సిర్పూర్కర్ కమిషన్ నివేదికకు చట్టబద్ధత ఉందా?ఎన్ కౌంటర్ బూటకం కాకపోతే కేసు హైకోర్టుకు ఎందుకు వచ్చింది?
కమిషన్ నివేదిక ఆధారంగా సుప్రీం తీర్పెందుకు ప్రకటించలేదు?ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు శిక్ష ఉంటుందా?
దిశ కేసు…
దేశమంతా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో దిశపై జరిగిన దాడి ప్రజల్ని ఎంత కదిలించిందో, ఆ తర్వాత పదిరోజుల్లోపే దిశ నిందితుల ఎన్ కౌంటర్ అంతే సంచలనంగా మారింది.
2019 డిసెంబర్ 6న దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ పై హక్కుల సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం చేశాయి. విచారణకు డిమాండ్ చేశాయి. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపేందుకు.. 2019 డిసెంబర్ 12న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సిర్పూర్కర్ కమిషన్‌ను నియమించింది. ఆరునెలల్లో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సిర్పూర్కర్ కమిషన్ హైద్రాబాద్ కేంద్రంగా విచారణ నిర్వహించింది.
దిశఘటన సంగతేమో కానీ, ఆ తర్వాత జరిగిన విచారణ పోలీసు వర్గాల్లో గుబులు రేపింది. విచారణ కమిషన్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్, బాంబే హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రేఖా బాల్దోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ డీఆర్ కార్తికేయన్ ఉన్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టిన కమిషన్.. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురు మృతుల కుటుంబ సభ్యుల వాంగ్మూలం నమోదుచేసింది. ఎన్‌కౌంటర్ సమయంలో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందిని కూడా కమిషన్ విచారించింది. కరోనా కారణంగా దర్యాప్తు ఆలస్యం కావడంతో ఈ ఏడాది జనవరి 28న కమిషన్ తన నివేదికను సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకి సమర్పించింది.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించిన ఏ చిన్న అంశాన్నీ కమిషన్ విస్మరించలేదు. ఘటన వెలుగులోకి వచ్చిన సమయం నుండి, ఎన్ కౌంటర్ వరకు జరిగిన అన్ని ఈవెంట్స్ ని పరిశీలించింది. కీలకమైన దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఫోరెన్సిక్ నివేదికలు, డాక్యుమెంట్ రికార్డ్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, సీన్ ఆఫ్ అఫెన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కమిషన్ సభ్యులు సేకరించారు. అంతేకాదు.. పలువురు అడ్వకేట్స్ తోపాటు, ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు, అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్, దిశ కుటుంబ సభ్యులు, ఎన్ కౌంటర్ లో చనిపోయిన నలుగురి కుటుంబ సభ్యులను కూడా కమిషన్ విచారించింది. వీటి ఆధారంగా తయారు చేసిన నివేదికను సిర్పూర్కర్ కమిషన్ ఉన్నత న్యాయస్థానానికి అందించింది.
సుదీర్ఘంగా 47 రోజులపాటు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన కమిషన్.. 57 మంది సాక్షులను విచారించినట్లు నివేదికలో తెలిపింది. కమిషన్ ఇచ్చిన నివేదిక, మానవహక్కుల సంఘాలు, ప్రభుత్వ వాదనలు అన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు… విచారణ చేపట్టింది. ఈ కేసును ప్రత్యేకంగా తాము పర్యవేక్షించలేమని చెబుతూ.. తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో…హైకోర్టు నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన అన్ని వివరాలను హైకోర్టుకు బదిలీ చేయాలని కోర్టు తెలిపింది.
ఇక్కడే కమిషన్ నివేదికలో ఏముందనే ఆసక్తి ఏర్పడింది.
అదే సమయంలో సిర్పూర్కర్ నివేదికను వాద, ప్రతివాదులకు అందించాలని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. నివేదికను సీల్డ్ కవర్ ఉంచాలన్న వాదనలు సుప్రీం తోసిపుచ్చింది. నివేదిక బయటపెడితే న్యాయవ్యవస్థపై ప్రభుత్వం చూపుతుందని న్యాయవాదులు వాదించారు. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను గోప్యంగా ఉంచాలని సీజేఐను సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ కోరారు. అయితే నివేదికలో గోప్యం ఏంలేదని, దోషి ఎవరో తేలిపోయిందని సీజేఐ అన్నారు. నివేదిక ఎందుకు బయటపెట్టకూడదని జస్టిస్ హిమాన్ష్ శుక్లా ప్రశ్నించారు. నివేదికను మరోసారి పరిశీలించే ప్రసక్తే లేదని సీజేఐ అన్నారు. ఇది పబ్లిక్ ఎంక్వయిరీ అని అవసరమైతే..నివేదికలోని అంశాలను తామే చదివి వినిపిస్తామని సీజేఐ వ్యాఖ్యానించారు. అంతకుముందు సిర్పూర్కర్ కమిషన్ నివేదికను బయట పెట్టాలని కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హక్కుల సంఘాల తరపు న్యాయవాది డిమాండ్ చేశారు.
సిర్పూర్కర్ కమిషన్ ఏం తేల్చింది?ఎన్‌కౌంటర్ బూటకమని తేలిందా?
దిశ ఘటన ఎంత అమానుషమో, దానికి ప్రతిగా పోలీసులు తుపాకి పనిచెప్పటం కూడా అంతే అమానుషమని మానవహక్కుల సంఘాలు ఆరోపించాయి. మహిళలపై దాడులకు ఇది పరిష్కారం కాదని వాదించాయి. దీంతో సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో ఏం సమర్పించిందనే ఆసక్తి ఏర్పడింది.
దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమని జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన 387 పేజీల నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో పోలీసులపై హత్యానేరం కింద విచారణ జరపాలని కమిషన్ సూచించింది. నిందితులు ఎదురుకాల్పుల్లో మరణించారన్న పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ కమిషన్ తెలిపింది.
చట్టపరమైన పలు నిబంధనలను, పోలీస్ మాన్యువల్ రూల్స్‌ని అతిక్రమించారని సిర్పూర్కర్ కమిషన్ తెలిపింది. మీడియాకు, విచారణ కమిషన్‌కు పోలీసులు కట్టుకథలు చెప్పారని వెల్లడించింది. ఎన్‌కౌంటర్ స్థలంలో సీసీటీవీ ఫుటేజీ దొరక్కుండా చేశారని రిపోర్ట్ ఇచ్చింది జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్.దిశ నిందితులే ముందుగా పోలీసులపై కాల్పులు జరిపారనేది అబద్దమని స్పష్టం చేసింది. దిశ నిందితుల్ని చంపాలనే ఉద్దేశంతోనే పోలీసులు కాల్పులు జరిపారన్న కమిషన్, ఇవి మూక దాడుల లాంటివేనని వ్యాఖ్యానించింది.
2019 నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ దిశపై హత్యాచారానికి పాల్పడిన నలుగురు యువకులను విచారణ సమయంలో పారిపోయేందుకు యత్నించడంతోపాటు పోలీసుల వద్ద తుపాకులు లాక్కొని కాల్పులు జరపగా.. పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులు మరణించారనేది పోలీసుల వాదన..
ఇప్పుడు సిర్పూర్కర్ కమిషన్ నివేదికతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందనే ఆసక్తి ఏర్పడింది. మరోపక్క సిర్పూర్కర్ కమిషన్ కు ఉన్న చట్టబద్ధత ఎంత? ఈ నివేదికపై హైకోర్టులో ఎలాంటి విచారణ జరగనుందనే ఆసక్తి ఏర్పడింది.
సిర్పూర్కర్ కమిషన్ నివేదిక వెల్లడైన తర్వాత దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఏది చట్టం? ఏది ధర్మం? అనే చర్చ మొదలైంది.దేశంలో పౌరులు ఎవరైనా, చట్టానికి లోబడే పనిచేయాలి.అన్ని వ్యవస్థలు చట్టం చెప్పిందే చేయాలి.
దీనికి పోలీసులు, కోర్టులు, అధికారులు ఎవరూ అతీతం కాదు.కానీ ఎన్ కౌంటర్‌లు జరిగిన సందర్భాల్లో అవి ఫేక్ ఎన్ కౌంటర్లని, పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారనే వాదనలు వినిపిస్తూ ఉంటాయి.ఇక్కడే మానవ హక్కులకు సంబంధించిన వాదనలు తెరపైకి వస్తాయి.
ఎన్ కౌంటర్ లను సమర్థించకూడదు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.కానీ, దిశ ఘటనలో ఎన్ కౌంటర్ కు ప్రజల మద్దతు లభించింది.కానీ, చట్టం ప్రజల మద్ధతు, ప్రజల ఆలోచలనలకు అనుగుణంగా ఉండాల్సిన అవసరం లేదు.
చట్టం ఓ సమున్నత లక్ష్యంతో తయారు చేసుకుంటాం.దాన్ని ఓ ఘటనకు, ఓ సందర్భానికి పరిమితం చేసి చూడలేం.
కానీ, ఇక్కడ ప్రజలు ఇన్ స్టంట్ న్యాయాన్ని ఆశించారు.దిశ ఘటన జరిగిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఉద్యమం చిన్నది కాదు.దేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా దిశ ఘటనపై ఇలాంటి స్పందనలే వచ్చాయి.
కానీ, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్‌కౌంటర్ లు తప్పే..ఫేక్ ఎన్ కౌంటర్లు తప్పున్నర తప్పే..కానీ, చట్టం తప్పంటున్నా..ప్రజలు న్యాయం కావాలంటారు.పోలీసులు ఎన్ కౌంటర్ చేయటం ధర్మం అనిపిస్తుంది..కానీ, చట్టం అందుకు ఒప్పుకోదు..అలాగని ఒక ఆడపిల్లని నలుగురు లైంగిక దాడి చేసి చంపితే దాన్ని చూస్తూ ఊరుకోవాలా? అనేది ప్రజల వాదనఅందుకే ప్రజల నైతిక మద్ధతు లభించింది.అలాంటపుడు మొత్తంగా ఎన్ని విచారణలు జరిగినా
దిశ నిందితుల ఎన్ కౌంటర్ సమాధానం దొరకని ప్రశ్నే అవుతుందనే భావించాలి.
ప్రజలు ఈ అబిప్రాయానికి రావటానికి ఎన్నో కారణాలున్నాయి.మనదేశంలో ఎన్నో కేసుల్లో న్యాయం అందటానికి జీవితకాలం పట్టిన సందర్భాలున్నాయి.నేరం స్పష్టంగా కనిపిస్తున్నా, నేరస్తుడెవరో మానవ విచక్షణకు స్పష్టంగా అర్థమవుతున్నాకోర్టులు సాక్ష్యాలు విచారణల వరుసలో ఏళ్లకేళ్లు గడిచి తీర్పు రావటానికి దశాబ్దాలు పట్టిన సందర్భాలున్నాయి.ఇవన్నీ చూసిన ప్రజలకు ఇన్ స్టంట్ జస్టిస్ గొప్పదిగా అనిపించటంలో ఆశ్చర్యం లేదు.
అందుకే చట్టం దృష్టిలో పోలీసులు చేసిన హత్యే కావచ్చు..కానీ, ప్రజలు మాత్రం దీన్ని హత్యగా భావించలేదు.
పోలీసులు తప్పు చేశారని అనుకోలేదు. పైగా దిశ ఎన్ కౌంటర్ టీమ్ ని హీరోల్లా చూసింది.
దేశంలో మహిళలపై దాడులు అనేకం జరుగుతున్నాయి.లైంగిక దాడులు జరగని రోజు ఉండటం లేదు.
ఇవన్నీ చూస్తున్న సామాన్య ప్రజానీకానికి నేరస్తులని తక్షణం శిక్షిస్తే నేరాలు ఆగుతాయనే అభిప్రాయం ఉంది.
సమాజం దృష్టిని ఆకర్షించి హైలైట్ అయిన నిర్భయ, దిశ లాంటి ఘటనల్లో ప్రజల నుండి ఇలాండి డిమాండ్లే వినిపించాయి.
కానీ, చట్ట ప్రకారం దర్యాప్తు, విచారణ జరగాలి. నేరస్తుడు రుజువు చేశాడని కోర్టుకు సాక్ష్యాలు చూపించాలి
అప్పుడే శిక్షించే అవకాశం ఉంటుంది. అంత కాలం ఆగే ఓపిక ప్రజల్లో లేకుండా పోతోంది.
దీన్నే మూక న్యాయంగా కోర్టులు కామెంట్స్ చేస్తున్నాయి.
కొన్ని సందర్భాల్లో ఇది సరైందే అనిపించినా, దీనివల్ల సమాజానికి చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
ఇక్కడ మరోప్రశ్న కూడా ఉంది.కఠిన శిక్షలు, సత్వర న్యాయంతో నేరాలు ఆగుతాయా?
దీనికి సమాధానం స్పష్టంగానే చెప్పవచ్చు.పొరుగునున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో పాటు, సౌదీ లాంటి దేశాల్లో మహిళలపై దాడులకు కఠిన శిక్షలున్నాయి.బహిరంగ ఉరిశిక్ష విధించే దేశాలు కూడా ఉన్నాయి.కానీ, ఇంత కఠిన శిక్ష విధిస్తున్నా నేరాలు ఆగలేదు, పైగా మహిళలపై ఏటా నేరాలు పెరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి.అంతెందుకు మనదగ్గర దిశ ఎన్ కౌంటర్ జరిగిన రోజు కూడా లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి..
అంటే తక్షణ న్యాయంతో నేరాలు ఆగవనే అంశం స్పష్టమౌతుంది.
ఇక్కడ మరో అంశం కూడా ఉంది.నేరస్తులు ఎవరో స్పష్టంగా తెలిసిన ఘటనలు కొన్ని ఉన్నా,
పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవటానికి ప్రోత్సహిస్తే దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి.
పోలీసుల ఆసక్తులు, ప్రయోజనాల కోసం కూడా ఎన్ కౌంటర్లు చేసే సందర్భాలు వస్తాయి.
రేపు ఓ అమాయకుడి చుట్టూ పోలీసులు సాక్ష్యాలు అల్లి ఎన్ కౌంటర్ చేస్తే ప్రశ్నించే అవకాశం ఉంటుందా?
అందుకే చట్ట ప్రకారం కోర్టులు శిక్ష విధించే వరకు ఆగటమే సరైందనే వాదనలు కూడా ఉన్నాయి.
మరో కీలకమైన అంశం ఏంటంటే…దిశ ఘటనలో నేరస్తులు సామాజికంగా, ఆర్థికంగా బలహీనులు..
వాళ్లు నేరస్తులే కావచ్చు..కానీ, పోలీసులు చూపిన రుజువులే సరైన ఆధారాలనే గ్యారంటే ఏముంది..
అవి కోర్టులో నిలబడాలి కదా.పైగా దిశ ఘటనలో నిందితులు నలుగురి స్థానంలోసమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉంటే కూడా పోలీసుల తుపాకీ ఇదే తీర్పు ఇస్తుందా?పోలీసులు ఇదే రకంగా న్యాయం చేస్తారా అనేది కూడా కీలక ప్రశ్నే.
ఎందుకంటే మన దేశంలో బాధితులందర్నీ ఒకేలా చూసే పరిస్థితి లేదు..బాధితులకు కులం, మతం, ఆర్థిక స్థితి ఆధారంగా సానుభూతి దక్కుతోందని,న్యాయం జరుగుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.అదే సమయంలో నేరస్తులకు కూడా వాళ్ల బలాబలాలను బట్టేనేరస్తులుగా రుజువు అవుతోందనే భావించాలి.ఇదే దిశ ఘటనలో నేరస్తులు ఆర్థికంగా, సామాజికంగా బలమైన వాళ్లై ఉంటే,న్యాయవ్యవస్థ లొసుగుల్ని అడ్డు పెట్టుకుని విచారణ సాగదీసి, ఆధారాలు నీరుగార్చినామమాత్రపు శిక్షతో బయటపడి ఉండేవారేమో.అంటే ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులకు
అలాంటి అండదండలు లేకపోవటం వల్లనే తక్షణ శిక్షకు గురయ్యి ఉంటారనేవాదనలకు బలం చేకూరుతుంది. ఇక్కడ నేరస్తులను సమర్థించటం కాదు.. కానీ,చట్టంముందు అందరూ సమానులుగా నిలబడే పరిస్థితికి అడ్డుపడుతున్న కారణాలను గుర్తించాలి.
ఇలాంటి నేరాలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో వీలైనంత త్వరగా కోర్టులు శిక్ష విధిస్తే ప్రజలకు నమ్మకం పెరుగుతుంది.
అప్పుడు తక్షణ న్యాయాన్ని ఆశించే పరిస్థితి ఉండదు.అన్నిటికీ మించి ఇలాంటి నేరాలకు వ్యక్తులను ప్రోత్సహించని వైపు మన వ్యవస్థ ఎదగాలి.అప్పుడే మహిళలు భద్రంగా ఉంటారు.అంతేకానీ, కంటికి కన్ను, పంటికి పన్ను అనే న్యాయం ఆ క్షణానికి సంతోషం కలిగించినా,అలాంటి ఘటనలను మాత్రం ఆపలేవనేది రుజువైన అంశం.
అందుకే దిశ ఘటనలో ఏది చట్టం? ఏది ధర్మం? అనే చర్చ మొదలైంది.దిశకు అన్యాయం జరిగింది.ఆ అన్యాయం చేసిన నేరస్తులకు జరిగింది కూడా అన్యాయమేనా అనేది ఇప్పుడు ప్రశ్న.ఇది నేరస్తులను సమర్థించేదిగా వినిపించవచ్చు.
కానీ, ఈ నలుగురి స్థానంలో ఆ నేరంతో సంబంధం లేనివాళ్లను పోలీసులు చూపించి ఉంటే..?అందుకే నేరం ఏదైనా ఓ పద్ధతి ప్రకారమే దానికి శిక్ష పడాలి.కోర్టులే శిక్షలు విధించాలి. పోలీసులు తక్షణ న్యాయం చేసి నేరాన్ని ఆపలేని వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటాన్ని ప్రోత్సహించకూడదనే వాదనలున్నాయి.
ఇప్పుడు జస్టిస్ సిర్పూర్కర్ కమిటి నివేదిక కూడా పోలీసులదే తప్పని తేల్చింది.కావాలని చంపి, నలుగురి హత్యకు ఆధారాలు లేకుండా చేశారని చెప్తోంది.మీడియాకు, కమిషన్ కు అసత్యాలు చెప్పారని తేల్చింది.ఈ పరిణామాల మధ్య హైకోర్టులో ఈ నివేదిక ఫలితం ఎలా ఉండనుంది అనేది ఆసక్తికరమైన అంశం.
దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమని జస్టిస్ వి.ఎస్. సిర్పూర్కర్ కమిషన్ తేల్చింది.387 పేజీల నివేదికలో పోలీసుల తీరును ఎండగట్టింది.ఈ వ్యవహారంలో పోలీసులపై హత్యానేరం కింద విచారణ జరపాలని కమిషన్ అభిప్రాయపడింది.ఈ వ్యవహారంపై సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఇచ్చి పలు సూచనలు చేసింది.ఇప్పుడు సుప్రీం ఆదేశాల ప్రకారం విషయం తెలంగాణ హైకోర్టును చేరింది
హైద్రాబాద్ కు అత్యంత సమీపంలోని షాద్ నగర్ చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద దిశ మృతదేహాన్ని గుర్తించారు.
ఆమెను నలుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ ఘటన 2019 నవంబర్ 28న జరిగింది.
మహమ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జోల్లు నవీన్ ఈ నలుగురు ఈ దుర్మార్గానికి పాల్పడినట్టుగా గుర్తించారు.
ఈ ఘటన జరిగిన తర్వాత నిందితులను తమకు అప్పగించాలని వేలాదిమంది పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దిశకు న్యాయం జరగాలంటే నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఆ తర్వాత నిందితులను సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసేందుకు చటాన్ పల్లి అండర్ పాస్ వద్దకు తీసుకొచ్చిన సమయంలో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు గాను ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో మరణించినట్టుగా అప్పటిసీ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు.
ఈ నలుగురిని ఎన్‌కౌంటర్ చేయడంతో భారత్‌లో చాలా మంది సంబరాలు చేసుకుంటున్నారు.ఎన్‌కౌంటర్ జరిగిన కొద్దిగంటల్లోనే ఘటన జరిగిన ప్రదేశానికి దాదాపు రెండు వేల మంది వచ్చారు.పోలీస్ చర్యను అభినందిస్తూ, వారిపై పూల వర్షం కురిపించారు.పోలీస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. స్వీట్లు పంచుకున్నారు.దిశ హత్యకు గురైన ప్రాంతం వద్ద పూలతో నివాళి అర్పించారు.సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. టపాసులు పేల్చారు.
ట్విటర్‌లో అనేక రకాల హ్యాష్‌ట్యాగ్‌లతో ఈ ఎన్‌కౌంటర్‌పై దాదాపు 3 లక్షల ట్వీట్లు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..చాలా ట్వీట్లు పోలీసులకు మద్దతు తెలుపుతూ వచ్చినవే.
ప్రజల్లో ఈ తరహా స్పందన ఎందుకు వచ్చిందనేది కచ్చితంగా ఆలోచించాల్సిన అంశమే.దేశంలోని వివిధ కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.ఇందులో అత్యాచారానికి సంబంధించిన కేసులే 150,000 ఉన్నాయి.
అందుకే న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం పోతోంది.నిర్భయ తల్లి కూడా ఈ ఎన్‌కౌంటర్ ని ప్రశంసించిన వారిలో ఉన్నారు..ఇవేవీ కొట్టిపారేసే విషయాలు ఏ మాత్రం కావు.దారుణ నేరాలకు బాధితులుగా మారిన వారికి సానుభూతిగా వచ్చే డిమాండ్లు ఆలానే ఉంటాయి.
వారం వ్యవధిలోనే నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేసి,తమ కస్టడీలో ఉండగానే చంపేశారు. నేర దర్యాప్తు పెద్దగా జరగకముందే వారు ఈ పని చేశారు.క్రైమ్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో జరిగిన కాల్పుల్లో చనిపోయారని పోలీసులు చెప్పుకొచ్చారు.కానీ, అనుమానితులను చంపేయడం ద్వారా పోలీసులు అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును దెబ్బతీశారు.నేరం ఇంకా నిరూపణ కాలేదు. నేరంలో అనుమానితుల పాత్రపై దర్యాప్తు కూడా పూర్తి కాలేదు.
ఈ లోపే ఎన్ కౌంటర్ తో లెక్క పూర్తిచేశారు పోలీసులు. ప్రజల్ని చల్లబరిచారు.
2008లో వరంగల్ లో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి జరిగింది. అప్పుడు కూడా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రమంతటా ఆందోళనలు జరిగాయి. వాళ్లు కూడా ఎన్ కౌంటర్ లోనే చనిపోయారు. అప్పుడు వరంగల్ ఎస్పీగా ఉన్నది కూడా సజ్జనారే.
ఇప్పుడు దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఆందోళనలు వెల్లువెత్తడంతో విచారణకు సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్ నియమించింది. ఈ కమిషన్ నివేదిక చూసిన సుప్రీం దోషులు ఎవరో తేలిందని కూడా చెప్పింది. కానీ ఈ కేసు హైకోర్టులో ఏమవుతుందనేది చెప్పటం అంత తేలిక కాదు. సిర్పూర్కర్ కమిషన్ ముందు విసి సజ్జనార్, ఏసీపీ సురేందర్ చెప్పిన సమాధానాలు చూస్తే చట్టాన్ని పోలీసులు ఎంత తేలిగ్గా తీసుకున్నారో అర్థమవుతుంది. ప్రజలనుంచి మద్ధతు ఉందనే కారణంతో ఇతర సందర్బాల్లో కూడా ఇంతే తెగువను పోలీసులు చూపగలరా? అంటే కచ్చితంగా చేయలేరు.
అక్కడ జరిగిన నేరం స్పష్టం. చేసిన వాళ్లెవరో కూడా స్పష్టమైనా శిక్షించాల్సింది పోలీసులు మాత్రం కచ్చితంగా కాదు.
నిందితులను వెంటనే కొట్టి చంపాలని, ఉరి తీయాలని కోరడం సరైన నిర్ణయం కాదు.హత్య కేసుల్లో మరణశిక్షలు ఉన్నా హత్యలు జరుగుతూనే ఉన్నాయి,అలాగే రేప్ కేసుల్లో మరణశిక్ష విధించినా ఆ కేసులూ ఆగడం లేదు.
మొత్తం సమాజ వ్యవస్థలో మార్పు రావాలి, జెండర్ సెన్సిబిలిటీ, నైతికతను పాటించడంలో నిబద్ధత ఉండాలి
ఆర్థిక, సామాజిక అసమానతలు లేని వ్యవస్థలో నేరాలు తక్కువగా ఉంటాయని మేధావుల అభిప్రాయం
ఇలాంటి ఘటనలో సత్వర న్యాయాన్ని ప్రజలు ఆశించడం తగిన కారణాలు ఉండొచ్చు.
అది చట్ట విరుద్ధమైనా ధర్మంగా కనిపించే పరిస్థితి ఉండవచ్చు..కానీ, వ్యవస్థలు నిబంధనలకు అనుగుణంగానే పనిచేయాలి.అప్పుడే అందరికీ న్యాయం దక్కుతుంది.పోలీసులు ప్రభుత్వ అధికారులు. రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి.
ఆయుధాలిచ్చింది ఇష్టం వచ్చినట్లు చంపేయడానికి, గాయపరచడానికి కాదు.మహిళలకు న్యాయం, స్వేచ్ఛ, గౌరవం ఎంతో అవసరమైనా, దానికి పోలీసులు తుపాకి మార్గం అవుతుందని భావించటం పొరపాటు.
ఇప్పుడు సిర్పూర్కర్ కమిషన్ నివేదిక సంచలనంగా మారింది.దీని ఫలితం ఎలా ఉండనుందనేది చర్చగా మారింది.
తెలంగాణ హైకోర్టు ఏం తేల్చనుంది? పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయి? వాళ్లను దోషులుగా తేలుస్తారా? లేక ఏళ్ల తరబడి సాగదీస్తారా? ఇవన్నీ కళ్లముందున్న ప్రశ్నలు.