకుని ఖరీదైన మందుల వ్యాపారం దేశంలో నడుస్తోంది.
డోలో-650 అనేది పారాసిటమల్ ట్యాబ్లెట్. కాకపోతే అందులో ఉండే మెడిసిన్ పవర్ 650ఎంజీ ఉంటుంది. డోలో అనేది మెడిసిన్ పేరు కాదు బ్రాండ్ పేరు. అందులో ఉండే మెడిసిన్ పారాసిటమల్. మైక్రో ల్యాబ్స్ అనే ఫార్మా కంపెనీ దీన్ని తయారు చేస్తోంది. 1993లో డోలో-650 అమ్మకాలు మొదలయ్యాయ్. పారాసిటమల్ 500 ఎంజీ విభాగంలో బాగా పోటీ ఉండటంతో కొత్తగా ఏమైనా చేయాలని భావించింది కంపెనీ. జ్వరం, నొప్పిని తగ్గించడంలో పారాసిటమల్-500 ఎంజీ, ఎఫెక్టివ్‌గా పని చేయడంలేదని గుర్తించింది మైక్రో ల్యాబ్స్. దీనికి సమాధానంగా డోస్ పెంచి పారాసిటమల్-650ఎంజీని తయారు చేయడం మొదలు పెట్టింది. దానికి పెట్టిన బ్రాండ్ నేమ్ డోలో-650. ట్యాబ్లెట్ పవర్ 500 నుంచి 650 ఎంజీకి పెరిగింది కాబట్టి దాని సైజు కూడా పెరుగుతుంది. అందువల్ల మింగేటప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ట్యాబ్లెట్‌ను ఓవల్ షేప్ అంటే కోడి గుడ్డు ఆకారంలో తయారు చేయడం ప్రారంభించింది.
30 ఏళ్ల నుంచి మార్కెట్‌లో ఉన్న డోలో-650… ఇప్పుడు ఇంతగా పాపులర్ కావడానికి కారణం కరోనా క్రైసిస్. కరోనా కాలంలో వినియోగం పెరగడంతో గత రెండేళ్లలో దీని సేల్స్ భారీగా పెరిగాయ్. హెల్త్ కేర్ రీసెర్చ్ సంస్థ ఐక్యూవియా రిపోర్ట్ ప్రకారం మార్చి 2020 తరువాత 350 కోట్ల డోలో-650 పిల్స్ అమ్ముడు పోయాయి. 2021లో డోలో అమ్మకాల విలువ రూ.307 కోట్లకు పెరిగింది. 2019లో అంటే కరోనాకి ముందు అమ్ముడు పోయిన డోలో-650 మాత్రల సంఖ్య సుమారు 110 కోట్లు మాత్రమే.
కరోనా సోకిన పేషెంట్లలో జ్వరం, ఒళ్లు నొప్పులు కామన్‌గా కనిపించే లక్షణాలు. దాంతో కరోనా సమయంలో డాక్టర్లు ఎక్కువగా పేషెంట్లకు డోలోను ప్రిస్ర్కైబ్ చేశారని నిపుణులు అంటున్నారు. పేషెంట్లలోనూ మౌత్ పబ్లిసిటీ పెరగడం కూడా డోలో పాపులర్ కావడానికి కలిసొచ్చిందని వారు చెబుతున్నారు. గతంలో కరోనా సోకినప్పుడు వాడాల్సిన మందులంటూ వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో చాలా మందులు వైరల్ అయ్యేవి. వాటిలో ప్రధానంగా ఉండేది డోలో-650. అది కూడా తమకు కలిసొచ్చిందని చెబుతోంది మైక్రో ల్యాబ్స్. దీంతో మెడికల్ షాపుకు వెళ్లి డోలో-650 ఇవ్వమని అడగడం పెరిగింది.
వ్యాక్సీన్ సెంటర్ల దగ్గర ఆరోగ్య నిపుణులకు డోలో-650తోపాటు శానిటైజర్లు, మాస్కులు ఉండే కిట్స్ ఇవ్వడం, మెడికల్ షాపుల్లో సరిపడా స్టాక్ ఉండేలా చూడటం వంటి చర్యలు తీసుకున్నామని కంపెనీ చెబుతోంది.మనం తరచూ వాడే పారాసిటమల్ ఉనికిలోకి వచ్చింది 1893లో. తొలిసారి పేషెంట్ల మీద వాడింది కూడా అప్పుడే. కానీ 1950 వరకు పారాసిటమల్‌ను కమర్షియల్‌గా ఉత్పత్తి చేయలేదు. 1950లో అమెరికాలో, 1956లో ఆస్ట్రేలియా, బ్రిటన్‌లో దాని వాణిజ్య ఉత్పత్తి మొదలైంది. 1980ల నాటికి ప్రపంచవ్యాప్తంగా పారాసిటమల్ బాగా పాపులర్ అయింది.
1990ల నాటికి భారత్‌లోనూ పారాసిటమల్ తయారీ ప్రారంభమైంది. నేడు పారాసిటమల్ తయారీ హబ్‌గా మారింది భారత్. చైనా తరువాత పారాసిటమల్ ఏపీఐను భారీగా ఎగుమతి చేస్తున్న రెండో దేశం ఇండియానే. అనేక దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతోంది పారాసిటమల్. నెలకు 5,600 మెట్రిక్ టన్నుల పారాసిటమల్‌ను తయారీ చేస్తోంది ఇండియా. ఇందులో దేశీయంగా వాడేది 200 మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగతా స్టాకంతా అమెరికా, బ్రిటన్, కెనడా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది.
ఫార్మా కంపెనీలు తమ మందులనే రోగులకు రాయాలంటూ డాక్టర్లకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తుంటాయని, దీనిపై జవాబుదారీతనం ఉండాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. వైద్యులు తమ మందులను సూచించేందుకు ప్రోత్సాహాకాలను అందిస్తున్నందున ఫార్మాస్యూటికల్ కంపెనీలను బాధ్యులను చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్ పై కోర్టు విచారణ చేపట్టింది. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేసిన విజ్ఞప్తిని యూనిఫాం కోడ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ కి చట్టబద్ధమైన మద్దతు ఇవ్వాలని కోరింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో రెమ్‌డిసివిర్ మెడిసిన్ అధిక విక్రయాలు, ప్రిస్క్రిప్షన్ ఉదాహరణను పిటిషనర్ ఉదాహరణగా చూపించారు.
ఇండియాలోని చాలా పెద్ద చిన్న చితకా.. ఫార్మా కంపెనీలన్నిటి దగ్గర వేల కోట్ల రూపాయల క్యాష్ ఉంది. కరోనా దేశంలో లక్షలాది మంది ప్రాణాలు తీస్తే ఫార్మా కంపెనీలకు కార్పొరేట్ ఆస్పత్రులకు మాత్రం లక్షల కోట్లు సంపాదించి పెట్టింది. ప్రధానంగా కరోనా సంక్షోభంలో ఫార్మా కంపెనీల అరాచకాలు అన్నీఇన్నీ కావు. జనం భయాన్ని క్యాష్ చేసుకుంటూ.. పది రూపాయల మందును వందరూపాయల కు అమ్ముకున్నారు. అప్పట్లో రెమిడెసివిర్ లాంటి ఒక్క ఇంజెక్షన్ 50వేల రూపాయలు కూడా పలికింది. తర్వాత కరోనా బారినుంచి తప్పించుకోవడానికి జనం రకరకాల మందులు మింగారు. కొని ఇళ్లల్లో నిల్వ పెట్టుకున్నారు. ఈ మందులను అడ్డు అదుపూ లేకుండా ఉత్పత్తి చేసి.. పన్నులు ఎగ్గొట్టి వేల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ సంపాదించాయి ఫార్మ కంపెనీలు. డాక్టర్లకు కమిషన్లు.. మందుల షాపులకు పర్సంటేజ్ లు ఇచ్చి అవసరం లేని మందులు కూడా రాయించి ఫార్మా పెద్దలు జనాన్ని దోచేశారు.
5 వందల రూపాయల రెమిడిసివిర్ ఇంజెక్షన్ 50 వేలకు అమ్ముకున్నారు. ప్రాణాలు నిలబెట్టుకునేందుకు లక్షలు కూడా ఇచ్చి కొన్నవాళ్లు ఉన్నారు. కరోనా బారిన పడకుండా జనం రకరకాల మందులు వాడారు. జింకోవిట్, సీ విటమిన్, పారాసిటమాల్, డోలో, డి విటమిన్ ట్యాబ్లెట్లను జనం ప్యాకెట్లు ప్యాకెట్లు కొనుక్కొని ఇళ్లలో పెట్టుకున్నారు. ఆ సమయంలో ఫార్మా కంపెనీలు 24 గంటలు ఉత్పత్తి చేసేవి. వాటికి లెక్కాపత్రం లేదు. అమ్ముకోవడమే తప్ప వాటిని అకౌంట్స్‌లో ఎక్కించిందే లేదు.
కరోనా సమయంలో మందులు దొరికితే చాలని జనం అనుకున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని అడ్డూ అదుపూ లేకుండా ఉత్పత్తి చేసి జనం చేత కొనిపించి తినిపించి… సొమ్ము చేసుకున్నాయి ఫార్మా కంపెనీలు. ఇప్పుడు డోలో.. గతంలో రెమ్ డెసీవర్.. పేరు వేరైనా జరిగింది మాత్రం సేమ్ టు సేమ్ ఒక్కటే.
ఫార్మాలో ట్యాబ్లెట్ క్వాలిటీ, దాని పనితీరుకన్నామెడికల్ రిప్రజెంటేటివ్‌ల వ్యాపారమే ఎక్కువగా ఉంటుంది. ప్రతీ దానికీ కమిషన్లే..! ట్యాబ్లెట్ రాసినందుకు, ఇంజెక్షన్ ప్రిస్క్రయిబ్ చేసినందుకు, సర్జికల్ ఇన్‌స్ట్రిమెంట్స్ సజెస్ట్ చేసినందుకు ప్రతీ దాంట్లోనూ డాక్టర్లకు కమిషన్ ఉంటుంది. డాక్టర్ల విదేశీ టూర్లకే ఫార్మా కంపెనీలు కొన్ని వందల కోట్లు ఖర్చు చేస్తుంటాయి. మరోపక్క మెడికల్ షాపులకు ట్యాబ్లెట్లు అమ్మినందుకు కమిషన్లు.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో మందుల షాపులకు ప్రత్యేక కమిషన్లు. శవాల మీద రాబందులు పడి పీక్కుతిన్నట్టు.. ఒక రోగికి జబ్బు చేస్తే దానిపై ఫార్మా కంపెనీలు, డాక్టర్లు, మందుల షాపులు… ఇన్ని రకాలుగా పీక్కు తింటాయి. హెటిరోలో దొరికిన వంద కోట్ల రూపాయల క్యాష్… అతి చిన్న ఉదాహరణ మాత్రమే..! 130 కోట్ల జనంలో ప్రతీ పౌరుడూ తీసుకునే ట్యాబ్లెట్ వెనకో, ఇంజెక్షన్ వెనకో.. కనిపించని దారుణాలు ఉంటాయి. భారతదేశంలో సామాన్యుడికి అర్ధం కాని ఫార్మా అవినీతి వేలకోట్లలో ఉంటుంది. ఇలా అడ్డగోలుగా సంపాదించిన డబ్బును ఫార్మా కంపెనీలు ఇప్పుడు ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగంలోనూ, ఇతర అక్రమ దారుల్లోనూ పెట్టుబడులు పెడుతున్నాయి.
ఫార్మా కంపెనీల అవకతవకల్లో మరో అంకం ఫార్మా ఏజెన్సీలు. ఇవి ఉత్పత్తి చెయ్యవు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కంపెనీల అడ్రస్‌లతో రకరకాల మందులు సృష్టిస్తుంటాయి. స్థానికంగా ఉన్న పెద్ద కంపెనీల్లో అనధికారికంగా మందులు ఉత్పత్తి చేస్తుంటాయి. ఆ మందులకు వీరు లేబుల్స్ వేసుకుని మార్కెట్లో అమ్ముకుంటారు. ఇలాంటి అర్హత లేని ఫార్మా ఏజెన్సీలు, చిన్నా చితకా కంపెనీలు దేశంలో వేలల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏజెన్సీలు ఇప్పుడు చేస్తున్న దందా అదే. పది రూపాయల ట్యాబ్లెట్ తయారు చేయడానికి 2 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఆ ట్యాబ్లెట్ పది రూపాయలకు రోగికి అమ్ముతారు. ట్యాబ్లెట్ ప్రిస్క్రయిబ్ చేసినందుకు డాక్టర్‌కు రూపాయ్, మెడికల్ షాపుకు రూపాయ్, కార్పొరేట్ ఆస్పత్రికి రూపాయ్, ఏజెన్సీకి రూపాయ్, ఉత్పత్తి చేసిన ఫార్మా కంపెనీకి 4 రూపాయలు వెళ్తుంది. అంటే రూపాయ్ ట్యాబ్లెట్ పది రూపాయలకు అమ్ముకుంటూ ఈ రకంగా జనాన్ని దోచుకుంటున్నాయ్ కంపెనీలు.
సామాన్యులు ఆస్తులమ్ముకుని మందులు కొనుక్కోడవానికి నానా పాట్లు పడుతుంటే.. ఆ మందులు తయారుచేసే కంపెనీలు మాత్రం జాతీయ అత్యవసర పరిస్థితిని.. ఆదాయ మార్గంగా ఎంచుకోవడం కచ్చితంగా కుట్రపూరిత నేరమే అంటున్నారు నిపుణులు. కనీస మానవతా దృక్పథం లేకుండా.. దొరికితనం దోచుకోవడమే పనిగా పెట్టుకున్న ఫార్మా కంపెనీలు.. ఏజెంట్లు, మందుల షాపులు, ఆస్పత్రులతో లింకులు పెట్టుకుని.. కోట్లు కూడబెట్టాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
అన్ని వ్యాపారాల్లోనూ అవినీతి ఉంది. అవినీతి కారణంగా వ్యవస్థకు కచ్చితంగా నష్టమే. కానీ ఆరోగ్య రంగం పరిస్థితి వేరు. ఆరోగ్య రంగంలో అవినీతి కారణంగా రాబోయే తరాలపై కూడా తీవ్రంగా దుష్ప్రభావం పడుతోంది. కోవిడ్ మందుల ధరల్లో మాయాజాలంతో.. చాలా మంది గంటల వ్యవధిలోనే బికారులయ్యారు. కోవిడ్ సెకండ్ వేవ్ టైమ్ లో చాలా మంది ఆస్తులమ్ముకుని కూడా అయినవారి ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. కానీ ఎడాపెడా సంపాదనకు అలవాటుపడ్డ ఫార్మా కంపెనీలకు ఇవేమీ పట్టడం లేదు. ఫార్మా కంపెనీలన్నీ అడ్డగోలుగా సంపాదిస్తున్నాయని కాదుకానీ.. చాలా కంపెనీలు అదే పనిచేస్తున్నాయనేది బహిరంగ రహస్యమే.
ఆరోగ్యం అనేది అత్యంత సున్నితమైన అంశం. కోట్ల మందిపై నేరుగా ప్రభావం చూపే అంశం. వైద్య రంగంలో మందులే కీలకం. డాక్టర్లపై ఎంతో నమ్మకంతో వారు చెప్పిన ట్యాబ్లెట్లు వేసుకుంటారు పేషెంట్లు. కానీ రోగానికి తగ్గ ట్యాబ్లెట్ కాకుండా.. తమకు బాగా గిట్టుబాటయ్యే ట్యాబ్లెట్ రాస్తున్నారని తెలిస్తే.. ఏ రోగికీ డాక్టర్ పై నమ్మకం ఉండదు. అప్పుడు మొత్తం వైద్యవవస్థే సంక్షోభంలో పడుతుంది. ఇది ఎవరికీ మంచిది కాదు. వైద్య రంగంలో బహుమానాలకు కక్కుర్తి పడి మందులు రాసే సంస్కృతికి వీలైనంత త్వరగా చరమగీతం పాడకపోతే.. మొత్తం వ్యవస్థే చెదలు పట్టి కుళ్ళిపోయే ప్రమాదం ఉంది.